Revised Common Lectionary (Complementary)
సున్నతి ఒడంబడికకు గురుతు
17 అబ్రాముకు 99 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడి యిలా చెప్పాడు: “నేను సర్వశక్తిమంతుడైన దేవుడిని. నా కోసం ఈ పనులు చేయి. నాకు విధేయుడవై, సరైన జీవితం జీవించు. 2 ఇలా గనుక నీవు చేస్తే, మన ఇద్దరి మధ్య ఒక ఒడంబడికను నేను తయారు చేస్తాను. నిన్ను బాగా అభివృద్ధి చేస్తాను.”
3 అప్పుడు దేవునియెదుట అబ్రాము సాష్టాంగ పడ్డాడు. అతనితో దేవుడు అన్నాడు. 4 “మన ఒడంబడికలో నా భాగం ఇది. అనేక జనములకు నిన్ను తండ్రిగా నేను చేస్తాను. 5 నీ పేరు నేను మార్చేస్తాను. నీ పేరు అబ్రాము కాదు, నీ పేరు అబ్రాహాము. అనేక జనాంగములకు నీవు తండ్రివి అవుతావు గనుక, నీకు నేను ఈ పేరు పెడుతున్నాను. 6 నీకు నేను పెద్ద సంతానాన్ని ఇస్తాను. నీనుండి క్రొత్త జనాంగాలు ఉద్భవిస్తాయి. నీనుండి క్రొత్త రాజులు వస్తారు. 7 నీకు, నాకు మధ్య ఒక ఒడంబడికను నేను ఏర్పాటు చేస్తాను. నీ సంతానానికి ఈ ఒడంబడిక వర్తిస్తుంది. నేను నీకు దేవునిగా ఉంటాను. నీ సంతానానికి దేవునిగా ఉంటాను.
వాగ్దాన పుత్రుడు ఇస్సాకు
15 అబ్రాహాముతో దేవుడు అన్నాడు: “నీ భార్య శారయికి నేను ఒక క్రొత్త పేరు పెడ్తాను. ఆమె క్రొత్త పేరు శారా.[a] 16 ఆమెను నేను ఆశీర్వదిస్తాను. ఆమెకు ఒక కుమారుణ్ణి నేను ఇస్తాను, మరి నీవు తండ్రివి అవుతావు. అనేక క్రొత్త జనాంగములకు ఆమె తల్లి అవుతుంది. జనముల రాజులు ఆమెలోనుండి వస్తారు.”
23 యెహోవాను ఆరాధించే ప్రజలారా! మీరంతా ఆయనను స్తుతించండి.
ఇశ్రాయేలు వంశస్థులారా! యెహోవాను ఘనపర్చండి.
ఇశ్రాయేలు వంశీయులారా! మీరంతా యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించండి.
24 ఎందుకంటే కష్టాలలో ఉన్న పేద ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
ఆ పేద ప్రజల విషయం యెహోవా సిగ్గుపడడు.
యెహోవా వారిని ద్వేషించడు.
ప్రజలు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన వారికి కనబడకుండా ఉండడు. వారి మొరను వింటాడు.
25 యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నిన్నుబట్టే వస్తుంది.
నేను చేస్తానని వాగ్దానం చేసిన వాటన్నింటినీ, ఈ ఆరాధికులందరి ఎదుటనే నేను చేస్తాను.
26 పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు.
యెహోవా కోసం చూస్తూ వచ్చే ప్రజలారా, మీరు ఆయనను స్తుతించండి.
మీ హృదయాలు ఎప్పటికీ సంతోషంగా ఉండునుగాక!
27 దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని
ఆయన వద్దకు తిరిగి వస్తారు.
28 ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే.
ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు.
29 నిజంగా, భూమిలో నిద్రించబోయే వారందరూ ఆయన్ని ఆరాధిస్తారు.
సమాధిలోనికి దిగిపోయేవారందరూ ఆయనకు తల వంచుతారు.
మరియు వారి ప్రాణాలను కాపాడుకొనలేనివారు కూడా తల వంచుతారు.
చచ్చిన ప్రతి మనిషి ఆయనకు తల వంచాలి.
30 భవిష్యత్తులో మన వారసులు యెహోవాను సేవిస్తారు.
