Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
65 సీయోను మీద ఉన్న దేవా, నేను నిన్ను స్తుతిస్తాను.
నేను వాగ్దానం చేసిన వాటిని నేను నీకు ఇస్తాను.
2 నీవు చేసిన వాటిని గూర్చి మేము చెబుతాము మరియు నీవు మా ప్రార్థనలు వింటావు.
నీ దగ్గరకు వచ్చే ప్రతి మనిషి యొక్క ప్రార్థనలూ నీవు వింటావు.
3 మా పాపాలు మేము భరించలేనంత భారమైనప్పుడు,
ఆ పాపాలను నీవు తీసివేస్తావు.
4 దేవా, నీ ప్రజలను నీవు ఏర్పరచుకొన్నావు.
నీ ఆలయానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు నీవు మమ్మల్ని ఏర్పాటు చేసికొన్నావు.
మాకు చాలా సంతోషంగా ఉంది!
నీ ఆలయంలో నీ పరిశుద్ధ ఇంటిలో మాకన్నీ అద్భుత విషయాలే ఉన్నాయి.
5 దేవా, నీవు మమ్మల్ని రక్షించుము. మంచి మనుష్యులు నిన్ను ప్రార్థిస్తారు.
నీవు వారి ప్రార్థనలకు జవాబిస్తావు.
వారి కోసం నీవు ఆశ్చర్య కార్యాలు చేస్తావు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నిన్ను నమ్ముకొంటారు.
6 దేవుడు తన మహాశక్తిని ఉపయోగించి పర్వతాలను చేశాడు.
మనచుట్టూరా ఆయన శక్తిని చూడగలము.
7 ఘోషించే సముద్రాలను దేవుడు నిమ్మళింప చేస్తాడు.
మరియు ప్రపంచంలో ఉన్న మనుష్యులందరినీ దేవుడు సంతోషంతో స్తుతింప చేస్తాడు.
8 దేవుడు చేసే శక్తివంతమైన విషయాలకు భూమిమీద ప్రతి మనిషీ భయపడతాడు.
దేవా, నీవు సూర్యుని ఉదయింపజేసే, అస్తమింపజేసే ప్రతి చోటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
9 నీవు భూమిని గూర్చి శ్రద్ధ తీసుకొంటావు.
నీవు దానికి నీరు పోస్తావు, అది దాని పంటలు పండించేలా నీవు చేస్తావు.
దేవా, నీవు కాలువలను ఎల్లప్పుడూ నీళ్లతో నింపుతావు.
నీవు ఇలా చేసి పంటలు పండింపచేస్తావు.
10 దున్నబడిన భూమి మీద వర్షం కురిసేటట్టు నీవు చేస్తావు.
భూములను నీవు నీళ్లతో నానబెడతావు.
నేలను నీవు వర్షంతో మెత్తపరుస్తావు.
అప్పుడు నీవు మొలకలను ఎదిగింపచేస్తావు.
11 కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు.
బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు.
12 అరణ్యము, కొండలు పచ్చగడ్డితో నిండిపోయాయి.
13 పచ్చిక బయళ్లు గొర్రెలతో నిండిపోయాయి.
లోయలు ధాన్యంతో నిండిపోయాయి.
పచ్చిక బయళ్లు, లోయలు సంతోషంతో పాడుతున్నట్లున్నాయి.
నీళ్లు రక్తంగా మారటం
14 అప్పుడు మోషే, అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు: “ఫరో మొండికెత్తాడు. ప్రజల్ని పోనిచ్చేందుకు ఫరో నిరాకరిస్తున్నాడు. 15 ఉదయాన్నే ఫరో నైలు నదికి వెళ్తాడు. నది ఒడ్డున అతని దగ్గరకు వెళ్లు. పాముగా మారిన ఆ కర్రను నీ వెంట తీసుకొనివెళ్లు. 16 అతనికి ఇలా చెప్పు: ‘హీబ్రూ ప్రజల దేవుడైన యెహోవా నన్ను నీ దగ్గరకు పంపించాడు. అరణ్యంలో నన్ను ఆరాధించటానికి నా ప్రజలను వెళ్లనివ్వు అని నీతో చెప్పమని యెహోవా నాతో చెప్పాడు. ఇప్పటివరకు నీవేమో యెహోవా మాట వినలేదు. 17 కనుక యెహోవా చెబుతున్నాడు, నేనే యెహోవానని చెప్పి నీవు ఇలా తెల్సుకొంటావు నా చేతిలో ఉన్న ఈ కర్రతో నైలు నది నీళ్లను నేను కొడతాను. నైలునది రక్తంగా మారిపోతుంది. 18 దానితో నదిలో చేపలన్నీ చస్తాయి, నది కుళ్లు కంపు కొడుతుంది. అంతటితో ఈజిప్టు వాళ్లు నదిలోని నీళ్లు తాగలేక పోతారు.’”
