Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: తంతి వాద్యాలతో పాడదగిన దావీదు కీర్తన.
4 నా మంచి దేవా, నేను నిన్ను ప్రార్థించినప్పుడు నాకు జవాబు ఇమ్ము.
నా ప్రార్థన ఆలకించి, నా యెడల దయ చూపించుము!
ఎప్పుడైనా నాకు కష్టాలు వస్తే, వాటిని తొలగించుము.[a]
2 ప్రజలారా, ఎన్నాళ్లు మీరు నన్నుగూర్చి చెడ్డమాటలు చెబుతారు?
ప్రజలారా, మీరు నన్ను గూర్చి చెప్పుటకు కొత్త అబద్ధాలకోసం చూస్తూనే ఉంటారు. అలాంటి అబద్ధాలు చెప్పటం అంటే మీకు ఇష్టం.
3 యెహోవా తన మంచి ప్రజల మొర వింటాడని మీకు తెలుసు.
నేను యెహోవాను ప్రార్థించినప్పుడు, ఆయన నా ప్రార్థన వింటాడు.
4 మిమ్ములను ఏదైనా ఇబ్బంది పెడుతుంటే, అప్పుడు కోప్పడవచ్చు.
కాని పాపం చేయవద్దు. మీరు పడకకు వెళ్లినప్పుడు ఆ విషయాలను గూర్చి ఆలోచించండి, అప్పుడు విశ్రాంతి తీసుకోండి.
5 దేవునికి మంచి బలులు అర్పించండి.
మరి యెహోవాయందు విశ్వాసం ఉంచండి.
6 “దేవుని మంచితనాన్ని మనకు ఎవరు చూపిస్తారు?
యెహోవా! ప్రకాశించే నీ ముఖాన్ని మమ్ముల్ని చూడనిమ్ము.” అని చాలామంది ప్రజలు అంటారు.
7 యెహోవా, నీవు నన్ను చాలా సంతోషపెట్టావు. ధాన్యం, ద్రాక్షారసం మాకు విస్తారంగా ఉన్నందుచేత పంట కోత సమయంలో సంబరపడే దానికంటే ఇప్పుడు మేము ఎక్కువ సంతోషంగా ఉన్నాము.
8 నేను పడకకు వెళ్లి, ప్రశాంతంగా నిద్రపోతాను.
ఎందుకంటె యెహోవా, నీవే నన్ను భద్రంగా నిద్ర పుచ్చుతావు గనుక.
పేతురు కుంటివానిని నయం చెయ్యటం
3 ఒక రోజు పేతురు, యోహాను పగలు మూడు గంటలప్పుడు మందిరానికి వెళ్తున్నారు. అది ప్రార్థనా సమయం. 2 కొందరు ఒక పుట్టు కుంటివాణ్ణి ప్రతిరోజూ మోసుకొని వెళ్ళి ఒక ద్వారం ముందు దించేవాళ్ళు. దీన్నే సౌందర్య ద్వారం అనేవాళ్ళు. మందిరంలోకి ప్రవేశించేవాళ్ళనుండి ఆ కుంటివాడు భిక్షమెత్తుకొంటూ ఉండేవాడు. 3 ఈ కుంటివాడు పేతురు యోహానులు ఆలయంలోకి ప్రవేశించబోతుండగా చూసి వాళ్ళను భిక్షమడిగాడు.
4 పేతురు అతనివైపు ఏక దృష్టితో చూసాడు. యోహాను కూడా అలాగే చూసాడు. పేతురు ఆ కుంటివానితో, “మా వైపు చూడు!” అని అన్నాడు. 5 ఆ కుంటివాడు వాళ్ళేదైనా యిస్తారని వాళ్ళ వైపు చూసాడు. 6 అప్పుడు పేతురు, “నా దగ్గర వెండి, బంగారాలు లేవు కాని నా దగ్గరున్నదాన్ని నీకిస్తాను. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట నడువు!” అని అంటూ,
7 అతని కుడి చేయి పట్టుకొని లేపాడు. వెంటనే ఆ కుంటివాని చీలమండలకు, పాదాలకు బలం వచ్చింది. 8 అతడు గంతేసి నిలబడి నడవటం మొదలు పెట్టాడు. తదుపరి అతడు నడుస్తూ గంతులేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళతో సహా మందిరంలోకి ప్రవేశించాడు. 9 మందిరంలో ఉన్నవాళ్ళంతా అతడు నడవటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు. 10 భిక్షమెత్తుకోవటానికి మందిరంలోని సౌందర్య ద్వారం ముందు కూర్చునేవాడు అతడేనని గుర్తించారు. జరిగింది చూసి వాళ్ళు భయపడి దిగ్భ్రాంతి చెందారు.
ఎవరు గొప్ప
24 ఆ తర్వాత వాళ్ళలో, “ఎవరు గొప్ప” అన్న విషయంపై వాదన మొదలైంది. 25 యేసు వాళ్ళతో, “యూదులుకాని వాళ్ళను, వాళ్ళ రాజులు క్రూరంగా పాలిస్తారు. అధికారంలో ఉన్నవాళ్ళు తమను పొగడమని ప్రజల్ని ఒత్తిడి చేస్తారు. 26 కాని మీరు అలా ఉండకూడదు. మీలో అందరికన్నా గొప్పవాడు అందరికన్నా చిన్నవానిలా మెలగాలి. నాయకుడు సేవకునిలా ఉండాలి. 27 ఎవరు గొప్ప? భోజనానికి కూర్చొన్నవాడా లేక భోజనం వడ్డించేవాడా? భోజనానికి కూర్చొన్న వాడేకదా! కాని నేను మీ సేవకునిలా ఉంటున్నాను.
28 “మీరు నా కష్టసమయాల్లో నా వెంట ఉన్నవాళ్ళు. 29 కనుక నా తండ్రి నాకు రాజ్యాన్ని అప్పగించి నట్లు నేను మీకు రాజ్యాన్ని అప్పగిస్తాను. 30 అప్పుడు మీరు నా రాజ్యంలో నాతో కలిసి కూర్చొని తింటారు. సింహాసనాలపై కూర్చుని పండ్రెండు వంశాల వారిపై తీర్పు చేస్తారు.
© 1997 Bible League International