Revised Common Lectionary (Complementary)
118 యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
2 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
19 మంచి గుమ్మములారా, నా కోసం తెరచుకోండి,
నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
20 అవి యెహోవా గుమ్మాలు.
ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
21 యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
22 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
మూలరాయి అయ్యింది.
23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు.
అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
24 ఈ వేళ యెహోవా చేసిన రోజు.
ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!
25 ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి.
దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము.
26 యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.”
యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము!
27 యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు.
బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల[a] వద్దకు గొర్రెపిల్లను మోసికొని రండి.”
28 యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
నేను నిన్ను స్తుతిస్తున్నాను.
29 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
పస్కా పండుగ
16 “అబీబు[a] నెలలో మీరు మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించాలి. ఎందుకంటే అబీబు నెలలోనే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రాత్రిపూట ఈజిప్టునుంటి బయటకు రప్పించాడు. 2 యెహోవా తనకు ప్రత్యేక స్థలంగా ఏర్పరచుకొనే చోటుకు మీరు వెళ్లాలి. అక్కడ మీ దేవుడైన యెహోవాను గౌరవించేందుకు, పస్కా పండుగ భోజనానికి ఒక ఆవును లేక మేకను మీరు బలి యివ్వాలి. 3 ఈ బలితోపాటు పొంగినది ఏదీ తినవద్దు. ఏడు రోజులపాటు పొంగని రొట్టెలు మీరు తినాలి. ఇది “బాధరొట్టె అని పిలువబడుతుంది.” ఈజిప్టు దేశంలో మీ బాధలను జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది సహాయపడుతుంది. ఎంత త్వరగా మీరు ఆ దేశం విడిచిపెట్టాల్సి వచ్చిందో జ్ఞాపకం ఉందా! మీరు బ్రదికినంత కాలం ఆ రోజును జ్ఞాపకం ఉంచుకోవాలి. 4 దేశవ్యాప్తంగా ఏడు రోజులపాటు ఎక్కడా ఎవరి యింటిలో పులిసిన రొట్టెలు ఉండకూడదు. మరియు మొదటి రోజు సాయంత్రం మీరు బలి అర్పించే మాంసం అంతా తెల్లవారక ముందే తినటం అయిపోవాలి.
5 “మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే పట్టణాలు దేనిలోనైనా పస్కా పండుగ జంతువును మీరు బలి అర్పించకూడదు. 6 మీ దేవుడైన యెహోవా తనకోసం ప్రత్యేక ఆలయంగా ఏర్పాటు చేసుకొన్న స్థలంలో మాత్రమే పస్కా పండుగ జంతువును మీరు బలిగా అర్పించాలి. అక్కడ సాయంకాలం సూర్యుడు అస్తమించినప్పుడు పస్కా పండుగ జంతువును మీరు బలి అర్పించాలి. యెహోవా మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొనివచ్చిన సందర్భము ఇది. 7 మరియు మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనే స్థలంలోనే పస్కా పండుగ మాంసం మీరు వండుకొని తినాలి. అప్పుడు ఉదయాన్నే మీరు తిరిగి మీ గుడారాలకు వెళ్లిపోవాలి. 8 పులియని రొట్టెలను ఆరు రోజులు మీరు తినాలి. ఏడో రోజున మీరు ఏ పనీ చేయకూడదు. ఆ రోజు, మీ దేవుడైన యెహోవా కోసం ప్రత్యేక సమావేశంగా ప్రజలంతా కూడు కొంటారు.
క్రీస్తు వినయంను అనుకరించుట
2 క్రీస్తులో ఐక్యత పొందటం వలన మీకు శక్తి కలిగింది కదా! ఆయన ప్రేమ మీకు ఆనందం యిస్తుంది కదా! ఆయన ఆత్మతో మీకు స్నేహం కలిగింది గదా! మీలో దయాదాక్షిణ్యాలు అభివృద్ధి చెందుతున్నాయి కదా! 2 అలాగైతే ఒకే మనస్సుతో, ఒకే ప్రేమలో పాలుపంచుకొంటూ, ఒకే ఆత్మతో, ఒకే ఉద్దేశంతో ఉండి నన్ను పూర్తిగా ఆనందపరచండి. 3 స్వలాభం కోసంగాని, స్వాభిమానం కోసంగాని ఏదీ చేయకండి. వినయంగా ఉండండి. మీరు యితరులకన్నా గొప్ప అని భావించకండి. 4 మీ స్వార్థం కోసం మాత్రమే చూసుకోకుండా యితరుల అవసరాలను కూడా గమనించండి.
నిస్వార్థంగా నుండుటకు క్రీస్తునుండి నేర్చుకొనండి
5 యేసు క్రీస్తులో ఉన్న మనస్సును పెంచుకోండి.
6 ఆయన దేవునితో సమానము.
అయినా ఆయన ఆ స్థానాన్ని పట్టుకొని కూర్చోవాలనుకోలేదు.
7 ఆయన అంతా వదులుకొన్నాడు.
మానవ రూపం దాల్చి సేవకునివలే ఉండటానికి వచ్చాడు.
8 మానవుని వలే కనిపిస్తూ, వినయంగా వుంటూ,
మరణాన్ని కూడా విధేయతగా అంగీకరించి, సిలువపై మరణించాడు.
9 అందువల్ల దేవుడాయనకు ఉన్నత స్థానం ఇచ్చి
అన్ని పేర్లకన్నా ఉత్తమమైన పేరు యిచ్చాడు.
10 యేసు పేరు విన్నప్పుడు పరలోకంలో, భూలోకంలో, పాతాళలోకంలో
ఉన్నవాళ్ళంతా ఆయన ముందు మోకరిల్లాలని ఈ విధంగా చేసాడు.
11 ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని అంగీకరించాలని ఈ విధంగా చేసాడు.
తండ్రియైన దేవునికి మహిమ కలుగుగాక!
© 1997 Bible League International