Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 133

దావీదు యాత్ర కీర్తనల్లో ఒకటి.

133 సహోదరులు ఐక్యంగా శాంతి కలిగి జీవించటం
    ఎంతో మంచిది, ఎంతో ఆనందం.
అది యాజకుని తలమీద పోయబడిన కమ్మని వాసనగల తైలంలాగా ఉంటుంది. అది అహరోను గడ్డం మీదికి కారుతున్న తైలంలాగా ఉంటుంది.
    అది అహరోను ప్రత్యేక వస్త్రాల మీదికి కారుతున్న తైలంలాగ ఉంటుంది.
అది హెర్మోను పర్వతం మీద నుండి సీయోను కొండమీద పడుతున్న మంచులా ఉంటుంది.
    సీయోను వద్దనే యెహోవా తన ఆశీర్వాదం ఇచ్చాడు. శాశ్వతజీవాన్ని ఆశీర్వాదంగా యెహోవా ఇచ్చాడు.

దానియేలు 2:1-23

నెబుకద్నెజరు స్వప్నం

నెబుకద్నెజరు రాజుగావున్న రెండవ సంవత్సరంలో, అతనికి కొన్ని కలలు వచ్చాయి. ఆ కలలు అతన్ని కలతపెట్టాయి, కనుక అతనికి నిద్ర పట్టలేదు. అప్పుడు రాజు తన కలను చెప్పటానికి మాంత్రికులను, గారడీవాళ్లను, శకునం చెప్పేవాళ్లను, కల్దీయులను పిలుపించుమని ఆజ్ఞాపించాడు. వారందరు వచ్చి రాజు ఎదుట నిలబడ్డారు. తాను ఏమి కలగన్నాడో చెప్పమని రాజు వారిని అడిగాడు.

అప్పుడు వారితో రాజు ఇలా అన్నాడు, “ఆ కల నన్ను కలత పెట్టింది. కాబట్టి కల, దాని అర్థం నాకు మీరు చెప్పాలి” తర్వాత కల్దీయులు రాజుతో సిరియా భాషలో[a], “రాజా, వర్థిల్లుము. మేము నీ సేవకులం. దయచేసి నీ కల ఏమిటో చెప్పుము. ఆ తర్వాత దాని అర్థం మేము చెబుతాము” అని అన్నారు.

అప్పుడు నెబుకద్నెజరు వారితో, “ఆ కలను నేను మర్చిపోయాను. కలను, దాని అర్థాన్ని కూడా మీరు చెప్పాలి. మీరు ఇవి చెప్పకపోతే, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికిస్తాను. మీ ఇళ్లను పాడు దిబ్బలుగా చేయిస్తాను. కాని మీరు నా కలను, దాని అర్థాన్ని వివరించినట్లయితే, అప్పుడు మీకు నేను కానుకలు, బహుమానాలు ఇస్తాను. గొప్పగా గౌరవిస్తాను. అందువల్ల ఆ కలను, దాని భావాన్ని, మీరు నాతో చెప్పండి” అని అన్నాడు.

మళ్లీ ఆ జ్ఞానవంతులు, “రాజా, దయచేసి నీ కలను చెప్పుము, మేము దాని అర్థం చెబుతాము” అని అడిగారు.

అప్పుడు నెబుకద్నెజరు ఇలా అన్నాడు: “మీరింకా వ్యవధి కోరుతున్నారని నాకు తెలుసు. కాని నేనేమి చెప్పానో, అది నా నిర్ధారణ అని మీకు తెలుసు. మీరు నా కలను గురించి చెప్పకపోతే, నేను మిమ్మల్ని శిక్షిస్తానని కూడా మీకు తెలుసు. కాబట్టి మీరంతా నాతో వ్యర్థమైన మాటలు, అబద్ధాలు చెప్పటానికి కాలయాపన చేస్తున్నారు. నేను చెప్పిన మాటలు మరచిపోతానని మీరు భావించవద్దు. ఇప్పుడు నా కలనుగురించి చెప్పండి. మీరు చెప్పితే, అప్పుడు ఆ కలయొక్క అర్థము కూడా మీరు చెప్పగలరని నాకు తెలుస్తుంది.”

10 అప్పుడు రాజుతో కల్దీయులు ఇలా చెప్పారు: “రాజు ఏమి అడుగుచున్నాడో, అది చెప్పగల ప్యక్తి ఈ భూమిమీదనే లేడు. ఈ విధంగా వివేకవంతుల్నిగాని, ఇంద్రజాలికుల్నిగాని, కల్దీయుల్నిగాని అడిగిన రాజు ఎవ్వరూ లేరు. ఈ విధంగా ఏ గొప్ప రాజుగాని, ఏ మహా శక్తివంతుడైన రాజుగాని అడుగలేదు. 11 చేయటానికి బహు కఠినమైన దానిని రాజు అడుగుచున్నాడు. దేవుళ్లు మాత్రమే రాజైన తమకు వచ్చిన కలనుగాని, ఆ కల అర్థముగాని చెప్పగలుగుతారు. కాని దేవుళ్లు మనుష్యులతో ఉండరు.”

12 ఇది వినగానే, రాజు చాలా ఉగ్రుడై, బబులోనులోని జ్ఞానవంతులందరిని చంపమని ఆజ్ఞాపించాడు. 13 నెబుకద్నెజరు వివేకవంతులందరు చంపబడాలని ఆజ్ఞ ప్రకటించగా రాజు మనుష్యులు దానియేలు మరియు అతని మిత్రుల్ని చంపడానికి వెళ్లారు.

