Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
35 యెహోవా, నా పోరాటాలు పోరాడుము
నా యుద్ధాలు పోరాడుము.
2 యెహోవా, కేడెము, డాలు పట్టుకొని,
లేచి, నాకు సహాయం చేయుము.
3 ఈటె, బరిసె తీసుకొని
నన్ను తరుముతున్న వారితో పోరాడుము.
“నేను నిన్ను రక్షిస్తాను” అని, యెహోవా, నా ఆత్మతో చెప్పుము,
4 కొందరు మనుష్యులు నన్ను చంపాలని చూస్తున్నారు.
ఆ ప్రజలు నిరాశచెంది, సిగ్గుపడేలా చేయుము.
వారు మళ్లుకొని పారిపోయేట్టు చేయుము.
ఆ మనుష్యులు నాకు హాని చేయాలని తలస్తున్నారు.
వారిని ఇబ్బంది పెట్టుము.
5 ఆ మనుష్యుల్ని గాలికి ఎగిరిపోయే పొట్టులా చేయుము.
యెహోవా దూత వారిని తరిమేలా చేయుము.
6 యెహోవా, వారి మార్గం చీకటిగాను, జారిపోయేటట్టుగాను చేయుము.
యెహోవా దూత వారిని తరుమును గాక!
7 నేనేమీ తప్పు చేయలేదు. కాని ఆ మనుష్యులు నన్ను ఉచ్చులో వేసి చంపాలని ప్రయత్నించారు.
నేను తప్పు ఏమీ చేయలేదు. కాని వారు నన్ను పట్టుకోవాలని ప్రయత్నించారు.
8 కనుక యెహోవా, ఆ మనుష్యులను వారి ఉచ్చులలోనే పడనిమ్ము.
వారి స్వంత ఉచ్చులలో వారినే తొట్రిల్లి పడనిమ్ము.
తెలియని ఆపద ఏదైనా వారిని పట్టుకోనిమ్ము.
9 అంతట నేను యెహోవాయందు ఆనందిస్తాను.
ఆయన నన్ను రక్షించినప్పుడు నేను సంతోషంగా ఉంటాను.
10 “యెహోవా, నీ వంటివాడు ఒక్కడూ లేడు.
యెహోవా, బలవంతుల నుండి పేదవారిని నీవు రక్షిస్తావు.
దోచుకొనువారినుండి నిస్సహాయులను పేదవారిని నీవు రక్షిస్తావు”
అని నా పూర్ణ వ్యక్తిత్వంతో నేను చెబుతాను.
22 బిలాము తన గాడిద మీద వెళ్తున్నాడు. అతని ఇద్దరు సేవకులు అతనితో ఉన్నారు. బిలాము ప్రయాణం చేస్తుండగా దేవునికి కోపం వచ్చింది. కనుక యెహోవా దూత మార్గంలో బిలాము ఎదుట నిలబడ్డాడు. ఆ దూత బిలామును ఆపుజేయబోతున్నాడు.
23 దారిలో యెహోవా దూత నిలబడటం బిలాము గాడిద చూచింది. ఆ దూత చేతిలో ఖడ్గం ఉంది. కనుక గాడిద దారి తొలగి పక్క పొలంలోకి వెళ్లింది. బిలాము యెహోవా దూతను చూడలేదు. అందుచేత అతనికి తన గాడిద మీద చాల కోపం వచ్చింది. అతడు గాడిదను కొట్టి, మళ్లీ దారి మీదికి వెళ్లేందుకు దాన్ని బలవంతం చేసాడు.
24 తర్వాత ఆ దారిలో ఇరుకైన చోట యెహోవా దూత నిలబడ్డాడు. ఇది రెండు ద్రాక్ష తోటల మధ్యఉంది. దారికి రెండు వైపులా గోడలు ఉన్నాయి 25 మళ్లీ ఆ గాడిద యెహోవా దూతను చూచింది. అందుచేత ఆ గాడిద గోడకు రాసుకొనే అంత దగ్గరగా వెళ్లింది. కనుక బిలాము పాదం గోడకేసి నొక్కేసింది. బిలాము తన గాడిదను మళ్లీ కొట్టాడు.
