Revised Common Lectionary (Complementary)
క్రొత్త ఒడంబడిక
31 “ఇశ్రాయేలు వంశంతోను, యూదా వంశంతోను నేనొక క్రొత్త ఒడంబడికను కుదుర్చుకునే సమయం ఆసన్న మవుతూ ఉంది. 32 ఇది నేను వారి పూర్వీకులతో చేసికొన్న ఒడంబడిక వంటిది గాదు. వారిని నా చేతితో ఈజిప్టు నుండి నడిపించి తీసికొని వచ్చి నప్పుడు మేమా ఒడంబడిక చేసికొన్నాము. నేను వారి యెహోవాను, కాని వారే ఆ ఒడంబడికను ఉల్లంఘించారు.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
33 “భవిష్యత్తులో నేను ఇశ్రాయేలుతో ఈ రకమైన ఒడంబడిక చేసుకుంటాను.” ఇదే యెహోవా వాక్కు. “నా బోధనలన్నీ వారి మనస్సులో నాటింప చేస్తాను. పైగా వాటిని వారి హృదయాల మీద వ్రాస్తాను. నేను వారి దేవుణ్ణి. వారు నా ప్రజలై ఉందురు. 34 యెహోవాను గురించి తెలిసికొనేందుకు ప్రజలు వారి పొరుగువారికి, బంధువులకు బోధించనక్కరలేదు. ఎందువల్లనంటే అన్ని తరగతుల ప్రజలు తమతమ భేదం లేకుండా నన్ను తెలిసికుంటారు.” ఇదే యెహోవా వాక్కు. “వారు చేసిన చెడ్డ పనులన్నిటినీ నేను క్షమిస్తాను. వారి పాపాలను నేను గుర్తు పెట్టుకొనను.”
సంగీత నాయకునికి: దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన.
51 దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా
నా మీద దయ చూపించుము.
నీ మహా దయ మూలంగా
నా పాపాలన్నీ తుడిచివేయుము.
2 దేవా, నా దోషం అంతా తీసివేయుము.
నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
3 నేను పాపం చేశానని నాకు తెలుసు.
నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
4 తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను.
దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే.
నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
5 నేను పాపంలో పుట్టాను.
పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
6 దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు.
అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
7 హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము.
నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
8 నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము.
నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
9 నా పాపాలను చూడకుము!
వాటన్నింటినీ తుడిచి వేయుము.
10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము
నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
11 నన్ను త్రోసివేయకుము!
నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
12 నీచేత రక్షించబడుట మూలంగా
కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము!
నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.
బేత్
9 యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు?
నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే.
10 నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు ప్రయత్నిస్తాను.
దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడనవుటకు నాకు సహాయం చేయుము.
11 నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను.
ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను
12 యెహోవా, నీకే స్తుతి.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
13 జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను.
14 ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా
నేను నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను.
15 నీ నియమాలను నేను చర్చిస్తాను.
నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను.
16 నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను.
నీ మాటలు నేను మరచిపోను.
5 క్రీస్తు ప్రధాన యాజకుని యొక్క గౌరవ స్థానాన్ని స్వయంగా ఆక్రమించలేదు. దేవుడాయనతో,
“నీవు నా కుమారుడవు.
