Revised Common Lectionary (Complementary)
నయమాను సమస్య
5 సిరియా రాజు యొక్క సైన్యాధిపతి నయమాను. రాజుకు అతడు అతి ముఖ్యుడు. ఎందుకనగా, యెహోవా అతనిని ఉపయోగించుకొని సిరియా విజయం సాధించేలా చేశాడు. నయమాను మహాశక్తిమంతుడు, గొప్పవాడు. కాని కుష్ఠువ్యాధి వలన అతను బాధ పడుతూ ఉన్నాడు.
2 ఇశ్రాయేలులో యుద్ధం చేయడానికై సిరియను సైన్యం అనేక బృందాల సైనికులను పంపింది. ఇశ్రాయేలీయులను వారి బానిసలుగా గ్రహించారు. ఒక సారి వారు ఇశ్రాయేలునుంచి ఒక అమ్మాయిని తీసుకువచ్చారు. ఆ అమ్మాయి నయమాను భార్యకు సేవకురాలుగా ఉంది. 3 ఆ అమ్మాయి నయమాను భార్యతో ఇలా చెప్పింది: “నా యజమాని (నయమాను) ప్రవక్తయైన ఎలీషాను కలుసుకోవాలని నా కోరిక. ఎలీషా షోమ్రోను నివాసి. ఆ ప్రవక్త నయమాను కుష్ఠువ్యాధిని బాగుచేయగలడు.”
4 నయమాను తన యజమాని (సిరియారాజు) వద్దకు వెళ్లాడు. సిరియా రాజుకు ఆ అమ్మాయి చెప్పిన విషయలు నయమాను తెలిపాడు.
5 అప్పుడు సిరియా రాజు, “అయితే ఇప్పుడే వెళ్లు. నేను ఇశ్రాయేలు రాజుకు ఒక లేఖ పంపుతాను” అన్నాడు.
అందువల్ల నయమాను ఇశ్రాయేలుకు వెళ్లాడు. నయమాను కొన్ని కానుకలు తీసుకు వెళ్లాడు. ఏడువందల పౌనుల వెండి, అరు వేల బంగారం ముక్కలు మరియు పది దుస్తులు నయమాను తీసుకువెళ్ళాడు. 6 సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకి ఇచ్చిన లేఖ కూడా తీసుకు వెళ్లాడు. ఆ లేఖలో ఇలా వుంది: “… నేను ఇప్పుడు నా సేవకుడైన నయమానుని నీ వద్దకు పంపుతున్నాను. అతని కుష్ఠువ్యాధిని నివారించుము.”
7 ఇశ్రాయేలు రాజు ఆ ఉత్తరం చదవగానే, తాను తలక్రిందులై నానని విచారంగా ఉన్నానని తెలిపేందుకు తన దుస్తులు చింపివేశాడు. ఇశ్రాయేలు రాజు, “నేను దేవుడినా? కాదు. జీవ మరణాల మీద నాకు శక్తిలేదు. అందువల్ల సిరియా రాజు కుష్ఠువ్యాధితో బాధపడే ఒకనిని స్వస్థపరుచుటకు నా వద్దకు ఎందుకు పంపినట్లు? దానిని గురించి ఆలోచించుము. అది ఒక మాయోపాయమని తెలియుచున్నది. సిరియా రాజు యద్ధానికి సన్నద్ధుడవుతున్నాడు” అని చెప్పాడు.
8 ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు తెలిసినపుడు ఈ క్రింది సందేశాన్ని రాజు పంపాడు: “నీవు నీ దుస్తులు ఎందుకు చింపివేసుకొన్నావు? నయమానుని నా వద్దకు పంపు. అప్పుడతను ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నట్లు తెలుసుకుంటాడు.”
9 ఈ కారణంగా నయమాను తన గుర్రాలతోను రథాలతోను ఎలీషా ఇంటికి వచ్చాడు. తలుపుకి వెలుపల నుంచున్నాడు. 10 ఎలీషా ఒక దూతను నయమాను వద్దకు పంపాడు. ఆదూత, “వెళ్లి, ఏడు మారులు యోర్దాను నదిలో స్నానం చేయుము. అప్పుడు నీ చర్మం నయమవుతుంది. నీవు శుద్ధుడవు అవుతావు, శుభ్రపడతావు” అన్నాడు.
