Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు దైవధ్యానాల్లో ఒకటి. ఎదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటిలో ఉన్నాడని చెప్పినప్పటిది.
52 పెద్ద మనిషీ, దైవజనులకు విరోధంగా చేసే చెడ్డ పనులను గూర్చి నీవెందుకు అతిశయిస్తున్నావు?
2 వంకర పనులు చేయాలనే నీవు పథకం వేస్తుంటావు.
నీ నాలుక పదునుగల కత్తిలా ఉంది. ఎందుకంటే నీ నాలుక అబద్ధాలు పలుకుతుంది.
3 మంచి కంటె కీడునే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు.
సత్యం పలుకుటకంటె ఎక్కువగా అబద్ధాలు చెప్పటం నీకు ఇష్టం.
4 నీవూ, నీ అబద్ధాల నాలుక మనుష్యులను బాధించటానికే ఇష్టపడుతుంది.
5 అందుచేత దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు.
ఆయన నిన్ను పట్టి నీ గుడారము నుండి బయటకు లాగివేస్తాడు. సజీవుల దేశంలోనుండి ఆయన నిన్ను వేళ్లతో పెళ్లగిస్తాడు.
6 మంచి వాళ్లు ఇది చూచి,
దేవునిని గౌరవిస్తారు.
వారు నిన్ను చూచి నవ్వి ఇలా అంటారు,
7 “దేవుని మీద ఆధారపడని ఆ మనిషికి ఏమి సంభవించిందో చూడండి.
ఆ మనిషి తనకు సహాయం చేసేందుకు ఐశ్వర్యాన్ని, తనకున్న దానిని మూర్ఖంగా నమ్ముకున్నాడు.”
8 అయితే దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను.
నేను శాశ్వతంగా ఎప్పటికీ దేవుని ప్రేమనే నమ్ముకొన్నాను.
9 దేవా, నీవు చేసిన వాటి మూలంగా నేను నిన్ను శాశ్వతంగా స్తుతిస్తాను.
నీ అనుచరుల సముఖములో నీవు మంచివాడవని నేను ప్రకటిస్తాను.
దేవదారు వృక్షంవంటి అష్షూరు
31 చెరకి కొనిపోబడిన పదకొండవ సంవత్సరం మూడవ నెల మొదటి రోజున యెహోవా మాట నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోకు మరియు అతని ప్రజలకు ఈ విషయాలు తెలియజేయుము,
“‘గొప్పతనంలో
నీవు ఎవరిలా ఉన్నావు?
3 మిక్కిలి ఉన్నతంగా పెరిగి తన అందమైన కొమ్మలతో దట్టమైన నీడనిస్తూ
లెబానోనులో పెరిగిన కేదారు వృక్షం అష్షూరు రాజ్యమే.
దాని తల మేఘాల్లో ఉంది!
4 మంచి నీటివనరు చెట్టును బాగా పెరిగేలా చేసింది.
లోతైన నది అది ఎత్తుగా పెరగటానికి దోహదమిచ్చింది.
చెట్టు నాటబడిన ప్రాంతంలో నదులు ప్రవహించాయి.
దాని కాలువలే అక్కడి పొలాల్లో ఉన్న చెట్లకు నీటిని అందజేశాయి
5 ఆ వృక్షం అలా మిగిలిన చెట్లన్నిటిలో పొడవుగా పెరిగింది.
దానికి ఎన్నో కొమ్మలు పెరిగాయి.
నీరు పుష్కలంగా ఉంది.
అందువల్ల దాని కొమ్మలు విస్తరించాయి.
6 కావున పక్షులన్నీ దాని
కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి.
ఆ ప్రాంతంలో జంతువులన్నీ దాని
చల్లని నీడలో తమ పిల్లల్ని పెట్టాయి.
గొప్ప రాజ్యాలన్నీ
ఆ చెట్టు నీడలో నివసించాయి!
7 ఆ విధంగా ఆ చెట్టు తన గొప్పతనంలోను,
తన పొడవైన కొమ్మలతోను,
ఎంతో ఆందంగా కన్పించింది.
