Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: అష్టమ శృతిమీద తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన
6 యెహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు.
కోపగించి నన్ను శిక్షించవద్దు.
2 యెహోవా, నా మీద దయ ఉంచుము.
నేను రోగిని, బలహీనుడిని నన్ను స్వస్థపరచుము. నా ఎముకలు వణకుతున్నాయి.
3 నా శరీరం మొత్తం వణకుతోంది.
యెహోవా నన్ను నీవు స్వస్థపర్చటానికి ఇంకెంత కాలం పడుతుంది.?
4 యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము.
నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము.
5 చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు.
సమాధుల్లోని ప్రజలు నిన్ను స్తుతించరు. అందుచేత నన్ను స్వస్థపరచుము.
6 యెహోవా, రాత్రి అంతా, నిన్ను ప్రార్థించాను.
నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది.
నా పడకనుండి కన్నీటి బొట్లు రాలుతున్నాయి.
నీకు మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను.
7 నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు.
ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది.
ఏడ్చుటవల్ల ఇప్పుడు నా కండ్లు నీరసంగాను, అలసటగాను ఉన్నాయి.
8 చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి!
ఎందుకంటె నేను ఏడ్వటం యెహోవా విన్నాడు గనుక.
9 యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు.
10 నా శత్రువులంతా తలక్రిందులై, నిరాశపడతారు.
వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి వెళ్లిపోతారు.
సిరియనుల శిబిరం ఖాళీగా వుండటాన్ని కుష్ఠరోగులు చూచుట
3 నగర ద్వారం వద్ద నలుగురు కుష్ఠరోగులుండిరి. వారు ఒకరితో ఒకరు ఇట్లు చెప్పుకున్నారు: “కూర్చుని మరణించాడానికి నిరీక్షిస్తున్నామా? 4 షోమ్రోనులో ఆహారంలేదు. మనము నగరంలోకి వెళితే, మనమక్కడ చనిపోతాము. ఇక్కడ ఉంటే, చనిపోతాము. కనుక మనము సిరియనుల గుడారానికి వెళదాము. వాళ్లు కనుక మనలను అక్కడ ఉండనిస్తే, అప్పుడు మనం బ్రతుకుదాము. వాళ్లు మనలను చంపితే మనము మరణిద్దాము.”
5 అందువల్ల ఆ సాయంకాలం ఆ నలుగురు కుష్ఠరోగులు సిరియనుల గుడారానికి వెళ్లారు. వారు గుడారం అంచుదాకా వెళ్లారు. అక్కడ మనుష్యులెవ్వరూ లేరు. 6 సిరియనుల గుడారం వారు రథాలు, గుర్రాలు, సైన్యం వస్తున్న సవ్వడిని సిరియనుల సైన్యం వినేలా యెహోవా ఏర్పాటు చేశాడు. అందువల్ల సిరియనుల సైనికులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకొన్నారు: “ఇశ్రాయేలు రాజు హిత్తీయుల, ఈజీప్టీయుల రాజులను మనకు ప్రతికూలంగా జీతమిచ్చి వాడుకున్నాడు.”
7 ఆ సాయంకాలమే సిరియావారు అన్నీ అక్కడే విడిచిపెట్టి పారిపోయారు. వారు తమ గుడారాలు విడిచిపెట్టారు. గుర్రాలు, గాడిదలు మొదలైనవి కూడా విడిచి పెట్టి ప్రాణాలకోసం పారిపోయారు.
విరోధి శిబిరములో కుష్ఠరోగులు
8 శిబిరం ప్రారంభమైన చోటికి ఈ కుష్ఠరోగులు వచ్చారు. వారు ఒక గుడారంలోకి వెళ్లారు. వారు తిన్నారు; త్రాగారు. తర్వాత ఆ కుష్ఠరోగులు వెండి బంగారం వస్త్రాలు మొదలైన వాటిని తీసుకున్నారు. వెండి బంగారాలు వస్త్రాలను వారు దాచివేశారు. తర్వాత వెనక్కి వచ్చి మరొక గుడారంలో ప్రవేశించారు. ఈ గుడారం నుంచి వస్తువులను బయటికి చేరవేశారు. ఈ వస్తువులను కూడా వారు దాచివేశారు. 9 తర్వాత ఈ కుష్ఠరోగులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు: “మనము తప్పు చేస్తున్నాము. నేడు మనకు మంచి వార్త కలదు. కాని మనము మౌనంగా ఉన్నాము. మళ్లీ సూర్యుడు వచ్చేంతవరకు మనము వేచివుంటే, మనము శిక్షింపబడతాము. ఇప్పుడే మనము వెళ్లిపోదాము. రాజు గారి భవనంలో వున్న మనష్యులకు చెపుదాము.”
మంచి వార్తను కుష్ఠరోగులు చెప్పుట
10 ఆ తరువాత కుష్ఠరోగులు వచ్చి, నగర ద్వారపాలకులతో చెప్పారు: “మేము సిరియావారి శిబిరాలకు వెళ్లాము. కాని మేము ఎవ్వరి గొంతు వినలేదు. అక్కడ ఎవ్వరూ లేరు. గుర్రాలు గాడిదలు ఇంకా కట్టివేయబడివున్నాయి. గుడారాలు అలాగేవున్నాయి. కాని మనుష్యులందరూ వెళ్లిపోయారు.”
