Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. కోరహు కుమారుల స్తుతి కీర్తన
84 సర్వశక్తిమంతుడువైన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది.
2 యెహోవా, నేను వేచియుండి అలసిపోయాను.
నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను.
నాలోని ప్రతి అవయవం జీవంగల దేవునికి ఆనంద గానం చేస్తుంది.
3 సర్వ శక్తిమంతుడువైన యెహోవా, నా రాజా, నా దేవా,
పిచ్చుకలకు, వానకోవెలలకు సహితం నివాసాలు ఉన్నాయి.
ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర గూళ్లు పెట్టుకొంటాయి.
అక్కడే వాటి పిల్లలు ఉంటాయి.
4 నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు.
వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తారు.
5 ఎవరైతే వారి బలానికి నిన్ను ఆధారంగా ఉండనిస్తారో వారు సంతోషిస్తారు.
వారు నిన్నే నడిపించ నిస్తారు.
6 దేవుడు నీటి ఊటగా చేసిన తొలకరి వాన నిలిచే
నీటి మడుగుల బాకా లోయగుండా వారు పయనిస్తారు.
7 వారు దేవుని కలుసుకొనే సీయోనుకు పోయే మార్గంలో
ఆ ప్రజలు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తారు.
8 సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించే
యాకోబు దేవా, నా మాట వినుము.
9 దేవా, మా సంరక్షకుని కాపాడుము.
నీవు ఏర్పరచుకొన్న రాజుకు దయ చూపుము.[a]
10 దేవా, నేను మరో స్థలంలో వెయ్యి రోజులు గడుపుటకంటె
నీ ఆలయంలో ఒక్కరోజు ఉండుట మేలు.
దుర్మార్గుల ఇంటిలో నివసించుటకంటె
నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను నిలిచియుండుట మేలు.
11 యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు.
దేవుడు మమ్మల్ని దయ, మహిమతో దీవిస్తున్నాడు.
యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు
ఆయన ఆన్ని మేళ్లూ అనుగ్రహిస్తాడు.
12 సర్వశక్తిమంతుడవైన యెహోవా, నిన్ను నమ్ముకొనే ప్రజలు నిజంగా సంతోషిస్తారు.
దర్యావేషు ఆజ్ఞ
6 దర్వావేషు రాజు తన ముందరి రాజుల చారిత్రక పత్రాలను గాలించవలసిందిగా ఆదేశించాడు. ఆ పత్రాలు బబులోనులో డబ్బును పదిలపరచిన ఖజానాలోనే పదిలపరచబడ్డాయి. 2 మాదీయ రాష్ట్రంలోని ఎగ్బతానా కోటలో చుట్టబడిన పత్రం ఒకటి కనిపించింది. ఆ చుట్టబడిన పత్రం[a] లో యిలా వ్రాయబడి వుంది:
అధికార పత్రం: 3 కోరెషు రాజు పాలన మొదటి సంవత్సరంలో, కోరెషు యెరూషలేములోని దేవాలయం విషయంలో ఈ క్రింది ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఆజ్ఞలో ఇలా పేర్కొనబడింది:
బలులు అర్పించేందుకు అనువైన యెరూషలేము దేవాలయం తిరిగి నిర్మించబడాలి. దానికి పునాదులు వెయ్యనియ్యండి, దేవాలయం (పొడవు 90 అడుగులు, వెడల్పు 90 అడుగులు వుండాలి.) 4 దాని చుట్టూ వుండే గోడ మూడు వరుసల పెద్ద రాళ్లతో, ఒక వరుస పెద్ద కొయ్య దూలాలతో నిర్మింపబడాలి. దేవాలయ నిర్మాణానికయ్యే ఖర్చులు రాజు ఖజానానుంచి చెల్లించాలి. 5 అంతేకాదు, దేవాలయం నుంచి తెచ్చిన వెండి, బంగారు వస్తువులు తిరిగి వాటి వాటి స్థానాల్లో వుంచబడాలి. వెనక, నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయంలోంచి కొల్లగొట్టి, ఆ వస్తువులను బబులోనుకు తెచ్చాడు. వాటిని తిరిగి ఆ దేవాలయంలో వుంచాలి.
6 ఇప్పుడిక దర్యావేషునైన నేను,
యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంత అధికారియైన తత్తెనైయు, షెతర్బోజ్నయినీ, ఆ రాజ్యంలో నివసించే అధికారులందరినీ యెరూషలేముకు దూరంగా పుండవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. 7 అక్కడి పనివాళ్లని వేధించకండి. ఆ దేవాలయ నిర్మాణాన్ని ఆపేందుకు ప్రయత్నించకండి. యూదా పాలనాధికారీ, యూదా నాయకులూ ఆ దేవాలయాన్ని తిరిగి నిర్మించాలి. ఆ దేవాలయం పూర్వం ఎక్కడున్నదో సరిగ్గా అదే స్థలంలో దాన్ని తిరిగి నిర్మించాలి.
