Revised Common Lectionary (Complementary)
ఆసాపు కీర్తనలలో ఒకటి.
50 దేవాధి దేవుడు యెహోవా మాట్లాడాడు.
సూర్యోదయ దిక్కు నుండి సూర్యాస్తమయ దిక్కు వరకు భూమి మీది ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు.
2 సీయోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పట్టణపు అందము పరిపూర్ణమైనది.
3 మన దేవుడు వస్తున్నాడు, ఆయన మౌనంగా ఉండడు.
ఆయన యెదుట అగ్ని మండుతుంది.
ఆయన చుట్టూరా గొప్ప తుఫాను ఉంది.
4 తన ప్రజలకు తీర్పు చెప్పుటకు పైన ఆకాశాన్ని,
క్రింద భూమిని ఆయన పిలుస్తున్నాడు.
5 “నా అనుచరులను నా చుట్టూరా చేర్చండి.
వారు బలియర్పణ ద్వారా నాతో ఒడంబడిక చేసుకున్నారు” అని ఆయన అంటాడు.
6 అప్పుడు ఆకాశాలు ఆయన న్యాయాన్ని చెప్పాయి.
ఎందుకంటే, దేవుడే న్యాయమూర్తి.
యరొబాము కుమారుని మరణం
14 ఆ సమయంలో యరొబాము కుమారుడు అబీయా తీవ్రంగా జబ్బు పడ్డాడు. 2 యరొబాము తన భార్యతో ఇలా అన్నాడు: “నీవు షిలోహుకు వెళ్లు. అక్కడ ప్రవక్త అహీయాను దర్శించు. నేను ఇశ్రాయేలుకు రాజునవుతానని చెప్పిన వాడే ఈ అహీయా. నీవు నా భార్యవని ప్రజలకు తెలియకుండా మారువేషం వేసుకొని వెళ్లు. 3 ప్రవక్త కొరకు పదిరొట్టెలను, తీపి పదార్థాలను, ఒక జాడీ తేనెను కానుకగా పట్టుకు వెళ్లు. తరువాత మన కుమారునికి ఏమి జరుగుతుందో చెప్పమని ఆయనను అడుగు. ప్రవక్తయైన అహీయా అంతా చెపుతాడు.”
4 అందువల్ల రాజు భార్య షిలోహుకు వెళ్లింది. ప్రవక్త అహీయా ఇంటికి వెళ్లింది. అహీయా పండు ముసలి వాడయ్యాడు. చూపుపోయింది. 5 కాని ఈ లోపు యెహోవా అహీయాతో, “యరొబాము భార్య నీ వద్దకు వస్తూవుంది. ఆమె కుమారునికి జబ్బు చేయగా, అతనికి ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని వస్తూవుంది” అని తెలియజేశాడు. తరువాత అహీయా ఆమెకు ఏమి చెప్పాలో కూడ యెహోవా వివరించాడు. యరొబాము భార్య అహీయా ఇంటికి వచ్చింది.
ఆమె ఎవరో ప్రజలకు తెలియకుండా వుండాలని ఆమె ప్రయత్నిస్తూ వుంది. 6 ఆమె ద్వారం వద్దకు వచ్చినట్లు అహీయా శబ్దం విన్నాడు. వెంటనే అహీయా ఇలా అన్నాడు: “యరొబాము భార్యా, లోపలికి రా, ప్రజలు నిన్ను ఎవరో అనుకోవాలని నీవు ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నీకు ఒక దుర్వార్త చెప్పదలిచాను. 7 నీవు ఇంటికి తిరిగి వెళ్లి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యరొబాముకు చెప్పమన్న వర్తమానం తెలియజేయి. యెహోవా ఇలా అంటున్నాడు: ‘యరొబామా, ఇశ్రాయేలీయులందరిలోను నేను నిన్ను ఎంపిక చేశాను. నా ప్రజలకు నిన్ను పాలకునిగా చేశాను. 8 దావీదు వంశం ఇశ్రాయేలును ఏలుతూ వుంది. కాని వారినుండి రాజ్యాన్ని తీసుకుని, దానిని నేను నీకిచ్చాను. నా సేవకుడగు దావీదువలె నీవు ప్రవర్తించలేదు. అతడు నా ఆజ్ఞలను ఎల్లప్పుడు పాటించాడు. పూర్ణ హృదయంతో అతడు నన్ను అనుసరించాడు. నేను అంగీకరించిన వాటినే అతడు చేసేవాడు. 9 కాని నీవు ఘోరమైన పాపాలను చాలా చేశావు. నీ ముందు పాలించిన వారు చేసిన పాపాలకంటె నీవు అతి భయంకరమైన పాపాలు చేశావు. నన్ను వదిలిపెట్టి పెడ మార్గాన పడ్డావు. నీవు విగ్రహాలను, చిల్లర దేవుళ్లను తయారు చేశావు. ఇది నాకు చాలా కోప కారణమయ్యింది. 10 కావున నేను యరొబాము కుటుంబానికి కష్టాలు కలుగజేస్తాను. నీ కుటుంబంలో పురుషులందరినీ చంపివేస్తాను. ఎండిన పేడను అగ్ని దహించి వేయునట్లు నేను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. 11 నగరంలో చనిపోయిన నీ కుటుంబం వారిని కుక్కలు పీక్కుతింటాయి. పొలాల్లో చనిపోయే నీ కుటుంబంవారిని పక్షులు పొడుచుకు తింటాయి.’ ఇదే యెహోవా వాక్కు.”
