Revised Common Lectionary (Complementary)
12 అయితే యెహోవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు.
నీ నామం శాశ్వతంగా కొనసాగుతుంది.
13 నీవు లేచి సీయోనును ఆదరిస్తావు.
నీవు సీయోను యెడల దయగా ఉండే సమయం వస్తూంది.
14 యెరూషలేము పట్టణపు రాళ్లను వారు ప్రేమిస్తారు.
15 జనసముదాయాలు యెహోవా నామాన్ని ఆరాధిస్తారు.
దేవా, భూమి మీద రాజులందరూ నిన్ను గౌరవిస్తారు.
16 ఎందుకంటే యెహోవా సీయోనును మరల నిర్మిస్తాడు.
యెరూషలేము మహిమను ప్రజలు మరల చూస్తారు.
17 దేవుడు సజీవులుగా విడిచిపెట్టిన ప్రజల ప్రార్థనలు వింటాడు.
దేవుడు వారి ప్రార్థనలు వింటాడు.
18 రాబోయే తరంవారు చదువుకొనేందుకు ఈ సంగతులు రాసిపెట్టు.
అప్పుడు, భవిష్యత్తులో ఆ ప్రజలు యెహోవాను స్తుతిస్తారు.
19 యెహోవా పైనున్న తన పవిత్ర స్థానం నుండి క్రిందకు చూస్తాడు.
యెహోవా పరలోకం నుండి క్రింద భూమిని చూస్తాడు.
20 ఖైదీల ప్రార్థనలు ఆయన వింటాడు.
మరణశిక్ష విధించబడిన ప్రజలను ఆయన విడుదల చేస్తాడు.
21 సీయోను ప్రజలు యెహోవాను గూర్చి చెబుతారు.
వారు యెహోవా నామాన్ని యెరూషలేములో స్మరిస్తారు.
22 జనసమూహములు కలిసి పోగుచేయబడునప్పుడు
రాజ్యాలు యెహోవాకు సేవచేయటానికి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది.
23 నాలో బలం పోయింది.
నా జీవితం తక్కువగా చేయబడింది.
24 కనుక నేను ఇలా చెప్పాను, “నేను ఇంకా యువకునిగా ఉండగానే నన్ను చావనివ్వకు.
దేవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు.
25 చాలా కాలం క్రిందట నీవు ప్రపంచాన్ని సృష్టించావు.
ఆకాశాన్ని నీ స్వహస్తాలతో చేశావు.
26 ప్రపంచం, ఆకాశం అంతం ఆవుతాయి.
కాని నీవు శాశ్వతంగా జీవిస్తావు.
అవి బట్టల్లా పాడైపోతాయి.
మరియు వస్త్రాలు మార్చినట్టుగా నీవు వాటిని మార్చివేస్తావు. అవన్నీ మార్చివేయబడతాయి.
27 కాని, దేవా, నీవు ఎన్నటికీ మారవు.
నీవు శాశ్వతంగా జీవిస్తావు!
28 ఈ వేళ మేము నీ సేవకులము.
భవిష్యత్తులో మా సంతతి వారిక్కడ నివసిస్తారు.
మరియు వారి సంతతి వారిక్కడ నిన్ను ఆరాధిస్తారు.”
షూనేములోని ఒక స్త్రీ ఎలీషాకి గది ఇచ్చుట
8 ఒకరోజు ఎలీషా షూనేము వెళ్లాడు. ఒక ముఖ్యమైన స్త్రీ షూనేములో నివసిస్తున్నది. ఈ స్త్రీ తన ఇంట విశ్రమించి భోజనం చేయమని ఎలీషాను కోరింది. కనుక ఆ ప్రదేశం మీదుగా ఎలీషా వెళ్లిన ప్రతిసారి అక్కడ ఆగి భోజనం చేసేవాడు.
9 ఆ స్త్రీ తన భర్తతో, “ఇదుగో, నాకు ఎలీషా దేవుని పవిత్ర వ్యక్తిగా గోచరిస్తున్నాడు. ఎప్పుడూ అతను మన ఇంటి మీదుగా వెళ్తాడు. 10 ఎలీషా కోసం మనము ఇంటి పై భాగాన ఒక గదిని కట్టిద్దాము. ఆ గదిలో ఒక మంచము కూడా అమర్చుదాము. అక్కడ ఒక మేజాబల్ల, ఒక కుర్చీ, ఒక దీపం ఉంచుదాము. ఎప్పుడైతే అతను మన ఇంటికి వస్తాడో అప్పుడు దీనిని అతను తన గదిగా వాడుకోవచ్చు” అని చెప్పింది.
11 ఒక రోజు ఎలీషా ఆమె ఇంటికి వచ్చాడు. అతను ఆ గదికి వెళ్లి, అక్కడ విశ్రమించాడు. 12 ఎలీషా తన సేవకుడైన గేహజీతో, “ఆ షూనేము స్త్రీని పిలువుము” అని చెప్పాడు.
సేవకుడు షూనేము స్త్రీని పిలిచాడు. ఆమె ఎలీషా ఎదుట నిలిచింది. 13 ఎలీషా తన సేవకునితో ఇట్లనెను: “ఇప్పుడీమెకు చెప్పుము. మాకోసం నీవు చేయదగినదంతా చేశావు. నీ కోసం మేమేమి చేయుదుము? మేము నీ పక్షమున రాజుతో గాని, సైన్యం యొక్క నాయకునితో గాని ఏమైనా చెప్పమంటావా?”
