Revised Common Lectionary (Complementary)
21 తప్పకుండా సత్యం నీకు తెలుసు కదూ?
తప్పక అది నీవు విన్నావు.
ఆదిలోనే ఎవరో ఒకరు నీతో సత్యం చెప్పారు.
భూమిని చేసింది ఎవరో తప్పక నీకు తెలుసు.
22 నిజమైన దేవుడు భూగోళానికి పైగా కూర్చుని ఉంటాడు.
ఆయనతో పోల్చి చూస్తే మనుష్యులు మిడతల్లా ఉంటారు.
ఆయన ఆకాశాలను బట్ట తెరచినట్టు తెరిచాడు.
ఆయన ఆకాశాలను ఒక గుడారంలా దాని క్రింద కూర్చునేందుకు పరిచాడు.
23 నిజమైన దేవుడు పరిపాలకులను ప్రాముఖ్యత లేనివారినిగా చేస్తాడు.
ఆయన ఈ లోకపు న్యాయమూర్తులను పూర్తిగా నిష్ప్రయోజకులనుగా చేస్తాడు.
24 ఆ పరిపాలకులు మొక్కల్లా ఉన్నారు వారు భూమిలో నాటబడ్డారు
కానీ వారు నేలలో వేరు తన్నుకొనక ముందే
దేవుడు ఆ మొక్కల మీద గాలి విసరజేస్తాడు.
దాంతో అవి చచ్చి, ఎండి పోతాయి.
గాలి వాటిని గడ్డి పరకల్లా కొట్టుకొని పోజేస్తుంది.
25 పరిశుద్ధుడు (దేవుడు) చెబుతున్నాడు: “నన్ను నీవు ఎవరితోనైనా పోల్చగలవా?
లేదు. నాకు ఎవరు సమానం కాదు.”
26 పైన ఆకాశాలను చూడు.
ఆ నక్షత్రాలన్నింటినీ ఎవరు సృష్టించారు?
ఆకాశంలోని ఆ “సైన్యాలు” అన్నింటిని ఎవరు సృష్టించారు?
ప్రతి నక్షత్రం దాని పేరుతో సహా ఎవరికి తెలుసు?
సత్యవంతుడైన దేవుడు చాలా బలం, శక్తి గలవాడు,
అందుచేత ఈ నక్షత్రాల్లో ఒక్కటి కూడ తప్పిపోదు.
27 యాకోబూ, ఇది నిజం!
ఇశ్రాయేలూ, దీనిని నీవు నమ్మాలి!
“నేను జీవించే విధము యెహోవా చూడలేదు
దేవుడు నన్ను కనుగొని శిక్షించాడు అని నీవెందుకు చెపుతున్నావు?”
28 యెహోవా అలసిపోడు, ఆయనకు విశ్రాంతి అవసరంలేదు.
భూమిమీద దూర స్థలాలన్నింటినీ యెహోవాయే సృష్టించాడు. యెహోవా నిత్యమూ జీవిస్తాడు.
29 బలహీనులు బలంగా ఉండేటట్టు యెహోవా సహాయం చేస్తాడు.
శక్తిలేని వాళ్లను ఆయన శక్తి మంతులుగా చేస్తాడు.
30 యువకులు అలసిపోతారు, వారికి విశ్రాంతి కావాలి.
చివరికి బాలురు కూడ తొట్రిల్లి, పడిపోతారు.
31 కాని యెహోవా మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద ఆధారపడే మనుష్యులు తిరిగి బలంగల వాళ్లవుతారు. అది వారు పక్షి రాజులా రెక్కలు కలిగి ఉన్నట్టుగా ఉంటుంది.
వారు విశ్రాంతి అవసరం లేకుండా పరుగుల మీద పరుగులు తీస్తూ ఉంటారు.
వారు అలసి పోకుండా నడుస్తారు.
147 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
మన దేవునికి స్తుతులు పాడండి.
ఆయనను స్తుతించుట మంచిది, అది ఎంతో ఆనందం.
2 యెహోవా యెరూషలేమును నిర్మించాడు.
బందీలుగా తీసికొనిపోబడిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వెనుకకు తీసికొనివచ్చాడు.
3 పగిలిన వారి హృదయాలను దేవుడు స్వస్థపరచి,
వారి గాయాలకు కట్లు కడతాడు.
4 దేవుడు నక్షత్రాలను లెక్కిస్తాడు.
వాటి పేర్లనుబట్టి వాటన్నిటినీ ఆయన పిలుస్తాడు.
5 మన ప్రభువు చాలా గొప్పవాడు. ఆయన చాలా శక్తిగలవాడు.
ఆయన పరిజ్ఞానానికి పరిమితి లేదు.
6 పేదలను యెహోవా బలపరుస్తాడు.
కాని చెడ్డ ప్రజలను ఆయన ఇబ్బంది పెడతాడు.
7 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి.
స్వరమండలాలతో మన దేవుణ్ణి స్తుతించండి.
8 దేవుడు ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు.
భూమి కోసం దేవుడు వర్షాన్ని సృష్టిస్తాడు.
పర్వతాల మీద దేవుడు గడ్డిని మొలిపిస్తాడు.
9 జంతువులకు దేవుడు ఆహారం యిస్తాడు.