14 అర్యోకు రాజరక్షకభటుల అధిపతి. బబులోనులోని వివేకవంతుల్ని చంపడానికి అతడు బయలు దేరాడు. కాని దానియేలు అతనితో తెలివిగా మాట్లాడాడు. 15 దానియేలు రాజరక్షకభటుల అధిపతియైన అర్యోకుని ఇలా అడిగాడు: “రాజు ఎందుకు ఇంత కఠినమైన శిక్షను విధించాడు?”

అప్పుడు అర్యోకు రాజు కలయొక్క వృత్తాంతము నంతటిని దానియేలుకు వివరించాడు. దానియేలు అది విని, సంగతి తెలుసుకొన్నాడు. 16 అతను నెబుకద్నెజరు రాజు వద్దకు వెళ్లి, తనకు మరికొంత సమయం ఇమ్మని, అప్పుడు తను కలను, కలయొక్క అర్థాన్ని చెప్పగలనని అడిగాడు.

17 దానియేలు తన ఇంటికి వెళ్లి మిత్రులైన హనన్యా, మిషాయేలు, అజర్యాలకు పూర్తి సంగతిని వివరించాడు. 18 తమ పాలిట దేవుడు దయకలిగి ఆ రహస్యమును తెలుపుటకు పరలోకమందున్న దేవుని ప్రార్థించుమని దానియేలు తన మిత్రుల్ని కోరాడు. ఎందుకనగా దానియేలు మరియు అతని మిత్రులు బబులోనులోని యితర వివేకవంతులతో కలిసి నాశనమవ్వకూడదు.

19 ఆ రాత్రి, దేవుడు ఆ రహస్యమును దానియేలుకి దర్శనములో వివరించాడు. అప్పుడు పరలోక మందున్న దేవున్ని దానియేలు స్తుతించాడు.

20 “నిరంతరం దేవుని పేరు కీర్తించబడాలి;
    శక్తియు, వివేకమును ఆయనకే చెందాలని దానియేలు దేవున్ని స్తుతించాడు.
21 దేవుడే కాలాల్ని సమయాల్ని మార్చుతాడు.
    ఆయనే రాజుల్ని వారి అధికారాల్ని మార్చుతాడు.
    ఆయనే మనుష్యులకు వివేకమిస్తాడు.
కనుక, వారు వివేకవంతులౌతారు.
    జ్ఞానమిస్తాడు, కనుక జ్ఞానవంతులవుతారు.
22 గ్రహించటానికి కష్టమైన రహస్యాలు ఆయనకు తెలుసు.
    చీకటిలో మరుగైన సంగతులు ఆయనకు తెలుసు.
    వెలుగు ఆయనలో నివసిస్తుంది.
23 మా పూర్వీకుల దేవా! నీకు కృతజ్ఞుణ్ణి, నిన్ను కీర్తిస్తున్నాను.
    నీవు నాకు వివేకము, బలము ప్రసాదించావు.
నీవు రాజు కన్న కలను, దాని అర్థాన్ని తెలియజేశావు.
    మేమడిగిన విషయాల్ని నీవు మాకు చెప్పావు” అని దానియేలు అన్నాడు.

అపొస్తలుల కార్యములు 4:23-31

విశ్వాసుల ప్రార్థన

23 విడుదలయ్యాక పేతురు, యోహాను తమ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రధానయాజకులు, పెద్దలు చెప్పినదంతా చెప్పారు. 24 ఇది విన్నాక వాళ్ళంతా కలిసి ఒకే ధ్యేయంతో దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు: “మహా ప్రభూ! నీవు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సకల వస్తువుల్ని సృష్టించావు. 25 నీవు పవిత్రాత్మ ద్వారా నీ సేవకుడు, మా తండ్రి అయిన దావీదు నోటినుండి యిలా పలికించావు:

‘జనాంగములు ఎందుకు రెచ్చుతున్నాయి?
ప్రజలెందుకు వృథాగా పన్నాగాలు పన్నుతున్నారు?

26 ‘రాజులు, పాలకులు కలిసి ప్రభువును,
    ఆయన క్రీస్తును ఎందుకు ఎదిరిస్తున్నారు?’(A)

27 హేరోదు మరియు పొంతి పిలాతు ఇశ్రాయేలు ప్రజలతో మరియు యితర దేశ ప్రజలతో కలిసారు. అంతా కలిసి పవిత్రతగల నీ సేవుకుణ్ణి, నీవు క్రీస్తుగా నియమించిన యేసును నిజంగానే ఎదిరించారు. 28 ఏది జరగాలో నీ శక్తి సంకల్పానుసారం నీవు ముందే నిర్ణయించావు. వాళ్ళు నీవు నిర్ణయించినట్లే చేసారు. 29 ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని భయపెడ్తున్నారు, చూడు ప్రభూ! నీ సందేశాన్ని ధైర్యంగా చెప్పే శక్తిని నీ సేవకులకు యివ్వు! 30 యేసు పవిత్రమైనవాడు, నీ సేవకుడు. ఆయన పేరిట రోగుల్ని నయం చెయ్యటానికి, అద్భుతాలు, మహత్యాలు చెయ్యటానికి నీ అభయ హస్తాన్ని చాపి మాకు శక్తినివ్వు!”

31 వాళ్ళ ప్రార్థన ముగిసాక వాళ్ళు సమావేశమైన స్థలం కంపించింది. అందరిలో పవిత్రాత్మ నింపుదల కలిగింది. వాళ్ళు దైవసందేశాన్ని ధైర్యంగా చెప్పటం మొదలు పెట్టారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International