Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 105:1-11

105 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుము. ఆయన నామాన్ని ఆరాధించుము.
    ఆయన చేసే అద్భుత కార్యాలను గూర్చి జనాలతో చెప్పు.
యెహోవాను గూర్చి పాడుము. ఆయనకు స్తుతులు పాడుము.
    ఆయన చేసే అద్భుతకార్యాలు అన్నింటిని గూర్చి చెప్పు.
యెహోవా పవిత్ర నామాన్ని గూర్చి అతిశయించు.
    యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరంతా సంతోషించండి.
బలంకోసం యెహోవా దగ్గరకు వెళ్లండి.
    సహాయంకోసం ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వెళ్లండి.
యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
    ఆయన అద్భుతాలను, జ్ఞానంగల నిర్ణయాలను జ్ఞాపకం చేసుకోండి.
దేవుని సేవకుడైన అబ్రాహాము సంతతివారు మీరు.
    దేవుడు ఏర్పరచుకొన్న యాకోబు సంతతివారు మీరు.
యెహోవా మన దేవుడు.
    యెహోవా సర్వలోకాన్ని పాలిస్తాడు.[a]
దేవుని ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం చేసికోండి.
    వెయ్యి తరాలవరకు ఆయన ఆదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి.
దేవుడు అబ్రాహాముతో ఒక ఒడంబడిక చేసాడు.
    ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు.
10 యాకోబుకు (ఇశ్రాయేలు) దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు.
    ఇశ్రాయేలుతో దేవుడు తన శాశ్వత ఒడంబడిక చేసాడు.
11 “నేను నీకు కనాను దేశాన్ని ఇస్తాను, ఆ దేశం నీకు చెందుతుంది.”
    అని దేవుడు చెప్పాడు.

కీర్తనలు. 105:37-45

37 అప్పుడు దేవుడు ఈజిప్టు నుండి తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చాడు.
    వారు వెండి బంగారాలు వారి వెంట తెచ్చారు.
    దేవుని ప్రజలు ఎవ్వరూ తొట్రిల్లి పడిపోలేదు.
38 దేవుని ప్రజలు వెళ్లిపోవటం చూచి ఈజిప్టు సంతోషించింది.
    ఎందుకంటే దేవుని ప్రజలను గూర్చి వారు భయపడ్డారు.
39 దేవుడు తన మేఘాన్ని ఒక దుప్పటిలా పరిచాడు.
    రాత్రివేళ తన ప్రజలకు వెలుగు ఇచ్చుటకు దేవుడు తన అగ్నిస్తంభాన్ని ఉపయోగించాడు.
40 ప్రజలు మాంసం కోసం ఆడిగినప్పుడు దేవుడు వారికి పూరేళ్లను రప్పించాడు.
    దేవుడు వారికి ఆకాశం నుండి సమృద్ధిగా ఆహారాన్ని యిచ్చాడు.
41 దేవుడు బండను చీల్చగా నీళ్లు ఉబుకుతూ వచ్చాయి.
    ఎడారిలో ఒక నది ప్రవహించడం మొదలైంది.

42 దేవుడు తన పవిత్ర వాగ్దానం జ్ఞాపకం చేసికొన్నాడు.
    దేవుడు తన సేవకుడు ఆబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసికొన్నాడు.
43 దేవుడు తన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించాడు.
    ప్రజలు వారి సంతోష గీతాలు పాడుతూ ఆనందంగా బయటకు వచ్చారు.
44 అప్పుడు యితరులు నివసిస్తున్న దేశాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు.
    ఇతరుల కష్టార్జితాన్ని దేవుని ప్రజలు పొందారు.
45 దేవుడు తన ప్రజలు తన న్యాయ చట్టాలకు విధేయులవుతారని ఇలా చేసాడు.
    వారు ఆయన ఉపదేశములకు జాగ్రత్తగా విధేయులు కావాలని దేవుడు ఇలా చేసాడు.

యెహోవాను స్తుతించండి.

ఆదికాండము 22:1-19

అబ్రాహామా, నీ కొడుకును బలి ఇవ్వు

22 ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలని దేవుడు అనుకొన్నాడు. “అబ్రాహామా” అని దేవుడు అతణ్ణి పిలిచాడు.

దానికి అబ్రాహాము “చిత్తం” అన్నాడు.

