Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
23 యెహోవా నా కాపరి
నాకు కొరత ఉండదు
2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
ఇశ్రాయేలు ఈజిప్టుకు వచ్చుట
28 యాకోబు మొదట యూదాను యోసేపు దగ్గరకు పంపించాడు. గోషెను దేశంలోని యోసేపు దగ్గరకు యూదా వెళ్లాడు. ఆ తర్వాత యాకోబు, అతని వాళ్లు ఆ దేశంలో ప్రవేశించారు. 29 యోసేపు తన తండ్రి వచ్చేస్తున్నాడని విన్నాడు. గోషెనులో తన తండ్రి ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు యోసేపు తన రథం సిద్ధం చేసుకొని బయల్దేరాడు. యోసేపు తన తండ్రిని చూడగానే అతని మెడమీద పడి కౌగిలించుకొని చాలాసేపు ఏడ్చాడు.
30 అప్పుడు ఇశ్రాయేలు, “ఇప్పుడు నేను మనశ్శాంతిగా మరణించవచ్చు, నీ ముఖం నేను చూశాను, నీవు ఇంకా బ్రతికే ఉన్నావని నేను చూడగలిగాను” అని యోసేపుతో చెప్పాడు.
31 తన సోదరులతోను, తన తండ్రి కుటుంబంతోను యోసేపు ఇలా చెప్పాడు: “నేను వెళ్లి మీరు వచ్చినట్లు ఫరోతో చెబుతాను. ఫరోతో నేను ఏమని చెబుతానంటే ‘నా అన్నలు, నా తండ్రి కుటుంబం కనాను దేశం విడిచి ఇక్కడ నా దగ్గరకు వచ్చారు. 32 ఈ నా కుటుంబం గొర్రెల కాపరుల కుటుంబం. నిత్యం వాళ్లు పశువుల్ని, మందల్ని కలిగి ఉండేవాళ్లు. వారి పశువుల్ని, వారికి కలిగిన అంతటిని వాళ్లతోబాటు వారు తెచ్చుకొన్నారు.’ 33 ఫరో మిమ్మల్ని పిలిచినప్పుడు మీరేం పని చేస్తారు? అని మిమ్మును అడుగుతాడు. 34 అప్పుడు మీరు ‘మేము గొర్రెల కాపరులం, మా జీవితకాలమంతా మా పశువుల్ని మేపుకొంటూ జీవించాం. మాకు ముందు మా పూర్వీకులు ఇలాగే జీవించారు’ అని చెప్పండి. అప్పుడు ఫరో మిమ్మును గోషెను దేశంలో జీవింపనిస్తాడు. గొర్రెల కాపరులంటే ఈజిప్టు ప్రజలకు యిష్టం లేదు, కనుక మీరు గోషెను దేశంలో ఉండవచ్చు.”
ఇశ్రాయేలు గోషెనులో స్థిరపడుట
47 యోసేపు ఫరో దగ్గరకు వెళ్లి, “నా తండ్రి, నా సోదరులు, వారి కుటుంబాలు మొత్తం ఇక్కడికి వచ్చారు. వారి పశువులు, కనాను దేశంలో వారికి కలిగినది మొత్తం వారితో తెచ్చుకొన్నారు. వారిప్పుడు గోషెనులో ఉన్నారు” అని చెప్పాడు. 2 యోసేపు తన సోదరులలో అయిదుగురిని తనతో కూడ ఫరో ఎదుటికి తీసుకొని వెళ్లాడు.
3 “మీ వృత్తి ఏమిటి?” అని ఫరో ఆ సోదరులను అడిగాడు.
ఆ సోదరులు ఫరోతో, “అయ్యా, మేము గొర్రెల కాపరులం. మాకు ముందున్న మా పూర్వీకులు కూడా గొర్రెల కాపరులే” అని చెప్పారు. 4 “కనాను దేశంలో కరవు కాలం చాలా దారుణంగా ఉంది. మా పశువులకు అవసరమైన గడ్డి ఉన్న పొలాలు ఎక్కడా లేవు. అందుచేత ఈ దేశంలో బ్రతుకుదామని మేము ఇక్కడికి వచ్చాం. మీరు దయచేసి మమ్మల్ని గోషెను దేశంలో ఉండనివ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం” అని వారు ఫరోతో చెప్పారు.
5 అప్పుడు యోసేపుతో ఫరో చెప్పాడు: “నీ తండ్రి, నీ సోదరులు నీ దగ్గరకు వచ్చారు. 6 వారు నివసించేందుకు ఈజిప్టులో ఏ స్థలమైనా సరే నీవు వారికోసం కోరుకోవచ్చు. నీ తండ్రికి, నీ సోదరులకు శ్రేష్ఠమైన భూమి ఇవ్వు. గోషెను దేశంలో వారిని ఉండనివ్వు. వారు నైపుణ్యంగల కాపరులైతే, వారు నా పశువులను కూడ చూసుకోవచ్చు.”
అపొస్తలులు మరియు యూదుల మహాసభ
4 యాజకులు, మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, సద్దూకయ్యులు కలిసి పేతురు, యోహాను ఉన్న చోటికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ప్రజలకు ఉపదేశిస్తూ ఉన్నారు. 2 ఆ అపొస్తలులు ప్రజలకు ఉపదేశించటం, యేసును ఉదాహరణగా తీసుకొని చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారని ప్రకటించటం విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది. 3 వాళ్ళు పేతురును, యోహానును బంధించారు. అప్పటికే సాయంకాలమై ఉండటం వల్ల మరుసటి రోజు దాకా వాళ్ళను బంధించి ఉంచారు. 4 వాళ్ళ సందేశాన్ని విని అనేకులు విశ్వాసులయ్యారు. ఆ విశ్వాసుల సంఖ్య సుమారు అయిదు వేలదాకా పెరిగిపోయింది.
© 1997 Bible League International