Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు దైవధ్యానాల్లో ఒకటి. ఎదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటిలో ఉన్నాడని చెప్పినప్పటిది.
52 పెద్ద మనిషీ, దైవజనులకు విరోధంగా చేసే చెడ్డ పనులను గూర్చి నీవెందుకు అతిశయిస్తున్నావు?
2 వంకర పనులు చేయాలనే నీవు పథకం వేస్తుంటావు.
నీ నాలుక పదునుగల కత్తిలా ఉంది. ఎందుకంటే నీ నాలుక అబద్ధాలు పలుకుతుంది.
3 మంచి కంటె కీడునే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు.
సత్యం పలుకుటకంటె ఎక్కువగా అబద్ధాలు చెప్పటం నీకు ఇష్టం.
4 నీవూ, నీ అబద్ధాల నాలుక మనుష్యులను బాధించటానికే ఇష్టపడుతుంది.
5 అందుచేత దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు.
ఆయన నిన్ను పట్టి నీ గుడారము నుండి బయటకు లాగివేస్తాడు. సజీవుల దేశంలోనుండి ఆయన నిన్ను వేళ్లతో పెళ్లగిస్తాడు.
6 మంచి వాళ్లు ఇది చూచి,
దేవునిని గౌరవిస్తారు.
వారు నిన్ను చూచి నవ్వి ఇలా అంటారు,
7 “దేవుని మీద ఆధారపడని ఆ మనిషికి ఏమి సంభవించిందో చూడండి.
ఆ మనిషి తనకు సహాయం చేసేందుకు ఐశ్వర్యాన్ని, తనకున్న దానిని మూర్ఖంగా నమ్ముకున్నాడు.”
8 అయితే దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను.
నేను శాశ్వతంగా ఎప్పటికీ దేవుని ప్రేమనే నమ్ముకొన్నాను.
9 దేవా, నీవు చేసిన వాటి మూలంగా నేను నిన్ను శాశ్వతంగా స్తుతిస్తాను.
నీ అనుచరుల సముఖములో నీవు మంచివాడవని నేను ప్రకటిస్తాను.
11 “యూదా రాజ కుటుంబానికి ఈ విషయాలు చెప్పండి:
‘యెహోవా వర్తమానాన్ని వినండి!
12 దావీదు వంశమా, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు:
నీవు ప్రతి రోజూ ప్రజల పట్ల సరియైన న్యాయ నిర్ణయం చేయాలి.
నేరస్థుల దౌష్ట్యానికి గురి అయిన వారిని సంరక్షించుము.
నీవది చేయకపోతే
నాకు చాలా కోపం వస్తుంది.
నా కోపం ఎవ్వరూ ఆపలేని
దహించు అగ్నిలా ఉంటుంది.
మీరు దుష్ట కార్యాలు చేశారు
గనుక ఇది జరుగుతుంది.’
13 “యెరూషలేమా, నేను నీకు వ్యతిరేకినైనాను.
నీవు పర్వత శిఖరంపై కూర్చుంటావు.
నీవు ఈ లోయలో మహరాణిలా కూర్చుంటావు.
యెరూషలేము వాసులారా
‘మమ్మల్ని ఎవ్వరూ ఎదుర్కొన లేరు,
ఎవ్వడూ మా పటిష్ఠమైన నగరం లోకి ప్రవేశించలేడు’ అని మీరంటారు.”
కాని యెహోవా నుండి వచ్చిన ఈ వర్తమానం వినండి.
14 “మీకు తగిన శిక్ష మీరనుభవిస్తారు!
మీ అడవుల్లో అగ్ని చెలరేగేలా చేస్తాను.
ఆ అగ్ని మీ చుట్టూ ఉన్న ప్రతి దానిని కాల్చి వేస్తుంది.”
22 ఆ పట్టణంలో నాకు మందిరం కనిపించలేదు. సర్వశక్తి సంపన్నుడు, ప్రభువు అయినటువంటి దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి మందిరమై ఉన్నారు. 23 దేవుని తేజస్సు ఆ పట్టణానికి వెలుగునిస్తుంది. గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి జ్యోతి కాబట్టి ఆ పట్టణానికి వెలుగునివ్వటానికి సూర్యచంద్రులు అవసరం లేదు.
24 జనులు ఆ వెలుగులో నడుస్తారు. ప్రపంచంలో ఉన్న రాజులు తమ ఘనతను ఆ పట్టణానికి తీసుకు వస్తారు. 25 ఆ పట్టణంలో రాత్రి అనేది ఉండదు. కనుక ఆ పట్టణం యొక్క ద్వారాలు ఎన్నటికీ మూయబడవు. 26 జనముల గౌరవము, వారి కీర్తి ఈ పట్టణానికి తేబడతాయి. 27 అపవిత్రమైనది ఆ పట్టణంలో ప్రవేశింపదు. అదే విధంగా అవమానకరమైన పనులు చేసేవాళ్ళు, మోసగాళ్ళు ఆ పట్టణంలోకి ప్రవేశించరు. గొఱ్ఱెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడ్డాయో వాళ్ళు మాత్రమే ప్రవేశించగలుగుతారు.
22 ఆ తర్వాత ఆ దేవదూత స్పటికంలా స్వచ్ఛంగా ఉన్న నదిని నాకు చూపాడు. దానిలో జీవజలం ఉంది. ఆ నది దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల కూర్చున్న సింహాసనం నుండి మొదలై, 2 పట్టణంలోని గొప్ప వీధి మధ్యనుండి పారుతూ ఉంది. ఆ నదికి యిరువైపులా జీవ వృక్షం ఉంది. ఆ వృక్షానికి పన్నెండు కాపులు కాస్తాయి. ప్రతి నెలా ఆ వృక్షం ఫలాలనిస్తుంది. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను నయం చేయటానికి ఉపయోగింపబడుతాయి.
3 ఇక మీదట ఏ శాపం ఉండదు. దేవునికి మరియు గొఱ్ఱెపిల్లకు చెందిన సింహాసనం పట్టణంలో ఉంటుంది. ఆయన భక్తులు ఆయనకు సేవ చేస్తారు. 4 వాళ్ళు ఆయన ముఖం చూస్తారు. ఆయన పేరు వాళ్ళ నొసళ్ళపై ఉంటుంది. 5 ఇక మీదట చీకటి ఉండదు. ప్రభువైన దేవుడు వాళ్ళకు వెలుగునిస్తాడు. కనుక వాళ్ళకు దీపపు వెలుగు కాని, సూర్యుని వెలుగు కాని అవసరం ఉండదు. వాళ్ళు చిరకాలం రాజ్యం చేస్తారు.
© 1997 Bible League International