Revised Common Lectionary (Complementary)
పది ఆజ్ఞలు
20 అప్పుడు మోషేతో దేవుడు ఈ మాటలు చెప్పాడు:
2 “నేను మీ దేవుణ్ణి, యెహోవాను. ఈజిప్టు దేశం నుండి నేనే మిమ్మల్ని బయటికి రప్పించాను. బానిసత్వం నుండి నేనే మిమ్మల్ని విడుదల చేసాను. (కనుక ఈ ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి)
3 “నేను గాక వేరే దేవుళ్లు ఎవ్వరినీ మీరు ఆరాధించకూడదు.
4 “విగ్రహాలు ఏవీ మీరు చేయకూడదు పైన ఆకాశానికి సంబంధించింది గాని, క్రింద భూమికి సంబంధించిందిగాని, భూమి క్రింద నీళ్లకు సంబంధించిందిగాని, దేని విగ్రహాన్ని లేక పటాన్ని చేయవద్దు. 5 ఎలాంటి విగ్రహాల్నీ పూజించవద్దు, సేవించవద్దు. ఎందుకంటే, యెహోవాను నేనే మీ దేవుణ్ణి. నేను నా ప్రజలు వేరే దేవుళ్లను పూజించటాన్ని ద్వేషిస్తాను.[a] ఒక వ్యక్తి నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ వ్యక్తి నన్ను ద్వేషిస్తున్నాడు. ఆ వ్యక్తి సంతానాన్ని మూడు, నాలుగు తరాల వరకు నేను శిక్షిస్తాను. 6 అయితే నా ఆజ్ఞలను ప్రేమించి, విధేయులయ్యే ప్రజలకు వేల తరాలవరకు నేను ఎంతో దయ చూపిస్తాను.
7 “మీ దేవుడైన యెహోవా పేరును మీరు తప్పుగా ప్రయోగించకూడదు. ఒక వ్యక్తి గనుక యెహోవా పేరును తప్పుగా ప్రయోగిస్తే, ఆ వ్యక్తి దోషి. యెహోవా అతణ్ణి నిర్దోషిగా చేయడు.
8 “సబ్బాతును ఒక ప్రత్యేక రోజుగా ఉంచుకోవడం మరచిపోవద్దు. 9 వారానికి ఆరు రోజులు మీరు మీ పని చేసుకోవచ్చు. 10 అయితే, యెహోవా గౌరవార్థం ఏడవరోజు విశ్రాంతి రోజు కనుక ఆ రోజు ఏ వ్యక్తీ పని చేయకూడదు. అంటే మీరు, మీ కొడుకులు, కూతుళ్లు, మీ ఆడ, మగ బానిసలు, చివరికి మీ జంతువులు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు కూడాను. 11 ఎందుకంటే, యెహోవా ఆరు రోజులు పనిచేసి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని వాటిలో ఉండే సమస్తాన్ని చేసాడు. ఏడో రోజున దేవుడు విశ్రాంతి తీసుకొన్నాడు. ఈ విధంగా ఏడవరోజును యెహోవా ఆశీర్వదించాడు. దాన్ని చాలా ప్రత్యేకమైన రోజుగా యెహోవా చేసాడు.
12 “నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చే దేశంలో నీకు పూర్తి ఆయుష్షు ఉండేటట్టుగా నీవు ఇలా చేయాలి.
13 “నీవు ఎవ్వరినీ హత్య చేయకూడదు.
14 “వ్యభిచార పాపం నీవు చేయకూడదు.
15 “నీవు దొంగతనం చేయకూడదు.
16 “నీ పొరుగువాళ్ల విషయంలో నీవు అబద్ధాలు చెప్పకూడదు.
17 “ఇతరుల వస్తువుల్ని నీవు తీసుకోవాలని ఆశ పడకూడదు. నీ పొరుగు వాడి ఇంటిని, లేక వాని భార్యను, లేక వాని ఆడ, మగ సేవకులను, లేక వాని ఆవులను, లేక అతని గాడిదలను తీసుకోవాలని నీవు ఆశపడకూడదు. నీ పొరుగువానికి చెందినది ఏదీ తీసుకోవాలని నీవు ఆశపడకూడదు.”
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
2 ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
3 నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
4 అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.
అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
5 తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
6 సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.
7 యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
8 యెహోవా చట్టాలు సరియైనవి.
అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.
9 యెహోవాను ఆరాధించుట మంచిది.
అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.
