Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.
30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
2 యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
నీవు నన్ను స్వస్థపరచావు.
3 సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.
4 దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
5 దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.
6 ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
నేను ఎన్నటికీ ఓడించబడను.
7 యెహోవా, నీవు నామీద దయ చూపావు.
బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
మరి నేను చాలా భయపడిపోయాను.
8 దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
9 “దేవా, నేను మరణించి,
సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.
11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
చర్మరోగుల నియమాలు
14 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, 2 “చర్మరోగాలు కలిగి బాగుపడిన ప్రజలకు నియమాలు ఇవి.
“ఆ వ్యక్తిని పవిత్రం చేసేందుకు ఇవే నియమాలు. చర్మవ్యాధి వచ్చిన వ్యక్తిని ఒక యాజకుడు చూడాలి. 3 బస వెలుపల ఆ వ్యక్తి దగ్గరకు యాజకుడు వెళ్లాలి. ఆ చర్మవ్యాధి బాగుపడినదేమో తెలుసుకొనేందుకు యాజకుడు పరిశీలించాలి. 4 ఆ వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉంటే అతణ్ణి ఈ పనులు చేయమని యాజకుడు చెప్పాలి: ప్రాణంతో ఉన్న రెండు పవిత్ర పక్షుల్ని అతడు తీసుకొని రావాలి, ఒక దేవదారు చెక్క ముక్కను, ఎర్రటి గుడ్డ ముక్కను, ఒక హిస్సోపు ముక్కను కూడా అతడు తీసుకొని రావాలి. ఇవన్నీ ఆవ్యక్తిని శుద్ధిచేసే పనికోసమే. 5 ఒక మట్టి పాత్రలో పారుతున్న నీళ్లమీద ఒక పక్షిని చంపమని యాజకుడు చెప్పాలి. 6 అప్పుడుయింకా ప్రాణంతో ఉన్న రెండో పక్షిని, దేవదారు చెక్కముక్క, ఎర్ర గుడ్డ ముక్క, హిస్సోపు ముక్కను యాజకుడు తీసుకోవాలి. పారుతున్న నీళ్లమీద చంపబడిన మొదటి పక్షి రక్తంలో, ప్రాణంతో ఉన్న రెండో పక్షిని, మిగతా వస్తువులను యాజకుడు ముంచాలి. 7 చర్మవ్యాధి ఉన్న వ్యక్తి మీద యాజకుడు ఏడుసార్లు చిలకరించాలి. అప్పుడు ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అప్పుడు యాజకుడు బహిరంగ స్థలానికి వెళ్లి, ప్రాణంతో ఉన్న పక్షిని స్వేచ్ఛగా ఎగిరిపోనివ్వాలి.
8 “తర్వాత ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. అతడు తన వెంట్రుకలన్నింటినీ క్షౌరం చేసుకోవాలి. అతడు నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడు అతడు పవిత్రం అవుతాడు. అప్పుడు ఆ వ్యక్తి బసలోనికి వెళ్లవచ్చును. కానీ అతడు ఏడు రోజులవరకు తన గుడారంబయట ఉండాలి. 9 ఏడవ రోజున అతడు తన వెంట్రుకలన్నీ క్షౌరం చేసుకోవాలి. అతడు తన తల, గడ్డం, కనుబొమ్మలు, వెంట్రుకలు అన్నీ క్షౌరం చేసుకోవాలి. తర్వాత అతడు తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. అప్పుడు అతడు పవిత్రుడవుతాడు.
10 “ఎనిమిదో రోజున, చర్మవ్యాధి కలిగి ఉండినవాడు ఏ దోషం లేని రెండు మగ గొర్రెపిల్లలను తీసుకొని వెళ్లాలి. ఏ దోషం లేని ఒక్క సంవత్సరపు ఆడ గొర్రె పిల్లను కూడా అతడు తీసుకొని వెళ్లాలి. ధాన్యార్పణ కోసం నూనె కలిపిన మూడు పదోవంతుల మంచి పిండిని అతడు తీసుకొని వెళ్లాలి. ఒక అర్ధసేరు ఒలీవ నూనె ఆ వ్యక్తి తీసుకొని వెళ్లాలి. 11 ఆ వ్యక్తి పవిత్రుడు అని ప్రకటించే యాజకుడు, ఆ వ్యక్తిని, అతని బలులను సన్నిధిగుడార ద్వారం దగ్గర యెహోవా ఎదుటికి తీసుకొని రావాలి. 12 గొర్రె పిల్లల్లో ఒకదాన్ని అపరాధపరిహారార్థ బలిగా అర్పించాలి. ఆ గొర్రెపిల్లను, కొంతనూనెను యెహోవా ఎదుట నైవేద్యంగా అర్పించాలి. 13 పాపపరిహారార్థ బలి, దహనబలి వధించే పవిత్ర స్థలంలోనే యాజకుడు మగ గొర్రెపిల్లను వధించాలి. అపరాధపరిహారార్థ బలి పాపపరిహారార్థ బలిలాగే ఉంటుంది. అది యాజకునికే చెందుతుంది. అది చాలా పవిత్రం.
