Revised Common Lectionary (Complementary)
22 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు:
“పిమ్మట ఎత్తైన దేవదారు వృక్షపు కొమ్మనొకటి నేను తీసుకొంటాను.
వృక్షపు పైభాగాన్నుండి ఒక చిన్న రెమ్మను తీసుకొంటాను.
నేనే దానిని చాలా ఎత్తైన పర్వతం మీద నాటుతాను.
23 నేనే దానిని ఇశ్రాయేలులోని ఒక ఎత్తైన పర్వతంపై నాటుతాను.
ఆ కొమ్మ ఒక వృక్షంలా పెరుగుతుంది.
అది బాగా కొమ్మలు వేసి, పండ్లు కాస్తుంది.
అది ఒక అందమైన దేవదారు వృక్షమవుతుంది.
దాని కొమ్మలపై అనేకమైన పక్షులు కూర్చుంటాయి.
అనేకమైన పక్షులు దాని కొమ్మల నీడల్లో నివసిస్తాయి.
24 “నేను పొడవైన వృక్షాలన్నిటినీ నేలకు పడేస్తానని ఇతర చెట్లన్నీ అప్పుడు తెలుసుకొంటాయి.
చిన్న చెట్లను పెరగనిచ్చి మహావృక్షాలను చేస్తానని కూడా అవి తెలుసుకొంటాయి.
పచ్చని చెట్లు ఎండిపోయేలా,
ఎండిన మోడులు చిగురించేలా చేస్తాను.
నేనే యెహోవాను
నేనేదైనా చేస్తానని చెప్పితే నేనది తప్పక చేస్తాను!”
సబ్బాతుకోసం స్తుతి కీర్తన.
92 యెహోవాను స్తుతించుట మంచిది.
సర్వోన్నతుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది.
2 ఉదయం నీ ప్రేమను గూర్చి పాడటం,
రాత్రివేళ నీ నమ్మకత్వాన్ని గూర్చి పాడటం మంచిది.
3 దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల ములను నీ కోసం వాయించటం మంచిది.
సితారా మీద నీ కోసం సంగీతనాదం చేయటం మంచిది.
4 యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు.
నీవు చేసిన వాటిని గూర్చి మేము సంతోషంగా పాడుకొంటాం.
12 నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు.
వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు.
13 మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాటబడిన మొక్కలవలె బలంగా ఉంటారు.
వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు.
14 వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు.
వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా వుంటారు.
15 యెహోవా మంచివాడని నేను చెబుతున్నాను.
ఆయనే నా బండ.
ఆయనలో అవినీతి లేదు.
6 అందువల్ల మనము ఈ శరీరంలో నివాసమున్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు ఖండితంగా తెలుసు. 7 మనము దృష్టి ఉండటం వల్ల జీవించటం లేదు. విశ్వాసం ఉండటం వల్ల జీవిస్తున్నాము. 8 మనమీ శరీరానికి దూరమై, ప్రభువుతో నివసించాలని కోరుకొంటున్నాము. మనకు ఆ ధైర్యం ఉంది. 9 అందువల్ల మనమీ శరీరంలో నివసిస్తున్నా లేక దానికి దూరంగా ఉన్నా ఆయన్ని ఆనంద పరచటమే మన ఉద్దేశ్యం. 10 ఎందుకంటే మనమంతా క్రీస్తు సింహాసనం ముందు నిలబడవలసి వస్తుంది. అప్పుడు, ఈ శరీరంలో మనముండగా చేసిన మంచికి, చెడుకు తగిన విధంగా ప్రతి ఒక్కడూ ప్రతిఫలం పొందుతాడు.
దేవునితో సమాధానం
11 కనుక ప్రభువుకు భయపడుట అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. కనుక ఆయన సందేశాన్ని అంగీకరించుమని ఇతరులను కూడా ఒత్తిడి చేస్తాము. మా గురించి దేవునికి బాగా తెలుసు. మీ హృదయాలకు కూడా ఈ విషయం తెలుసునని నా విశ్వాసం. 12 మా గురించి మేము చెప్పుకోవాలని లేదు. మా విషయంలో గర్వించటానికి మీకు అవకాశం యిస్తున్నాము. అప్పుడు మీరు మనిషి గుణాన్ని కాక, అతని వేషం చూసి పొగిడేవాళ్ళకు సమాధానం చెప్పగలుగుతారు. 13 మాకు మతి పోయిందా? ఔను, అది దేవుని కోసం పోయింది. మాకు మతి ఉందా? ఔను అది మీకోసం ఉంది.
14 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తుంది. ఎందుకంటే ప్రజల కోసం ఆయన మరణించాడు. అందువల్ల అందరూ ఆయన మరణంలో భాగం పంచుకొన్నారు. ఇది మనకు తెలుసు. 15 ఆయన అందరి కోసం మరణించాడు. కనుక జీవిస్తున్నవాళ్ళు యిక మీదట తమ కోసం జీవించరాదు. మరణించి ప్రజలకోసం మళ్ళీ బ్రతికింపబడినవాని కోసం జీవించాలి.
16 ఇకనుండి మేము ఎవ్వరినీ లౌకికంగా పరిగణించము. ఒకప్పుడు మనం క్రీస్తును లౌకికంగా పరిగణించాము, గాని ఇప్పుడు అలా కాదు. ఆయన్ని గురించి మా అభిప్రాయం మారిపోయింది. 17 క్రీస్తులో ఐక్యత పొందినవాడు క్రొత్త జీవితం పొందుతాడు. పాత జీవితం పోయి క్రొత్త జీవితం వస్తుంది.
పెరిగే విత్తనం యొక్క ఉపమానం
26 యేసు మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “దేవుని రాజ్యం ఈ విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి విత్తనాల్ని భూమ్మీద చల్లుతాడు. 27 అవి రాత్రి, పగలు, అతడు పడుకొని ఉన్నా, లేచివున్నా మొలకెత్తి పెరుగుతూ ఉంటాయి. అవి ఏ విధంగా పెరుగుతున్నాయో అతనికి తెలియదు. 28 భూమి తనంతకు తానె ధాన్యాన్ని పండిస్తుంది. మొదట మొలక వేసి ఆ తర్వాత కంకువేసి, ఆ కంకి నిండా ధాన్యం పండుతుంది. 29 పంటకాలం వరకు ఆ ధాన్యం పూర్తిగా పండిపోతుంది. వెంటనే, రైతు కొడవలిపెట్టి కోస్తాడు.”
దేవుని రాజ్యం దేనీతో పోల్చపడింది?
(మత్తయి 13:31-32, 34-35; లూకా 13:18-19)
30 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “దేవుని రాజ్యం ఏ విధంగా ఉందని చెప్పాలి? ఏ ఉపమానాన్ని ఉపయోగించి దాన్ని వర్ణించాలి? 31 అది ఆవగింజలాంటిది. మనం భూమిలో నాటే విత్తనాలన్నిటి కన్నా అది చాలా చిన్నది. 32 కాని ఆ ఆవగింజను నాటాక తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఉంటాయి. గాలిలో ఎగిరే పక్షులు దాని నీడలో గూడుకట్టుకొంటాయి.”
33 యేసు ఇలాంటి ఉపమానాల్ని ఎన్నో ఉపయోగించి, దైవసందేశాన్ని వాళ్ళు అర్థం చేసుకొన్నంత బోధించాడు. 34 ఉపమానాల్ని ఉపయోగించకుండా వాళ్ళకు ఏదీ బోధించ లేదు. కాని ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకు అన్నీ వివరించి చెప్పాడు.
© 1997 Bible League International