నిజమైన జ్ఞానము
18 ఎందుకంటే, క్రీస్తు సిలువను గురించిన సందేశము నశించిపోయే వాళ్ళకు నిష్ప్రయోజనంగా కనిపిస్తుంది. కాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి. 19 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“విజ్ఞానుల్లో ఉన్న విజ్ఞానాన్ని నేను నాశనం చేస్తాను.
పండితుల్లో ఉన్న తెలివిని నిష్ప్రయోజనం చేస్తాను.”(A)
20 మరి విజ్ఞానులు ఏమయ్యారు? పండితులు ఏమయ్యారు? సమకాలిక తర్క శాస్త్రజ్ఞులు ఏమయ్యారు? అంటే, దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం నిష్ప్రయోజనమని రుజువు చేసినట్లే కదా! 21 తనను జ్ఞానంతో కనుక్కోవటం సాధ్యం కారాదని దేవుడే నిర్ణయించాడు. దానికి మారుగా ప్రజలు “మూర్ఖత్వం” అని భావిస్తున్న “మా సందేశాన్ని” విశ్వసించినవాళ్ళు రక్షింపబడాలని ఆయన నిర్ణయించాడు.
22 యూదులు మహిమలు అడుగుతారు. గ్రీకులు జ్ఞానాన్ని అన్వేషిస్తారు. 23 మేమైతే, సిలువపైనున్న క్రీస్తును ప్రకటిస్తాము. మా సందేశం యూదులకు ఒక ఆటంకంగాను, యూదులుకాని వాళ్ళకు అర్థం లేనిదానిగాను కనిపిస్తుంది. 24 కాని దేవుడు పిలిచిన యూదులకు, యూదులుకానివాళ్ళకు “క్రీస్తు” దేవుని శక్తితో, ఆయన జ్ఞానంతో సమానము. 25 దేవుని అవివేకం, నిజానికి మానవుని జ్ఞానం కన్నా శ్రేష్ఠమైనది. దేవుని బలహీనత మానవుల బలంకన్నా శక్తివంతమైనది.
యెసు మందిరాన్ని పరిశుభ్రం చేయటం
(మత్తయి 21:12-13; మార్కు 11:15-17; లూకా 19:45-46)
13 యూదుల పస్కా పండుగ దగ్గర పడగానే యేసు యెరూషలేము వెళ్ళాడు. 14 ప్రజలు మందిర ఆవరణంలో ఎద్దుల్ని, గొఱ్ఱెల్ని, పావురాల్ని, అమ్మటం చూసాడు. కొందరు బల్లల ముందు కూర్చొని డబ్బు మార్చటం చూసాడు. 15 త్రాళ్ళతో ఒక కొరడా చేసి అందర్ని ఆ మందిరావరణం నుండి తరిమి వేసాడు. ఎద్దుల్ని, గొఱ్ఱెల్ని తరిమేసి, డబ్బులు మారుస్తున్న వాళ్ళ డబ్బును క్రింద చల్లి వాళ్ళ బల్లల్ని తల క్రిందులుగా చేసివేసాడు. 16 పావురాలు అమ్ముతున్న వాళ్ళతో, “అవన్నీ అక్కడనుండి తీసివేయండి! నా తండ్రి ఆలయాన్ని సంత దుకాణంగా మార్చటానికి మీకెన్ని గుండెలు?” అని అన్నాడు.
17 ఆయన శిష్యులు లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయ జ్ఞాపకం చేసుకొన్నారు:
“నీ యింటిపై నాకున్న ఆశ నన్ను దహించి వేస్తుంది.”(A)
18 యూదులు యేసుతో, “ఒక అద్భుతాన్ని చేసి చూపించు. దానితో నీకు యివి చేయటానికి అధికారమున్నదని నమ్ముతాము” అని అన్నారు.
19 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ మందిరాన్ని పడగొట్టండి. నేను దాన్ని మూడు రోజుల్లో మళ్ళీ కడతాను.”
20 యూదులు, “ఈ మందిరం కట్టటానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. నీవు దాన్ని మూడు రోజుల్లో నిర్మిస్తావా?” అని అన్నారు.
21 కాని యేసు మాట్లాడింది ఆలయమనే తన దేహాన్ని గురించి. 22 ఆయన బ్రతికింపబడ్డాక, ఆయన శిష్యులకు ఆయన చెప్పింది జ్ఞాపకం వచ్చింది. అప్పుడు వాళ్ళు గ్రంథాల్లో వ్రాయబడిన వాటిని, యేసు చెప్పిన వాటిని విశ్వసించారు.
© 1997 Bible League International