Revised Common Lectionary (Complementary)
118 యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
2 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
14 యెహోవా నా బలం, నా విజయ గీతం!
యెహోవా నన్ను రక్షిస్తాడు!
15 మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు.
యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
16 యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి.
యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
17 నేను జీవిస్తాను! కాని మరణించను.
మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను.
18 యెహోవా నన్ను శిక్షించాడు,
కాని ఆయన నన్ను చావనియ్య లేదు.
19 మంచి గుమ్మములారా, నా కోసం తెరచుకోండి,
నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
20 అవి యెహోవా గుమ్మాలు.
ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
21 యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
22 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
మూలరాయి అయ్యింది.
23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు.
అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
24 ఈ వేళ యెహోవా చేసిన రోజు.
ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!
ప్రపంచ ప్రారంభం
1 మొట్ట మొదట దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు. 2 భూమి మొత్తం శూన్యంగా ఉండెను. భూమిమీద ఏమీ ఉండలేదు. మహా సముద్రాన్ని చీకటి ఆవరించి ఉండెను. దేవుని ఆత్మ నీళ్లమీద సంచరిస్తూ ఉండెను.
మొదటి రోజు-వెలుగు
3 అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక!” అన్నాడు. వెలుగు ప్రకాశించటం మొదలయింది. 4 దేవుడు ఆ వెలుగును చూశాడు. ఆయనకు అది చక్కగా కనబడింది. అప్పుడు దేవుడు ఆ వెలుగును చీకటి నుండి వేరు చేశాడు. 5 వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని దేవుడు పేరు పెట్టాడు.
అస్తమయము అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది మొదటి రోజు.
రెండవ రోజు-ఆకాశం
6 అప్పుడు దేవుడు, “జలములను రెండు భాగములుగా చేయుటకు అంతరిక్షం[a] ఉండును గాక!” అన్నాడు. 7 కనుక దేవుడు అంతరిక్షాన్ని చేసి, నీళ్లను వేరుపర్చాడు. కొంత నీరు అంతరిక్షం పైగాను, కొంత నీరు అంతరిక్షం క్రిందను ఉంది. 8 దేవుడు ఆ అంతరిక్షానికి “ఆకాశం” అని పేరు పెట్టాడు. అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది రెండవ రోజు.
మూడవ రోజు-పొడి నేల, మొక్కలు
9 అప్పుడు దేవుడు, “పొడి నేల కనబడునట్లు, ఆకాశం క్రింద ఉండే నీరు ఒక్క చోట చేరునుగాక!” అన్నాడు. అలాగే జరిగింది. 10 ఆ పొడి నేలకు “భూమి” అని దేవుడు పేరు పెట్టాడు. మరియు ఒక్క చోట చేరిన నీటికి “సముద్రాలు” అని దేవుడు పేరు పెట్టాడు. ఆయనకు ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది. 11 అప్పుడు దేవుడు, “భూమి గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను, ఫలవృక్షాలను మొలిపించును గాక, ఫలవృక్షాలు విత్తనాలుగల పండ్లను పండిస్తాయి. మరియూ ప్రతి మొక్క తన స్వంత రకం విత్తనాన్ని రూపొందిస్తుంది. ఈ మొక్కలు భూమిమీద పెరుగును గాక” అన్నాడు. అలాగే జరిగింది. 12 గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను భూమి మొలిపించింది. మరియు అది విత్తనాలుగల పండ్ల చెట్లను మొలిపించింది. ప్రతి మొక్క తన స్వంత రకం విత్తనాలను రూపొందించింది. దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది.
13 అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది మూడవ రోజు.
నాలుగవ రోజు-సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు
14 అప్పుడు, “ఆకాశంలో జ్యోతులు ఉండును గాక. ఈ జ్యోతులు రాత్రి నుండి పగలును వేరు చేస్తాయి. జ్యోతులు ప్రత్యేక సంకేతాలను, ప్రత్యేక సమావేశాల[b] ప్రారంభాన్ని సూచించేందుకు ఉపయోగించబడతాయి. మరియు రోజులను సంవత్సరాలను తెలుపుటకు అవి ఉపయోగించబడతాయి. 15 భూమి మీద వెలుగును ప్రకాశింప చేయుటకు ఈ జ్యోతులు ఆకాశంలో ఉంటాయి” అని దేవుడు అన్నాడు. అలాగే జరిగింది.