14 “అపరాధపరిహారార్థ బలినుండి కొంత రక్తాన్ని యాజకుడు తీసుకోవాలి. పవిత్ర పర్చబడాల్సిన వ్యక్తికుడి చెవి కొన మీద ఈ రక్తంలో కొంచెం యాజకుడు వేయాలి. ఆ వ్యక్తి కుడి చేతి బొటన వేలిమీద, కుడి పాదపు బొటనవేలిమీద ఈ రక్తంలో కొంచెం యాజకుడు వేయాలి. 15 యాజకుడు కొంచెం నూనె తీసుకొని తన ఎడమ అరచేతిలో పోసుకోవాలి. 16 అప్పుడు యాజకుడు తన ఎడమ చేతిలో ఉన్న నూనెలో తన కుడి చేత వేలిని ముంచాలి. ఆ నూనెలో కొంచెం యెహోవా ఎదుట ఏడుసార్లు చిలకరించేందుకు ఆవేలిని అతడు ఉపయోగించాలి. 17 పవిత్ర పర్చబడాల్సిన ఆ వ్యక్తి కుడి చెవి కొనమీద యాజకుడు తన అరచేతిలోని నూనె కొంచెం పోయాలి. ఆ వ్యక్తి కుడి చేతి బొటన వేలిమీద కుడి పాదం బొటనవేలి మీద యాజకుడు ఆ నూనెలో కొంచెం పోయాలి. అపరాధపరిహారార్థ బలి అర్పణపు రక్తం మీద యాజకుడు ఆ నూనెలో కొంచెం పోయాలి. 18 యాజకుడు తన అరచేతిలో మిగిలిన నూనెను పవిత్రపర్చబడాల్సిన వ్యక్తి తలమీద పోయాలి. ఈ విధంగా యెహోవా ఎదుట ఆ వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచి వేస్తాడు.
19 “తర్వాత ఆ వ్యక్తి పవిత్రుడయ్యేటట్టు యాజకుడు పాపపరిహారార్థ బలిని అర్పించి, ఆ వ్యక్తి పాపాలను తుడిచివేయాలి. ఆ తర్వాత దహనబలి పశువును యాజకుడు వధించాలి. 20 అప్పుడు యాజకుడు దహనబలి అర్పణను, ధాన్యార్పణను బలిపీఠం మీద అర్పించాలి. ఈ విధంగా ఆ వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచివేయాలి. ఆ వ్యక్తి పవిత్రుడవుతాడు.
స్కెవ కుమారులు
11 దేవుడు పౌలు ద్వారా ఎన్నో మహత్కార్యాలు చేసాడు. 12 ప్రజలు అతడు తాకిన జేబు రుమాళ్ళను, తుండు గుడ్డల్ని తీసుకొని జబ్బుతో ఉన్నవాళ్ళ దగ్గరకు వెళ్ళేవాళ్ళు. వాటితో వాళ్ళ జబ్బులు నయమయ్యేవి. పట్టిన దయ్యాలు వదిలిపొయ్యేవి.
13 చుట్టూ ఉన్న ప్రాంతాలలో తిరిగి దయ్యాల్ని వదిలిస్తున్న కొందరు యూదులు యేసు ప్రభువు పేరునుపయోగించి దయ్యాలు పట్టినవాళ్ళకు నయం చెయ్యటానికి ప్రయత్నించారు. వాళ్ళు, “పౌలు ప్రకటిస్తున్న యేసు పేరిట ఆజ్ఞాపిస్తున్నాము. బయటకు రా!” అని అనేవాళ్ళు. 14 స్కెవ అనే యూదుల ప్రధానయాజకుడు, అతని ఏడుగురు కుమారులు యిలా చేసేవాళ్ళు.
15 ఒకసారి ఆ దయ్యం, “యేసు ఎవరో నాకు తెలుసు. పౌలు ఎవరో నాకు తెలుసు. కాని మీరెవరు?” అని అడిగింది.
16 ఆ దయ్యం పట్టిన వాడు వాళ్ళ మీద పడి వాళ్ళను బాగా కొట్టాడు. వాళ్ళు రక్తం కార్చుకొంటూ ఆ యిల్లు వదిలి దిగంబరంగా పారిపోయారు.
17 ఎఫెసులో నివసిస్తున్న యూదులకు, గ్రీకులకు ఈ విషయం తెలిసింది. వాళ్ళందరూ భయపడి యేసు ప్రభువు నామాన్ని చాలా గౌరవించటం మొదలు పెట్టారు. 18 ఇది జరిగాక చాలా మంది తాము చేసిన వాటిని బహిరంగంగా ఒప్పుకోవటం మొదలు పెట్టారు. 19 మంత్ర విద్య నేర్చిన కొందరు తమ గ్రంథాల్ని తెచ్చి అందరి సమక్షంలో వాటిని కాల్చి వేసారు. ఆ తదుపరి వాళ్ళు తాము కాల్చిన గ్రంథాల వెలగట్టి వాటి వెల సుమారు యాభై వేల ద్రాక్మాలని[a] నిర్ణయించారు. 20 ఈ విధంగా ప్రభువు సందేశం బాగా వ్యాపించింది. దాని ప్రభావం అభివృద్ధి చెందుతూ వచ్చింది.
© 1997 Bible League International