Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: అష్టమ శృతిమీద తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన
6 యెహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు.
కోపగించి నన్ను శిక్షించవద్దు.
2 యెహోవా, నా మీద దయ ఉంచుము.
నేను రోగిని, బలహీనుడిని నన్ను స్వస్థపరచుము. నా ఎముకలు వణకుతున్నాయి.
3 నా శరీరం మొత్తం వణకుతోంది.
యెహోవా నన్ను నీవు స్వస్థపర్చటానికి ఇంకెంత కాలం పడుతుంది.?
4 యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము.
నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము.
5 చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు.
సమాధుల్లోని ప్రజలు నిన్ను స్తుతించరు. అందుచేత నన్ను స్వస్థపరచుము.
6 యెహోవా, రాత్రి అంతా, నిన్ను ప్రార్థించాను.
నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది.
నా పడకనుండి కన్నీటి బొట్లు రాలుతున్నాయి.
నీకు మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను.
7 నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు.
ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది.
ఏడ్చుటవల్ల ఇప్పుడు నా కండ్లు నీరసంగాను, అలసటగాను ఉన్నాయి.
8 చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి!
ఎందుకంటె నేను ఏడ్వటం యెహోవా విన్నాడు గనుక.
9 యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు.
10 నా శత్రువులంతా తలక్రిందులై, నిరాశపడతారు.
వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి వెళ్లిపోతారు.
16 “ఇప్పుడు నా జీవితం దాదాపు అయిపోయింది.
నేను త్వరలోనే మరణిస్తాను. శ్రమదినాలు నన్ను పట్టివేశాయి.
17 రాత్రివేళ నా ఎముకలు అన్నీ నొప్పెడతాయి.
బాధ నన్ను నమిలివేయటం ఎన్నడూ ఆగిపోలేదు.
18 దేవుడు మహాబలంగా నా చొక్కా పట్టి లాగుతున్నాడు.
ఆయన నా బట్టలను నలిపి వేస్తున్నాడు.
19 దేవుడు నన్ను బురదలో పడదోస్తున్నాడు.
నేను మట్టిలా, బూడిదలా అయిపోతున్నాను.
20 “దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెడుతున్నాను.
కానీ నీవు జవాబు ఇవ్వవు.
నేను నిలబడి ప్రార్థన చెస్తాను.
కానీ నీవు నాకు జవాబు ఇవ్వవు.
21 దేవా, నీవు నా ఎడల అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు.
నన్ను బాధపెట్టేందుకు నీవు నీ శక్తిని ప్రయోగిస్తున్నావు.
22 దేవా, బలమైన గాలి నన్ను కొట్టుకొని పోయేటట్టు నీవు చేస్తున్నావు.
నీవు నన్ను తుఫానులో పడదోస్తున్నావు.
23 నీవు నన్ను నా మరణానికి తీసుకొని పోతున్నావని నాకు తెలుసు.
మరణం ప్రతి మనిషికి ఏర్పాటు చేయబడిందే.
24 “కానీ అప్పటికే నాశనమయి, సహాయంకోసం అలమటించేవాణ్ణి
నిశ్చయంగా ఎవ్వరూ బాధించరు.
25 దేవా, కష్టాల్లో ఉన్న ప్రజల పక్షంగా నేను మొర్ర పెట్టానని నీకు తెలుసు.
పేద ప్రజల కోసం నా హృదయం ఎంతో విచారించిందని నీకు తెలుసు.
26 కానీ నేను మంచివాటి కోసం ఎదురు చూస్తే వాటికి బదులు చెడ్డవి జరిగాయి.
వెలుగుకోసం నేను చూస్తే చీకటి వచ్చింది.
27 అంతరంగంలో నేను చీల్చివేయబడ్డాను.
శ్రమలు ఎన్నటికీ ఆగిపోవు. శ్రమకాలాలు నా యెదుట ఉన్నాయి.
28 నేను ఎల్లప్పుడూ ఎంతో విచారంగా ఉంటానుగాని,
నాకు ఆదరణ లభ్యం కాదు. నేను సమాజంలో నిలబడి సహాయం కోసం కేకలు వేస్తాను.
29 నేను అడవి కుక్కలకు సోదరుడినయ్యాను. నిప్పుకోళ్లు నాకు జతగాళ్లు.
30 నా చర్మం చాలా నల్లబడిపోయింది.
నా శరీరం జ్వరంతో వేడిగా ఉంది.
31 దుఃఖమయ గీతాలు వాయించేందుకు నా స్వర మండలమును శృతి చేయబడింది.
విచారంగా ఏడుస్తున్న శబ్దాలు నా పిల్లనగ్రోవి చేస్తుంది.
46 యేసు, తాను నీళ్ళను ద్రాక్షారసంగా మార్చిన గలిలయలోని “కానా” ను మళ్ళీ దర్శించాడు. కపెర్నహూము పట్టణంలో ఒక రాజ్యాధికారి ఉండేవాడు. అతని కుమారుడు జబ్బుతో ఉన్నాడు. 47 యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని విని ఆ రాజ్యాధికారి ఆయన దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి చావుకు దగ్గరగా ఉన్న తన కుమారునికి నయం చేయుమని వేడుకున్నాడు. 48 “మహాత్కార్యాలు, అద్భుతాలు చూస్తే కాని మీరు నమ్మరు” అని యేసు అతనితో అన్నాడు.
49 ఆ రాజ్యాధికారి, “అయ్యా! నా కుమారుడు మరణించకముందే దయచేసి రండి!” అని అన్నాడు.
50 యేసు, “నీవు వెళ్ళు! నీ కుమారుడు జీవిస్తాడు” అని అన్నాడు.
అతడు యేసు మాట విశ్వసించి వెళ్ళి పోయాడు. 51 అతడు యింకా దారిలో ఉండగానే అతని సేవకులు ఎదురుగా వచ్చి బాబుకు నయమై పోయిందని చెప్పారు.
52 అతడు వాళ్ళను తన కుమారునికి ఏ సమయంలో నయమైందని అడిగాడు.
వాళ్ళు, “నిన్న ఒంటిగంటకు జ్వరం విడిచింది” అని సమాధానం చెప్పారు.
53 సరిగ్గా అదే సమయానికి యేసు తనతో, “నీ కుమారుడు జీవిస్తాడు” అని అన్న విషయం అతనికి జ్ఞాపకం వచ్చింది. అందువల్ల అతడు, అతని యింట్లోని వాళ్ళంతా ప్రభువుని నమ్మారు.
54 యూదయ దేశం నుండి గలిలయకు వచ్చాక యిది యేసు చేసిన రెండవ మహాత్కార్యము.
© 1997 Bible League International