యెహోవా విషయమై వారు నిత్యం చెప్పుతారు.
31 ఇంకా పుట్టని మనుష్యులకు దేవుని మంచితనం గూర్చి చెబుతారు.
దేవుడు నిజంగా చేసిన మంచి కార్యాలను గూర్చి ఆ మనుష్యులు చెబుతారు.
విశ్వాసంద్వారా దేవుని వాగ్దానం పొందెను
13 అబ్రాహాము మరియు అతని సంతానం ప్రపంచాన్ని వారసత్వంగా పొందుతారని దేవుడు వాగ్దానం చేసాడు. ఈ వాగ్దానం ధర్మశాస్త్రాన్ని పాటించినందుకు చెయ్యలేదు. అతనిలో విశ్వాస ముండటంవలన దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానం చేసాడు. 14 ఒకవేళ వారసులు కావటానికి ధర్మశాస్త్రం కారణమైతే, విశ్వాసానికి విలువ ఉండదు. పైగా వాగ్దానానికి అర్థం ఉండదు. 15 ధర్మశాస్త్రం ఉంటే దేవుని ఆగ్రహం ఉంటుంది. కాని ధర్మశాస్త్రం లేకపోతే దాన్ని అతిక్రమించే ప్రశ్నేరాదు.
16 ఆ వాగ్దానము విశ్వాసము ఉండటంవల్ల సంభవిస్తోంది. అది ఉచితంగా లభించాలని దేవుని ఉద్దేశ్యం. అది అబ్రాహాము సంతానానికంతా వర్తిస్తుందని దేవుడు అభయమిచ్చాడు. అంటే ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళకే కాకుండా అబ్రాహాములో ఉన్న విశ్వాసాన్ని తమలో వ్యక్తం చేసేవాళ్ళకు కూడా అది వర్తిస్తుందన్న మాట. అబ్రాహాము మనందరికీ తండ్రి. 17 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నేను నిన్ను ఎన్నో జనాంగములకు తండ్రిగా చేస్తాను.”(A) దేవుని దృష్టిలో అబ్రాహాము మనకు తండ్రిలాంటి వాడు. దేవుడు చనిపోయినవాళ్ళకు ప్రాణం పొయ్యగలడు. తన ఆజ్ఞలతో లేనివాటిని సృషించగలడు. అలాంటి దేవుణ్ణి అబ్రాహాము విశ్వసించాడు.
18 నిరాశ సమయంలో అబ్రాహాము ఆశతో నమ్ముకొన్నాడు. అందుకే అతడు ఎన్నో జనములకు తండ్రి అయ్యాడు. “నీ సంతతివాళ్ళు చాలా మంది ఉంటారు” అని దేవుడు చెప్పిన ప్రకారమే జరిగింది. 19 అప్పటికి అబ్రాహాముకు సుమారు నూరు సంవత్సరాల వయస్సు. అతని శరీరం బలహీనంగా ఉండింది. పైగా శారాకు గర్భం దాల్చే వయస్సు దాటిపోయి ఉంది. ఈ సంగతులు అబ్రాహాముకు తెలుసు. అయినా అతని విశ్వాసం సన్నగిల్లలేదు. 20 దేవుడు చేసిన వాగ్దానంలో అతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దానికి మారుగా అతడు దృఢ విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించాడు. 21 దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నిలుపుకోగలడని, ఆ శక్తి ఆయనలో ఉందని అబ్రాహాముకు సంపూర్ణమైన విశ్వాసం ఉండినది. 22 ఈ కారణంగానే, “దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు” 23 “నీతిమంతునిగా పరిగణించాడు” అన్న పదాలు అతనికొరకు మాత్రమే వ్రాయబడలేదు. 24 అవి మనకోసం కూడా వ్రాయబడ్డాయి. మనము మన యేసు ప్రభువును బ్రతికించిన దేవునియందు విశ్వసిస్తున్నాము. కనుక దేవుడు మనల్ని కూడా నీతిమంతులుగా పరిగణిస్తాడు. 25 దేవుడు మన పాపాల కోసం ఆయన్ని మరణానికి అప్పగించాడు. మనం నీతిమంతులం కావాలని ఆయన్ని బ్రతికించాడు.
