Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: కోరహు కుమారుల గీతం.
47 సర్వజనులారా, చప్పట్లు కొట్టండి.
సంతోషంగా దేవునికి కేకలు వేయండి.
2 మహోన్నతుడగు యెహోవా భీకరుడు.
భూలోకమంతటికీ ఆయన రాజు.
3 ఆయన ప్రజలను మనకు లోబరిచాడు.
ఆ రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు.
4 దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు.
యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరుకున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు.
5 బూర మ్రోగగానే, యుద్ధనాదం వినబడగానే
యెహోవా దేవుడు లేచాడు.
6 దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
7 దేవుడు సర్వలోకానికి రాజు.
స్తుతిగీతాలు పాడండి.
8 దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద కూర్చున్నాడు.
దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తున్నాడు.
9 రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశమయ్యారు.
దేవుని ప్రజలు అబ్రాహాము వంశస్థులు. వారి జనాంగమును దేవుడు కాపాడును.
నాయకులందరూ దేవునికి చెందినవారు.
దేవుడు మహోన్నతుడు.
మోషే దేవున్ని కలుసుకోవడం
15 అప్పుడు మోషే పర్వతం మీదికి వెళ్లాడు. ఆ పర్వతాన్ని మేఘం కప్పేసింది. 16 సీనాయి పర్వతం మీద యెహోవా మహిమ దిగివచ్చింది. ఆరు రోజుల పాటు పర్వతాన్ని మేఘం కప్పేసింది. ఏడోరోజున ఆ మేఘంలోనుంచి యెహోవా మోషేతో మాట్లాడాడు. 17 ఇశ్రాయేలు ప్రజలు యెహోవా మహిమను చూడగలిగారు. అది ఆ పర్వతం మీద మండుతున్న అగ్నిలా వుంది.
18 అప్పుడు మోషే ఆ పర్వతం మీద యింకా పైకి ఎక్కి మేఘంలోకి వెళ్లాడు. నలభై పగళ్లూ, నలభై రాత్రులు మోషే ఆ పర్వతం మీదే ఉన్నాడు.
9 నేను యోహానును, మీ సోదరుణ్ణి. యేసుతో పొందిన ఐక్యత వల్ల మనము ఆయన రాజ్యంలో ఒకటిగా ఉన్నాము. సహనంతో కష్టాలు అనుభవిస్తున్నాము. యేసు చెప్పిన సత్యాన్ని దేవుని సందేశాన్ని ప్రకటించటం వల్ల నన్ను వాళ్ళు పత్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉంచారు. 10 ఆదివారమునాడు నేను దేవుని ఆత్మపూర్ణుడనైయుండగా బూర ఊదినట్లు నా వెనుకనుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. 11 అది నాతో, “నీవు చూసినదాన్ని ఒక గ్రంథంగా వ్రాసి ఈ ఏడు సంఘాలకు అనగా, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయకు పంపుము” అని అన్నది.
12 నాతో మాట్లాడుతున్న స్వరం ఎవరిదో చూడాలని వెనక్కు తిరిగి చూసాను. వెనక్కు తిరిగి చూడగా ఏడు బంగారు దీపస్తంభాలు కన్పించాయి. 13 వాటి మధ్య ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన మనుష్యకుమారునిలా[a] ఉన్నాడు. ఆయన వేసుకొన్న అంగీ ఆయన పాదాల వరకు ఉంది. ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టబడివుంది. 14 ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలా ఉన్నాయి. ఆయన వెంట్రుకల్ని మంచుతో కూడా పోల్చవచ్చు. ఆయన కళ్ళు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. 15 ఆయన పాదాలు కొలిమిలో కాలే యిత్తడిలా ఉన్నాయి. ఆయన కంఠధ్వని జల ప్రవాహం చేసే శబ్దంలా ఉంది. 16 ఆయన తన కుడి చేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు. ఇరువైపులా పదునుగానున్న ఒక కత్తి ఆయన నోటి నుండి బయటకు వచ్చింది. ఆయన ముఖం దివ్యంగా ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది.
17 నేనాయన్ని చూసి, ప్రాణం పోయిన వానిలా ఆయన పాదాల ముందు పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నా తలపై ఉంచి, “భయపడకు. ఆదిని, అంతాన్ని నేనే!” అని అన్నాడు. 18 నేను చిరకాలం జీవించేవాణ్ణి. ఒకప్పుడు నేను మరణించి ఉంటిని. కాని యిక శాశ్వతంగా జీవించి ఉంటాను. మరణంపై నాకు అధికారం ఉంది. మృత్యులోకపు తాళంచెవులు నా దగ్గర ఉన్నాయి.
© 1997 Bible League International