Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 135

135 యెహోవాను స్తుతించండి.
    యెహోవా సేవకులారా, యెహోవా నామాన్ని స్తుతించండి.
యెహోవా ఆలయంలో నిలిచి ఉండే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
    ఆలయ ప్రాంగణంలో నిలబడే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
    యెహోవాను స్తుతించుట ఆనందదాయకం గనుక ఆయన నామాన్ని స్తుతించండి.

యెహోవా యాకోబును కోరుతున్నాడు.
    యెహోవా ఇశ్రాయేలును తన విశేషమైన సొత్తుగా ఎన్నుకొన్నాడు.
యెహోవా గొప్పవాడని నాకు తెలుసు.
    మన ప్రభువు ఇతర దేవుళ్లందరికంటె గొప్పవాడు!
ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో,
    అగాధపు మహా సముద్రాల్లో యెహోవా ఏది చేయాలనుకొంటే అది చేస్తాడు.
భూమికి పైగా మేఘాలను దేవుడు చేస్తాడు.
    మెరుపులను, వర్షాన్ని దేవుడు చేస్తాడు.
    దేవుడు గాలిని తన నిధిలోనుండి రప్పిస్తాడు.
ఈజిప్టు మనుష్యులలో జ్యేష్ఠులందరినీ, జంతువులలో మొదట పుట్టినవాటన్నిటినీ దేవుడు నాశనం చేసాడు.
దేవుడు ఈజిప్టులో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసాడు.
    ఫరోకు, అతని అధికారులకు ఆ సంగతులు సంభవించేలా దేవుడు చేశాడు.
10 దేవుడు అనేక రాజ్యాలను ఓడించాడు.
    బలమైన రాజులను దేవుడు చంపేసాడు.
11 అమోరీయుల రాజైన సీహోనును దేవుడు ఓడించాడు.
    బాషాను రాజైన ఓగును దేవుడు ఓడించాడు.
    కనానులోని జనాంగాలన్నింటినీ దేవుడు ఓడించాడు.
12 వారి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.
    దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు.

13 యెహోవా, నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగియుంటుంది.
    యెహోవా, ప్రజలు నిన్ను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొంటారు.
14 యెహోవా జనాంగాల్ని శిక్షించాడు.
    కాని తన సేవకుల యెడల దయ చూపించాడు.
15 ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే.
    వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే.
16 ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కాని అవి మాట్లాడలేవు.
    కళ్లు వున్నాయి కాని అవి చూడలేవు.
17 ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కాని అవి వినలేవు.
    ముక్కులు ఉన్నాయి కాని అవి వాసన చూడలేవు.
18 మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మనుష్యులు సరిగ్గా ఆ విగ్రహాల్లాగానే అవుతారు.
    ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు ఆ విగ్రహాల మీదనే నమ్మకముంచారు.

19 ఇశ్రాయేలు వంశమా, యెహోవాను స్తుతించు!
    అహరోను వంశమా, యెహోవాను స్తుతించు.
20 లేవీ వంశమా, యెహోవాను స్తుతించు!
    యెహోవాను ఆరాధించే ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
21 సీయోనులో నుండి, తన నివాసమైన యెరూషలేములో నుండి,
    యెహోవా స్తుతించబడును గాక!

యెహోవాను స్తుతించండి!

యెషయా 26:1-15

దేవునికొక స్తుతి గీతం

26 ఆ సమయమందు యూదాలో ప్రజలు ఈ పాటలు పాడుతారు:

యెహోవా మాకు రక్షణనిస్తాడు మాకు ఒక బలమైన పట్టణం ఉంది.
    మా పట్టణానికి బలమైన గోడలు, భద్రత ఉన్నాయి.
తలుపులు తెరవండి, మంచివాళ్లు ప్రవేశిస్తారు.
    ఆ ప్రజలు దేవుని యొక్క మంచి జీవన విధానాన్ని అవలంబిస్తారు.
యెహోవా, నీవే నిజమైన శాంతి ప్రసాదిస్తావు
    నీ మీద ఆధారపడే ప్రజలకు నీవు శాంతిని ప్రసాదిస్తావు.
    నీయందు విశ్వాసముంచే ప్రజలకు నీవు శాంతిని ప్రసాదిస్తావు.

కనుక ఎల్లప్పుడు యెహోవాను విశ్వసించాలి.
    నీవు యెహోవాను నిజంగా శాశ్వతంగా విశ్వసించాలి.
అయితే గర్వించిన పట్టణాన్ని యెహోవా నాశనం చేస్తాడు.
    అక్కడ నివసించే ప్రజలను ఆయన శిక్షిస్తాడు.
ఆ ఎత్తయిన పట్టణాన్ని నేలమట్టానికి ఆయన పడద్రోస్తాడు
    అది ధూళిలో పడిపోతుంది.
అప్పుడు పేదలు, దీనులైన ప్రజలు ఆ శిథిలాల మీద నడుస్తారు.