19 యెహోవా మోషేకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “వారి నదులు, కాలువలు, చెరువుల మీద, వారు నీరు నిల్వ చేసే ప్రతి స్థలం మీద తన చేతి కర్ర చాపాలని అహరోనుకు చెప్పు. అతను ఇలా చెయ్యగానే నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి. చెక్క పాత్రలు, రాతి పాత్రల్లో ఉన్న నీళ్లతో సహా మొత్తం నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి.”
20 యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే, అహరోనులు చేసారు. అతను కర్ర పైకెత్తి నైలునది నీళ్లమీద కొట్టాడు. ఫరో, అతని అధికారులు అందరి ముందు అతడు ఇలా చేసాడు. నదిలో నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి. 21 నదిలో చేపలు చచ్చాయి. నది కుళ్లు కంపు కొట్టడం మొదలయింది. అందుచేత ఈజిప్టు వాళ్లు ఆ నదిలో నీళ్లు తాగలేక పోయారు. ఈజిప్టు అంతా రక్తమయం అయిపోయింది.
22 మాంత్రికులు కూడ మాయలు చేసి అలాగే చేసారు. కనుక మోషే, అహరోనుల మాటను ఫరో లెక్కచేయలేదు. ఇది సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది. 23 ఫరో ముఖం తిప్పుకొని తన ఇంట్లోకి వెళ్లిపోయాడు. మోషే, అహరోనులు చేసిన దాన్ని ఫరో అలక్ష్యం చేసాడు.
24 ఈజిప్టు వాళ్లు నదిలో నీళ్లు త్రాగలేక పోయారు. అందుచేత తాగే నీళ్ల కోసం వాళ్లు ఆ నది చుట్టూ బావులు తవ్వారు.
తుఫాను
13 దక్షిణ గాలి వీచగానే తమకు కావలసింది దొరికిందని వాళ్ళనుకున్నారు. లంగరు తీసి, ఓడను క్రేతు తీరం ప్రక్కగా నడుపుతూ ప్రయాణం సాగించారు. 14 అంతలోనే, ఊరకులోను అనబడే తీవ్రమైన తుఫాను గాలి క్రేతు ద్వీపం మీదుగా వీచటం మొదలైంది. 15 ఓడ ఆ తుఫానుగాలికి కొట్టుకొని పోయింది. ఎదురు గాలివల్ల మా ఓడ ముందుకు పోలేక పోయింది. మేమేమీ చెయ్యలేక పోయాము. గాలి వీచిన వైపు మా ఓడ కొట్టుకొని పోయింది. 16 “కౌద” అనబడే చిన్న ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకొని దాని ప్రక్కగా ప్రయాణం సాగించాము. ఓడకు కట్టబడిన పడవను చాలా కష్టంగా కాపాడగలిగాము. 17 దానిని ఓడమీదకి ఎక్కించిన తర్వాత త్రాళ్ళు బిగించి ఓడను గట్టిగా కట్టారు. ఓడ “సూర్తిస్” ప్రాంతంలోని యిసుక తిప్పల మీదికి వెళ్తుందని భయపడ్డారు. కనుక తెరచాపలు దించి ఓడను గాలి వీచే వైపు పోనిచ్చారు.
18 మరుసటి రోజు, తుఫానుగాలి తీవ్రంగా వీచటంవల్ల ఓడలోవున్న సరుకులు సముద్రంలో పడవేసారు. 19 మూడవ రోజు ఓడలో ఉపయోగించే పనిముట్లను కూడా సముద్రంలో పడవేసారు. 20 సూర్యుడు కాని, నక్షత్రాలు కాని చాలా రోజుల దాకా కనపడ లేదు. తుఫానుగాలి తీవ్రత తగ్గలేదు. మేము బ్రతుకుమీద ఆశ యిక పూర్తిగా వదులుకున్నాము.
