Revised Common Lectionary (Complementary)
115 యెహోవా, ఏ ఘనతా మేము స్వీకరించకూడదు. ఘనత నీకే చెందుతుంది.
నీ ప్రేమ, నమ్మకం మూలంగా ఘనత నీదే.
2 మా దేవుడు ఎక్కడ అని జనాంగాలు ఎందుకు ఆశ్చర్యపడాలి?
3 దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన కోరింది చేస్తాడు.
4 ఆ జనాంగాల “దేవుళ్లు” వెండి బంగారాలతో చేయబడ్డ విగ్రహాలే.
ఎవరో ఒక మనిషి చేతులతో చేసిన విగ్రహాలే అవి.
5 ఆ విగ్రహాలకు నోళ్లున్నాయి కాని అవి మాట్లాడలేవు.
వాటికి కళ్లున్నాయి కాని అవి చూడలేవు.
6 వాటికి చెవులున్నాయి కాని అవి వినలేవు.
వాటికి ముక్కులున్నాయి కాని అవి వాసన చూడలేవు.
7 వాటికి చేతులు ఉన్నాయి కాని అవి తాకలేవు.
వాటికి కాళ్లు ఉన్నాయి కాని అవి నడవలేవు.
వాటికి గొంతుల్లోనుంచి ఏ శబ్దాలూ రావు.
8 ఆ విగ్రహాలను చేసేవారు. వాటిని నమ్ముకొనే వారు కూడ సరిగ్గా వాటివలె అవుతారు.
9 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ము.
యెహోవా వారి బలము, ఆయన వారి డాలు.
10 అహరోను వంశస్థులు యెహోవాను నమ్ముతారు.
యెహోవా వారి బలము, డాలు అయివున్నాడు.
11 యెహోవా అనుచరులు యెహోవాను నమ్ముకొంటారు.
యెహోవా తన అనుచరులకు సహాయం చేసి కాపాడుతాడు.
12 యెహోవా మమ్మల్ని జ్ఞాపకం చేసికొంటాడు.
యెహోవా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
యెహోవా ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు.
యెహోవా అహరోను వంశాన్ని ఆశీర్వదిస్తాడు.
13 యెహోవా పెద్దవారైనా, చిన్నవారైనా తన అనుచరులను ఆశీర్వదిస్తాడు.
14 యెహోవా మీ కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆయన మీ పిల్లల కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
15 యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.
ఆకాశాన్ని, భూమిని యెహోవా చేశాడు.
16 ఆకాశం యెహోవాకు చెందుతుంది.
కాని భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చాడు.
17 చనిపోయినవాళ్లు యెహోవాను స్తుతించరు.
కింద సమాధిలో ఉన్న మనుష్యులు యెహోవాను స్తుతించరు.
18 అయితే మనం యెహోవాను స్తుతిస్తాం.
మనం యిప్పటినుండి ఎప్పటికీ ఆయనను స్తుతిస్తాము!
యెహోవాను స్తుతించండి!
29 “అహరోను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు, ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఆయన గుండెమీద ఉంటాయి. న్యాయం తీర్చడానికి ఆయన ధరించే తీర్పు పతకం మీద ఈ పేర్లు ఉంటాయి. ఈ విధంగా ఇశ్రాయేలు కుమారులు పన్నెండు మందిని యెహోవా ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాడు. 30 దేవుని నిర్ణయాలు తెలుసుకొనేందుకు ఊరీము, తుమ్మీములను ప్రయోగిస్తాడు. అందుచేత ఊరీము, తుమ్మీములను న్యాయతీర్పు పైవస్త్రములో ఉంచాలి. అహరోను యెహోవా ముందర ఉన్నప్పుడు ఈ విషయాలు అతని గుండెమీద ఉంటాయి. కనుక అహరోను యెహోవా యెదుట ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చే ఒక విధానాన్ని ఎల్లప్పుడూ తనతో తీసుకువెళ్తాడు.
