Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 6

సంగీత నాయకునికి: అష్టమ శృతిమీద తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన

యెహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు.
    కోపగించి నన్ను శిక్షించవద్దు.
యెహోవా, నా మీద దయ ఉంచుము.
    నేను రోగిని, బలహీనుడిని నన్ను స్వస్థపరచుము. నా ఎముకలు వణకుతున్నాయి.
    నా శరీరం మొత్తం వణకుతోంది.
యెహోవా నన్ను నీవు స్వస్థపర్చటానికి ఇంకెంత కాలం పడుతుంది.?
యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము.
    నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము.
చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు.
    సమాధుల్లోని ప్రజలు నిన్ను స్తుతించరు. అందుచేత నన్ను స్వస్థపరచుము.

యెహోవా, రాత్రి అంతా, నిన్ను ప్రార్థించాను.
    నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది.
నా పడకనుండి కన్నీటి బొట్లు రాలుతున్నాయి.
    నీకు మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను.
నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు.
    ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది.
    ఏడ్చుటవల్ల ఇప్పుడు నా కండ్లు నీరసంగాను, అలసటగాను ఉన్నాయి.

చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి!
    ఎందుకంటె నేను ఏడ్వటం యెహోవా విన్నాడు గనుక.
యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు.

10 నా శత్రువులంతా తలక్రిందులై, నిరాశపడతారు.
    వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి వెళ్లిపోతారు.

2 దినవృత్తాంతములు 26:1-21

యూదా రాజుగా ఉజ్జియా

26 తరువాత అమజ్యా స్థానంలో కొత్త రాజుగా ప్రజలు ఉజ్జియాను ఎంచుకున్నారు. ఉజ్జియా తండ్రి పేరు అమజ్యా. ఇది జరిగే నాటికి ఉజ్జియా పదహారు సంవత్సరాలవాడు. ఎలతు పట్టణాన్ని ఉజ్జియా తిరిగి నిర్మించి యూదాకు యిచ్చాడు. అమజ్యా చనిపోయి, తన పూర్వీకులతో సమాధి చేయబడిన తరువాత ఉజ్జియా ఇది చేశాడు.

తాను రాజయ్యేనాటికి ఉజ్జియా పదహారు సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు ఏబై రెండు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు యెకొల్యా. యెకొల్యా యెరూషలేముకు చెందిన స్త్రీ. యెహోవా అతని నుండి ఆశించిన విధంగా ఉజ్జియా తన కార్యకలాపాలు కొనసాగించాడు. తన తండ్రి అమజ్యావలెనే ఉజ్జియా కూడా దేవుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాడు. జెకర్యా జీవించి ఉన్న కాలంలోనే ఉజ్జియా దేవుని సేవకుడయ్యాడు. ప్రభువైన యెహోవా పట్ల ఎలా భక్తి విశ్వాసాలు కలిగి వుండాలో జెకర్యా ఉజ్జియాకు నేర్పాడు. ఉజ్జియా యెహోవాకు విధేయుడై వున్నంతకాలం, ఆయన అతనికి విజయం చేకూర్చి పెట్టాడు.

ఫిలిష్తీయులతో ఉజ్జియా యుద్ధం చేశాడు. గాతు, యబ్నె, అష్డోదు పట్టణాల చుట్టూ వున్న ప్రాకారాలను అతడు పడగొట్టాడు. అష్టోదు పట్టణానికి దగ్గరగాను, మరియు ఫిలిష్తీయులు నివసించే ప్రాంతాలలోను ఉజ్జియా కొన్ని పట్టణాలను నిర్మించాడు. ఫిలిష్తీయులతోను, గూర్బయలులో నివసిస్తున్న అరబీయులతోను, మెహోనీయులతోను ఉజ్జియా జరిపిన యుద్ధాలలో యెహోవా అతనికి విజయం చేకూర్చాడు. అమ్మోనీయులు ఉజ్జియాకు కప్పం చెల్లించారు. ఈజిప్టు సరిహద్దులవరకు ఉజ్జియా పేరు ప్రతిష్ఠలు వ్యాపించాయి. మిక్కిలి బలపరాక్రమాలు కలవాడగుటచే ఉజ్జియా ప్రసిద్ధిగల వ్యక్తి అయ్యాడు.

