Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
65 సీయోను మీద ఉన్న దేవా, నేను నిన్ను స్తుతిస్తాను.
నేను వాగ్దానం చేసిన వాటిని నేను నీకు ఇస్తాను.
2 నీవు చేసిన వాటిని గూర్చి మేము చెబుతాము మరియు నీవు మా ప్రార్థనలు వింటావు.
నీ దగ్గరకు వచ్చే ప్రతి మనిషి యొక్క ప్రార్థనలూ నీవు వింటావు.
3 మా పాపాలు మేము భరించలేనంత భారమైనప్పుడు,
ఆ పాపాలను నీవు తీసివేస్తావు.
4 దేవా, నీ ప్రజలను నీవు ఏర్పరచుకొన్నావు.
నీ ఆలయానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు నీవు మమ్మల్ని ఏర్పాటు చేసికొన్నావు.
మాకు చాలా సంతోషంగా ఉంది!
నీ ఆలయంలో నీ పరిశుద్ధ ఇంటిలో మాకన్నీ అద్భుత విషయాలే ఉన్నాయి.
5 దేవా, నీవు మమ్మల్ని రక్షించుము. మంచి మనుష్యులు నిన్ను ప్రార్థిస్తారు.
నీవు వారి ప్రార్థనలకు జవాబిస్తావు.
వారి కోసం నీవు ఆశ్చర్య కార్యాలు చేస్తావు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నిన్ను నమ్ముకొంటారు.
6 దేవుడు తన మహాశక్తిని ఉపయోగించి పర్వతాలను చేశాడు.
మనచుట్టూరా ఆయన శక్తిని చూడగలము.
7 ఘోషించే సముద్రాలను దేవుడు నిమ్మళింప చేస్తాడు.
మరియు ప్రపంచంలో ఉన్న మనుష్యులందరినీ దేవుడు సంతోషంతో స్తుతింప చేస్తాడు.
8 దేవుడు చేసే శక్తివంతమైన విషయాలకు భూమిమీద ప్రతి మనిషీ భయపడతాడు.
దేవా, నీవు సూర్యుని ఉదయింపజేసే, అస్తమింపజేసే ప్రతి చోటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
9 నీవు భూమిని గూర్చి శ్రద్ధ తీసుకొంటావు.
నీవు దానికి నీరు పోస్తావు, అది దాని పంటలు పండించేలా నీవు చేస్తావు.
దేవా, నీవు కాలువలను ఎల్లప్పుడూ నీళ్లతో నింపుతావు.
నీవు ఇలా చేసి పంటలు పండింపచేస్తావు.
10 దున్నబడిన భూమి మీద వర్షం కురిసేటట్టు నీవు చేస్తావు.
భూములను నీవు నీళ్లతో నానబెడతావు.
నేలను నీవు వర్షంతో మెత్తపరుస్తావు.
అప్పుడు నీవు మొలకలను ఎదిగింపచేస్తావు.
11 కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు.
బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు.
12 అరణ్యము, కొండలు పచ్చగడ్డితో నిండిపోయాయి.
13 పచ్చిక బయళ్లు గొర్రెలతో నిండిపోయాయి.
లోయలు ధాన్యంతో నిండిపోయాయి.
పచ్చిక బయళ్లు, లోయలు సంతోషంతో పాడుతున్నట్లున్నాయి.
