Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.
30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
2 యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
నీవు నన్ను స్వస్థపరచావు.
3 సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.
4 దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
5 దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.
6 ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
నేను ఎన్నటికీ ఓడించబడను.
7 యెహోవా, నీవు నామీద దయ చూపావు.
బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
మరి నేను చాలా భయపడిపోయాను.
8 దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
9 “దేవా, నేను మరణించి,
సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.
11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
21 “అయితే ఆ వ్యక్తి పేదవాడై అలాంటి అర్పణలు ఇవ్వలేకపోతే, అపరాధపరిహారార్థబలిగా ఒక మగ గొర్రెపిల్లను అతడు తీసుకొని రావాలి. యాజకుడు ఆ వ్యక్తి పాపాలను తుడిచివేసేందుకు అది నైవేద్యం. ధాన్యార్పణగా తూములో పదోవంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని ఒక అర్థసేరు నూనెను 22 రెండు గువ్వలను, రెండు పావురపు పిల్లలను అతడు తీసుకొనిరావాలి. పేదవాళ్లుకూడ వాటిని తీసుకొని రాగలుగుతారు. ఒక పక్షి పాపపరిహారార్థబలి కొరకు, మరొకటి దహనబలి కొరకు.
23 “ఎనిమిదో రోజున సన్నిధి గుడారం దగ్గర యాజకుని వద్దకు అతడు వాటిని తీసుకొని రావాలి. ఆ వ్యక్తి పవిత్రుడయ్యేందుకు వాటిని యెహోవా ఎదుట అర్పించాలి. 24 అపరాధపరిహారార్థ బలికోసం గొర్రెపిల్లను, నూనెను, యాజకుడు తీసుకొని యెహోవా ఎదుట నైవేద్యంగా వాటిని అల్లాడించాలి. 25 అప్పుడు అపరాధపరిహారార్థ బలికొరకైన గొర్రెపిల్లను యాజకుడు వధించాలి. అపరాధపరిహారార్థ బలి రక్తంలో కొంచెం యాజకుడు తీసుకోవాలి. పవిత్రం చేయబడాల్సిన వ్యక్తి కుడి చెవి కొనమీద ఈ రక్తంలో కొంచెం యాజకుడు పోయాలి. ఈ వ్యక్తి కుడి చేతి బొటనవేలిమీద, కుడి పాదం బొటనవేలిమీద యాజకుడు ఈ రక్తం కొంచెం పోయాలి. 26 ఈ నూనెలో కూడ కొంచెం అతని ఎడమ చేతిలో యాజకుడు పోయాలి. 27 యాజకుడు తన కుడిచేతి వేలిని ప్రయోగించి తన ఎడమ చేతిలోని నూనె కొంచెం తీసి యెహోవా ఎదుట ఏడుసార్లు చిలకరించాలి. 28 తర్వాత యాజకుడు తన చేతిలోని నూనె కొంచెం తీసి పవిత్రం కావాల్సిన వ్యక్తి కుడి చెవి కొనమీద వేయాలి. ఆ వ్యక్తి కుడి చేతి బొటన వేలి మీద, కుడి పాదం బొటన వేలిమీద యాజకుడు ఈ నూనెను కొంచెం వేయాలి. అపరాధపరిహారార్థబలి రక్తం స్థానంలో యాజకుడు ఈ నూనె కొంచెం వేయాలి. 29 యాజకుడు తన చేతిలో మిగిలిపోయిన నూనెను, పవిత్రం కావాల్సిన వాని తల మీద పోయాలి. ఈ విధంగా యెహోవా ఎదుట ఆ వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచివేస్తాడు.
30 “అప్పుడు ఆ వ్యక్తి ఒక గువ్వ లేక పావురపు పిల్లలలో ఒకదానిని అర్పించాలి. (పేదవారు కూడా ఆ పక్షులను ఇవ్వగలరు, ఆ వ్యక్తి ఇవ్వగలిగిందే ఇవ్వాలి). 31 ఒక పక్షిని పాప పరిహారార్థబలిగాను మరొక దాన్ని దహనబలిగాను ఆ వ్యక్తి అర్పించాలి. అతడు వాటిని ధాన్యార్పణతో బాటు అర్పించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి పాపాలను యెహోవా ఎదుట తుడిచి వేస్తాడు. మరియు ఆ వ్యక్తి పవిత్రం అవుతాడు.”
32 ఒక వ్యక్తి చర్మ వ్యాధినుండి బాగు పడిన తర్వాత అతణ్ణి పవిత్రం చేయటానికి అవి నియమాలు. “పవిత్రం అయ్యేందుకు నియమం ప్రకారం బలులు అర్పించలేని ప్రజలకు అవి నియమాలు.”
బేతనియ గ్రామంలో తైలాభిషేకం
(మార్కు 14:3-9; యోహాను 12:1-8)
6 బేతనియ గ్రామంలో కుష్టురోగియగు సీమోను అని పిలువబడే ఒక వ్యక్తి యింట్లో యేసు ఉన్నాడు. 7 యేసు భోజనానికి కూర్చొని ఉండగా ఒక స్త్రీ చలువరాతి బుడ్డిలో అతి విలువైన అత్తరుతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన తలపై పోసింది.
8 ఇది చూసి శిష్యులకు కోపం వచ్చింది. “ఎందుకిలా వ్యర్థంచేయటం? 9 ఈ అత్తరు పెద్ద మొత్తానికి అమ్మి ఆ డబ్బు పేదవాళ్ళ కివ్వవలసింది!” అని వాళ్ళన్నారు.
10 యేసుకు ఈ విషయం తెలిసి, “ఆమెనెందుకంటున్నారు? ఆమె సరియైన పని చేసింది, 11 పేద వాళ్ళు మీతో ఎప్పుడూ ఉంటారు. కాని నేను మీతో ఎల్లకాలం ఉండబోను. 12 ఆమె ఆ అత్తరు నా శరీరం మీద పోసి నన్ను సమాధి చెయ్యటానికి సిద్ధం చేసింది. 13 ఇది సత్యం—ఈ సువార్తను ప్రపంచంలో ఏ చోట ప్రకటించినా ఆమె జ్ఞాపకార్థం ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది” అని అన్నాడు.
© 1997 Bible League International