యెరూషలేములో మూలద్వారాం వద్ద, లోయ ద్వారం వద్ద, మరియు గోడమలుపు వద్ద ఉజ్జియా బురుజులు కట్టించి బాగా బలపర్చాడు. 10 ఎడారిలో సహితం ఉజ్జియా బురుజులు కట్టించాడు. అతడు చాలా బావుల కూడా తవ్వించాడు. కొండల (మన్యం) ప్రాంతంలోను, మైదాన ప్రాంతాలలోను అతనికి పశుసంపద విస్తారంగా వుంది. పంట సాగుకు అనువైన కొండలయందు, మైదానములందు ఉజ్జియాకు వ్యవసాయదారులున్నారు. ద్రాక్షతోటల పెంపకంలో శ్రద్ధవహించే రైతులు కూడ అతనికి వున్నారు. అతడు వ్యవసాయ రంగాన్ని అభిమానించాడు.

11 ఉజ్జియాకు మంచి శిక్షణ పొందిన సైన్యం ఉంది. కార్యదర్శి యెహీయేలు, మరో అధికారి మయశేయా అనేవారు సైన్యాన్ని, వివిధ భాగాలుగా విభజించారు. వారి పైఅధికారి హనన్యా. యెహీయేలు, మయశేయా సైనికులందరినీ లెక్కించి వారిని పటాలాలుగా విభజించారు. హనన్యా రాజాధికారులలో ఒకడు. 12 సైనికులపై అధికారులే రెండువేల ఆరువందల మంది ఉన్నారు. 13 వంశాలవారీ ఎంపికైన సైన్యాధికారుల క్రింద మొత్తం మూడు లక్షల ఏడువేల ఐదువందల మంది యుద్ధంలో కాకలు తీరిన సైనికులున్నారు. ఆ సైనికులు శత్రువుల నుండి రక్షణ పొందటానికి రాజుకు సహాయపడతారు. 14 ఉజ్జియా సైన్యానికి డాళ్లు, ఈటెలు, శిరస్త్రాణాలు కవచాలు విల్లంబులు, ఒడిసెల రాళ్లు సరఫరా చేశాడు. 15 మేధావులు తమ కల్పనా శక్తితో రూపొందించిన యంత్రాలను ఉజ్జియా యెరూషలేములో తయారుచేయించాడు. ఆ యంత్రాలను బురుజుల మీద, గోడలు కలిసిన మూలల మీద ఉంచాడు. ఈ యంత్రాలు బాణాలు వదలటం, బండరాళ్లు విసిరి వేయటం మొదలైన పనులు చేసేవి. ఉజ్జియా చాలా ప్రఖ్యాతి గాంచాడు. దూర ప్రదేశాలలో కూడ ప్రజలు అతని పేరు విన్నారు. అతనికి ఎడతెగని సహాయం అందటంతో అతను చాలా శక్తివంతమైన రాజు అయ్యాడు.

16 ఉజ్జియా గొప్పవాడు కావటంతో పాటు, గర్విష్ఠి కూడా అయ్యాడు. అతని గర్వమే అతని వినాశనానికి కారణమయ్యింది. అతని దేవుడైన యెహోవాకు అతడు విశ్వాసపాత్రుడు కాలేదు. బలిపీఠం మీద ధూపం వేయటానికి అతడు ఆలయంలోకి వెళ్లాడు. 17 యాజకుడైన అజర్యా, మరియు ధైర్యంగల యెహోవా సేవకులు ఎనుబది మంది ఉజ్జియాను వెంబడించి ఆలయంలోకి వెళ్లారు. 18 ఉజ్జియా తప్పు చేస్తున్నట్లు వారతనిని మందలించారు. వారు యిలా అన్నారు: “ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయటం నీ పనికాదు. ఈ పని చేయటం నీకు మంచిది కాదు. యాజకులైన అహరోను సంతానంవారు మాత్రమే యెహోవాకు ధూపం వేయాలి. ధూపం వేసే పవిత్ర కార్యానికి ఈ యాజకులు శిక్షణ పొందారు. ఈ అతిపవిత్ర స్థలం నుండి నీవు బయటకు పొమ్ము. నీవు విశ్వాసంగా లేవు. ప్రభువైన యెహోవా నీ ఈ ప్రవర్తనకు నిన్ను గౌరవించడు!”