12 యరొబాము భార్యతో ప్రవక్త అహీయా ఇంకా ఇలా అన్నాడు: “ఇప్పుడు ఇంటికి వెళ్లు. నీవు నగర ద్వారం ప్రవేశించగానే నీ కుమారుడు చనిపోతాడు. 13 ఇశ్రాయేలంతా వాని కొరకు విలపించి, అతనిని సమాధి చేస్తారు. యరొబాము కుటుంబంలో నీ కుమారుడు ఒక్కడే సమాధి చేయబడతాడు. ఎందువల్లననగా యరొబాము కుటుంబంలో అతడొక్కడే ప్రభువైన ఇశ్రాయేలు దేవుని సంతోషపరిచాడు. 14 యెహోవా ఇశ్రాయేలుపై మరో కొత్త రాజును నియమిస్తాడు. ఆ కొత్త రాజు యరొబాము కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ఇది శీఘ్రంగా జరుగుతుంది. 15 అప్పుడు యెహోవా ఇశ్రాయేలును శిక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు నీటిలోని ఎత్తైన గడ్డి అల్లాడినట్లు తల్లడిల్లి పోతారు. ఇశ్రాయేలు ప్రజల్ని ఈ మంచి దేశంనుండి యెహోవా లాగివేస్తాడు. ఈ రాజ్యాన్ని వారి పూర్వికులకు ఆయన ఇచ్చాడు. యూఫ్రటీసు నదికావల వీరు చెల్లాచెదరైపోయేలా చేస్తాడు. ఇది జరుగుతుంది. కారణమేమంటే యెహోవా ఆ ప్రజల పట్ల కోపంగా వున్నాడు. ప్రత్యేకమైన స్తంభాలు నిర్మించి అషేరాను ఆరాధించటం మొదలుపెట్టి ప్రజలాయనకు చాలా కోపం కలుగ జేశారు. 16 యరొబాము పాపం చేశాడు. అతడు పాపం చేసి ఇశ్రాయేలు ప్రజలు కూడ పాపం చేయటానికి కారకుడయ్యాడు. కావున ఇశ్రాయేలు ప్రజలు ఓడింపబడేలా యెహోవా చేస్తాడు.”
17 యరొబాము భార్య తిర్సాకు తిరిగి వెళ్లింది. ఆమె ఇంటికి వెళ్లగానే బాలుడు చనిపోయాడు. 18 ఇశ్రాయేలీయులంతా అతని కొరకై విలపించి, అతనిని సమాధిచేశారు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో, అదే విధంగా ఇది జరిగింది. తన సేవకుడైన ప్రవక్త అహీయా ద్వారా ఈ విషయాలన్నీ చెప్పాడు.
దేవుని దయకు నేను కృతజ్ఞుణ్ణి
12 నాకు శక్తినిచ్చి, నన్ను విశ్వాసపాత్రునిగా ఎంచి, ఈ సేవకోసం నన్ను నియమించిన మన యేసు క్రీస్తు ప్రభువుకు నా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. 13 ఒకనాడు నేను దైవదూషణ చేసినవాణ్ణి, హింసించిన వాణ్ణి, క్రూరుణ్ణి. నేను అమాయకంగా నాలో విశ్వాసం లేకపోవడం వల్ల అలా ప్రవర్తించానని దేవుడు నన్ను కనికరించాడు. 14 మన ప్రభువు తన అనుగ్రహాన్ని నాపై ధారాళంగా కురిపించాడు. ఆ అనుగ్రహంతో పాటు యేసు క్రీస్తులో ఉన్న విశ్వాస గుణాన్ని, ప్రేమను కూడా నాకు ప్రసాదించాడు.
15 పాపులను రక్షించటానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది విశ్వసింపదగిన విషయం. దీన్ని అందరూ అంగీకరించాలి. ఆ పాపుల్లో నేను ప్రథముణ్ణి. 16 నేను ప్రథముణ్ణి కనుకనే యేసు నాపై దయ చూపాడు. ఈ విధంగా తనను విశ్వసించబోయేవాళ్ళకు, తనవల్ల విముక్తి పొందబోయేవాళ్ళకు అనంతమైన తన సహనము ఆదర్శంగా ఉండాలని అంతులేని సహనాన్ని ప్రదర్శించాడు. 17 చిరకాలం రాజుగా ఉండే దేవునికి, కంటికి కనిపించని, చిరంజీవి అయినటువంటి ఆ ఒకే ఒక దేవునికి గౌరవము, మహిమ చిరకాలం కలుగుగాక! ఆమేన్.
18 తిమోతీ, నా కుమారుడా! గతంలో ప్రవక్తలు నీ భవిష్యత్తును గురించి చెప్పారు. దాని ప్రకారం మంచి పోరాటం సాగించి ఆ ప్రవక్తలు చెప్పినవి సార్థకం చేయమని ఆజ్ఞాపిస్తున్నాను. 19 విశ్వాసంతో, మంచి హృదయంతో పోరాటం సాగించు. కొందరు వీటిని వదిలి తమ విశ్వాసాన్ని పోగొట్టుకొన్నారు. 20 హుమెనై, అలెక్సంద్రు ఇలాంటి వాళ్ళు. వీళ్ళు దైవదూషణ చెయ్యకుండా ఉండటం నేర్చుకోవాలని వాళ్ళను సాతానుకు అప్పగించాను.
© 1997 Bible League International