Revised Common Lectionary (Complementary)
సబ్బాతుకోసం స్తుతి కీర్తన.
92 యెహోవాను స్తుతించుట మంచిది.
సర్వోన్నతుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది.
2 ఉదయం నీ ప్రేమను గూర్చి పాడటం,
రాత్రివేళ నీ నమ్మకత్వాన్ని గూర్చి పాడటం మంచిది.
3 దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల ములను నీ కోసం వాయించటం మంచిది.
సితారా మీద నీ కోసం సంగీతనాదం చేయటం మంచిది.
4 యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు.
నీవు చేసిన వాటిని గూర్చి మేము సంతోషంగా పాడుకొంటాం.
12 నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు.
వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు.
13 మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాటబడిన మొక్కలవలె బలంగా ఉంటారు.
వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు.
14 వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు.
వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా వుంటారు.
15 యెహోవా మంచివాడని నేను చెబుతున్నాను.
ఆయనే నా బండ.
ఆయనలో అవినీతి లేదు.
అమాజ్యా యూదాలో తన పరిపాలన ప్రారంభించుట
14 యూదా రాజయిన యోవాషు కుమారుడైన అమాజ్యా యెహోయాహాజు కొడుకైన యోవాషు ఇశ్రాయేలు రాజుగా వున్న రెండవ సంవత్సరమున యూదాకు రాజయ్యాడు. 2 అమాజ్యా పరిపాలన ప్రారంభించేనాటికి 25 యేళ్లవాడు. యెరూషలేములో అమాజ్యా 29 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను. 3 యెహోవా మెచ్చుకున్న పనులు అమాజ్యా జరిగించాడు. తన పూర్వికుడైన దావీదువలె అతను పూర్తిగా దేవుని అనుసరించలేదు. తన తండ్రి అయిన యోవాషు చేసిన పనులన్నీ అతను చేశాడు. 4 అతను ఉన్నత స్థానాలను నాశనం చేయలేదు. ఆ ఆరాధనా స్థలాలలో ఆ నాటికీ ప్రజలు బలులు అర్పించుచూ, ధూపం వేస్తూ ఉన్నారు.
5 అమాజ్యాకు తన రాజ్యం మీద మంచి అదుపు వున్న ఆ సమయమున, తన తండ్రిని చంపిన అధికారులను అతను చంపాడు. 6 కాని హంతకుల పిల్లలను అతను చంపలేదు. యెహోవా మోషే ధర్మశాస్త్రంలో ఈ ఆజ్ఞను ఇచ్చాడు; “తమ పిల్లలు చేసినదానికి వారి తల్లిదండ్రులను చంపకూడదు. తమ తల్లిదండ్రులు చేసిన దానికి వారి పిల్లలను చంపకూడదు. అతనే స్వయంగా చేసిన చెడు పనికి అతనినే చంపవలెను.”(A)
7 అమాజ్యా ఉప్పు లోయలో పదివేల మంది ఎదోము వాళ్లను చంపాడు. యుద్ధంలో అమాజ్యా సెలా అనే స్థలాన్ని “యొక్తయేలు” అని వ్యవహరించాడు. ఆ స్థలం నేటికీ “యొక్తయేలు” అని పిలువ బడుచున్నది.
అమాజ్యా యెహోయాషుకి ప్రతికూలంగా యుద్ధం కోరుకొనుట
8 అమాజ్యా యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు వద్దకు దూతల్ని పంపాడు. యెహోయాహాజు ఇశ్రాయేలు రాజయిన యెహూ కుమారుడు. “మనము ముఖాముఖిగా కలుసుకుని యుద్ధం చేద్దాము” అని అమాజ్యా సందేశం పంపించాడు.
9 ఇశ్రాయేలు రాజయిన యెహోయాషు యూదా రాజయిన అమాజ్యకు తిరిగి వ్రాశాడు. యెహోయాషు ఇలా చెప్పాడు. “లెబానోను దేవదారు చెట్టుకి లెబానోనులోని ముళ్లపొద ఒక సందేశం పంపింది. అది ఏమనగా, నీవు నీ కుమార్తెను నా కుమారుడికి పెళ్లి చేసుకునేందుకు యిమ్ము. కాని లెబానోనులోని ఒక దుష్ట మృగం ఆ త్రోవను వెళుతూ ముళ్లపొద మీద నడిచింది. నీవు ఎదోముని ఓడించిన మాట నిజమే. 10 కాని నీవు ఎదోము మీద పొందిన విజయానికి నీవు గర్వపడుతున్నావు. నీవు ఎదోములో వుండి మిడిసిపడుతున్నావు. ఇంతకు నీవు ఎందుకు ఆపద తెచ్చుకుంటావు. నీవు ఇలా చేస్తే, నీవు పతనంకాగలవు. మరియు యూదా నీతో పాటు నాశనం కాగలదు.”