19 కాని ఉజ్జియాకు కోపం వచ్చింది. అతని చేతిలో ధూపకలశం ఉంది. యాజకులపట్ల ఉజ్జియా కోపగించుకుంటూ ఉండగనే అతని నుదటిపై కుష్ఠురోగం[a] పుట్టింది. ఆలయంలో ధూపపీఠం ప్రక్కనేవున్న యాజకుల ముందే ఇది జరిగింది. 20 ప్రధాన యాజకుడైన అజర్యా, మరియు ఇతర యాజకులు ఉజ్జియా వైపు చూశారు. అతని నుదటి మీద కుష్ఠు రోగాన్ని వారు చూడగలిగారు. యాజకులు వెంటనే ఉజ్జియాను ఆలయం నుండి బయటికి తరిమేశారు. యెహోవా అతనిని శిక్షకు గురిచేసిన కారణంగా ఉజ్జియా తనకుతానే బయటకు వచ్చాడు. 21 రాజైన ఉజ్జియా కుష్ఠురోగి అయ్యాడు. అతడు యెహోవా ఆలయంలో మళ్లీ ప్రవేశించలేక పోయాడు. ఉజ్జియా కుమారుడు యోతాము రాజగృహ కార్యక్రమాలు నిర్వహిస్తూ, రాజు తరపున ప్రజాపాలకుడయ్యాడు.

అపొస్తలుల కార్యములు 3:1-10

పేతురు కుంటివానిని నయం చెయ్యటం

ఒక రోజు పేతురు, యోహాను పగలు మూడు గంటలప్పుడు మందిరానికి వెళ్తున్నారు. అది ప్రార్థనా సమయం. కొందరు ఒక పుట్టు కుంటివాణ్ణి ప్రతిరోజూ మోసుకొని వెళ్ళి ఒక ద్వారం ముందు దించేవాళ్ళు. దీన్నే సౌందర్య ద్వారం అనేవాళ్ళు. మందిరంలోకి ప్రవేశించేవాళ్ళనుండి ఆ కుంటివాడు భిక్షమెత్తుకొంటూ ఉండేవాడు. ఈ కుంటివాడు పేతురు యోహానులు ఆలయంలోకి ప్రవేశించబోతుండగా చూసి వాళ్ళను భిక్షమడిగాడు.

పేతురు అతనివైపు ఏక దృష్టితో చూసాడు. యోహాను కూడా అలాగే చూసాడు. పేతురు ఆ కుంటివానితో, “మా వైపు చూడు!” అని అన్నాడు. ఆ కుంటివాడు వాళ్ళేదైనా యిస్తారని వాళ్ళ వైపు చూసాడు. అప్పుడు పేతురు, “నా దగ్గర వెండి, బంగారాలు లేవు కాని నా దగ్గరున్నదాన్ని నీకిస్తాను. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట నడువు!” అని అంటూ,

అతని కుడి చేయి పట్టుకొని లేపాడు. వెంటనే ఆ కుంటివాని చీలమండలకు, పాదాలకు బలం వచ్చింది. అతడు గంతేసి నిలబడి నడవటం మొదలు పెట్టాడు. తదుపరి అతడు నడుస్తూ గంతులేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళతో సహా మందిరంలోకి ప్రవేశించాడు. మందిరంలో ఉన్నవాళ్ళంతా అతడు నడవటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు. 10 భిక్షమెత్తుకోవటానికి మందిరంలోని సౌందర్య ద్వారం ముందు కూర్చునేవాడు అతడేనని గుర్తించారు. జరిగింది చూసి వాళ్ళు భయపడి దిగ్భ్రాంతి చెందారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International