అప్పుడు దేవుడు చెప్పాడు, “నీ కుమారుని మోరీయా దేశం తీసుకొని వెళ్లు. మోరీయాలో నీ కుమారుణ్ణి నాకు బలిగా చంపు. నీ ఒకే కుమారుడు, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుడైన ఇస్సాకును ఇలా చేయాలి. అక్కడ కొండల్లో ఒక దానిమీద అతణ్ణి దహనబలిగా ఉపయోగించు. ఏ కొండ అనేది నేను నీతో చెబుతాను.”

ఉదయాన అబ్రాహాము లేచి, తన గాడిదను సిద్ధం చేశాడు. ఇస్సాకును తన ఇద్దరు సేవకులను అబ్రాహాము తన వెంట తీసుకు వెళ్లాడు. బలి అర్పణ కోసం కట్టెలను అబ్రాహాము నరికాడు. తర్వాత వారు వెళ్లాలని దేవుడు అతనితో చెప్పిన చోటికి వారు వెళ్లారు. వారు మూడు రోజులు ప్రయాణం చేసిన తర్వాత, అబ్రాహాము కన్నులెత్తి దూరంలో వారు వెళ్లవలసిన చోటును చూశాడు. అప్పుడు అబ్రాహాము, “మీరు ఈ గాడిదతో ఇక్కడ ఉండండి. నేను, నా కుమారుడు అక్కడికి వెళ్లి, ఆరాధన చేస్తాం. ఆ తర్వాత మేము మీ దగ్గరకు తిరిగి వస్తాం” అని తన సేవకులతో చెప్పాడు.

అబ్రాహాము బలికోసం కట్టెలు తీసుకొని, తన కుమారుని భుజంమీద పెట్టాడు. ఒక ప్రత్యేక ఖడ్గం, నిప్పు అబ్రాహాము పట్టుకొన్నాడు. అప్పుడు అబ్రాహాము, అతని కుమారుడు యిద్దరు కలిసి ఆరాధనా స్థలానికి వెళ్లారు.

ఇస్సాకు “తండ్రీ!” అని తన తండ్రి అబ్రాహామును పిలిచాడు.

“ఏమిటి కొడుకా?” అని అడిగాడు అబ్రాహాము.

“కట్టెలు, నిప్పు నాకు కనబడుతున్నాయి. కాని మనం బలిగా దహించే గొర్రెపిల్ల ఏది?” అని ఇస్సాకు అడిగాడు. “నా కుమారుడా, బలికోసం గొర్రెపిల్లను సరైన సమయంలో దేవుడు మనకు ఇస్తాడు” అని అబ్రాహాము జవాబిచ్చాడు.

కనుక అబ్రాహాము, అతని కుమారుడు ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్లారు. దేవుడు వారికి వెళ్లమని చెప్పిన చోటికి వారు వెళ్లారు. అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠం కట్టాడు. కట్టెలను ఆ బలిపీఠం మీద పెట్టాడు. తర్వాత తన కుమారుడు ఇస్సాకును అబ్రాహాము కట్టివేశాడు. బలిపీఠం మీద కట్టెలపై ఇస్సాకును పరుండబెట్టాడు. 10 అప్పుడు అబ్రాహాము తన ఖడ్గం తీసుకొని, తన కుమారుని చంపడానికి సిద్ధమయ్యాడు.

11 కాని అప్పుడు యెహోవా దూత అబ్రాహామును ఆపు చేశాడు. దేవుని దూత ఆకాశం నుండి “అబ్రాహామా, అబ్రాహామా” అని పిలిచాడు.

“చిత్తం” అని అబ్రాహాము జవాబిచ్చాడు.

12 “నీ కుమారుని చంపవద్దు, అతనికి ఏ హానీ చేయవద్దు. నీకు దేవుని పట్ల భయం, ఆరాధనా భావం ఉన్నాయని నాకిప్పుడు తెలుసు. నా కోసం, నీ కుమారుణ్ణి, అదీ, నీ ఒకే ఒక్క కుమారుణ్ణి చంపడానికి కూడా నీవు సిద్ధమేనని నేను చూశాను” అన్నాడు దేవదూత.

13 అబ్రాహాము అటు ప్రక్క చూడగా ఒక పొట్టేలు కనబడింది. ఆ పొట్టేలు కొమ్ములు ఒక పొదలో చిక్కుకొన్నాయి. కనుక అబ్రాహాము వెళ్లి, పొట్టేలును పట్టుకొని దానిని చంపాడు. ఆ పొట్టేలును దేవునికి బలిగా అబ్రాహాము ఉపయోగించాడు. అబ్రాహాము కుమారుడు రక్షించబడ్డాడు. 14 అందుచేత ఆ స్థలానికి “యెహోవా ఈరె[a] అని అబ్రాహాము పేరు పెట్టాడు. “పర్వతం మీద యెహోవా చూసుకుంటాడు” అని ఇప్పటికి ప్రజలు చెబుతారు.