8 ఇప్పుడు నేనీక్రింది ఆజ్ఞను జారీ చేస్తున్నాను. దేవాలయం నిర్మిస్తున్న యూదా పెద్దలకు, మీరు ఈ క్రింది పనులు చెయ్యాలి. దేవాలయ నిర్మాణ ఖర్చులు పూర్తిగా ఖాజానానుంచి చెల్లింపబడాలి. ఆ సొమ్ము యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతంలోని రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వసూలు చేయబడాలి. ఆ నిర్మాణం ఆగిపోకుండా వుండేందుకుగాను మీరీ పనులు త్వర త్వరగా చెయ్యాలి. 9 వాళ్లకి ఏమి కావాలన్నా సరే ఇవ్వండి. పరలోక దేవునికి బలి ఇచ్చేందుకు వాళ్లు దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు కావాలంటే, వాటిని వాళ్లకి ఇవ్వండి. యెరూషలేము యాజకులు గోధుమలు, ఉప్పు, ద్రాక్షారసం, నూనె కావాలంటే, వాటిని మీరు ప్రతిరోజూ వాళ్లకి తప్పనిసరిగా ఇవ్వండి. 10 పరలోక దేవుని సంతృప్తి పరచేందుకోసం మీరు వీటిని యూదా యాజకులకు ఇవ్వండి. ఆ యాజకులు నా కోసం, నా కొడుకుల కోసం ప్రార్థన చేసేందుకుగాను మీరు వాటిని వాళ్లకి ఇవ్వండి.
11 దీనికీ తోడు నా మరో ఆజ్ఞ: ఎవరైనా ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే అతని ఇంటి దూలాన్ని ఊడపీకి, దానితో అతని పొట్టలో పొడవాలి. అతని ఇంటిని ధ్వంసంచేసి, దాన్నొక రాళ్ల కుప్పగా మార్చాలి.
12 దేవుడు యెరూషలేములో తన నామమును ఉంచాడు. ఈ నా ఆజ్ఞను ధిక్కరించ ప్రయత్నించే వ్యక్తి ఒక రాజైనా, మరొకడెవడైనా, అతన్ని ఆ దేవుడు ఓడిస్తాడని నేను ఆశిస్తున్నాను, యెరూషలేములోని ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ఏ వ్యక్తి అయినా ప్రయత్నిస్తే, దేవుడు అతన్ని నాశనం చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
జాగ్రత్త, ఇది నా (దర్యావేషు రాజు) తిరుగులేని ఆజ్ఞ. దీన్ని విధిగా వెంటనే, పూర్తిగా పాటించాలి!
దేవాలయ నిర్మాణ పనిపూర్తి, ప్రతిష్ఠ
13 సరే, యూఫ్రటీసు నది పశ్చమ ప్రాంత పాలనాధికారి తత్తెనైయు, షెతర్బోజ్నయి, వారి సహోద్యోగులు దర్యావేషు రాజు ఆజ్ఞను సంపూర్ణంగా పాటించారు. 14 దానితో, యూదుల పెద్దలు (నాయకులు) నిర్మాణ కృషిని కొనసాగించారు. ప్రవక్త హగ్గయి, ఇద్దో కొడుకు జెకర్యాల ప్రోత్సాహంతో వాళ్లు జయప్రదమయ్యారు. వాళ్ల దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞాపాలన క్రమంలో యీ పని పూర్తయింది. ఈ పని పూర్తయ్యేందుకు పారసీక రాజులైన కోరెషు, దర్యావేషు, అర్తహషస్తల ఆజ్ఞలు పాలింపబడటం కూడా కారణమే. 15 దేవాలయ నిర్మాణం అదారు నెల, మూడవ రోజున[b] దర్వావేషు రాజు పాలన ఆరవ ఏట[c] పూర్తయింది.
16 అప్పుడిక ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, నిర్భంధంనుంచి వెనక్కి తిరిగి వచ్చిన ఇతరులు ఆ దేవాలయ ప్రతిష్ఠను పెద్ద పండుగలా, ఎంతో సంతోషంగా జరుపుకున్నారు.
యేసు ఆలయంలోనికి వెళ్ళటం
(మత్తయి 21:12-17; లూకా 19:45-48; యోహాను 2:13-22)
15 యెరూషలేము చేరుకొన్నాక యేసు దేవాలయంలోకి ప్రవేశించి వ్యాపారం చేస్తున్న వాళ్ళను తరిమి వేయటం మొదలుపెట్టాడు. డబ్బు మార్చే వ్యాపారస్తుల బల్లల్ని, పావురాలు అమ్ముతున్న వ్యాపారస్తుల బల్లల్ని క్రింద పడవేసాడు. 16 దేవాలయం ద్వారా ఎవరూ సరుకులు మోసుకు పోనీయకుండా చేసాడు. 17 ఆయన బోధిస్తూ, “‘నా ఆలయం అన్ని జనాంగాలకు ప్రార్థనా ఆలయం అనిపించుకొంటుంది’ అని గ్రంథాల్లో వ్రాసారు.(A) కాని మీరు దాన్ని దోపిడి దొంగలు దాచుకొనే గుహగా మార్చారు”(B) అని అన్నాడు.
18 అక్కడున్న ప్రజలు యేసు బోధను విని ఆశ్చర్యపొయ్యారు. ప్రధానయాజకులు, శాస్త్రులు భయపడి యేసును చంపటానికి మార్గం వెతకటం మొదలు పెట్టారు. 19 సాయంత్రం కాగానే ఆయన, శిష్యులు పట్టణం వదిలి వెళ్ళిపొయ్యారు.
© 1997 Bible League International