Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. కోరహు కుమారుల స్తుతి కీర్తన
84 సర్వశక్తిమంతుడువైన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది.
2 యెహోవా, నేను వేచియుండి అలసిపోయాను.
నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను.
నాలోని ప్రతి అవయవం జీవంగల దేవునికి ఆనంద గానం చేస్తుంది.
3 సర్వ శక్తిమంతుడువైన యెహోవా, నా రాజా, నా దేవా,
పిచ్చుకలకు, వానకోవెలలకు సహితం నివాసాలు ఉన్నాయి.
ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర గూళ్లు పెట్టుకొంటాయి.
అక్కడే వాటి పిల్లలు ఉంటాయి.
4 నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు.
వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తారు.
5 ఎవరైతే వారి బలానికి నిన్ను ఆధారంగా ఉండనిస్తారో వారు సంతోషిస్తారు.
వారు నిన్నే నడిపించ నిస్తారు.
6 దేవుడు నీటి ఊటగా చేసిన తొలకరి వాన నిలిచే
నీటి మడుగుల బాకా లోయగుండా వారు పయనిస్తారు.
7 వారు దేవుని కలుసుకొనే సీయోనుకు పోయే మార్గంలో
ఆ ప్రజలు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తారు.
8 సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించే
యాకోబు దేవా, నా మాట వినుము.
9 దేవా, మా సంరక్షకుని కాపాడుము.
నీవు ఏర్పరచుకొన్న రాజుకు దయ చూపుము.[a]
10 దేవా, నేను మరో స్థలంలో వెయ్యి రోజులు గడుపుటకంటె
నీ ఆలయంలో ఒక్కరోజు ఉండుట మేలు.
దుర్మార్గుల ఇంటిలో నివసించుటకంటె
నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను నిలిచియుండుట మేలు.
11 యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు.
దేవుడు మమ్మల్ని దయ, మహిమతో దీవిస్తున్నాడు.
యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు
ఆయన ఆన్ని మేళ్లూ అనుగ్రహిస్తాడు.
12 సర్వశక్తిమంతుడవైన యెహోవా, నిన్ను నమ్ముకొనే ప్రజలు నిజంగా సంతోషిస్తారు.
యూదా రాజుగా హిజ్కియా
29 హిజ్కియా రాజయ్యేనాటికి ఇరువై యైదు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అబీయా. అబీయా జెకర్యా కుమార్తె. 2 ప్రభువైన యెహోవా ఆశించిన మంచి కార్యాలన్నీ హిజ్కియా చేశాడు. తన పూర్వీకుడైన దావీదులా అతడు ప్రతి మంచి పనినీ చేశాడు.
3 హిజ్కియా ఆలయానికి తలుపులు పెట్టించి, ద్వారాలను పటిష్ఠంచేశాడు. హిజ్కియా ఆలయాన్ని మరల తెరిచాడు. అతడు రాజైన మొదటి సంవత్సరం మొదటి నెలలో ఈ పని చేశాడు. 4-5 యాజకులను, లేవీయులను హిజ్కియా సమావేశపర్చాడు. ఆలయానికి తూర్పు భాగానగల ఖాళీ ప్రదేశంలో అతడు వారిని కలిశాడు. వారితో హిజ్కియా యిలా అన్నాడు: “లేవీయులారా, ఇది వినండి! మీరంతా పవిత్ర సేవా కార్యక్రమానికి సిద్ధంకండి. యెహోవా యొక్క ఆలయాన్ని పవిత్రం చేసే కార్యక్రమానికి అంతా సిద్ధం చేయండి. యెహోవా మీ పితరులు అనుసరించిన దేవుడు. ఆలయానికి చెందని వస్తువులన్నీ అక్కడ నుంచి తీసిపారవేయండి. ఆ వస్తువులు ఆలయాన్ని పవిత్రం చేయజాలవు. 6 మన పూర్వీకులు యెహోవాను వదిలి పెట్టారు. యెహోవా యొక్క ఆలయాన్ని చూడకుండా వారి ముఖాలు తిప్పుకున్నారు. 7 వారు మండప ద్వారాలు మూసివేసి, ఆలయ దీపాలను ఆర్పివేశారు. వారు ఇశ్రాయేలు దేవుని ఆలయపు పవిత్ర స్థానంలో ధూపం వేయటం, దహనబలులు అర్పించటం మానివేశారు. 8 కావున యెహోవా యూదా, యెరూషలేము ప్రజలపట్ల మిక్కిలి కోపంగా వున్నాడు. యెహోవా వారిని శిక్షించాడు. అన్యదేశాలవారు యెహోవా పేరు విని భయపడ్డారు. యూదా, యెరూషలేము ప్రజలను యెహోవా శిక్షించిన తీరు చూసి వారు మిక్కిలి విస్మయం చెందారు. అన్యులు యూదా ప్రజలను చూసి అస్యహించుకుని, సిగ్గుతో తలలు ఆడించారు. ఇవన్నీ నిజమైన విషయాలని మీకు తెలుసు. స్వయంగా మీ కళ్లతో మీరే చూడవచ్చు. 9 అందువల్లనే మీ పూర్వీకులు యుద్ధంలో చంపబడ్డారు. మన కుమారులు, కుమార్తెలు, భార్యలు బందీలుగా చేయబడ్డారు. 10 కావున హిజ్కియానైన నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో ఒక ఒడంబడిక చేసుకోదలిచాను. అప్పుడాయన మనపట్ల ఎంతమాత్రం కోపగించడు. 11 కావున మీరు సోమరితనం మానండి. ఏమాత్రం కాలయాపన చేయవద్దు. యెహోవాకు సేవ చేయటానికి యెహోవాయే మిమ్ముల్ని ఎన్నుకున్నాడు. మీరాయనను సేవించి, ఆయనకు దూపం వేయాలి.”
