Revised Common Lectionary (Complementary)
దేవుడు యోబుతో మాట్లాడటం
38 అప్పుడు యెహోవా తుఫానులో నుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు.
2 “నా జ్ఞానమును అంగీకరించక పనికిమాలిన,
తెలివితక్కువ మాటలతో నన్ను ప్రశ్నించే వీడు ఎవడు?
3 యోబూ, మగవాడిలా గట్టిగా ఉండు.
నేను నిన్ను అడిగే ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండు.
4 “యోబూ, నేను భూమిని చేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు?
నీవు అంత తెలివిగల వాడెవైతే నాకు జవాబు చెప్పు.
5 యోబూ, ప్రపంచం ఎంత పెద్దగా ఉండాలో నిర్ణయించింది ఎవరు?
నీకు తెలిసినట్టే ఉంది! కొలబద్దతో ప్రపంచాన్ని ఎవరు కొలిచారు?
6 భూమికి ఆధారాలు దేనిమీద ఉన్నాయి?
భూమికి అత్యంత ముఖ్యమైన రాయిని దాని పునాదిలో వేసింది ఎవరు?
7 అది జరిగినప్పుడు ఉదయ నక్షత్రాలు కలిసి పాడాయి.
దేవదూతలు కేకలు వేసి, ఎంతో సంతోషించారు.
8 “యోబూ, భూమి అగాధములో నుండి
సముద్రం ప్రవహించినప్పుడు దానిని నిలిపేందుకు దాని తలుపులు మూసినవారు ఎవరు?
9 ఆ సమయంలో నేనే సముద్రాన్ని మేఘాలతో కప్పి వేశాను.
మరియు సముద్రాన్ని చీకటితో చుట్టి వేశాను.
10 సముద్రానికి హద్దులు నేనే నియమించాను.
మూయబడిన ద్వారాల వెనుక నేను దానిని ఉంచాను.
11 నీవు ఇంత మట్టుకు రావచ్చు. కాని ఇంకా ముందుకు రాకూడదు.
నీ గర్వపు అలలు ఆగి పోవాల్సింది ఇక్కడే, అని నేను సముద్రంతో చెప్పాను.
అయిదవ భాగం
(కీర్తనలు 107–150)
107 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
ఆయన ప్రేమ శాశ్వతం.
2 యెహోవా రక్షించిన ప్రతి మనిషి ఆ మాటలు చెప్పాలి.
వారి శత్రువుల నుండి యెహోవా రక్షించిన ప్రతి మనిషీ ఆయనను స్తుతించాలి.
3 అనేక దేశాల నుండి యెహోవా తన ప్రజలను ఒక్కచోట సమావేశపర్చాడు.
తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణాల[a] నుండి ఆయన వారిని తీసుకొని వచ్చాడు.
23 కొందరు ఓడలో సముద్రం మీద ప్రయాణం చేశారు.
వారు సముద్రాల మీద వ్యాపారం చేశారు.
24 ఆ ప్రజలు యెహోవా చేయగలిగిన సంగతులను చూశారు.
సముద్రం మీద యెహోవా చేసిన ఆశ్చర్యకార్యాలను వారు చూశారు.
25 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, బలమైన గాలి వీచటం మొదలయింది.
అలలు అంతకంతకు పెద్దవయ్యాయి.
26 అలలు ఆకాశమంత ఎత్తు లేస్తున్నాయి.
తుఫాను మహా ప్రమాదకరంగా ఉండటంచేత మనుష్యులు ధైర్యాన్ని కోల్పోయారు.
27 ఆ మనుష్యులు తూలిపోతూ, తాగుబోతుల్లా పడిపోతున్నారు.
నావికులుగా వారి నైపుణ్యం నిష్ప్రయోజనం.
28 వారు చిక్కులో పడ్డారు. అందుచేత సహాయం కోసం వారు యెహోవాకు మొర పెట్టారు.
మరియు యెహోవా వారిని వారి కష్టాల్లోనుంచి రక్షించాడు.
29 దేవుడు తుఫానును ఆపివేసి,
అలలను నెమ్మది పర్చాడు.
30 సముద్రం నిమ్మళించినందుకు నావికులు సంతోషించారు.
వారు వెళ్లాల్సిన స్థలానికి దేవుడు వారిని క్షేమంగా నడిపించాడు.
31 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
ప్రజలకోసం యెహోవా చేసే ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
32 మహా సమాజంలో యెహోవాను స్తుతించండి.
పెద్దలు సమావేశమైనప్పుడు ఆయనను స్తుతించండి.
6 దేవునితో సహపనివారంగా మేము, దైవానుగ్రహాన్ని వృథా చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొంటున్నాము. 2 ఎందుకంటే, దేవుడే ఈ విధంగా అన్నాడు:
“నేను సరియైన సమయానికి మీ మనవి విన్నాను.
