Revised Common Lectionary (Complementary)
24 యెహోవా, నీవు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశావు.
భూమి నీ కార్యాలతో నిండిపోయింది.
నీవు చేసే ప్రతి పనిలో నీవు నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తావు.
25 మహా సముద్రాన్ని చూడు. అది ఎంతో పెద్దది.
మహా సముద్రంలో రకరకాల ప్రాణులు నివసిస్తాయి. వాటిలో కొన్ని ప్రాణులు పెద్దవి, కొన్ని చిన్నవి.
మహా సముద్రంలో ఉండే వాటిని లెక్కించుటకు అవి చాలా విస్తారంగా ఉన్నాయి.
26 మహా సముద్రంలో ఓడలు ప్రయాణం చేస్తాయి.
నీవు చేసిన సముద్ర ప్రాణి మకరం[a] ఆ సముద్రంలో ఆడుకుంటుంది.
27 దేవా, ఆ ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి.
దేవా, వాటికి సరియైన సమయంలో నీవు ఆహారం ఇస్తావు.
28 దేవా, జీవించే ప్రాణులన్నీ తినే ఆహారం నీవే వాటికి ఇస్తావు.
మంచి భోజనంతో నిండిన నీ గుప్పిళ్లు నీవు విప్పగా అవి కడుపు నిండేంత వరకు భోజనము చేస్తాయి.
29 నీవు వాటి నుండి తిరిగిపోయినప్పుడు
అవి భయపడిపోతాయి.
వాటి ప్రాణం వాటిని విడిచినప్పుడు అవి బలహీనమై చస్తాయి.
మరియు అవి మరల మట్టి అయిపోతాయి.
30 కాని యెహోవా, నీ ఆత్మను పంపినప్పుడు, అవి మరల ఆరోగ్యంగా ఉంటాయి.
భూమి మరల క్రొత్తదిగా అవుతుంది.
31 యెహోవా మహిమ శాశ్వతంగా కొనసాగును గాక.
యెహోవా చేసిన వాటిని చూచి ఆయన ఆనందించునుగాక.
32 యెహోవా భూమివైపు చూసేటప్పుడు
అది వణకుతుంది.
ఆయన పర్వతాలను ముట్టేటప్పుడు
వాటినుండి పొగ లేవటానికి ప్రారంభిస్తుంది.
33 నా జీవితకాలం అంతా నేను యెహోవాకు పాడుతాను.
నేను బ్రతికి ఉండగా యెహోవాకు స్తుతులు పాడుతాను.
34 నేను చెప్పిన విషయాలు ఆయనను సంతోషపెడతాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా విషయమై నేను సంతోషిస్తున్నాను.
35 భూమి మీద నుండి పాపం కనబడకుండా పోవును గాక.
దుర్మార్గులు శాశ్వతంగా తొలగిపోవుదురు గాక.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!
యెహోవాను స్తుతించు!
యెహోవా దేశాన్ని మరల ఇచ్చివేస్తాడు
18 అప్పుడు యెహోవా ఈ దేశాన్నిగూర్చి ఉద్వేగపడ్డాడు.
తన ప్రజల విషయం ఆయన విచార పడ్డాడు.
19 యెహోవా తన ప్రజలతో మాట్లాడాడు.
ఆయన చెప్పాడు, “నేను మీకు ధాన్యం, ద్రాక్షారసం, నూనె పంపిస్తాను.
అవి మీకు సమృద్ధిగా ఉంటాయి.
రాజ్యాల మధ్య నేను మిమ్మిల్ని ఇంకెంత మాత్రం అవమానించను.
20 లేదు. ఆ ఉత్తరపు ప్రజలను మీ దేశంనుండి వెళ్ళగొడతాను.
ఎండిపోయిన ఖాళీ దేశానికి వారు వెళ్ళేటట్టు నేను చేస్తాను.
వారిలో కొందరు తూర్పు సముద్రానికి వెళ్తారు.
మరి కొందరు పడమటి సముద్రానికి వెళ్తారు.
ఆ ప్రజలు అంత భయంకరమైన పనులు చేశారు.
కాని వారు చచ్చి కుళ్ళిపోతున్న దానిలా ఉంటారు.
అక్కడ భయంకరమైన కంపు కొడుతుంది!”
దేశం మరల కొత్తదిగా చేయబడుతుంది
21 దేశమా, భయపడకు.
సంతోషించి ఆనందంతోనిండి ఉండు.
ఎందుకంటే యెహోవా గొప్పకార్యాలు చేస్తాడు.
22 పొలంలోని పశువులారా, భయపడవద్దు.