16 యాజకులు ఆలయాన్ని పవిత్ర పర్చటానికి అతి పవిత్రస్థలంలోనికి వెళ్లారు. ఆలయంలో వారు చూసిన అపవిత్రమైన వస్తువులన్నిటినీ తీసివేశారు. నిషేధించబడిన వస్తువులన్నిటినీ ఆలయపు ఆవరణలోనికి తీసుకొని వచ్చారు. అక్కడ నుంచి ఆ నిషిద్ధ వస్తువులన్నిటినీ లేవీయులు కిద్రోను లోయకు తీసికొని వెళ్లి పారవేశారు. 17 మొదటి నెల మొదటి రోజున లేవీయులు పరిశుద్ధ కార్యక్రమానికి సంసిద్ధులయ్యారు. నెలలో ఎనిమిదవ రోజున లేవీయులు ఆలయ ఆవరణలోకి వచ్చారు. అప్పటి నుంచి మరో ఎనిమిది రోజులపాటు పవిత్రారాధనకు పనికి వచ్చేలా ఆలయాన్ని శద్ధిచేశారు. మొదటి నెలలో పదహారవ రోజున పని ముగించారు.
18 పిమ్మట వారు రాజైన హిజ్కియా వద్దకు వెళ్లారు. వారు ఆయనతో, “హిజ్కియా రాజా, మేము పూర్తి ఆలయాన్ని, దహనబలుల బలిపీఠాలను ఆలయంలో ఇతర పరికరాలను శుభ్రపర్చాము. నైవేద్యపు రొట్టెను వుంచే బల్లను, ఆ బల్ల మీద ఉపయోగించే పరికరాలను శుద్ధి చేశాము. 19 రాజైన అహాజు విశ్వాసంలేనివాడై, తాను రాజుగా వున్నప్పుడు కొన్ని వస్తువులను పారవేశాడు. కాని మేము ఆ వస్తువులన్నిటినీ సేకరించి తిరిగి అక్కడ వుంచి పవిత్ర సేవకార్యక్రమానికి సిద్ధం చేసాము. అవన్నీ ఇప్పుడు యెహోవా బలిపీఠం ముందు వున్నాయి” అని చెప్పారు.
యేసు క్రీస్తు మన పాపాలకు బలి
23 అందువల్ల పరలోకంలో ఉన్న వస్తువుల ప్రతిరూపాలను బలి యిచ్చి పరిశుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడింది. కాని, పరలోకంలో ఉన్న వాటిని పవిత్రం చెయ్యటానికి యింకా మంచిరకమైన బలులు కావాలి. 24 భూమ్నీదవున్న ఈ పవిత్ర స్థానం నిజమైన దానికి ప్రతిరూపం మాత్రమే. క్రీస్తు మానవుడు నిర్మించిన ఈ పవిత్ర స్థానాన్ని కాదు ప్రవేశించింది. ఆయన మనకోసం పరలోకంలో ఉన్న దేవుని యొద్దకు వెళ్ళాడు.
25 ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం పశువుల రక్తంతో అతి పవిత్ర స్థానాన్ని ప్రవేశించినట్లు, ఆయన తనను తాను పదే పదే బలిగా సమర్పించుకోవటానికి పరలోకానికి వెళ్ళలేదు. 26 అలా అర్పించి ఉంటే ప్రపంచం సృష్టింప బడినప్పటి నుండి క్రీస్తు ఎన్నోసార్లు మరణించ వలసి వచ్చేది. కాని, ప్రస్తుతం యుగాల అంతంలో తనను తాను ఒకే ఒకసారి బలిగా అర్పించుకుని పాపపరిహారం చెయ్యాలని ప్రత్యక్ష్యమయ్యాడు.
27 ప్రతి ఒక్కడూ, ఒక్కసారే మరణించాలి. తర్వాత దేవుని తీర్పుకు గురి అవ్వాలి. వాళ్ళపై తీర్పు చెబుతాడు. 28 అందువల్ల, అనేకుల పాపపరిహారం కోసం క్రీస్తు ఒకసారి మాత్రమే తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన రెండవసారి ప్రత్యక్ష్యమౌతాడు. పాపం మోయటానికి కాదు తనకోసం కాచుకొని ఉన్నవాళ్లకు రక్షణ కలిగించటానికి ప్రత్యక్ష్యమౌతాడు.
© 1997 Bible League International