11 నయమాను కోపపడి, వెళ్లిపోయాడు. అతను, “ఎలీషా కనీసం వెలుపలికి వచ్చి నా యెదుట నిలబడి తన దేవుడైన యెహోవాని పిలుస్తాడనుకున్నాను. నా ముందర చేయి ఆడించి మరి నా కుష్ఠువ్యాధి బాగుచేస్తాడని ఆశించాను. 12 దమస్కు నదులైన అబానా, ఫర్పరులు ఇశ్రాయేలులోని అన్ని జలాల కంటె మంచివి. నేనెందుకు దమస్కులోని ఆ నదులలో స్నానం చేసి శుద్ధుణ్ని కాకూడదు!” అని అనుకొని నయమాను మహోగ్రుడయి కోపంతో వెళ్లిపోయాడు.
13 కాని నయమాను సేవకులు అతనిని సమీపించి అతనితో మాట్లాడారు. వారు ఈ విధంగా అన్నారు: “తండ్రీ, ప్రవక్త మిమ్మల్ని ఒక కష్టమైన పని చెయ్యమని చెబితే, ఆ విధంగా చేయవా? అలాగే, నీతో సులభమైన పని చెప్పినా, అది కూడా పాటించాలి. అతను చెప్పిందేమనగా, కడుగుకొనుము, నీవు శుద్ధడవయ్యెదవు.”
14 అందువల్ల దైవజనుడు ఎలీషా చెప్పినట్లుగా నయమాను ఆచరించాడు. నయమాను యోర్దాను నది లోపలికి వెళ్లి ఏడు సార్లు మునిగాడు. వెంటనే నయమాను శుద్ధుడయ్యాడు. నయమాను చర్మం పసిపిల్లవాని చర్మంవలె మృదువుగా వుంది.
దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.
30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
2 యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
నీవు నన్ను స్వస్థపరచావు.
3 సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.
4 దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
5 దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.
6 ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
నేను ఎన్నటికీ ఓడించబడను.
7 యెహోవా, నీవు నామీద దయ చూపావు.
బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
మరి నేను చాలా భయపడిపోయాను.
8 దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
9 “దేవా, నేను మరణించి,
సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.
11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
24 పరుగు పందెంలో అందరూ పాల్గొన్నా ఒక్కనికే బహుమతి లభిస్తుందని మీకు తెలియదా? కనుక ఆ బహుమతి పొందాలనే ఉద్దేశ్యంతో పరుగెత్తండి. 25 పరుగు పందెంలో పాల్గొనదలచిన వాళ్ళందరూ మంచి క్రమశిక్షణ పొందుతారు. విజయకిరీటం పొందాలనే వాళ్ళ ఉద్దేశ్యం. కాని, వాళ్ళు పొందే కిరీటం చిరకాలం ఉండదు. మనం చిరకాలం ఉండే కిరీటం కోసం పోరాడుతున్నాం. 26 నేను గమ్యం లేకుండా పరుగెత్తను. గాలితో పోరాడుతున్న వానిలా పోరాడను. 27 నేను నా దేహానికి సరియైన శిక్షణనిచ్చి, అదుపులో ఉంచుకొంటాను. బోధించిన తర్వాత కూడా ఆ బహుమతి పొందే అర్హత పోగొట్టుకోరాదని ప్రయాస పడుచున్నాను.
యేసు రోగిని నయం చేయటం
(మత్తయి 8:1-4; లూకా 5:12-16)
40 ఒక కుష్టురోగి ఆయన దగ్గరకు వచ్చి మోకరిల్లి, “మీరు దయతలిస్తే నయం చెయ్యగలరు” అని వేడుకున్నాడు.
41 యేసుకు జాలివేసింది. తన చేయి జాపి, “సరే దయ చూపుతాను!” అని అంటూ అతణ్ణి తాకాడు. 42 వెంటనే కుష్టురోగం అతన్ని వదిలిపోయింది. అతనికి నయమైంది.
43 అతణ్ణి పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరికి చెప్పకుండా జాగ్రత్తపడు. 44 కాని వెళ్ళి మీ యాజకునికి చూపు. మోషే ఆజ్ఞాపించిన బలి యిచ్చి నీవు శుద్ధి అయినట్లు రుజువు చేసుకొ” అని గట్టిగా చెప్పాడు. 45 కాని అతడు వెళ్ళి అందరికి చెప్పాడు. ఆ కారణంగా యేసు ఆ గ్రామాన్ని బహిరంగంగా ప్రవేశించ లేక పొయ్యాడు. గ్రామాల వెలుపల అరణ్య ప్రదేశాల్లో బస చేసాడు. అయినా ప్రజలు అన్ని ప్రాంతాలనుండి ఆయన దగ్గరకు వచ్చారు.
© 1997 Bible League International