Revised Common Lectionary (Complementary)
23 యెహోవాను ఆరాధించే ప్రజలారా! మీరంతా ఆయనను స్తుతించండి.
ఇశ్రాయేలు వంశస్థులారా! యెహోవాను ఘనపర్చండి.
ఇశ్రాయేలు వంశీయులారా! మీరంతా యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించండి.
24 ఎందుకంటే కష్టాలలో ఉన్న పేద ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
ఆ పేద ప్రజల విషయం యెహోవా సిగ్గుపడడు.
యెహోవా వారిని ద్వేషించడు.
ప్రజలు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన వారికి కనబడకుండా ఉండడు. వారి మొరను వింటాడు.
25 యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నిన్నుబట్టే వస్తుంది.
నేను చేస్తానని వాగ్దానం చేసిన వాటన్నింటినీ, ఈ ఆరాధికులందరి ఎదుటనే నేను చేస్తాను.
26 పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు.
యెహోవా కోసం చూస్తూ వచ్చే ప్రజలారా, మీరు ఆయనను స్తుతించండి.
మీ హృదయాలు ఎప్పటికీ సంతోషంగా ఉండునుగాక!
27 దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని
ఆయన వద్దకు తిరిగి వస్తారు.
28 ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే.
ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు.
29 నిజంగా, భూమిలో నిద్రించబోయే వారందరూ ఆయన్ని ఆరాధిస్తారు.
సమాధిలోనికి దిగిపోయేవారందరూ ఆయనకు తల వంచుతారు.
మరియు వారి ప్రాణాలను కాపాడుకొనలేనివారు కూడా తల వంచుతారు.
చచ్చిన ప్రతి మనిషి ఆయనకు తల వంచాలి.
30 భవిష్యత్తులో మన వారసులు యెహోవాను సేవిస్తారు.
యెహోవా విషయమై వారు నిత్యం చెప్పుతారు.
31 ఇంకా పుట్టని మనుష్యులకు దేవుని మంచితనం గూర్చి చెబుతారు.
దేవుడు నిజంగా చేసిన మంచి కార్యాలను గూర్చి ఆ మనుష్యులు చెబుతారు.
పనిపిల్ల హాగరు
16 అబ్రాము భార్య శారయి. ఆమెకు, అబ్రాముకు పిల్లలు లేరు. శారయికి ఈజిప్టుకు చెందిన పని పిల్ల ఉంది. ఆమె పేరు హాగరు. 2 శారయి అబ్రాముతో యిలా చెప్పింది: “చూడండి, నాకు పిల్లలు పుట్టకుండా చేశాడు యెహోవా. కనుక మీరు నా పనిమనిషితో పొండి. ఆమె ద్వారా పుట్టే శిశువును నా స్వంత శిశువుగా నేను స్వీకరిస్తాను.” తన భార్య శారయి మాట అబ్రాము విన్నాడు.
3 కనాను దేశంలో అబ్రాము పది సంవత్సరాలు జీవించిన తర్వాత ఇది జరిగింది. హాగరును తన భర్త అబ్రాముకు శారయి యిచ్చింది. (హాగరు ఈజిప్టు నుండి వచ్చిన దాసి).
4 అబ్రాము వల్ల హాగరు గర్భవతి అయింది. హాగరు ఇది గమనించినప్పుడు. ఆమె చాలా గర్వపడి, తన యజమానురాలైన శారయికంటే తాను గొప్పదాన్ని అని తలంచడం మొదలు పెట్టింది. 5 అయితే శారయి అబ్రాముతో, “నా పనిమనిషి ఇప్పుడు నన్నే అసహ్యించుకొంటుంది. దీనికి నేను నిన్నే నిందిస్తాను. ఆమెను నేను నీకు ఇచ్చాను. ఆమె గర్భవతి అయింది. అయితే ఆమె నాకంటే గొప్పదని భావిస్తుంది. మనలో ఎవరు సరియైనవాళ్లో యెహోవాయే నిర్ణయించాలని నేను కోరుతున్నాను” అని అనింది.
6 కాని అబ్రాము శారయితో, “హాగరుకు నీవు యజమానురాలివి, నీ యిష్టం వచ్చినట్లు నీవు ఆమెకు చేయవచ్చు” అన్నాడు. అందుచేత శారయి తన పనిమనిషిని చాలా చులకనగా చూసింది. ఆ పనిమనిషి పారిపోయింది.
అబ్రాహాము యొక్క విశ్వాసం
4 అబ్రాహాము మన మూలపురుషుడు. అతడు ఈ విషయంలో ఏమి నేర్చుకొన్నాడు! 2 అబ్రాహాము చేసిన కార్యాలవలన అతడు నీతిమంతునిగా పరిగణింపబడి ఉంటే అతడు గర్వించటానికి కారణం ఉండేది. కాని దేవుని యెదుట కాదు 3 ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “అబ్రాహాము దేవుణ్ణి విశ్వసించాడు కనుక దేవుడు అతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు.”(A)
4 పనిచేసేవానికి కూలి దొరుకుతుంది. అది అతని హక్కు. ఆ వచ్చిన జీతం బహుమానం కాదు. 5 దుర్మార్గుల్ని నీతిమంతులుగా చెయ్యగల దేవుడు, వాళ్ళు కార్యాలు చెయ్యకపోయినా వాళ్ళు తనను విశ్వసిస్తే, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళను నీతిమంతులుగా పరిగణిస్తాడు. 6 క్రియలు చేయకున్నా దేవునిచే నీతిమంతునిగా పరిగణింపబడిన మానవుడు ధన్యుడు. ఈ విషయాన్ని గురించి దావీదు ఈ విధంగా అన్నాడు:
7 “దేవుడు ఎవరి తప్పుల్ని,
పాపాల్ని క్షమిస్తాడో వాళ్ళు ధన్యులు.
8 ఎవరి పాపాల్ని ప్రభువు వాళ్ళ లెక్కలో
వెయ్యడో వాళ్ళు ధన్యులు.”(B)
9 మరి, సున్నతి చేయించుకొన్నవాళ్ళు మాత్రమే ధన్యులా లేక సున్నతి చేయించుకోనివాళ్ళు కూడా ధన్యులా? అబ్రాహాములో విశ్వాసం ఉండటం వల్ల దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడని మనమంటూ వచ్చాము. 10 దేవుడు అతణ్ణి నీతిమంతునిగా ఎప్పుడు అన్నాడు? సున్నతి చేయించుకొన్న పిదపనా లేక ముందా? సున్నతి చేయించుకున్న పిదప కాదు, ముందే. 11 అబ్రాహాము సున్నతి చేయించుకోకముందు అతనిలో విశ్వాసముండటం వల్ల దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు. దీనికి చిహ్నంగా అబ్రాహాము సున్నతిని ఒక ముద్రగా పొందాడు. తద్వారా సున్నతి పొందకున్నా, విశ్వాసం ఉన్నవాళ్ళకు అతడు తండ్రి అయ్యాడు. వీళ్ళను నీతిమంతులుగా పరిగణించాలని దేవుని ఉద్దేశం. 12 అబ్రాహాము సున్నతి చేయించుకొన్నవాళ్ళకు కూడా తండ్రి. అంటే అందరికి కాదు. మన తండ్రి అబ్రాహాము సున్నతి చేయించుకోకముందు నుండి అతనిలో ఉన్న విశ్వాసాన్ని తమలో చూపిన వాళ్ళకు మాత్రమే అతడు తండ్రి.
© 1997 Bible League International