Revised Common Lectionary (Complementary)
అయిదవ భాగం
(కీర్తనలు 107–150)
107 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
ఆయన ప్రేమ శాశ్వతం.
2 యెహోవా రక్షించిన ప్రతి మనిషి ఆ మాటలు చెప్పాలి.
వారి శత్రువుల నుండి యెహోవా రక్షించిన ప్రతి మనిషీ ఆయనను స్తుతించాలి.
3 అనేక దేశాల నుండి యెహోవా తన ప్రజలను ఒక్కచోట సమావేశపర్చాడు.
తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణాల[a] నుండి ఆయన వారిని తీసుకొని వచ్చాడు.
23 కొందరు ఓడలో సముద్రం మీద ప్రయాణం చేశారు.
వారు సముద్రాల మీద వ్యాపారం చేశారు.
24 ఆ ప్రజలు యెహోవా చేయగలిగిన సంగతులను చూశారు.
సముద్రం మీద యెహోవా చేసిన ఆశ్చర్యకార్యాలను వారు చూశారు.
25 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, బలమైన గాలి వీచటం మొదలయింది.
అలలు అంతకంతకు పెద్దవయ్యాయి.
26 అలలు ఆకాశమంత ఎత్తు లేస్తున్నాయి.
తుఫాను మహా ప్రమాదకరంగా ఉండటంచేత మనుష్యులు ధైర్యాన్ని కోల్పోయారు.
27 ఆ మనుష్యులు తూలిపోతూ, తాగుబోతుల్లా పడిపోతున్నారు.
నావికులుగా వారి నైపుణ్యం నిష్ప్రయోజనం.
28 వారు చిక్కులో పడ్డారు. అందుచేత సహాయం కోసం వారు యెహోవాకు మొర పెట్టారు.
మరియు యెహోవా వారిని వారి కష్టాల్లోనుంచి రక్షించాడు.
29 దేవుడు తుఫానును ఆపివేసి,
అలలను నెమ్మది పర్చాడు.
30 సముద్రం నిమ్మళించినందుకు నావికులు సంతోషించారు.
వారు వెళ్లాల్సిన స్థలానికి దేవుడు వారిని క్షేమంగా నడిపించాడు.
31 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
ప్రజలకోసం యెహోవా చేసే ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
32 మహా సమాజంలో యెహోవాను స్తుతించండి.
పెద్దలు సమావేశమైనప్పుడు ఆయనను స్తుతించండి.
యోబు తన మాటలు కొనసాగించటం
29 యోబు మాట్లాడటం కొనసాగించాడు. యోబు ఇలా అన్నాడు:
2 “దేవుడు నన్ను కాపాడి, నా విషయం జాగ్రత్త తీసుకొన్న ఇటీవలి మాసాల్లో ఉన్నట్టుగానే
నా జీవితం ఉంటే బాగుండునని నేను ఆశిస్తున్నాను.
3 నేను చీకటిలో నడచినప్పుడు నాకు వెలుగు ఇచ్చుటకు నా తలమీద దేవుని వెలుగు ప్రకాశించే సమయం వస్తే బాగుండునని నేను ఆశిస్తున్నాను.
(నేను జీవించవలసిన సరియైన మార్గాన్ని దేవుడు నాకు చూపించాడు).
4 నా జీవితం ఎంతో విజయవంతంగా ఉండి దేవుడు నాకు సన్నిహితమైన స్నేహితునిగా ఉండే రోజుల కోసం నేను ఆశిస్తున్నాను.
అవి దేవుడు నా ఇంటిని ఆశీర్వదించిన రోజులు.
5 సర్వశక్తిమంతుడైన దేవుడు ఇంకా నాతో ఉండగా
నా పిల్లలు నా దగ్గర ఉన్న సమయం కోసం నేను ఆశిస్తున్నాను.
6 అది నా జీవితం ఎంతో బాగున్నప్పటి మాట.
నా మార్గం అంతా మీగడతో నిండిపోయినట్టు, నా కోసం ఒలీవ నూనెను నదులుగా ప్రవహించి నట్టు అది కనబడింది.
7 “నేను పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లి పట్టణ పెద్దలతో కలిసి
ఆరుబయట కూర్చున్న రోజులు అవి.