వడగళ్లు
13 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఉదయాన్నే లేచి, ఫరో దగ్గరికి వెళ్లు. ‘నన్ను ఆరాధించడానికి, నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల దేవుడైన, యెహోవా అంటున్నాడని అతనితో చెప్పు. 14 నీవు గనుక ఇలా చెయ్యకపోతే, అప్పుడు నీ మీద, నీ ప్రజలమీద, నీ అధికారుల మీద నా శక్తి అంతా ప్రయోగిస్తాను. అప్పుడు నాలాంటి దేవుడు ప్రపంచంలోనే లేడని నీకు తెలుస్తుంది. 15 నేను నా శక్తిని ప్రయోగించి, ఒక్క రోగం రప్పించానంటే, అది నిన్ను, నీ ప్రజల్ని భూమి మీద లేకుండా తుడిచి పారేస్తుంది. 16 అయితే ఒక కారణం వల్ల నేను నిన్ను ఇక్కడ ఉంచాను. నా శక్తిని నీవు చూడాలని నిన్ను ఇక్కడ ఉంచాను. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నా విషయం తెల్సుకొంటారు. 17 నీవు ఇంకా నా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నావు. నీవు వాళ్లను స్వతంత్రంగా వెళ్లనివ్వడంలేదు. 18 కనుక రేపు ఈ వేళకు మహా బాధాకరమైన వడగళ్ల వానను నేను కురిపిస్తాను. ఇంతకు ముందు ఎన్నడూ ఈజిప్టు ఒక దేశంగా ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకూ ఇలాంటి వడగళ్ల వాన పడలేదు. 19 ఇక నీవు నీ జంతువుల్ని క్షేమంగా ఉండేచోట పెట్టుకోవాలి. ప్రస్తుతం పొలాల్లో ఉన్న నీ స్వంతదైన ప్రతిదాన్నీ భద్రమైన చోట నీవు ఉంచుకోవాలి. ఎందుచేతనంటే పొలాల్లో నిలబడి ఉండే మనిషిగాని జంతువుగాని చచ్చినట్లే. ఇంట్లో చేర్చబడకుండా ఉండే ప్రతి దానిపైనా వడగళ్లు కురుస్తాయి.’”
20 ఫరో అధికారులలో కొందరు యెహోవా మాటను గమనించారు. వాళ్లు వెంటనే వారి పశువులన్నిటినీ, బానిసలందరినీ ఇండ్లలో చేర్చారు. 21 కాని మిగతా వాళ్లు యెహోవా సందేశాన్ని లెక్క చేయలేదు. అలాంటి వారు పొలాల్లో ఉన్న తమ బానిసలందరిని, జంతువులన్నింటిని అక్కడే ఉండ నిచ్చారు.
22 నీ చేతులు గాలిలో పైకి ఎత్తు, “ఈజిప్టు అంతటా వడగళ్ల వాన ప్రారంభం అవుతుంది. ఈజిప్టు పొలాల్లో ఉన్న మొక్కలన్నిటి మీద, జంతువుల మీద, మనుష్యులందరి మీద వడగళ్లు పడతాయి” అని మోషేతో యెహోవా చెప్పాడు.
23 కనుక మోషే తన కర్రను పైకి ఎత్తాడు, ఉరుములు, మెరుపులు వచ్చేటట్టు, భూమి మీద వడగళ్లు కురిసేటట్టు యెహోవా చేసాడు. ఈజిప్టు అంతటా వడగళ్లు పడ్డాయి. 24 వడగళ్లు పడుతోంటే, ఆ వడగళ్లతో పాటు మెరుపులు మెరిసాయి. ఈజిప్టు ఒక రాజ్యంగా ఏర్పడినప్పటి నుండి, ఈజిప్టును ఇంత దారుణంగా దెబ్బతీసిన వడగళ్ల వాన ఇదే. 25 ఈజిప్టు పొలాల్లో ఉన్న సర్వాన్నీ ఈ వడగళ్ల వాన నాశనం చేసింది. మనుష్యుల్ని, జంతువుల్ని, మొక్కల్ని వడగళ్లు నాశనం చేసాయి. వడగళ్ల మూలంగా పొలాల్లోని చెట్లన్నీ విరిగి పోయాయి. 26 ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషేను ఒక్కటే వడగళ్లు పడని ఒకే ఒక చోటు.
27 మోషే అహరోనులను ఫరో పిలిపించాడు. ఫరో వారితో, “ఈ సారి నేను పాపం చేసాను. యెహోవా న్యాయమంతుడు. తప్పు నాది, నా ప్రజలది. 28 వడగళ్లు, ఉరుములు మరీ భయంకరంగా ఉన్నాయి! వాటిని ఆపేయమని దేవుణ్ణి అడుగు. నేను మిమ్మల్ని వెళ్లిపోనిస్తాను. మీరు ఇక్కడ ఉండనక్కర్లేదు.” అని చెప్పాడు.