21 చాలా రోజులనుండి వాళ్ళు ఆహారం తినలేదు. పౌలు వాళ్ళ మధ్య నిలబడి, “నా సలహా పాటించి మీరు క్రేతునుండి ప్రయాణం చేయకుండా ఉండవలసింది. అలా చేసి ఉంటే మీకు కష్టంగాని, నష్టంగాని కలిగేది కాదు. 22 కాని, యిప్పుడు మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను. ధైర్యంగా ఉండండి. మీలో ఒక్కరు కూడా ప్రాణాల్ని కోల్పోరు. కాని ఓడ మాత్రం నష్టమౌతుంది. 23 నేను ఎవరికి చెందానో, ఎవరి సేవ నేను చేస్తున్నానో ఆయన దూత నిన్న రాత్రి నా ప్రక్కన నిలబడి ఇలా చెప్పాడు: 24 ‘పౌలూ! భయపడకు. విచారణకై నీవు చక్రవర్తి ముందు నిలబడతావు. దేవుడు దయదలిచి, నీ కోసం నీతో ప్రయాణం చేస్తున్న వాళ్ళ ప్రాణాలను రక్షించాడు.’ 25 అందువల్ల ప్రజలారా! దైర్యంగా ఉండండి. నాకు దేవుని పట్ల నమ్మకం ఉంది. ఆయన చెప్పినట్లే జరుగుతుంది. 26 మనం త్వరలోనే ఒక ద్వీపానికి కొట్టకుపోతాము” అని అన్నాడు.
27 పదునాల్గవ రోజు రాత్రి కూడా మేమింకా అద్రియ సముద్రంలో గాలికి కొట్టుకొని పోతున్నాము. సుమారు అర్ధరాత్రి వేళ నావికులు భూమి దగ్గరకొచ్చిందని గ్రహించారు. 28 బుడుదు[a] నీళ్ళలోకి వేసి ఇరవై బారల లోతుందని తెలుసుకున్నారు. కొంతసేపైన తర్వాత మళ్ళీ బుడుదు నీళ్ళలోకి వేసి పదునైదు బారల లోతుందని తెలుసుకున్నారు. 29 ఓడ రాళ్ళకు కొట్టుకుంటుందని భయపడి ఓడ వెనుక భాగంనుండి నాలుగు లంగర్లు వేసారు. ఆ తదుపరి సూర్యుని వెలుగు కోసం ప్రార్థించారు. 30 నావికులు ఓడ ముందుభాగంనుండి లంగర్లు నీళ్ళలోకి దింపుతున్నట్లు నటిస్తూ ఓడకు కట్టబడిన చిన్న పడవను సముద్రంలోకి దింపారు. తప్పించుకు వెళ్ళాలని వాళ్ళ ఉద్దేశ్యం. 31 అప్పుడు పౌలు శతాధిపతితో, సైనికులతో, “ఈ నావికులు ఓడలో ఉంటే తప్ప మీరు రక్షింపబడరు” అని అన్నాడు. 32 ఇది విని సైనికులు పడవకు కట్టిన త్రాళ్ళను కోసి ఆ పడవను నీళ్ళలోకి పోనిచ్చారు.
33 సూర్యోదయానికి ముందు పౌలు వాళ్ళనందర్ని తినమని చెబుతూ, “గడిచిన పదునాలుగు రోజులనుండి మీరు ఆహారం ముట్టకుండా జీవించారు. ఏం జరుగనున్నదో మీకు తెలియదు. అయినా కాచుకున్నారు. 34 ఇక మిమ్మల్ని కొంచెం తినమని వేడుకొంటున్నాను. మిమ్మల్ని రక్షించుకోవాలంటే తినటం అవసరం. మీ తలలపై ఉన్న ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు” అని అన్నాడు. 35 ఇలా చెప్పాక అతడు రొట్టెను తీసుకొని దేవునికి అందరి ముందు కృతజ్ఞతలు చెప్పి దాన్నుండి ఒక ముక్కను విరిచి తినటం మొదలు పెట్టాడు. 36 అప్పుడందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకున్నారు. 37 మా సంఖ్య మొత్తం రెండువందల డెబ్బది ఆరు. 38 వాళ్ళంతా తృప్తిగా తిన్నారు. ఆ తర్వాత ఓడలో ఉన్న మిగతా ధాన్యాన్ని సముద్రంలోకి పారవేసి ఓడను తేలిక చేసారు.
© 1997 Bible League International