15 ఆకాశంనుండి యెహోవా దూత అబ్రాహామును రెండవసారి పిల్చాడు. 16 యెహోవా దూత చెప్పాడు: “నా కోసం నీ కుమారుణ్ణి చంపడానికి నీవు సిద్ధపడ్డావు. అతడు నీకు ఒక్కడే కుమారుడు. నా కోసం నీవు ఇలా చేశావు గనుక నేను నీకు ఈ వాగ్దానం చేస్తున్నాను. యెహోవానైన నేను వాగ్దానం చేసేది ఏమిటంటే, 17 నిజంగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఆకాశంలో అసంఖ్యాక నక్షత్రాలలాగా సముద్ర తీరంలో ఇసుకలాగా నీ సంతానమును చేస్తాను. నీ ప్రజలు వారి శత్రువులనందరినీ ఓడిస్తారు. 18 నీ సంతానం ద్వారా భూమిమీద ప్రతిజనం ఆశీర్వదించబడతారు. నీవు నాకు విధేయుడవయ్యావు కనుక నేను దీన్ని చేస్తాను.”

19 అప్పుడు అబ్రాహాము మళ్లీ తన సేవకుల దగ్గరకు వెళ్లిపోయాడు. వాళ్లంతా బెయేర్షెబాకు ప్రయాణమై వెళ్లిపోయారు. అబ్రాహాము అక్కడ నివసించాడు.

హెబ్రీయులకు 11:1-3

విశ్వాసము

11 ఆశించినవి తప్పక లభిస్తాయని నమ్మటం, మనకు కనిపించనివాటిని ఉన్నాయని నమ్మటం. ఇదే విశ్వాసం. మన పూర్వికుల్లో యిలాంటి విశ్వాసముంది కనుకనే దేవుడు వాళ్ళను మెచ్చుకొన్నాడు.

దేవుడు ఆజ్ఞాపించటం వల్ల ఈ ప్రపంచం సృష్టింపబడిందని మనము విశ్వసిస్తున్నాము. అంటే, కనిపించనివాటితో కనిపించేది సృష్టింపబడిందన్న మాట.

హెబ్రీయులకు 11:13-19

13 వీళ్ళందరు దేవుణ్ణి విశ్వసిస్తూ జీవించి, మరణించారు. దేవుడు వాగ్దానం చేసినవి వాళ్ళకు లభించలేదు. వాళ్ళు అవి రావటం దూరం నుండి చూసి ఆహ్వానించారు. ఈ భూమ్మీద తాము పరదేశీయుల్లా జీవిస్తున్నట్లు వాళ్ళు అంగీకరించారు. 14 వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే వాళ్ళు తమ స్వదేశానికోసం వెతుకుతూండేవాళ్ళని అనిపిస్తుంది. 15 ఒక వేళ వాళ్ళు తాము వదిలివచ్చిన దేశాన్ని గురించి ఆలోచిస్తున్నట్లయితే తమ దేశానికి తిరిగి వెళ్ళే అవకాశం వాళ్ళకు ఉండింది. 16 కాని వాళ్ళు యింకా గొప్ప దేశానికి, అంటే పరలోకానికి వెళ్ళాలని ఆశించారు. అందువల్ల దేవుడు యితర్లు తనను “వాళ్ళ దేవుడు” అని పిలిచినందుకు సిగ్గుపడలేదు. పైగా తన వాళ్ళ కోసం ఒక పట్టణం నిర్మించాడు.

17-18 దేవుడు అబ్రాహామును పరీక్షించినప్పుడు అతనిలో విశ్వాసముండటంవల్ల ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధం అయ్యాడు. దేవుడు ఇస్సాకు ద్వారా నీ వంశం అభివృద్ధి చెందుతుంది(A) అని యింతకు పూర్వం వాగ్దానం చేశాడు. అయినా అబ్రాహాము తన ఏకైక పుత్రుణ్ణి బలిగా అర్పించబోయాడు. 19 దేవుడు చనిపోయినవాళ్ళను బ్రతికించగలడని అబ్రాహాముకు తెలుసు. ఒక విధంగా చూస్తే దేవుడు ఇస్సాకును బ్రతికించి అబ్రాహాముకు ఇచ్చాడనే చెప్పుకోవచ్చు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International