8 అక్కడ ప్రజలంతా నన్ను గౌరవించేవారు. యువకులు నన్ను చూచినప్పుడు పక్కకు తప్పుకొనేవారు.
పెద్దలు నా యెడల గౌరవ సూచకంగా లేచి నిలబడేవారు.
9 ప్రజానాయకులు నన్ను చూడగానే మాట్లాడటం నిలిపివేసి
నోటిమీద చేయి వేసుకొనేవారు (ఇతరులను నిశ్శబ్దంగా ఉంచటానికి).
10 చాలా ప్రముఖ నాయకులు కూడా, నేను వారిని సమీపించినప్పుడు వారి స్వరాలు తగ్గించేవారు.
అవును వారి నాలుకలు వారి అంగిట అంటుకొని పోయినట్లు కనిపించేది.
11 నేను మాట్లాడటం విన్నవారు ఎవరైనా సరే, నన్ను గూర్చి మంచి మాటలు చెప్పేవారు.
నన్ను చూచిన వారు నన్ను పొగిడారు.
12 ఎందుకంటే, పేదవాడు ఒకడు సహాయం కోసం వేడుకొంటే, నేను సహాయం చేశాను.
తల్లి దండ్రులు లేని బిడ్డ విషయం శ్రద్ధ తీసుకొనేవారు ఎవరూ లేనప్పుడు నేను సహాయం చేశాను.
13 మరణించే మనిషీ నన్ను ఆశీర్వదించాడు.
అవసరంలో ఉన్న విధవలకు నేను సహాయం చేసాను.
14 సక్రమంగా జీవించటం నాకు వస్త్రం.
న్యాయం నాకు అంగీలా, తలపాగాలా ఉండేది.
15 గుడ్డివారికి నా కళ్లతో నేను సహాయం చేశాను.
కుంటివారికి నా పాదాలతో నేను సహాయం చేశాను.
16 పేద ప్రజలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను.
కష్టాలలో ఉన్న పరాయివారి పక్షం నేను వహించాను.
17 దుర్మార్గుల శక్తిని నేను నాశనం చేశాను.
దుర్మార్గుల బారి నుండి నిర్దోషులను నేను రక్షించాను.
18 “నేను ఎల్లప్పుడూ ఇలా తలచేవాణ్ణి. నేను చాలాకాలం బ్రతుకుతాను.
తర్వాత నా స్వంత ఇంటిలో మరణిస్తాను.
19 వేర్లు ఎల్లప్పుడూ నీటిని తాకుతూ ఆకులు ఎల్లప్పుడు
మంచుతో తడిగా ఉండే చెట్టులా నేను ఉన్నాను.
20 నాలో నా మహిమ ఎల్లప్పుడూ కొత్తదిగా ఉంటుంది.
నాచేతిలో ఒక కొత్త విల్లు ఉన్నట్టుగా నేను ఎల్లప్పుడూ బలంగా ఉంటాను.
పౌలు మాసిదోనియా మరియు గ్రీసుకు వెళ్ళటం
20 అల్లర్లు తగ్గిపొయ్యాక, పౌలు యేసు శిష్యుల్ని పిలిచాడు. వాళ్ళను ఆత్మీయంగా ప్రోత్సాహపరిచి, వాళ్ళనుండి సెలవు తీసుకొన్నాడు. ఆ తర్వాత మాసిదోనియకు వెళ్ళాడు. 2 ఆ ప్రాంతాన పర్యటన చేసి ఆత్మీయంగా ఉత్సాహపరిచే ఎన్నో విషయాలు ప్రజలకు చెప్పి చివరకు గ్రీసు దేశం చేరుకున్నాడు. 3 అక్కడ మూడు నెలలున్నాడు. అక్కడినుండి సిరియ దేశానికి ఓడలో ప్రయాణం చెయ్యాలనుకొని సిద్ధమయ్యాడు.
