Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు దైవధ్యానాల్లో ఒకటి. ఎదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటిలో ఉన్నాడని చెప్పినప్పటిది.
52 పెద్ద మనిషీ, దైవజనులకు విరోధంగా చేసే చెడ్డ పనులను గూర్చి నీవెందుకు అతిశయిస్తున్నావు?
2 వంకర పనులు చేయాలనే నీవు పథకం వేస్తుంటావు.
నీ నాలుక పదునుగల కత్తిలా ఉంది. ఎందుకంటే నీ నాలుక అబద్ధాలు పలుకుతుంది.
3 మంచి కంటె కీడునే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు.
సత్యం పలుకుటకంటె ఎక్కువగా అబద్ధాలు చెప్పటం నీకు ఇష్టం.
4 నీవూ, నీ అబద్ధాల నాలుక మనుష్యులను బాధించటానికే ఇష్టపడుతుంది.
5 అందుచేత దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు.
ఆయన నిన్ను పట్టి నీ గుడారము నుండి బయటకు లాగివేస్తాడు. సజీవుల దేశంలోనుండి ఆయన నిన్ను వేళ్లతో పెళ్లగిస్తాడు.
6 మంచి వాళ్లు ఇది చూచి,
దేవునిని గౌరవిస్తారు.
వారు నిన్ను చూచి నవ్వి ఇలా అంటారు,
7 “దేవుని మీద ఆధారపడని ఆ మనిషికి ఏమి సంభవించిందో చూడండి.
ఆ మనిషి తనకు సహాయం చేసేందుకు ఐశ్వర్యాన్ని, తనకున్న దానిని మూర్ఖంగా నమ్ముకున్నాడు.”
8 అయితే దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను.
నేను శాశ్వతంగా ఎప్పటికీ దేవుని ప్రేమనే నమ్ముకొన్నాను.
9 దేవా, నీవు చేసిన వాటి మూలంగా నేను నిన్ను శాశ్వతంగా స్తుతిస్తాను.
నీ అనుచరుల సముఖములో నీవు మంచివాడవని నేను ప్రకటిస్తాను.
దర్మార్గపు రాజులకు వ్యతిరేకంగా తీర్పు
22 యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు రాజభవనానికి వెళ్లు. అక్కడ యూదా రాజును కలిసి ఈ వర్తమానాన్ని అతనికి చెప్పు. 2 ‘ఓ యూదా రాజా, యెహోవా యొక్క ఈ వర్తమానాన్ని ఆలకించు. నీవు దావీదు సింహాసనంపై కూర్చుని పరిపాలిస్తున్నావు గనుక, ఇది వినుము. ఓ రాజా! నీవును నీ అధికారులును శ్రద్ధగా వినండి. యెరూషలేము ద్వారాల నుండి వచ్చే నీ ప్రజలంతా ఈ యెహోవా వాక్కును తప్పక వినాలి. 3 యెహోవా ఇలా చెపుతున్నాడు: న్యాయమైన, నీతిగల పనులనే చేయండి. దోపిడిగాండ్ర బారినుండి దోచుకోబడిన వారిని ఆదుకోండి. అనాధ పిల్లలను, వితంతువులను బాధించవద్దు. వారిపట్ల మీరు అపచారం చేయవద్దు. అమాయకులను చంపవద్దు. 4 ఈ ఆదేశ సూత్రాలను మీరు పాటిస్తే, మీకు ఈ మంచి పనులు జరుగుతాయి: దావీదు సింహాసనంపై కూర్చున్న రాజులంతా నగర ద్వారాలగుండా యెరూషలేముకు నిరంతరం రాగలుగుతారు. ఆ రాజులు వారి అధికారులతో సహా నగర ద్వారాల నుండి వస్తారు. ఆ రాజులు, వారి అధికారులు, వారి ప్రజలు అందరూ రథాలలోను, గుర్రాల మీదను స్వారీ చేస్తూ వస్తారు. 5 కాని మీరీ ఆదేశాలను పాటించకపోతే యెహోవా ఇలా చెప్పుచున్నాడు: యెహోవానైన నేను ప్రమాణ పూర్వకంగా చెప్పేదేమంటే, ఈ రాజగృహం నాశనం చేయబడుతుంది. ఇది కేవలం ఒక రాళ్ల గుట్టగా మారిపోతుంది.’”
6 యూదా రాజు నివసించే భవనాన్ని గురించి యెహోవా చెప్పేదేమంటే:
“గిలియాదు అడవుల్లా ఈ భవంతి చాలా ఎత్తుగా ఉంది
లెబానోను పర్వతాలవలె ఈ భవంతి ఎత్తుగావుంది
కాని నేను నిజంగా దీనిని ఎడారిలా మార్చివేస్తాను.
నిర్మానుష్యంగా వున్న నగరంవలె ఈ భవంతి ఖాళీగా వుండి పోతుంది.
7 ఈ భవనాన్ని నాశనం చేయటానికి నేను మనుష్యులను పంపుతాను.
ఆ రాజగృహ నాశనానికి వచ్చిన ప్రతి వాని చేతిలోను ఒక ఆయుధం ఉంటుంది.
అందమైన, బలమైన మీ దేవదారు దూలాలను వారు నరికి వేస్తారు.
నరికిన ఆ దూలాలను వారు తగలబెడతారు.
8 “ఇతర దేశాల ప్రజలెందరో ఈ నగరం ప్రక్కగా వెళతారు. వారంతా, ‘యెహోవా యెరూషలేమునకు ఎందుకీ దుర్గతి పట్టించాడు? యెరూషలేము ఒక గొప్ప నగరం’ అని ఒకరి నొకరు అడుగుతారు. 9 దానికి సమాధానమిది: ‘యూదా రాజ్య ప్రజలు వారి యెహోవా దేవుని నిబంధనను అనుసరించటం, మాని వేయటం మూలంగా దేవుడు యెరూషలేమును నాశనం చేశాడు. ఆ ప్రజలు అన్య దేవుళ్ళను కొలిచి ఆరాధించారు.’”
చెట్టు, దాని ఫలము
(మత్తయి 7:17-20; 12:34-35)
43 “మంచి చెట్టుకు చెడు పండ్లు కాయవు. అదే విధంగా చెడ్డ చెట్టుకు మంచి పండ్లు కాయవు. 44 పండ్లను బట్టి చెట్టు జాతి తెలుస్తుంది. ముండ్ల పొదల నుండి అంజూరపు పండ్లు, గోరింట పొదల నుండి ద్రాక్షాపండ్లు లభించవు. 45 మంచి వాని హృదయం మంచి గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అతని నుండి మంచి తనమే బయటకు వస్తుంది. చెడ్డవాని హృదయం చెడు గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అతనినుండి చెడే బయటకు వస్తుంది. మనిషి తన హృదయములో ఉన్న గుణాలను బట్టి మాట్లాడుతాడు.
© 1997 Bible League International