29 మోషే ఫరోతో చెప్పాడు: “నేను ఈ పట్టణంనుండి యెహోవా ఎదుట నా చేతులు చాచి ప్రార్థిస్తాను. ఉరుములు, వడగళ్లు ఆగిపోతాయి. ఈ భూమిమీద యెహోవా ఉన్నాడని మీరు అప్పుడు తెలుసుకొంటారు. 30 అయినా నీవు నీ అధికారులు ఇంకా యెహోవాకు భయపడడంలేదని నాకు తెలుసు.”
31 అప్పుడే జనుము గింజ పట్టింది. యవలు అప్పుడే పూత పట్టాయి. అయిననూ ఈ మొక్కలు నాశనం అయ్యాయి. 32 అయితే గోధుమలు, మిరప ఇతర ధాన్యాలకంటె ఆలస్యంగా పక్వానికి వస్తాయి. అందుచేత ఈ మొక్కలు నాశనం కాలేదు. 33 మోషే ఫరోను విడిచి పట్టణం బయటికి వెళ్లాడు. యెహోవా యెదుట అతడు తన చేతులు చాచాడు. ఉరుములు, వడగళ్లు ఆగిపోయాయి. నేలమీద వర్షం కురవడం కూడ ఆగిపోయింది.
34 ఎప్పుడయితే వర్షం, వడగళ్లు, ఉరుములు ఆగిపోవడం ఫరో చూశాడో, అప్పుడు అతను మళ్లీ తప్పు చేసాడు. అతను అతని అధికారులు మళ్లీ మొండికెత్తారు. 35 ఇశ్రాయేలు ప్రజల్ని స్వేచ్ఛగా వెళ్లనిచ్చేందుకు నిరాకరించాడు ఫరో. యెహోవా మోషే ద్వారా చెప్పినట్లే ఇది జరిగింది.
ఓడ పగిలి పోవటం
39 సూర్యోదయమయింది. వాళ్ళకు భూమి కనిపించింది. కాని వాళ్ళు అది గుర్తించలేదు. ఇసుక ఉన్న తీరం యొక్క పాయ కనపడగానే ఓడను వీలైతే అక్కడ ఆపాలనుకున్నారు. 40 త్రాళ్ళు కోసేసి లంగర్లను సముద్రంలోకి పడనిచ్చారు. చుక్కానుల త్రాళ్ళు విప్పారు. ఓడ యొక్క ముందుభాగంలో ఉన్న తెరచాపను లేపి ఓడను తీరం వైపు పోనిచ్చారు. 41 కాని ఆ ఓడ నీళ్ళలో ఉన్న యిసుకకు తగిలి భూమిలో చిక్కుకొని పోయింది. ఓడ యొక్క ముందుభాగం యిసుకలో చిక్కుకుపోవటం వల్ల ఓడ కదల్లేదు. అలలు తీవ్రంగా కొట్టటం వల్ల ఓడ యొక్క వెనుక భాగం ముక్కలై పోయింది.
42 నేరస్థులు ఈది పారిపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో సైనికులు వాళ్ళను చంపాలని నిశ్చయించుకున్నారు, 43 కాని పౌలు ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో ఆ శతాధిపతి సైనికులు చేయదలచిన దానిని చేయనివ్వలేదు. ఈద గలిగినవాళ్ళను, నీళ్ళలోకి దూకి ఒడ్డును చేరుకోమని ఆజ్ఞాపించాడు. 44 మిగతావాళ్ళను చెక్కల సహాయంతో, ఓడ యొక్క విరిగిన ముక్కల సహాయంతో ఒడ్డును చేరుకోమన్నాడు. ఈ విధంగా అందరూ క్షేమంగా తీరాన్ని చేరుకున్నారు.
© 1997 Bible League International