మంచి వాళ్లకు నిజాయితీయే జీవన విధానం
    మంచి మనుష్యులు సూటి సత్య మార్గం అవలంబిస్తారు.
మరియు దేవా, ఆ మార్గాన్ని అనుసరించటానికి
    దానిని నీవు తేలికగా మృదువుగా చేస్తావు.
కానీ యెహోవా, మేము నీ న్యాయ మార్గం కోసం ఎదురు చూస్తున్నాం.
    నిన్ను, నీ నామాన్ని మా ఆత్మలు జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తున్నాయి.
నా ఆత్మ రాత్రిపూట నీతో ఉండాలని ఆశిస్తుంది.
    ప్రతి నూతన దినపు సంధ్యా సమయంలో నీతో ఉండాలని నా ఆత్మ నాలో కోరుతుంది.
దేశంలోనికి నీ న్యాయ మార్గం వచ్చినప్పుడు
    ప్రజలు సరైన జీవన విధానం నేర్చుకొంటారు.
10 చెడ్డవాడికి నీవు దయ మాత్రమే చూపిస్తే
    వాడు మంచి చేయటం నేర్చుకోడు.
చెడ్డవాడు మంచి ప్రపంచంలో జీవించినప్పటికీ వాడు చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు.
    ఆ చెడ్డ వ్యక్తి యెహోవా గొప్ప తనాన్ని ఎప్పటికీ చూడకపోవచ్చు.
11 కానీ, యెహోవా, అలాంటి ప్రజలను నీవు శిక్షిస్తే
    వారు దానిని చూస్తారు.
యెహోవా నీ ప్రజల మీద నీకు ఉన్న బలమైన ప్రేమను నీవు చెడ్డ మనుష్యులకు చూపించు.
    అప్పుడు చెడ్డవాళ్లు సిగ్గుపడతారు.
    నీ శత్రువులు నీ స్వంత అగ్నిలో కాలిపోతారు.
12 యెహోవా, మేము చేయాలని ప్రయత్నించిన వాటన్నింటినీ చేయటంలో నీదే విజయం.
    కనుక మాకు శాంతి ప్రసాదించు.

తన ప్రజలకు దేవుడు క్రొత్త జీవితాన్ని ఇస్తాడు

13 యెహోవా, నీవే మా దేవుడివి. అయితే గతంలో మేము ఇతర ప్రభువులను అనుసరించాం.
మేము ఇతర యజమానులకు చెందిన వాళ్లం
    కానీ ప్రజలు ఇప్పుడు ఒకే ఒక్క పేరు, నీపేరు మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలని మేము కోరుతున్నాం.
14 ఆ అబద్ధ దేవుళ్లు జీవం లేనివి
    ఆ దయ్యాలు మరణం నుండి మళ్లీ లేవవు
నీవు వాటిని నాశనం చేయాలని నిర్ణయించావు.
    మేము వాటిని జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసే వాటన్నింటినీ నీవు నాశనం చేశావు.
15 నీవు ప్రేమించే దేశానికి నీవు సహాయం చేశావు
    ఇతరులు ఆ దేశాన్ని జయించకుండ నీవు నిలిపివేశావు.

మార్కు 12:18-27

కొందరు సద్దూకయ్యులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం

(మత్తయి 22:23-33; లూకా 20:27-40)

18 చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతకరని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేసారు. 19 “అయ్యా, ఒకని సోదరుడు చనిపోతే, ఆ చనిపోయిన సోదరునికి సంతానం లేకపోయినట్టయితే, ఆ చనిపోయిన సోదరుని భార్యను బ్రతికివున్న సోదరుడు వివాహమాడి, చనిపోయిన సోదరునికి సంతానం కలిగేటట్లు చెయ్యాలని మోషే మనకోసం ధర్మశాస్త్రంలో వ్రాసాడు. 20 ఒకప్పుడు ఏడుగురు సోదరులుండే వాళ్ళు. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా చనిపొయ్యాడు. 21 రెండవ వాడు అతని వితంతువును వివాహమాడాడు. కాని అతడు కూడా సంతానం లేకుండా చనిపొయ్యాడు. మూడవ వానికి కూడా అదే సంభవించింది. 22 ఆ ఏడుగురిలో ఎవ్వరికి సంతానం కలగలేదు. చివరకు ఆ స్త్రీకూడా చనిపోయింది. 23 చనిపోయిన వాళ్ళు బ్రతికి వచ్చినప్పుడు ఆమె ఎవరి భార్యగా పరిగణింపబడుతుంది? ఆమెను ఆ ఏడగురు పెండ్లి చేసుకొన్నారు కదా?” అని అడిగారు.

24 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు. కనుక పొరబడుతున్నారు. 25 చనిపోయిన వాళ్ళు బ్రతికివచ్చాక వివాహం చేసుకోరు. వాళ్ళు ఆడ, మగ అని ఉండరు. వాళ్ళు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు. 26 ఇక చనిపోయిన వాళ్ళు బ్రతకటం విషయంలో మోషే తాను వ్రాసిన గ్రంథంలో ‘పొదను’ గురించి వ్రాసినప్పుడు, దేవుడు అతనితో ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’(A) అని అతనితో చెప్పాడు. 27 ‘నేను వాళ్ళ దేవుణ్ణి’ అని ఆయన అన్నప్పుడు, వాళ్ళు నిజంగా చనిపోలేదన్న మాట. అంటే ఆయన బ్రతికివున్న వాళ్ళకు మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు.”[a]

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International