Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
2 ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
3 నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
4 అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.
అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
5 తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
6 సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.
7 యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
8 యెహోవా చట్టాలు సరియైనవి.
అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.
9 యెహోవాను ఆరాధించుట మంచిది.
అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.
16 మూడవ రోజు ఉదయాన పర్వతం మీద ఉరుములు, మెరుపులు వచ్చాయి. దట్టమైన ఒక మేఘం ఆ పర్వతం మీదికి వచ్చింది. ఒక బూర శబ్దం చాల పెద్దగా వినబడింది. ఆ బసలో ఉన్న ప్రజలంతా భయపడిపోయారు. 17 అప్పుడు పర్వతం దగ్గర దేవుణ్ణి కలుసుకొనేందుకు ప్రజలను వారి బసలోనుంచి మోషే బయటకు నడిపించాడు. 18 సీనాయి పర్వతం పొగతో నిండిపోయింది. కొలిమిలోనుంచి లేచినట్టు పొగ ఆ పర్వతం మీద నుండి పైకి లేచింది. యెహోవా అగ్నిలా ఆ పర్వతం మీదికి వచ్చినందువల్ల యిలా జరిగింది. పైగా పర్వతం అంతా వణకడం మొదలయ్యింది. 19 బూర శబ్దం మరింత గట్టిగా మోగింది. దేవునితో మోషే మాట్లాడినప్పుడల్లా ఉరుములాంటి స్వరంతో యెహోవా జవాబిచ్చాడు.
20 సీనాయి కొండ మీదికి యెహోవా దిగి వచ్చాడు. పరలోకంనుంచి ఆ కొండ శిఖరం మీదికి యెహోవా దిగి వచ్చాడు. అప్పుడు మోషేను తనతో కూడ పర్వత శిఖరం మీదికి రమ్మని యెహోవా పిలిచాడు. కనుక మోషే పర్వతం మీదికి వెళ్లాడు.
21 అప్పుడు యెహోవా మోషేతో, “నీవు కిందికి వెళ్లి, ప్రజలు నాకు సమీపంగా రాకూడదని, నావైపు చూడకూడదని వారితో చెప్పు. వారు కనుక అలా చేస్తే, వారిలో చాల మంది చస్తారు. 22 నాకు సమీపంగా వచ్చే యాజకులు ఈ ప్రత్యేక సమావేశం కోసం వారిని సిద్ధం చేసుకోవాలని వారితో చెప్పు. వారు ఇలా చేయకపోతే, నేను వాళ్లను శిక్షిస్తాను” అని చెప్పాడు.
23 కానీ మోషే యెహోవాతో “ప్రజలు పర్వతం మీదికి రాలేరు. ఒక గీత గీయమని, ప్రజల్ని ఆ గీత దాటి పవిత్ర స్థలం దగ్గరకు రానివ్వవద్దని నీవే మాకు చెప్పావు” అని అన్నాడు.
24 యెహోవా మోషేతో, “కింద ప్రజల దగ్గరకు వెళ్లి, అహరోనును తీసుకొనిరా. అతణ్ణి నీతోపాటు తీసుకొనిరా, కాని యాజకుల్ని, ప్రజల్ని, రానివ్వవద్దు. వాళ్లు నాకు సమీపంగా వస్తే, నేను వాళ్లను శిక్షిస్తాను” అన్నాడు.
25 మోషే ప్రజల దగ్గరకు కిందికి వెళ్లి, ఈ సంగతులు వారితో చెప్పాడు.
యేసుని రూపాంతరం
(మత్తయి 17:1-13; లూకా 9:28-36)
2 ఆరురోజుల తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును ఒక ఎత్తైన కొండ మీదికి తనవెంట పిలుచుకు వెళ్ళాడు. వాళ్ళు అక్కడ ఏకాంతంగా ఉన్నారు. అక్కడ యేసు వాళ్ళ సమక్షంలో దివ్యరూపం పొందాడు. 3 ఆయన దుస్తులు మెరువ సాగాయి. ప్రపంచంలో ఏ చాకలి చలువ చేయలేనంత తెల్లగా మారిపొయ్యాయి. 4 ఏలీయా, మోషేలు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు యేసుతో మాట్లాడటం శిష్యులు చూసారు.
5 పేతురు యేసుతో, “రబ్బీ! మనిమిక్కడే ఉండటం మంచిది. మేము మూడు పర్ణశాలలు వేస్తాము. మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి” అన్నాడు. 6 శిష్యులు భయపడుతూ ఉండటం వల్ల పేతురుకు ఏమనాలో తోచలేదు.
7 అప్పుడు ఒక మేఘం కనిపించి వాళ్ళను కప్పి వేసింది. ఆ మేఘం నుండి, “ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయన మాట వినండి” అని అనటం వినిపించింది.
8 వెంటనే వాళ్ళు తమ చుట్టూ చూశారు. మిగతా యిద్దరూ వాళ్ళకు కనిపించలేదు. యేసు మాత్రమే కనిపించాడు.
© 1997 Bible League International