Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
25 యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.
2 నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను.
నేను నిరాశచెందను.
నాశత్రువులు నన్ను చూచి నవ్వరు.
3 నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు.
కాని నమ్మక ద్రోహులు నిరాశపడతారు.
వారికి ఏమీ దొరకదు.
4 యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము.
నీ మార్గాలను ఉపదేశించుము.
5 నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము.
నీవు నా దేవుడవు, నా రక్షకుడవు.
రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
6 యెహోవా, నా యెడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నా యెడల చూపించుము.
7 నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు.
యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
8 యెహోవా నిజంగా మంచివాడు.
జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు.
9 దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు.
న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు.
10 యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను అనుసరించే మనుష్యులందరికి
ఆయన మార్గాలు దయగలవిగా, వాస్తవమైనవిగా ఉంటాయి.
దానియేలు ప్రార్థన
9 మాదీయుడైన అహష్వేరోషు కుమారుడగు దర్యావేషు బబులోను రాజ్యానికి రాజైన మొదటి సంవత్సరంలో జరిగిన సంగతి ఇది. 2 దర్యావేషు రాజుగా ఉండిన మొదటి సంవత్సరంలో, దానియేలు అను నేను, దేవుని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా వ్రాయించిన సంగతిని గ్రహించాను. ఏమనగా యెరూషలేము డెబ్బై సంవత్సరాలు పాడుబడినదిగా ఉండవలసిన సమయము పూర్తి అవుతూందని గ్రహించాను.
3 తర్వాత నేను గోనెపట్ట ధరించి, బూడిదలో కూర్చొని ఉపవాసముండి నా ప్రభువైన దేవునికి నా మనవిని ప్రార్థన విజ్ఞాపన ద్వారా తెలియపర్చుకొన్నాను. 4 నా దేవుడైన యెహోవాకు ప్రార్థించి నా పాపములన్నిటినీ ఒప్పుకొన్నాను.
“ప్రభువా! నీవు భయంకరుడవైన మహా దేవుడవు. నిన్ను ప్రేమించి, నీ ఆజ్ఞలకు లోబడే ప్రజలపట్ల నీ ఒడంబడికను నెరవేరుస్తావు.
5 “ప్రభువా! మేము పాపాలు చేశాము. మేము చెడ్డ పనులు చేసి నీకు విరుద్ధంగా ప్రవర్తించాము. మేము నీ ఆజ్ఞలకు, నీ విధులకు అవిధేయులమయ్యాం. 6 ప్రవక్తలు నీ తరపున మా రాజులతోను, నాయకులతోను, మా తండ్రులతోను, దేశంలోని ప్రజలందరితోను మాట్లాడారు. మేము నీ సేవకులైన ప్రవక్తల మాటలు వినలేదు.
7 “ప్రభువా, నవు నీతిమంతుడవు. మేము అనగా యూదా, యెరూషలేము ప్రజలు, మా పితరులు నీకు ద్రోహము చేసిన కారణాన దూర, సమీప దేశాలకు చెదరగొట్టబడిన ఇశ్రాయేలువారమైన మేము ఈ దినాన సిగ్గు పడవలసినవారమై యున్నాము.
8 “ప్రభువా! మా రాజులు, నాయకులు, మా పూర్వీకులు నీకు విరోధంగా పాపం చేసినందువల్ల మేము సిగ్గు పడవలసినవారమైతిమి.
9 “ప్రభువు దయామయుడు, క్షమాపణా స్వభావం గలవాడు. అయినను మేము నిజంగానే నీకు విరుద్ధంగా పాపం చేశాము. 10 మేము మా దేవుడైన యెహోవా మాటలు పాటించలేదు. తన సేవకులైన ప్రవక్తలద్వారా యెహోవా మాకు ప్రసాదించిన ఆ చట్టాలను అతిక్రమించాము. 11 ఇశ్రాయేలు ప్రజలు నీ బోధనలకు విధేయులు కాకుండా వారందరూ నీకు విముఖులయ్యారు. దేవుని సేవకుడైన మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన శాపాలు, ప్రమాణాలు మా మీద క్రుమ్మరించ బడ్డాయి. ఎందుకంటే, మేము నీ యెడల పాపం చేశాము
12 “దేవుడు మాకును, రాజులకును విరోధంగా పలికిన మాటలు మా యెడల జరిగేటట్లు చేశాడు. ఎలాగనగా ఆకాశం క్రింద ముందెన్నడూ జరుగని మహా విపత్తును యెరూషలేము యెడల జరిగించుట ద్వారా మాపై ఈ శిక్షను విధించాడు. 13 ఆ భయంకర విషయాలన్నీ మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లుగానే మాకు జరిగాయి. మేము మా పాపాలు మాని, ఆయన సత్యాన్ననుసరించి నడుచుకొని, ప్రభువు దయను పొందేటట్లు ప్రయత్నించలేదు. 14 ప్రభువు మా మీదికి నాశనాన్ని రప్పించటానికి వెనుకాడలేదు. ఎందుకంటే మా దేవుడైన ప్రభువు ఈ కార్యాలన్నిటిలో నీతిమంతుడు. కాని మేము ఆయనకు విధేయులం కాలేదు.
3 తండ్రితో ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో మాకు సహవాసం ఉంది కనుక, మీరు కూడా మాతో సహవాసం చెయ్యాలనే ఉద్దేశ్యంతో మేము చూసినదాన్ని, విన్నదాన్ని మీకు ప్రకటిస్తున్నాము. 4 మన[a] ఆనందం సంపూర్ణంగా ఉండాలని యిది మీకు వ్రాస్తున్నాను.
వెలుగులో నడుచుట
5 దేవుడు వెలుగై వున్నాడు. ఆయనలో చీకటి ఏ మాత్రం లేదు. ఈ సందేశాన్ని ఆయన మాకు చెప్పాడు. దాన్ని మేము మీకు ప్రకటిస్తున్నాం. 6 మనకు ఆయనతో సహవాసముందని అంటూ చీకట్లో నడిస్తే మనము అసత్యమాడినట్లే కదా! సత్యాన్ని ఆచరించటం మానుకొన్నట్లే కదా! 7 దేవుడు వెలుగులో ఉన్నాడు. కాబట్టి మనం కూడా వెలుగులో నడిస్తే మన మధ్య సహవాసం ఉంటుంది. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు రక్తం మన పాపాలన్నిటిని కడుగుతుంది.
8 మనలో పాపం లేదని అంటే, మనల్ని మనము మోసం చేసుకొన్న వాళ్ళమౌతాము. సత్యం మనలో ఉండదు. 9 మనం చేసిన పాపాన్ని ఒప్పుకొంటే దేవుడు సత్యవంతుడు, సక్రమంగా న్యాయం జరిగించేవాడు కనుక మన పాపాల్ని క్షమిస్తాడు. మనలో ఉన్న అవినీతిని కడిగి వేస్తాడు. 10 మనం పాపాలు చెయ్యలేదని అంటే ఆయన్ని మనం అబద్ధమాడుతున్న వానిగా చేసినట్లౌతుంది. ఆయన సందేశానికి మన జీవితాల్లో స్థానం ఉండదు.
© 1997 Bible League International