14 కనుక నా ప్రియ మిత్రులారా! మీరు విగ్రహారాధనకు దూరంగా ఉండండి. 15 మీరు తెలివిగలవాళ్ళు కనుక ఇలా మాట్లాడుతున్నాను. నేను చెపుతున్న వాటిని గురించి మీరే నిర్ణయించండి 16 మనము కృతజ్ఞతతో దీవెన పాత్రనుండి త్రాగటం క్రీస్తు రక్తాన్ని పంచుకోవటము కదా? మనము విరిచిన రొట్టెను పంచుకోవటము క్రీస్తు శరీరాన్ని పంచుకోవటము కదా? 17 రొట్టె ఒకటే గనుక ఆ ఒకే రొట్టెలో పాలుపొందే మనం అనేకులమైనప్పటికిని ఒకే శరీరమైయున్నాము.
18 ఇశ్రాయేలు ప్రజల్ని చూడండి. బలి ఇచ్చినదాన్ని తినేవాళ్ళు బలిపీఠానికి భాగస్వాములు కారా? 19 మరి నేను చెపుతున్నదానికి అర్థం ఏమిటి? విగ్రహాల్లో కాని, ఆరగింపు చేసిన ప్రసాదంలో కాని, ఏదో ప్రత్యేకత ఉందని చెపుతున్నానా? 20 లేదు. నేను చెపుతున్నది ఏమిటంటే యూదులుకానివాళ్ళు బలిపీఠాలపై బలి ఇచ్చినవి దయ్యాల కోసం బలి ఇవ్వబడ్డాయి. అవి దేవునికి అర్పితం కావు. మీరు దయ్యాలతో భాగస్వాములు కారాదని నా విన్నపం. 21 మీరు ప్రభువు పాత్రనుండి త్రాగుతూ దయ్యాల పాత్రనుండి కూడా త్రాగాలని ప్రయత్నించరాదు. మీరు ప్రభువు పంక్తిలో కూర్చొని భోజనం చేస్తూ దయ్యాల పంక్తిలో కూడా కూర్చోవటానికి ప్రయత్నం చేయరాదు. 22 మనం దేవుని కోపాన్ని రేపటానికి ప్రయత్నిద్దామా? మనం ఆయన కంటే శక్తిగలవాళ్ళమా? ఎన్నటికీ కాదు.
మరికొన్ని కర్తవ్యాలు
23 “మనకు ఏది చెయ్యటానికైనా స్వేచ్ఛ ఉంది” కాని అన్నీ లాభదాయకం కావు. “మనకు అన్నీ చెయ్యటానికి స్వేచ్ఛ ఉంది” కాని అన్నిటి వల్ల వృద్ధి కలుగదు. 24 ఎవరూ తమ మంచి కొరకే చూసుకోరాదు. ఇతరుల మంచి కోసం కూడా చూడాలి.
25 మీ మనస్సులు పాడు చేసుకోకుండా కటికవాని అంగడిలో అమ్మే ఏ మాంసాన్నైనా తినండి. 26 “ఎందుకంటే ఈ భూమి, దానిలో ఉన్నవన్నీ ప్రభునివే.”(A)
27 క్రీస్తును విశ్వసించనివాడు మిమ్మల్ని భోజనానికి పిలిస్తే మీకు ఇష్టముంటే వెళ్ళండి. మనస్సుకు సంబంధించిన ప్రశ్నలు వేయకుండా మీ ముందు ఏది ఉంచితే అది తినండి. 28 కాని ఎవరైనా మీతో, “ఇది విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ప్రసాదం” అని అంటే, ఈ విషయం మీతో చెప్పినవాని కోసం, వాని మనస్సుకోసం దాన్ని తినకండి. 29 అంటే, మీ మనస్సు కోసం అని కాదు, ఆ చెప్పినవాని మనస్సు కోసం దాన్ని తినకండి. నా స్వాతంత్ర్యం విషయంలో అవతలివాని మనస్సు ఎందుకు తీర్పు చెప్పాలి? 30 నేను కృతజ్ఞతలు అర్పించి భోజనం చెయ్యటం మొదలుపెడ్తాను. నేను కృతజ్ఞతలు అర్పించి తినే భోజనాన్ని గురించి ఇతరులు నన్నెందుకు విమర్శించాలి?
31 కానీ మీరు తిన్నా, త్రాగినా, ఏది చేసినా అన్నీ దేవుని ఘనత కోసం చేయండి. 32 యూదులకు గాని, యూదులుకానివాళ్ళకు గాని, దేవుని సంఘానికి గాని, కష్టం కలిగించకుండా జీవించండి. 33 నేను చేస్తున్నట్లు మీరు చెయ్యండి. నేను అన్ని పనులూ ఇతరులను సంతోషపెట్టాలని చేస్తాను. నా మంచి నేను చూసుకోను. వాళ్ళ మంచి కోసం చేస్తాను. వాళ్ళు రక్షింపబడాలని నా ఉద్దేశ్యం.
11 నేను క్రీస్తును అనుసరించిన విధంగా, మీరు నన్ను అనుసరించండి.
© 1997 Bible League International