Revised Common Lectionary (Complementary)
సబ్బాతుకోసం స్తుతి కీర్తన.
92 యెహోవాను స్తుతించుట మంచిది.
సర్వోన్నతుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది.
2 ఉదయం నీ ప్రేమను గూర్చి పాడటం,
రాత్రివేళ నీ నమ్మకత్వాన్ని గూర్చి పాడటం మంచిది.
3 దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల ములను నీ కోసం వాయించటం మంచిది.
సితారా మీద నీ కోసం సంగీతనాదం చేయటం మంచిది.
4 యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు.
నీవు చేసిన వాటిని గూర్చి మేము సంతోషంగా పాడుకొంటాం.
12 నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు.
వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు.
13 మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాటబడిన మొక్కలవలె బలంగా ఉంటారు.
వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు.
14 వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు.
వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా వుంటారు.
15 యెహోవా మంచివాడని నేను చెబుతున్నాను.
ఆయనే నా బండ.
ఆయనలో అవినీతి లేదు.
14 అందుచేత యెహోవా దేవుడు సర్పంతో ఇలా అన్నాడు:
“ఈ మహా చెడ్డ పని నీవే చేశావు
కనుక నీవు శపించబడ్డావు.
జంతువులన్నిటి కంటే
నీ పరిస్థితి హీనంగా ఉంటుంది.
నీవు నీ పొట్టతో పాకడం తప్పనిసరౌతుంది.
నీవు జీవిత కాలమంతా మట్టి తింటావు.
15 ఈ స్త్రీని, నిన్ను ఒకరికొకర్ని
విరోధుల్నిగా నేను చేస్తాను.
నీ సంతానము, ఆమె సంతానము
ఒకరికొకరు విరోధులవుతారు.
నీవు ఆమె శిశువు పాదం మీద కాటేస్తావు
ఈ శిశువు నీ తలను చితుక కొడతాడు.”
16 అప్పుడు స్త్రీతో యెహోవా దేవుడు ఇలా అన్నాడు:
“నీవు గర్భవతిగా ఉన్నప్పుడు నేను
నీకు బహు ప్రయాస కలుగజేస్తాను.
నీవు పిల్లల్ని కనేటప్పుడు మహా
గొప్ప బాధ నీకు కలుగుతుంది.
నీవు నీ భర్తను వాంఛిస్తావు
కాని అతడే నిన్ను ఏలుతాడు.”
17 అప్పుడు పురుషునితో దేవుడు ఈలాగు అన్నాడు:
“ప్రత్యేకమైన చెట్టుఫలాన్ని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించాను.
అయితే నీవు నీ భార్య చెప్పిన మాటలు విన్నావు. ఆ చెట్టు ఫలాన్ని తిన్నావు. కనుక
నీ మూలంగా భూమిని నేను శపిస్తాను.
భూమి ఇచ్చే ఆహారం కోసం నీవు నీ జీవితాంతం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.
18 పొలంలో పండే మొక్కల్ని నీవు తినాలని అనుకొంటావు
కాని ముళ్లను, పొదలను నేల నీకోసం పండిస్తుంది.
19 నీ భోజనం కోసం నీవు చాలా కష్టపడి పని చేస్తావు.
నీ ముఖం అంతా చెమటతో నిండి పోయేంతగా నీవు పని చేస్తావు.
నీవు చనిపోయే రోజు వరకు కష్టపడి పని చేస్తావు
మరణించాక నీవు మరలా మట్టి అయిపోతావు.
నేను నిన్ను చేసినప్పుడు మట్టిలో నుంచే నీవు తీయబడ్డావు
మళ్లీ నీవు చనిపోయినప్పుడు తిరిగి మట్టిలోనే కలిసిపోతావు.”
20 ఆదాము[a] తన భార్యకు హవ్వ[b] అని పేరు పెట్టాడు. ఎన్నడైనా సరే, బ్రతికిన ప్రతి మనిషికి ఈమె తల్లి కనుక ఆయన ఆమెకు ఆ పేరు పెట్టాడు.
21 యెహోవా దేవుడు జంతు చర్మాలతో ఆ పురుషునికి, అతని భార్యకు చొక్కాలు చేశాడు. ఆ తరువాత ఆ చొక్కాలను వారికి తొడిగించాడు.
22 అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు: “చూడండి, మనిషి మనలా తయారయ్యాడు. మంచి, చెడ్డలు మనిషికి తెలుసు. ఇప్పుడు ఆ మనిషి జీవ వృక్షంనుండి ఫలములు తీసుకొని తింటే అతడు శాశ్వతంగా జీవిస్తాడు.”
23 కనుక ఏదెను తోటనుండి ఆ మనిషిని యెహోవా దేవుడు వెళ్లగొట్టాడు. ఆదాము బలవంతంగా వెళ్లగొట్టబడి ఏ నేల నుండి అతడు తీయబడ్డాడో ఆ నేలను సేద్యం చేయటం మొదలు పెట్టాడు. 24 తరువాత ఆ తోటకు కాపలాగా దాని ద్వారం దగ్గర కెరూబులను[c] దేవుడు ఉంచాడు. ఒక అగ్ని ఖడ్గాన్ని కూడా అక్కడ ఉంచాడు. జీవ వృక్షమునకు పోయే మార్గాన్ని కాపలా కాస్తూ ఆ ఖడ్గం చుట్టూరా తిరుగుతూవుంది.
యేసు మానవజన్మనెత్తటం
5 మనం మాట్లాడుతున్న ప్రపంచాన్ని, అంటే రాబోవు ప్రపంచాన్ని దేవుడు తన దూతలకు లోపర్చ లేదు. 6 ధర్మశాస్త్రంలో ఒకచోట ఈ విధంగా వ్రాయబడింది:
“మానవుణ్ణి గురించి నీవాలోచించటానికి అతడెంతటివాడు?
మానవ కుమారుణ్ణి నీవు చూడడానికి అతడెంతటివాడు?
7 నీవతనికి దేవదూతలకన్నా కొద్దిగా తక్కువ స్థానాన్ని యిచ్చావు!
మహిమ, గౌరవమనే కిరీటాన్ని నీవతనికి తొడిగించి,
8 అన్నిటినీ అతని పాదాల క్రింద ఉంచావు.”(A)
దేవుడు అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు అంటే, ప్రతి ఒక్కటి ఆయన అధికారానికి లోబడి ఉండాలన్నమాట. కాని ప్రస్తుతం, అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నట్లు మనకు కనిపించటం లేదు. 9 యేసు, దేవదూతల కన్నా కొంత తక్కువవానిగా చేయబడ్డాడు. అంటే ఆయన మానవులందరి కోసం మరణించాలని, దేవుడాయన్ని అనుగ్రహించి ఈ తక్కువ స్థానం ఆయనకు యిచ్చాడు. యేసు కష్టాలను అనుభవించి మరణించటంవలన “మహిమ, గౌరవము” అనే కిరీటాన్ని ధరించగలిగాడు.
© 1997 Bible League International