ఆ స్త్రీ, “నేను నా ప్రజల మధ్య హాయిగా ఇక్కడ నివసిస్తున్నాను” అని బదులు చెప్పింది.
14 “మనమామెకు ఏమి చేద్దాం?” అని ఎలీషా గేహజీని అడిగాడు.
“ఆమెకు కొడుకు లేడని నాకు తెలియును. ఆమె భర్త ముసలివాడు” అని ప్రత్యుత్తర మిచ్చాడు.
15 అప్పుడు ఎలీషా, “ఆమెను పిలువుము” అన్నాడు.
అందువల్ల గేహజీ ఆమెను పిలుచుకొని వచ్చాడు. ఆమె వచ్చి అతని ఎదుట నిలబడింది. 16 ఎలీషా ఆమెతో, “వచ్చే వసంత కాలంలో, ఈ పాటికి నీవు నీ సొంత మగ బిడ్డను కౌగిలించుకుని ఉందువు” అన్నాడు.
ఆ స్త్రీ, “కాదు దైవజనుడా! నాతో అబద్ధం చెప్పకు” అని చెప్పింది.
షూనేము స్త్రీకి కొడుకు పుట్టుట
17 ఆమె గర్భవతి అయింది. ఎలీషా చెప్పినట్లుగా, తరువాత వసంత ఋతువులో ఆమె ఒక కుమారుని ప్రసవించింది.
షూనేము స్త్రీ కుమారుడు మరల బ్రతుకుట
32 ఎలీషా ఇంట్లోకి వెళ్లాడు. తన మంచం మీద ఆ బిడ్డ చనిపోయివున్నాడు. 33 ఎలీషా గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు. ఇప్పుడు ఎలీషా మరియు ఆబిడ్డ మాత్రమే గదిలో వున్నారు. అప్పుడు ఎలీషా యెహోవాని ప్రార్థించాడు. 34 ఎలీషా పడక వద్దకు వెళ్లాడు. బిడ్డ మీద పడుకున్నాడు. ఎలీషా తన నోటిని బిడ్డ నోటిమీద వుంచాడు. ఎలీషా తన కండ్లను బిడ్డ కండ్ల మీద వుంచాడు. తరువాత బిడ్డ దేహం వేడి ఎక్కేంత వరకు బిడ్డమీద ఎలీషా పండుకొన్నాడు.
35 తర్వాత ఎలీషా లేచి ఆ గది చుట్టూ తిరిగాడు. వెనుకకు వెళ్లి, బిడ్డ ఏడు సార్లు తుమ్మేంత వరకూ కళ్లు తెరిచేంతవరకూ బిడ్డ మీద పండుకొన్నాడు.
36 ఎలీషా గేహజీని పిలిచి, “ఆ షూనేము స్త్రీని పిలువుము” అని చెప్పాడు.
గేహజీ షూనేము స్త్రీని పిలిచాడు. ఆమె ఎలీషా వద్దకు వచ్చింది. “నీ కొడుకుని ఎత్తుకో” అని ఎలీషా చెప్పాడు.
37 తర్వాత షూనేము స్త్రీ గదిలోకి వెళ్లి, ఎలీషా పాదాలకు మోకరిల్లింది. ఆ తర్వాత తన పిల్లవాడిని ఎత్తుకుని ఆమె వెలుపలికి వెళ్లింది.
ఈకొనియలో
14 ఈకొనియలో పౌలు, బర్నబా ఎప్పటిలాగే యూదుల సమాజమందిరానికి వెళ్ళి, బాగా మాట్లాడారు. తద్వారా చాలా మంది యూదులు, యూదులు కానివాళ్ళు విశ్వాసులయ్యారు. 2 వాళ్ళ సందేశాన్ని నమ్మని యూదులు, యూదులు కానివాళ్ళను రేకెత్తించి మన సోదరులకు విరుద్ధంగా వాళ్ళ మనసుల్ని పాడుచేసారు.
3 కాబట్టి, వాళ్ళు ప్రభువు పట్ల తమ విశ్వాసము విడువక ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ చాలాకాలం ఉన్నారు. ప్రభువు వాళ్ళకు అద్భుతాలను, మహిమలను చేసే శక్తినిచ్చాడు. ఈ విధంగా తన అనుగ్రహాన్ని గురించి రుజువు చేసాడు. 4 ఆ పట్టణంలోని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి కొందరు యూదుల పక్షం, మరికొందరు అపొస్తలుల పక్షం చేరిపోయారు.
5 యూదులు కానివాళ్ళు, యూదులు తమ తమ నాయకులతో కలిసి అపొస్తలుల్ని అవమానించి, రాళ్ళతో కొట్టి చంపివేయాలనుకొన్నారు. 6 కాని అపొస్తలులు ఇది కనిపెట్టి లుకయొనియలోని లుస్త్ర, దెర్బే అనే పట్టణాల చుట్టూ ఉన్న ప్రాంతాలకు వెళ్ళిపోయారు. 7 ఆయా ప్రాంతాల్లో వాళ్ళు దేవుని సువార్తను ప్రకటించటం కొనసాగించారు.
© 1997 Bible League International