రక్షించే రోజున మీకు సహాయం చేసాను.”(A)
నేను చెప్పేదేమిటంటే, దేవుడు అనుగ్రహించే సమయం ఇదే. రక్షించే రోజు ఈ దినమే.
3 మేము చేసే సేవ చెడుపేరు పొందరాదని, మేము ఎవరి దారికి ఆటంకాలు కలిగించము. 4 దానికి మారుగా మేము అన్ని విషయాలలో దేవుని సేవకులమని రుజువు చేసుకొంటున్నాము. ఆ గొప్ప సహనం మాకు కష్టాలు, దుఃఖాలు, అవసరాలు కలిగినప్పుడు, 5 దెబ్బలు తిన్నప్పుడు, చెరసాలలో పడినప్పుడు, ప్రజలు ఎదురు తిరిగినప్పుడు, నిద్రాహారాలు లేక కష్టపడి పని చేసినప్పుడు, 6 నిష్కల్మషంగా ఉండటంలో, యితర్లను అర్థం చేసుకోవటంలో, సహనం, దయ చూపటంలో, పరిశుద్ధాత్మ విషయంలో, నిజమైన ప్రేమ వ్యక్తం చేయటంలో, 7 సత్యంగా మాట్లాడటంలో, దేవుని శక్తి విషయంలో, కుడి ఎడమ చేతుల్లో ఉన్న నీతి ఆయుధాల విషయంలో, 8 కీర్తి వచ్చినా, అవమానాలు కలిగినా, పొగడ్తలు వచ్చినా, నిందలు కలిగినా, సత్యవంతులన్నా, మోసగాళ్ళన్నా, 9 మేము తెలిసినా మమ్మల్ని తెలియనివాళ్ళుగా చూసినప్పుడు, చనిపోవుచున్నను చనిపోనివారిగా ఉన్నప్పుడు, కొట్టబడినా చంపబడకుండా ఉన్నప్పుడు, 10 దుఃఖంతో ఉన్నా ఆనందంగా ఉన్నప్పుడు, దరిద్రులమైనా యితరులను ధనవంతులుగా చేస్తున్నప్పుడు, మా దగ్గర ఏమీ లేకున్నా అన్నీ ఉన్నాయన్నట్టుగా ఉన్నప్పుడు మేము దేవుని సేవకులంగా రుజువు చేసుకొంటున్నాం.
11 కొరింథులోని ప్రజలారా! మేము మీతో దాచకుండా మాట్లాడి మిమ్మల్ని హృదయ పూర్వకంగా అంగీకరించాము. 12 మేము మా ప్రేమ దాచకుండా మీకు చూపాము. కాని మీరు మీ ప్రేమ మాకివ్వకుండా దాస్తున్నారు. 13 నేను మిమ్మల్ని నా బిడ్డలుగా భావించి మాట్లాడుతున్నాను. మేము మిమ్మల్ని హృదయ పూర్వకంగా అంగీకరించినట్లే, మమ్మల్ని మీరు హృదయపూర్వకంగా అంగీకరించండి.
యేసుని శిష్యులు ఆయన శక్తిని చూడటం
(మత్తయి 8:23-27; లూకా 8:22-25)
35 ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సముద్రం అవతలివైపుకు వెళ్దాం!” అని అన్నాడు. 36 శిష్యులు, అక్కడ ఉన్న ప్రజా సమూహాన్ని వదిలి పడవలో ఉన్న యేసును తమవెంట తీసుకు వెళ్ళారు. మరికొన్ని పడవలు కూడా వాళ్ళను అనుసరించాయి. 37 ఇంతలో తీవ్రమైన ఒక పెనుగాలి వీచింది. అలలు రేగి ఆ పడవలోకి నీళ్ళు వచ్చాయి. పడవ నిండి పోసాగింది. 38 పడవ వెనుక వైపు యేసు తలక్రింద ఒక దిండు పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయన్ని లేపి ఆయనతో, “బోధకుడా! మేము మునిగి పోయినా మీకు చింతలేదా?” అని అన్నారు.
39 ఆయన లేచి గాలిని, అలల్ని గద్దిస్తూ, “ఆగిపో, నెమ్మదించు!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి తీవ్రత తగ్గిపోయింది. అంతటా శాంతం ఏర్పడింది.
40 ఆయన తన శిష్యులతో, “మీరెందుకింత భయపడుతున్నారు? మీలో యింకా విశ్వాసం కలుగలేదా?” అని అన్నాడు.
41 వాళ్ళకు చాలా భయంవేసింది. తమలో తాము, “ఎవరీయన? గాలి, అలలు కూడా ఆయన మాటకు లోబడుతున్నాయే!” అని ఆశ్చర్యపడ్డారు.
© 1997 Bible League International