11 కాని అమాజ్యా యెహోయాషు ఇచ్చిన హెచ్చరికను లెక్కచేయలేదు. అందువల్ల ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమాజ్యాకు ప్రతి కూలంగా బేత్షెమెషు అనే చోట యుద్ధం చేయడానికి వెళ్లాడు. 12 ఇశ్రాయేలు యూదాను ఓడించాడు. యూదాకు చెందిన ప్రతి వ్యక్తి పారిపోయాడు. 13 బేత్షెమెషు వద్ద ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమాజ్యాను బంధించాడు. అమాజ్యా యెవాషు కుమారుడు. అతను అహజ్యా కుమారుడు. యెహోయాషు అమాజ్యాను యెరూషలేముకు తీసుకువెళ్లాడు. యెహోయాషు ఎఫ్రాయీము ద్వారం నుంచి కోట ద్వారం, 600 అడుగుల యెరూషలేము ప్రాకారమును పగలగొట్టాడు. 14 తర్వాత యెహోయాషు యెహోవా ఆలయం లోని బంగారం, వెండి, వస్తువులను రాజభవనంలోని నిధులను తీసుకుపోయాడు. యెహోయాషు ప్రజలను కూడా తన బందీలుగా తీసుకుపోయాడు. తర్వాత అతను షోమ్రోనుకు తిరిగి వెళ్లాడు.
రైతు విత్తనాలు చల్లుటను గురించిన ఉపమానం
(మత్తయి 13:1-9; లూకా 8:4-8)
4 ఒక రోజు యేసు సముద్రం దగ్గర బోధించటం మొదలు పెట్టాడు. ఆయన చుట్టూ చాలమంది ప్రజలు చేరటం వల్ల ఆయన పడవనెక్కి కూర్చొని నీళ్ళలోకి వెళ్ళాడు. ప్రజలు ఒడ్డున ఉన్నారు. 2 ఆయన ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్ళకు చాలా విషయాలు బోధించాడు. ఆ విధంగా బోధిస్తూ,
3 “వినండి! ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. 4 అతడు విత్తనములు చల్లుతుండగా కొన్ని దారి ప్రక్కన పడ్డాయి. వాటిని పక్షులు తినివేసాయి. 5 మరికొన్ని మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందువల్ల అవి త్వరగా మొలకెత్తాయి. 6 కాని సూర్యుడు రాగానే అవి ఆ వేడికి వాడిపోయాయి. వాటికి వేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి. 7 మరికొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కల మధ్య పడ్డాయి. ఆ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కలను అణచి వేయటంవల్ల వాటికి ధాన్యం పండలేదు. 8 మరికొన్ని విత్తనాలు సారవంతమైన భూమ్మీద పడ్డాయి. అవి మొలకెత్తి పెరిగి, ముప్పై వంతుల, అరవైవంతుల, నూరువంతుల పంటను కూడా యిచ్చాయి.”
9 ఈ విధంగా చెప్పి యేసు, “చెవులున్న వాడు విననీ!” అని అన్నాడు.
యేసు బోధించుటకు ఉపమానములను ఎందుకు ఉపయోగించాడు
(మత్తయి 13:10-17; లూకా 8:9-10)
10 ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన పన్నెండుగురు శిష్యులు ఆయన చుట్టూ ఉన్న మిగతా వాళ్ళు ఆ ఉపమానాన్ని గురించి అడిగారు.
11 ఆయన వాళ్ళతో, “దేవుని రాజ్యంయొక్క రహస్య జ్ఞానాన్ని మీకు చెప్పాను. కాని యితరులకు ఈ జ్ఞానం ఉపమానాల ద్వారా చెబుతాను. 12 ఎందుకంటే,
‘వాళ్ళు ఎప్పుడూ చూస్తారు కాని ఏదీ గ్రహించరు.
అన్నీ వింటారు కాని ఒక్కటీ అర్థం చేసుకోరు.
వాళ్ళు అలా చేస్తే దేవుని వైపు మళ్ళవచ్చు దేవుడు వాళ్ళను క్షమిస్తాడు.’”(A)
యేసు విత్తనము యొక్క ఉపమానమును వివరించటం
(మత్తయి 13:18-23; లూకా 8:11-15)
13 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “మీకీ ఉపమానం అర్థం కాలేదా? మరి మిగతా ఉపమానాల్ని ఎలా అర్థం చేసుకొంటారు? 14 రైతు, దైవ సందేశాన్ని విత్తుతున్నవాడు. 15 కొందరు వ్యక్తులు దారి మీది మట్టిలాంటి వాళ్ళు. వీళ్ళలో విత్తనం నాటిన వెంటనే, అంటేవాళ్ళు విన్న వెంటనే, సైతాను వచ్చి వాళ్ళలో నాటబడిన దైవసందేశాన్ని తీసుకువెళ్తాడు.
16 “మరి కొందరు రాతినేలలాంటి వాళ్ళు. వీళ్ళు సందేశాన్ని విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు. 17 కాని వాళ్ళు సందేశాన్ని లోతైన జీవితంలోనికి నాటనివ్వరు. కొంత కాలం మాత్రమే నిలుస్తుంది. ఆ సందేశం కారణంగా కష్టంకాని, హింసకాని కలిగితే వాళ్ళు వెంటనే దాన్ని వదిలేస్తారు.
18 “మరి కొందరు ముళ్ళమొక్కలు మొలిచే నేలలాంటి వాళ్ళు. వాళ్ళు దైవసందేశం వింటారు కాని 19 ఈ జీవితం వల్ల కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, యితర వస్తువుల పట్ల వ్యామోహం, ఆ దైవ సందేశాన్ని అణిచివేసి ఫలించకుండా చేస్తాయి.
20 “ఇతరులు సారవంతమైన భూమిలాంటివాళ్ళు. కనుక వీళ్ళు దైవసందేశాన్ని విని అంగీకరించి ఫలంపొందే వాళ్ళు. కనుక వీళ్ళు ముప్పై, అరవై, నూరువంతుల ఫలం ఫలిస్తారు.”
© 1997 Bible League International