16 కనుక ఆ రెండు పెద్ద జ్యోతులను దేవుడు చేశాడు. పగటి వేళను ఏలుటకు దేవుడు పెద్ద జ్యోతిని చేశాడు. రాత్రి వేళను ఏలుటకు ఆయన చిన్న జ్యోతిని చేశాడు. దేవుడు నక్షత్రాలను కూడా చేశాడు. 17 భూమి మీద ప్రకాశించుటకు ఈ జ్యోతులను దేవుడు ఆకాశంలో ఉంచాడు. 18 పగటిని, రాత్రిని ఏలుటకు ఈ జ్యోతులను ఆకాశంలో ఉంచాడు. ఈ జ్యోతులు చీకటి నుండి వెలుగును వేరు చేశాయి. దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది.
19 అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది నాలుగవ రోజు.
బ్రతికి వచ్చిన దేహం
35 కొందరు, “చనిపోయినవాళ్ళు ఏ విధంగా బ్రతికింపబడతారు? వాళ్ళు ఎలాంటి దేహంతో వస్తారు?” అని అడగవచ్చు. 36 ఎంతటి మూర్ఖులు! నీవు భూమిలో నాటిన విత్తనం చనిపోకపోతే అది మొలకెత్తదు. 37 నీవు ఒక చిన్న విత్తనాన్ని, ఉదాహరణకు ఒక గోధుమ విత్తనాన్ని నాటుతావు, కాని పెరగబోయే మొలకను నాటవు. 38 దేవుడు తాను అనుకొన్న విధంగా ప్రతీ విత్తనానికి దానికి తగిన దేహాన్ని యిస్తాడు. 39 మాంసాలన్నీ ఒకే రకం కావు. మానవుల మాంసం ఒక రకం. జంతువుల మాంసం ఒక రకం. పక్షుల మాంసం ఒక రకం. చేపల మాంసం ఒక రకం. 40 ఆకాశంలో జ్యోతులున్నాయి, భూమ్మీద జ్యోతులున్నాయి, గాని వాటి వాటి ప్రకాశం వేరు. 41 సూర్యుడు ఒక రకంగా, చంద్రుడు ఒక రకంగా, నక్షత్రాలు ఒక రకంగా ప్రకాశిస్తాయి. ఒక నక్షత్రం ప్రకాశించిన విధంగా మరొక నక్షత్రం ప్రకాశించదు.
42 చనిపోయినవాళ్ళు బ్రతికి రావటం కూడా అదే విధంగా ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి, నశించని శరీరాన్ని పొందుతారు. 43 గౌరవం లేని శరీరంగా నాటబడి, మహిమగల శరీరంగా లేపబడుతుంది. బలహీనమైన శరీరంగా నాటబడి, శక్తిగల శరీరముగా లేస్తుంది. 44 భౌతికమైన శరీరాన్ని నాటి, ఆత్మీయమైన శరీరాన్ని పుట్టిస్తాడు.
భౌతికమైన శరీరం ఉంది అంటే, ఆత్మీయ శరీరం కూడా ఉంటుంది. 45 ఈ విధంగా వ్రాయబడింది: “ప్రథమ పురుషుడైన ఆదాము జీవించే నరుడయ్యాడు, చివరి ఆదాము జీవాన్ని ఇచ్చే ఆత్మ అయ్యాడు.” 46 ముందు ఆత్మీయత రాలేదు. ముందు భౌతిక శరీరం వచ్చింది. ఆ తర్వాత ఆత్మీయత వచ్చింది. 47 మొదటి పురుషుడు భూమ్మీద ఉన్న మట్టితో సృష్టింపబడ్డాడు. రెండవ మనుష్యుడు పరలోకంనుండి దిగివచ్చాడు. 48 భూమ్మీద ఉన్నవాళ్ళు మట్టితో సృష్టింపబడినవానివలే ఉన్నారు. పరలోకానికి సంబంధించినవాళ్ళు పరలోకంనుండి వచ్చినవానివలె ఉన్నారు. 49 మట్టితో సృష్టింపబడినవాని పోలికలతో మనము జన్మించినట్లే, పరలోకం నుండి వచ్చినవాని పోలికలను కూడా మనము పొందుతాము.
© 1997 Bible League International