నేడు నేను నీకు తండ్రినయ్యాను”(A)
అని చెప్పి మహిమ పరచాడు. 6 మరొక చోట, ఇలా అన్నాడు:
“నీవు మెల్కీసెదెకు వలె చిరకాలం
యాజకుడవై ఉంటావు.”(B)
7 యేసు తాను భూమ్మీద జీవించినప్పుడు తనను చావునుండి రక్షించగల దేవుణ్ణి కళ్ళనిండా నీళ్ళు పెట్టుకొని పెద్ద స్వరంతో ప్రార్థించి వేడుకొన్నాడు. ఆయనలో భక్తి, వినయం ఉండటంవల్ల దేవుడాయన విన్నపం విన్నాడు. 8 యేసు దేవుని కుమారుడైనా, తాననుభవించిన కష్టాల మూలంగా విధేయతతో ఉండటం నేర్చుకొన్నాడు. 9 పరిపూర్ణత పొందాక, తన పట్ల విధేయతగా ఉన్నవాళ్ళందరికీ శాశ్వతమైన రక్షణ ప్రసాదించ గలవాడయ్యాడు. 10 దేవుడు మెల్కీసెదెకు యొక్క క్రమంలో యేసును ప్రధాన యాజకునిగా నియమించాడు.
జీవము, మరణముల గురించి యేసు మాట్లాడటం
20 పండుగ రోజు ఆరాధన చెయ్యటానికి వెళ్ళిన వాళ్ళల్లో గ్రీకులు కూడా ఉన్నారు. 21 వాళ్ళు ఫిలిప్పును కలుసుకొని, “అయ్యా! మేము యేసును చూడటానికి వచ్చాము” అని అన్నారు. ఫిలిప్పు, గలిలయలోని బేత్సయిదా అనే గ్రామానికి చెందిన వాడు. 22 ఫిలిప్పు వెళ్ళి అంద్రెయతో చెప్పాడు. వీళ్ళిద్దరూ వెళ్ళి యేసుతో చెప్పారు.
23 యేసు ఇలా అన్నాడు: “మనుష్యకుమారుడు మహిమపొందు గడియ దగ్గరకు వచ్చింది. 24 ఇది నిజం. గోధుమ విత్తనం భూమ్మీద పడి చనిపోకపోతే అది ఒకటిగానే ఉంటుంది. అది చనిపోతే ఎన్నో విత్తనాల్ని ఉత్పత్తి చేస్తుంది. 25 తన ప్రాణాన్ని ప్రేమించే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని ఈ ప్రాపంచిక జీవితాన్ని ఏవగించుకొన్నవాడు తన ప్రాణాన్ని కాపాడు కొంటాడు. పైగా అనంతజీవితం పొందుతాడు. 26 నా సేవ చేయదలచిన వాడు నన్ను అనుసరించాలి. నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు అక్కడ ఉంటాడు. నా సేవ చేసేవాణ్ణి నా తండ్రి గౌరవిస్తాడు.
యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం
27 “ఇక నా ఆత్మ కలవరం చెందుతున్నది. తండ్రీ నేనేమనాలి? ఈ గడియనుండి నన్ను రక్షించుమని అడగాలా? కాదు! నేను వచ్చింది ఈ గడియ కోసమే కదా! 28 తండ్రీ నీ పేరుకు మహిమ కలిగించుకో.”
అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “నేను యిదివరలో నా పేరుకు మహిమ కలిగించాను. మళ్ళీ దానికి మహిమ కలిగిస్తాను!” అని అన్నది.
29 అక్కడ నిలుచున్న ప్రజలు యిది విన్నారు. కొందరు ఉరిమిందన్నారు.
మరి కొందరు, “దేవదూత ఆయనతో మాట్లాడాడు” అని అన్నారు.
30 యేసు, “ఆ గొంతు మీ కోసం పలికింది. నా కోసం కాదు. 31 ఈ ప్రపంచంపై తీర్పు చెప్పే సమయం వచ్చింది. ఈ లోకాధికారిని బయటకు తరిమి వేసే సమయం వచ్చింది. 32 కాని దేవుడు నన్ను ఈ భూమ్మీదినుండి పైకెత్తినప్పుడు నేను ప్రజలందర్ని నా యొద్దకు ఆకర్షిస్తాను. వాళ్ళను నా దగ్గరకు పిలి పించుకుంటాను” అని అన్నాడు. 33 ఇది చెప్పి తాను ఏ విధంగా మరణించనున్నాడో సూచించాడు.
© 1997 Bible League International