26 తర్వాత యెహోవా దూత మరో చోట నిలబడ్డాడు. ఇది కూడ ఇరుకు దారి. గాడిద వెనుకకు తిరిగే అంత చోటుకూడ అక్కడలేదు. ఆ గాడిద కుడికి ఎడమకు కూడ తిరుగలేక పోయింది. 27 యెహోవాను ఆ గాడిద మళ్లీ చూచింది. కనుక బిలాముతో సహా ఆ గాడిద కూలబడింది. బిలాముకు ఆ గాడిద మీద చాలా కోపం వచ్చింది. అందుచేత అతడు తన కర్రతో దాన్ని కొట్టాడు.
28 అప్పుడు యెహోవా ఆ గాడిద మాట్లాడేటట్టు చేసాడు. ఆ గాడిద, “నీవు నా మీద ఎందుకు కోపగించు కొంటున్నావు? నీకు నేనేమి చేసాను? నీవు నన్ను మూడుసార్లు కొట్టావు” అంది బిలాముతో.
32 మీరు చింతించరాదని నా కోరిక. “వివాహం చేసుకోనివాడు ప్రభువును ఏ విధంగా ఆనంద పరచాలా” అని, అంటే ఆత్మీయమైన విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. 33 కాని, వివాహితుడు తన భార్యను ఎలా ఆనందపరచాలని ఆలోచిస్తూ ఉంటాడు. కనుక ప్రాపంచిక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. 34 అందువల్ల అతని మనస్సు రెండు రకాలుగా పని చేస్తూ ఉంటుంది. పెళ్ళికాని స్త్రీలు, కన్యలు ప్రభువు ఆజ్ఞల్ని పాటించటంలో నిమగ్నులై ఉంటారు. తమ మనస్సును, శరీరాన్ని ప్రభువుకు అర్పించి పని చేస్తుంటారు. కాని పెళ్ళిచేసుకొన్న స్త్రీలు తమ భర్తను ఆనందపరచటానికి, ప్రాపంచిక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటారు. 35 ఇది నేను మీ మంచి కోసం చెపుతున్నాను. అనవసరమైన కట్టుబాట్లు నియమించాలని కాదు. మీరు సక్రమంగా నడుచుకోవాలని, మనస్ఫూర్తిగా మిమ్నల్ని మీరు ప్రభువుకు అర్పించుకోవాలని నా ఉద్ధేశ్యం.
36 తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకోకుండా ఉండటం అక్రమమని భావించినవాడు, లేక ఆమెకు వయస్సు పెరిగిపోవటంవల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావించినవాడు పెళ్ళి చేసుకోవచ్చు. ఇది పాపం కాదు. 37 కాని పెళ్ళి చేసుకోరాదని తన మనస్సులో నిశ్చయించుకొన్నవాడు, పెళ్ళి చేసుకోవాలనే నిర్బంధం లేనివాడు, తన మనస్సును అదుపులో పెట్టుకోగలవాడు కూడా పెళ్ళి మాని సరియైన పని చేస్తున్నాడు. 38 కనుక తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకొన్నవాడు మంచి పని చేస్తున్నాడు. కాని పెళ్ళి చేసుకోనివాడు ఇంకా మంచి పని చేస్తున్నాడు.
39 భర్త బ్రతికి ఉన్నంత కాలము భార్య అతనికి కట్టుబడి ఉండాలి. అతడు చనిపోతే ఆమె తనకు ఇష్టమున్నవాణ్ణి వివాహం చేసుకోవచ్చు. కాని అతడు ప్రభువు యొక్క విశ్వాసియై ఉండాలి. 40 ఆమె విధవరాలుగా ఉండిపోతే ఆనందంగా ఉంటుందని నా అభిప్రాయం. నాకును దేవుని ఆత్మ సహాయం ఉన్నదని తలస్తున్నాను.
© 1997 Bible League International