ఇంతలో యూదులు తనను చంపాలని అనుకొంటున్నారని అతనికి తెలిసింది. అందువలన అతడు తిరిగి మాసిదోనియకు వెళ్ళి అక్కడినుండి ప్రయాణం చేసాడు. 4 అతని వెంట ఉన్నవాళ్ళు ఎవరనగా: బెరయ పట్టణంనుండి పుర్రు కుమారుడైన సోపత్రు, థెస్సలొనీక పట్టణంనుండి అరిస్తర్కు, సెకుందు, దెర్బే పట్టణంనుండి గాయి, తిమోతి, ఆసియనుండి తుకికు, త్రోఫిము. 5 వీళ్ళు ముందే వెళ్ళి మా కోసం త్రోయలో కాచుకొని ఉన్నారు. 6 కాని మేము ఫిలిప్పీనుండి ప్రత్యేకమైన పులియని రొట్టెల పండుగ తర్వాత ఓడలో ప్రయాణమయ్యాము. అయిదు రోజులు ప్రయాణం చేసాక త్రోయలో వాళ్ళను కలుసుకున్నాము. అక్కడ ఏడు రోజులు ఉన్నాము.
పౌలు చివరిసారి త్రోయకు వెళ్ళటం
7 ఆదివారం రోజున అంతా కలిసి రొట్టె విరుచుటకు సమావేశమయ్యాము. పౌలు మరుసటి రోజు ప్రయాణం చేయాలని అనుకోవటం వలన అర్థరాత్రి దాకా ప్రజలతో మాట్లాడాడు. 8 మేము మేడపైనున్న గదిలో సమావేశమయ్యాము. మా గదిలో చాలా దీపాలు వెలుగుతూ ఉన్నాయి. 9 ఆ గది కిటికీలో ఐతుకు అనే యువకుడు కూర్చొని ఉన్నాడు. పౌలు ఏకధాటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో ఐతుకుకు నిద్ర వచ్చి గాఢంగా నిద్రపొయ్యాడు. ఆ నిద్రలో మూడవ అంతస్తునుండి క్రింద పడ్డాడు. కొంత మంది వచ్చి చనిపోయిన అతణ్ణి చూసారు.
10 పౌలు క్రిందికి వెళ్ళి ఆ యువకుని ప్రక్కన ఒరిగి అతణ్ణి తన చేతుల్తో ఎత్తి, “దిగులు పడకండి, ప్రాణం ఉంది” అని అన్నాడు. 11 అతడు మళ్ళీ మేడ మీదికి వెళ్ళి రొట్టె విరిచి సోదరులకు పంచి తాను తిన్నాడు. తెల్లవారే దాకా వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపొయ్యాడు. 12 ప్రజలు బ్రతికింపబడిన ఆ యువకుణ్ణి అతని యింటికి పిలుచుకు వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళ మనస్సులు ఎంతో నెమ్మది పడ్డాయి.
త్రోయనుండి మిలేతుకు ప్రయాణం
13 మేము పౌలును వదిలి ఓడనెక్కి “అస్సు” కు వెళ్ళాము. తాను కాలి నడకన అస్సుకు చేరుకొని మమ్మల్ని అక్కడ కలుసుకొంటానని చెప్పాడు. అక్కడినుండి మాతో కలిసి ఓడలో ప్రయాణం చెయ్యాలని అతని ఉద్దేశ్యం. 14 మేము అతణ్ణి అస్సులో కలుసుకొన్నాక అతడు మా ఓడనెక్కాడు. అంతా కలిసి “మితులేనే” వెళ్ళాము. 15 మితులేనేనుండి మరుసటి రోజు ఓడలో మళ్ళీ ప్రయాణం సాగించి, “కీయొసు” ద్వీపం కొంత దూరం ఉందనగానే లంగరు వేసాము. ఆ మరుసటి రోజు ప్రయాణం చేసి “సమొసు” ద్వీపానికి దగ్గరగా వచ్చాము. మరొక రోజు ప్రయాణం చేసాక “మిలేతు” చేరుకున్నాము. 16 పౌలు యెరూషలేముకు త్వరగా వెళ్ళాలని అనుకొన్నాడు. ఆసియ ప్రాంతంలో కాలాన్ని వ్యర్థం చెయ్యటం యిష్టం లేక ఎఫెసులో ఆగకుండా వెళ్ళాడు. వీలైతే పెంతెకొస్తు పండుగనాటికి యెరూషలేంలో ఉండాలని అనుకొన్నాడు.
© 1997 Bible League International