Revised Common Lectionary (Complementary)
93 యెహోవాయే రాజు!
ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు.
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
2 దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
3 యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది.
ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
4 పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి.
కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
5 యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి.
నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.
ఇశ్రాయేలీయులు దేవుని ప్రత్యేక ప్రజలు
7 “మీరు స్వాధీనం చేసుకొనేందుకు ప్రవేశించబోతున్న దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్ములను తీసుకొని వస్తాడు. అనేక రాజ్యాలవాళ్లను – హిత్తీయులు, గిర్గాషీయులు, ఆమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు – మీకంటె బలంగల ఏడు గొప్ప రాజ్యాల వాళ్లను మీకోసం యెహోవా బలవంతంగా బయటకు వెళ్లగొడ్తాడు. 2 ఈ రాజ్యాలను మీ దేవుడైన యెహోవా మీ అధికారం క్రింద ఉంచుతాడు. మీరు వారిని ఓడిస్తారు. మీరు వాళ్లను సర్వనాశనం చేయాలి. వాళ్లతో ఏ ఒడంబడిక చేసుకోవద్దు. వాళ్లకు దయ చూపించవద్దు. 3 ఆ ప్రజల్లో ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు, ఆ ఇతర రాజ్యాలకు చెందిన ఎవరినీ మీ కుమారులనుగాని కుమారైలనుగాని పెళ్లి చేసుకోనివ్వవద్దు. 4 ఎందుకంటే మీ పిల్లలు నన్ను వెంబడించకుండా ఆ ఇతరులు వారిని మళ్లిస్తారు. అప్పుడు మీ పిల్లలు ఇతర దేవుళ్లను సేవిస్తారు. కనుక యెహోవా మీ మీద కోపగిస్తాడు. వెంటనే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు.
బూటకపు దేవుళ్లను నాశనం చేయండి
5 “ఈ రాజ్యలకు మీరు చేయాల్సింది యిదే, మీరు వారి బలిపీఠాలను విరుగగొట్టి, వాళ్ల స్మారక శిలలను ముక్కలుగా చేయాలి. వారి ఆషేరు స్తంభాలను[a] నరికి వేసి, వారి విగ్రహాలను కాల్చివేయండి. 6 ఎందుకంటే మీరు యెహోవాకు స్వంత ప్రజలు. భూమిమీద మొత్తం ప్రజలందరిలో మీరు ఆయనకు ప్రత్యేక ప్రజగా ఉండేందుకు – కేవలం ఆయనకు మాత్రమే చెందిన వారుగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకొన్నాడు. 7 యెహోవా ఎందుకు ప్రేమించి, ఏర్పాటు చేసుకొన్నాడు? ఇతర ప్రజలకంటే మీరు ఎక్కువమంది ఉన్నారని కాదు. సమస్త జనులలో మీరే అతి తక్కువ సంఖ్యవారు. 8 అయితే యెహోవా మహాశక్తితో మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాడు. బానిసత్వంనుండి ఆయన మిమ్మల్ని స్వతంత్రులను చేసాడు. ఈజిప్టు రాజు ఫరో అధికారంనుండి ఆయన మిమ్మల్ని విడుదల చేసాడు. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుకను, మీ పూర్వీకులకు ఆయన చేసిన వాగ్దానాన్ని నిలుపు కోవాలనీ ఆయన అలా చేసాడు.
9 “అందుచేత మీ దేవుడైన యెహోవా ఒక్కడే దేవుడు, ఆయన నమ్మదగినవాడు అని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన తన ఒడంబడికను నిలబెట్టుకొంటాడు. ఆయనను ప్రేమించి, ఆయన ఆజ్ఞలకు విధేయులయ్యే వారందరికీ ఆయన తన ప్రేమ, దయ చూపుతాడు. వేయి తరాలవరకు ఆయన తన ప్రేమ, దయ చూపిస్తూనే ఉంటాడు. 10 అయితే యెహోవాను ద్వేషించే ప్రజలను ఆయన శిక్షిస్తాడు. వాళ్లను ఆయన నాశనం చేస్తాడు. ఆయనను ద్వేషించే మనిషిని శిక్షించటంలో ఆయన నిదానించడు. 11 కనుక నేడు మీకు నేను ఇస్తున్న ఆజ్ఞలు, చట్టాలు నియమాలు విధేయత చూపే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.
తిమోతికి చెప్పిన ఉపదేశము
11 కాని నీవు విశ్వాసివి. కనుక వీటికి దూరంగా ఉండు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సహనాన్ని, వినయాన్ని అలవరచుకో. 12 నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి బాగా పోరాటం సాగించు. అనంత జీవితాన్ని సంపాదించు. దీని కోసమే దేవుడు నిన్ను పిలిచాడు. నీవు అనేకుల సమక్షంలో ఆ గొప్ప సత్యాన్ని అంగీకరించావు.
© 1997 Bible League International