ఎందువల్ల ననగా దానివేళ్ళు నీరు బాగా అందేవరకు నాటుకున్నాయి!
8 దేవుని ఉద్యానవనంలో ఉన్న కేదారు వృక్షాలు
కూడా ఈ చెట్టంత పెద్దగా లేవు.
దీనికి ఉన్నన్ని కొమ్మలు సరళ వృక్షాలకు కూడా లేవు.
అక్షోట (మేడి) చెట్లకు అసలిటువంటి కొమ్మలే లేవు.
దేవుని ఉద్యానవనంలో
ఇంత అందమైన చెట్టేలేదు.
9 అనేకమైన కొమ్మలతో
ఈ చెట్టును నేను అందమైనదిగా చేశాను.
ఏదెనులో దేవుని ఉద్యానవనంలో ఉన్న చెట్లన్నీ
దీనిపట్ల అసూయ చెందాయి!’”
10 కావున నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “ఈ చెట్టు విస్తరించి పొడవుగా పెరిగింది. దాని తలని మబ్బుల్లో పెట్టుకుంది. దాని ఎత్తు చూసుకొని అది గర్వపడింది. 11 అందువల్ల ఒక పరాక్రమశాలియగు రాజు ఆ చెట్టును ఉంచుకొనేలా చేస్తాను. అది చేసిన చెడ్డ పనులకు ఆ పాలకుడు దానిని శిక్షిస్తాడు. అతని చెడు తనంవల్ల నేను ఆ చెట్టును నాతోటనుండి తీసుకొంటిని. 12 దేశాలన్నిటిలో క్రొత్తవాళ్లు, చాలా క్రూరులయిన వాళ్లు దానిని నరికి పడవేశారు. ఆ చెట్టు కొమ్మలు కొండల మీదను, లోయలలోను చెల్లా చెదరుగా పడవేశారు. ఆ దేశం గుండా ప్రవహించే నదులలో విరిగిన కొమ్మలు కొట్టుకు పోయాయి. ఆ చెట్టు క్రింద నీడ ఇక ఏ మాత్రం లేకపోవటంతో వివిధ దేశాల ప్రజలంతా దానిని వదిలిపెట్టారు.
చివరి మాట
11 ఇది మీకు నేను నా స్వహస్తాలతో వ్రాసాను. మీరు గమనించాలని అక్షరాలు ఎంత పెద్దగా వ్రాసానో చూడండి. 12 నలుగురిలో మంచి పేరు పొందాలనుకొన్నవాళ్ళు సున్నతి చేయించుకోమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళీ విధంగా చెయ్యటానికి ఒకే ఒక కారణం ఉంది. అది క్రీస్తు సిలువను గురించి బోధించటం వల్ల కలిగే హింసనుండి తప్పించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం. 13 సున్నతి చేసుకొన్నవాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని ఆచరించరు. కాని శారీరకంగా వాళ్ళు గర్వించటానికి మిమ్మల్ని సున్నతి చేయించుకోమంటున్నారు.
14 యేసు క్రీస్తు ప్రభువు యొక్క సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించను. ఎందుకనగా క్రీస్తు సిలువ ద్వారా లోకానికి నేను, నాకు లోకం చచ్చియున్నాము. 15 సున్నతి చేయించుకొన్నా, చేయించుకోకపోయినా ఒకటే. క్రొత్త జీవితం పొందటం ముఖ్యం. 16 ఈ నియమాల్ని పాటించేవాళ్ళందరికీ, దేవుని ఇశ్రాయేలు ప్రజలకు శాంతి, అనుగ్రహం లభించును గాక.
17 చివరకు, నా దేహంపై యేసును గురించి పొందిన గుర్తులు ఉన్నాయి. కనుక నాకెవ్వరూ ఆటంకం కలిగించకుండా ఉండండి.
18 సోదరులారా! యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహము మీ ఆత్మకు తోడై ఉండుగాక! ఆమేన్.
© 1997 Bible League International