Revised Common Lectionary (Complementary)
15 ఒక రోజు భక్తులందరూ సమావేశం అయ్యారు. వాళ్ళ సంఖ్య నూట ఇరవై. పేతురు మాట్లాడటానికి లేచి నిలుచున్నాడు. 16 అతడు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా సోదరులారా! చాలా కాలం క్రిందటే పవిత్రాత్మ యూదాను గురించి దావీదు నోటి ద్వారా పలికాడు. లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయాలు తప్పక జరుగవలసినవి. ఈ యూదా యేసును బంధించిన వాళ్ళకు దారి చూపాడు. 17 యూదా మాలో ఒకడు. మాతో కలిసి సేవ చెయ్యటానికి ఎన్నుకోబడ్డవాడు.”
21 “ఇప్పుడు యింకొకడు మనలో చేరాలి. అతడు వాళ్ళలో, అంటే యేసు మనతో కలిసి జీవించినంత కాలం మనతో కలిసి ఉన్నవాళ్ళలో ఒకడై ఉండాలి. 22 అతడు యేసు ప్రభువు చావునుండి బ్రతికి వచ్చాడన్న దానికి మనతో కలిసి సాక్ష్యం చెప్పాలి. యోహాను బాప్తిస్మము నివ్వటం మొదలు పెట్టినప్పటినుండి యేసును మననుండి పరలోకానికి తీసుకు వెళ్ళిన దినం దాకా మనతో కలిసి జీవించినవాడై ఉండాలి.”
23 వాళ్ళు ఇద్దరి పేర్లను సూచించారు. బర్సబ్బా అని పిలువబడే యోసేపు పేరు, ఇతన్నే యూస్తు అని కూడా అంటారు, మత్తీయ పేరు. 24-25 అంతా కలిసి ఈ విధంగా ప్రార్థించారు: “ప్రభూ! నీకు ప్రతి ఒక్కరి మనస్సు తెలుసు. యూదా తన స్థానాన్ని వదిలి తాను వెళ్ళతగిన స్థానానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో అపొస్తలత్వాన్ని, ఈ సేవా స్థానాన్ని ఆక్రమించటానికి నీవెన్నుకొన్నవాణ్ణి మాకు చూపించు.” 26 ఆ తర్వాత వాళ్ళు చీటీలు వేసారు. వాళ్ళు తీసిన చీటీలో మత్తీయ పేరు వ్రాయబడి ఉంది. అందువల్ల అతడు ఆ పదకొండుగురిలాగే అపొస్తలుడయ్యాడు.
మొదటి భాగం
(కీర్తనలు 1–41)
1 ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే,
అతడు చెడ్డవారి సలహాలు పాటించనప్పుడు,
అతడు పాపులవలె జీవించనప్పుడు,
దేవునికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసివుండనప్పుడు.
2 ఆ మంచి మనిషి, యెహోవా ఉపదేశాలను ప్రేమిస్తాడు.
ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్లు అతడు తలపోస్తూంటాడు.
3 కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలె బలంగా ఉంటాడు.
సకాలంలో ఫలాలు ఫలించే ఒక చెట్టువలె అతడు ఉంటాడు.
అతడు ఆకులు వాడిపోని చెట్టువలె ఉంటాడు.
అతడు చేసేది అంతా సఫలం అవుతుంది.
4 అయితే చెడ్డవాళ్లు అలా ఉండరు.
వాళ్లు గాలి చెదరగొట్టివేసే పొట్టువలె ఉంటారు.
5 ఒక న్యాయ నిర్ణయం చేసేందుకు మంచి మనుష్యులు గనుక సమావేశమైతే, అప్పుడు చెడ్డ మనుష్యులు దోషులుగా రుజువు చేయబడతారు.
ఆ పాపాత్ములు నిర్దోషులుగా తీర్చబడరు.
6 ఎందుకంటే యెహోవా మంచి మనుష్యులను కాపాడుతాడు,
చెడ్డ మనుష్యులు ఆయన చేత నాశనం చేయబడతారు.