యాజకుల యితర వస్త్రాలు
31 “ఏఫోదు పైన ధరించేందుకు ఒక అంగీని చెయ్యాలి. అంగీని నీలంరంగు బట్టతోనే చెయ్యాలి. 32 దాని మధ్యలో తల పట్టేందుకు ఒక రంధ్రం ఉండాలి. అది మెడచుట్టూ చిరిగిపోకుండా గోటు ఉండాలి. 33 నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణం రంగుల బట్టతో దానిమ్మపండు చేయాలి. అంగీ కింది భాగంలో దానిమ్మ పండును వేలాడదీయాలి. దానిమ్మపండు మధ్య బంగారు గంటలు వ్రేలాడదీయాలి. 34 అంగీ అడుగున చుట్టూరా ఒక బంగారు దానిమ్మపండు ఒక గంట, మరో దానిమ్మపండు, మరో గంట ఇలా ఉండాలి. 35 అహరోను యాజకునిగా పని చేసేటప్పుడు ఈ అంగీని ధరించి, యెహోవా ఎదుట పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. అతడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటప్పుడు గంటలు మోగుతాయి. ఈ విధంగా అహరోను మరణించడు.
36-37 “స్వచ్ఛమైన బంగారంతో ఒక బద్ద చేయాలి, “యెహోవా పరిశుద్ధుడు” అనే మాటలు ఒక ముద్రగా తలపాగా చుట్టూ ముందరవైపు కట్టేందుకు నీలం పతకం ఉపయోగించాలి. 38 అహరోను దీన్ని తన తలమీద ధరిస్తాడు. ఇశ్రాయేలీయుల కానుకల విషయంలో దోషాలు ఏమైన ఉంటే ఆ దోషాన్ని అతడు భరించినప్పుడు, ఇది అతన్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. ఈ కానుకలు ప్రజలు యెహోవాకు అర్పించేవి. ప్రజల కానుకలను యెహోవా స్వీకరించేటట్టు అహరోను దీనిని ఎప్పుడూ తన తలమీద ధరించాలి.
కృతజ్ఞత, ప్రార్థన
3 నేను మిమ్మల్ని తలచుకొన్నప్పుడెల్లా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను. 4 కనుక మీకోసం ప్రార్థించినప్పుడెల్లా ఆనందంతో ప్రార్థిస్తాను. 5 దైవసందేశం ప్రచారం చెయ్యటానికి మీరు మొదటి రోజు నుండి ఈ రోజుదాకా నాతో కలిసి పని చేసారు. 6 ఈ మంచి కార్యాన్ని మీలో ప్రారంభించినవాడు అది పూర్తి అయ్యేదాకా, అంటే యేసు క్రీస్తు వచ్చేదాకా కొనసాగిస్తాడని నాకు నమ్మకం ఉంది.
7 మీరు నా హృదయంలో ఉన్నారు. కనుక మీ అందర్ని గురించి నేనీవిధంగా ఆలోచించటం సమంజసమే. ఎందుకంటే నేను సంకెళ్ళలో ఉన్నా, లేక సువార్తను ప్రకటిస్తూ దానిలో ఉన్న నిజాన్ని నిరూపిస్తూ, స్వేచ్ఛగా పర్యటన చేస్తున్నా దైవానుగ్రహాన్ని మీరు నాతో కలిసి పంచుకొన్నారు. 8 మీ పట్ల నాకున్న ప్రేమ యేసు క్రీస్తు నుండి వచ్చిందని నేను దైవసాక్షిగా చెపుతున్నాను.
9 ఇదే నా ప్రార్థన:
మీ ప్రేమ అవధులు లేకుండా పెరగాలి, దానితోబాటు మీకు నిజమైన జ్ఞానము, ఆ జ్ఞానంలోని లోతులు తెలుసుకొనే శక్తి కలగాలి. 10 అప్పుడు మీకు మంచి, చెడు విడమరిచే శక్తి కలుగుతుంది. క్రీస్తు వచ్చే వరకు మీరు పవిత్రంగా ఎలాంటి అపవాదులు లేకుండా ఉండగలుగుతారు. 11 మీరు నీతిగా జీవించటంవల్ల ఫలం పొందుతారు. ఆ ఫలం యేసు క్రీస్తు నుండి వచ్చి మీలో నిండిపోతుంది. తద్వారా దేవునికి కీర్తి, స్తుతి కలుగుతుంది.
© 1997 Bible League International