అరణ్యపు బీళ్ళు మరలా గడ్డి మొలిపిస్తాయి.
చెట్లు ఫలాలు ఫలిస్తాయి.
అంజూరపు చెట్లు, మరియు ద్రాక్షావల్లులు మరిన్ని ఫలాలు ఫలిస్తాయి.
23 కనుక, సీయోను ప్రజలారా, సంతోషించండి.
మీ యెహోవా దేవునియందు ఆనందంగా ఉండండి.
ఎందుకంటే ఆయన తన మంచితనాన్ని చూపి వర్షం కురిపిస్తాడు.
ఇదివరకటివలె ఆయన మీకు తొలకరి వర్షాలు, కడపటి వర్షాలు కురిపిస్తాడు.
24 మరియు కళ్లాలు గోధుమలతో నిండిపోయి ఉంటాయి.
క్రొత్త ద్రాక్షారసం మరియు ఒలీవ నూనె సీసాలలో పొర్లిపోతూంటాయి.
25 “నేనే యెహోవాను, నా సైన్యాన్ని మీకు విరోధంగా పంపించాను.
ఆ దండు మిడుతలు, ఆ దూకుడు మిడుతలు, ఆ వినాశ మిడుతలు
మరియు ఆ కోత మిడుతలు మీ పంటను తినివేశాయి.
కాని నేనే యెహోవాను, ఆ కష్టకాల సంవత్సరాలన్నింటికీ
తిరిగి మీకు నేను చెల్లిస్తాను.
26 అప్పుడు మీకు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది.
మీరు తృప్తిగా ఉంటారు.
మీ యెహోవా దేవుని నామం మీరు స్తుతిస్తారు.
మీకోసం అయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
నా ప్రజలు తిరిగి ఎన్నటికి సిగ్గుపరచబడరు.
27 ఇశ్రాయేలు ప్రజలకు నేను తోడుగా ఉన్నానని మీరు తెలుసుకొంటారు.
మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొంటారు.
మరో దేవుడు ఎవ్వరూ లేరు.
నా ప్రజలు తిరిగి ఎన్నడూ సిగ్గుపడరు.”
యెహోవా ప్రజలందరికీ తన ఆత్మను ఇస్తాడు
28 “దీని తరువాత
ప్రజలందరిమీద నా ఆత్మను కుమ్మరిస్తాను (ఇస్తాను).
మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు.
మీ ముసలివాళ్ళు కలలు కంటారు.
మీ యువకులు దర్శనాలు చూస్తా రు.
29 ఆ సమయంలో నా సేవకులమీద,
సేవకురాండ్రమీద కూడ నా ఆత్మను కుమ్మరిస్తాను (ఇస్తాను).
4 దేవుని ఆత్మ ఒక్కడే అయినా ఆయన ఎన్నో రకాల వరాలిస్తాడు. 5 ప్రభువు ఒక్కడే కాని, ఆయనకు ఎన్నో విధాలుగా సేవ చేయవచ్చు. 6 దేవుడు నలుగురిలో పలువిధాలుగా పని చేస్తాడు. దేవుడు ఒక్కడే అయినా ఆయన అన్నీ చేస్తాడు. అందరిలో చేస్తాడు.
7 దేవుడు ప్రతీ ఒక్కరిలో తన ఆత్మ ఉండేటట్లు చేసాడు. ఇది మనము చూస్తున్నాము. అందరికీ శ్రేయస్సు కలగాలని ఆయన ఉద్దేశ్యం. 8 ఒకనికి పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ జ్ఞానంతో మాట్లాడే వరాన్ని, ఆ ఆత్మ ద్వారానే బుద్ధి వాక్యాన్ని ఇచ్చాడు. 9 అదే పరిశుద్ధాత్మ ద్వారా ఒకనికి విశ్వాసము ఇచ్చాడు. మరొకనికి వ్యాధులు నయం చేసే వరము నిచ్చాడు. 10 ఒకనికి అద్భుతాలు చేయు శక్తిని, మరొకనికి ప్రవచించే శక్తిని ఇచ్చాడు. ఒకనికి ఆత్మలను గుర్తించే శక్తిని, మరొకనికి రకరకాల భాషల్లో మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఇంకొకనికి వాటి అర్థాలను విడమర్చి చెప్పే శక్తినిచ్చాడు. 11 ఆ ఒక్క ఆత్మయే అన్నీ చేస్తున్నాడు. ఆయన తన యిచ్ఛానుసారం ప్రతీ ఒక్కనికి వరాల్ని ఇస్తాడు.
© 1997 Bible League International