9 మనము మనుష్యుల సాక్ష్యం అంగీకరిస్తాము. కాని యిది దేవుని సాక్ష్యం కనుక యింకా గొప్పది. ఈ సాక్ష్యం తన కుమారుణ్ణి గురించి యిచ్చింది. 10 దేవుని కుమారుని పట్ల విశ్వాసమున్నవాడు ఈ సాక్ష్యాన్ని నమ్ముతాడు. దేవుడు తన కుమారుని విషయంలో యిచ్చిన సాక్ష్యం నమ్మనివాడు దేవుడు అసత్యవంతుడని నిందించినవాడౌతాడు. 11 ఆ సాక్ష్యం యిది! దేవుడు మనకు నిత్యజీవం యిచ్చాడు. ఈ జీవము ఆయన కుమారునిలో ఉంది. 12 కుమారుణ్ణి స్వీకరించినవానికి ఈ జీవము లభిస్తుంది. ఆ కుమారుణ్ణి స్వీకరించనివానికి జీవం లభించదు.
చివరి మాట
13 దేవుని కుమారుని పేరులో విశ్వాసం ఉన్న మీకు నిత్యజీవం లభిస్తుంది. ఈ విషయం మీకు తెలియాలని యివన్నీ మీకు వ్రాస్తున్నాను.
6 “ఈ ప్రపంచంలో నీవు నాకు అప్పగించిన వాళ్ళకు నిన్ను గురించి తెలియ చేసాను. వాళ్ళు నీ వాళ్ళు. కాని వాళ్ళను నీవు నాకు అప్పగించావు. వాళ్ళు నీ సందేశాన్ని పాటించారు. 7 నీవు నాకు ఎన్నోయిచ్చావు. అవన్నీ నాకిచ్చినావని వాళ్ళకిప్పుడు తెలిసింది. 8 ఎందుకంటే, నీవు నాకు చెప్పిన సందేశాన్ని వాళ్ళకు చెప్పాను. వాళ్ళు దాన్ని అంగీకరించారు. నేను నిజంగా నీ నుండి వచ్చానని వాళ్ళకు తెలుసు. నీవు నన్ను పంపావన్న విశ్వాసం యిప్పుడు వాళ్ళలో కలిగింది. 9 నేను వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. ప్రపంచాని కోసం ప్రార్థించటం లేదు. నీవు నాకు అప్పగించిన వాళ్ళు నీ వాళ్ళు కావాలని ప్రార్థిస్తున్నాను. 10 నావన్నీ నీవి, నీవన్నీ నావి. నా వాళ్ళ ద్వారా నాకు మహిమ కలుగుతోంది.
11 “నేనీ ప్రపంచంలో యిక ఉండను. కాని వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉన్నారు. నేను నీ దగ్గరకు రాబోతున్నాను. ఓ తండ్రీ! నీలో పవిత్రత ఉంది. నీవు నాకిచ్చిన, నీ నామంలో ఉన్న మహిమతో వాళ్ళను రక్షించు. అలా చేస్తే మనం ఒకటిగా ఉన్నట్లు వాళ్ళు కూడా ఒకటిగా ఉంటారు. 12 నేను వాళ్ళతో ఉన్నప్పుడు, నీవు నా కిచ్చిన నామంతో వాళ్ళను రక్షించి కాపాడాను. లేఖనాల్లో వ్రాసినవి నిజం కావటానికి నాశనం కావలసిన వాడు తప్ప మరెవ్వరూ నాశనం కాలేదు.
13 “నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా ఆనందం వాళ్ళ హృదయాల్లో పూర్తిగా నిండి పోవాలని నేనీ ప్రపంచంలో ఉన్నప్పుడే ఈ విషయాలు చెబుతున్నాను. 14 నీ సందేశం నా శిష్యులకు చెప్పాను. నేను ఈ ప్రపంచానికి చెందిన వాణ్ణి కాదు. అదే విధంగా నా శిష్యులు కూడా ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళు కాదు. కనుక ప్రపంచం వాళ్ళను ద్వేషిస్తుంది.
15 “వాళ్ళనీ ప్రపంచం నుండి తీసుకు వెళ్ళమని నేను ప్రార్థించటం లేదుగాని దుర్మార్గుని నుండి వాళ్ళను రక్షించుమని ప్రార్థిస్తున్నాను. 16 నేను ఏ విధంగా ఈ ప్రపంచానికి చెందనో అదే విధంగా వాళ్ళు కూడా ఈ ప్రపంచానికి చెందరు. 17 సత్యంలో వారిని పవిత్రపరచు, నీ వాక్యమే సత్యం. 18 నీవు నన్ను ఏ విధంగా పంపావో, అదే విధంగా వాళ్ళను నేను ఈ ప్రపంచంలోనికి పంపాను. 19 వాళ్ళ కోసం నన్ను నేను ప్రత్యేకపరచు కొన్నాను. వాళ్ళు కూడా నిజంగా ప్రత్యేకించబడాలని నా ఉద్దేశ్యం.
© 1997 Bible League International