యేసు తన మరణాన్ని గురించి చెప్పటం
(మత్తయి 16:21-28; లూకా 9:22-27)
31 ఆ తదుపరి యేసు వాళ్ళకు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు: “మనుష్య కుమారుడు కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధానయాజకులు, శాస్త్రులు, ఆయన్ని తృణీకరిస్తారు. ఆయన చంపబడి మూడు రోజుల తర్వాత మళ్ళీ బ్రతికివస్తాడు.” 32 యేసు ఈ విషయాన్ని గురించి స్పష్టంగా మాట్లాడాడు.
పేతురు ఆయన చేయిపట్టుకొని వారించటం మొదలు పెట్టాడు. 33 కాని యేసు వెనక్కు తిరిగి తన శిష్యుల వైపు ఒకసారి చూసి, పేతురుతో “సైతానా! నాముందు నుండి వెళ్ళిపో! నీవు మానవరీతిగా ఆలోచిస్తున్నావు కాని, దేవుని రీతిగా కాదు” అని అన్నాడు.
34 ఆ తర్వాత తన శిష్యుల్ని, ప్రజల్ని దగ్గరకు పిలిచి, “మీరు నన్ను అనుసరింపదలిస్తే, తనను తాను విసర్జించుకొని తన సిలువను మోస్తూ అనుసరించాలి. 35 ఎందుకంటే, తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకొన్నవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. కాని నాకోసం, సువార్త కోసం ప్రాణాన్ని పోగొట్టుకొన్నవాడు దాన్ని కాపాడుకొంటాడు. 36 ప్రపంచాన్నంతా జయించి తన ప్రాణాన్ని వదులుకొన్న మనిషికి ఏంలాభం కలుగుతుంది? 37 తన ప్రాణాన్ని తిరిగి పొందటానికి మనిషి ఏంయివ్వగలడు? 38 ఈ తరం వ్యభిచారంతో, పాపంతో నిండివుంది. నా విషయంలో కాని, నా బోధనల విషయంలో కాని ఎవ్వడు సిగ్గుపడతాడో, మనుష్య కుమారుడు తండ్రి తేజస్సుతో, పవిత్రమైన దేవదూతలతో కలసి వచ్చినప్పుడు వాని విషయంలో సిగ్గుపడతాడు.”
యేసుని రూపాంతరం
(మత్తయి 17:1-13; లూకా 9:28-36)
2 ఆరురోజుల తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును ఒక ఎత్తైన కొండ మీదికి తనవెంట పిలుచుకు వెళ్ళాడు. వాళ్ళు అక్కడ ఏకాంతంగా ఉన్నారు. అక్కడ యేసు వాళ్ళ సమక్షంలో దివ్యరూపం పొందాడు. 3 ఆయన దుస్తులు మెరువ సాగాయి. ప్రపంచంలో ఏ చాకలి చలువ చేయలేనంత తెల్లగా మారిపొయ్యాయి. 4 ఏలీయా, మోషేలు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు యేసుతో మాట్లాడటం శిష్యులు చూసారు.
5 పేతురు యేసుతో, “రబ్బీ! మనిమిక్కడే ఉండటం మంచిది. మేము మూడు పర్ణశాలలు వేస్తాము. మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి” అన్నాడు. 6 శిష్యులు భయపడుతూ ఉండటం వల్ల పేతురుకు ఏమనాలో తోచలేదు.
7 అప్పుడు ఒక మేఘం కనిపించి వాళ్ళను కప్పి వేసింది. ఆ మేఘం నుండి, “ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయన మాట వినండి” అని అనటం వినిపించింది.
8 వెంటనే వాళ్ళు తమ చుట్టూ చూశారు. మిగతా యిద్దరూ వాళ్ళకు కనిపించలేదు. యేసు మాత్రమే కనిపించాడు.
9 వాళ్ళు కొండదిగి క్రిందికి వస్తుండగా యేసు, “మనుష్య కుమారుడు చనిపోయి బ్రతికి వచ్చేవరకు మీరు చూసిన దృశ్యాన్ని ఎవ్వరికి చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు.
© 1997 Bible League International