పక్షి పిల్లల్ని దేవుడు పోషిస్తాడు.
10 యుద్ధాశ్వాలు, బలంగల సైనికులు ఆయనకు ఇష్టం లేదు.
11 యెహోవాను ఆరాధించే ప్రజలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తారు.
ఆయన నిజమైన ప్రేమను నమ్ముకొనే ప్రజలు యెహోవాకు సంతోషం కలిగిస్తారు.
20 దేవుడు యిలా మరి ఏ దేశానికీ చెయ్యలేదు.
ఇతర మనుష్యులకు దేవుడు తన న్యాయ చట్టం ఉపదేశించలేదు.
యెహోవాను స్తుతించండి!
16 కాని నేను సువార్త ప్రకటిస్తున్నందుకు గొప్పలు చెప్పుకోలేను. సువార్త బోధించటం నా కర్తవ్యం. నేను సువార్త బోధించటం ఆపేస్తే నాకు శాపం కలుగుగాక! 17 స్వయంగా ఈ పని చేస్తే నాకు బహుమానం ఉంది. ఈ పని చెయ్యాలని నేను స్వయంగా కోరలేదు. ఆ బాధ్యతను నాకు దేవుడే అప్పగించాడు. 18 మరి నా ప్రతిఫలం ఏమిటి? ప్రతిఫలం పుచ్చుకోకుండా, నా హక్కులు అడగకుండా సువార్తను ప్రకటించటమే నా ప్రతిఫలం.
19 నేను స్వేచ్ఛాజీవిని, ఎవ్వరికీ బానిసను కాను. కాని చేతనైనంతమందిని గెలవాలని నేను ప్రతి ఒక్కనికీ బానిసనౌతాను. 20 నేను యూదులతో ఉన్నప్పుడు వాళ్ళని గెలవాలని యూదునిలా జీవించాను. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలు గెలవాలని, నేను ధర్మశాస్త్రం అనుసరించవలసిన అవసరం లేకపోయినా ధర్మశాస్త్రం అనుసరించేవాళ్ళకోసం దాన్ని అనుసరిస్తూ ఉన్నట్లు జీవించాను. 21 ధర్మశాస్త్రం లేనివాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళని గెలవాలని, ధర్మశాస్త్రం లేనివానిగా ప్రవర్తించాను. అంటే నేను దేవుని న్యాయానికి అతీతుడను కాను. నిజానికి నేను క్రీస్తు న్యాయాన్ని అనుసరిస్తున్నాను. 22 బలహీనుల్ని గెలవాలని బలహీనుల కోసం బలహీనుడనయ్యాను. ఏదో ఒక విధంగా కొందరినైనా రక్షించగలుగుతానేమో అని నేను అందరికోసం అన్ని విధాలుగా మారిపొయ్యాను. 23 నేను ఇవన్నీ సువార్త కోసం చేసాను. అది అందించే దీవెనలు పొందాలని నా అభిలాష.
యేసు అనేకులను నయం చేయటం
(మత్తయి 8:14-17; లూకా 4:38-41)
29 వాళ్ళు సమాజమందిరం వదిలి నేరుగా యాకోబు మరియు యోహానులతో కలిసి సీమోను మరియు అంద్రెయల ఇంటికి వెళ్ళారు. 30 సీమోను అత్త జ్వరంతో మంచం పట్టివుంది. ఆమెను గురించి వాళ్ళు యేసుతో చెప్పారు. 31 ఆయన ఆమెను సమీపించి చేయి పట్టుకొని లేపి కూర్చోబెట్టాడు. జ్వరం ఆమెను వదిలిపోయింది. ఆమె వెంటనే వాళ్ళకు పరిచర్యలు చెయ్యటం మొదలు పెట్టింది.
32 ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం కాగానే ప్రజలు వ్యాధిగ్రస్తుల్ని, దయ్యంపట్టిన వాళ్ళను, యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. 33 ఆ ఊరంతా ఆయనవున్న యింటిముందు చేరుకుంది. 34 రకరకాల వ్యాధులున్న వాళ్ళకు యేసు నయం చేసాడు. ఎన్నో దయ్యాలను విడిపించాడు. ఆ దయ్యాలకు తానెవరో తెలుసు కనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.
యేసు ఇతర పట్టణాలకు వెళ్ళటం
(లూకా 4:42-44)
35 యేసు తెల్లవారుఝామున ఇంకా చీకటియుండగానే లేచి యిల్లు వదిలి ఎడారి ప్రదేశానికి వెళ్ళి, అక్కడ ప్రార్థించాడు. 36 సీమోను మరియు అతని సహచరులు యేసును వెతకటానికి వెళ్ళారు. 37 ఆయన్ని చూసి వాళ్ళు, “అంతా మీకోసం వెతుకుతున్నారు” అని అన్నారు.
38 యేసు సమాధానం చెబుతూ, “ఇతర గ్రామాలకు వెళ్దాం రండి. అక్కడ కూడా ప్రకటించాలని నా అభిలాష, నేను వచ్చింది కూడా అందుకే కదా!” అని అన్నాడు. 39 ఆయన గలిలయ ప్రాంతమంతా పర్యటన చేసి అక్కడి సమాజమందిరాల్లో ప్రకటించాడు. దయ్యాలను వదిలించాడు.
© 1997 Bible League International