Revised Common Lectionary (Complementary)
7 యెహోవా ఇలా చెప్పుచున్నాడు:
“సంతోషంగా ఉండండి. యాకోబు కొరకు పాటలు పాడండి!
రాజ్యాలలో కెల్ల మేటియైన ఇశ్రాయేలు విషయంలో ఎలుగెత్తి చాటండి.
మీ స్తుతి గీతాలు పాడండి! ఇలా చాటి చెప్పండి:
‘యెహోవా తన ప్రజలను కాపాడినాడు![a]
ఇశ్రాయేలు దేశంలో జీవంతో మిగిలిన వారిని యెహోవా రక్షించినాడు!’
8 ఉత్తరాన గల దేశం నుండి
ఇశ్రాయేలీయులను తీసికొని వస్తానని తెలిసికొనండి.
భూమి మీద వివిధ దూర దేశాలలో చెదరియున్న
ఇశ్రాయేలును నేను తిరిగి కూడదీస్తాను.
వారిలో చాలా మంది గుడ్డి వారు, కుంటివారు అయ్యారు.
కొందరు స్త్రీలు నిండు గర్భిణీలై కనటానికి సిద్ధంగా ఉన్నారు.
ఎంతో మంది ప్రజలు తిరిగి వస్తారు.
9 వారు తిరిగి వచ్చే సమయంలో ఎంతగానో దుఃఖిస్తారు.
కాని నేను వారికి మార్గదర్శినై, వారిని ఓదార్చుతాను.
నేను వారిని ప్రవహించే సెలయేళ్ల ప్రక్కగా నడిపించుతాను.
వారు తూలిపోకుండా
తిన్ననైన బాటపై వారిని నడిపిస్తాను.
నేనా విధంగా వారికి దారి చుపుతాను.
కారణమేమంటే నేను ఇశ్రాయేలుకు తండ్రిని
మరియు ఎఫ్రాయిము నా ప్రథమ పుత్రుడు.
10 “ఓ రాజ్యములారా (ప్రజలారా), యెహోవా యొక్క ఈ వర్తమానం వినండి!
ఈ సందేశాన్ని దూరసముద్రతీర వాసులందరికి తెలియజెప్పండి.
‘ఇశ్రాయేలు ప్రజలను చెల్లాచెదురు చేసిన ఆ సర్వోన్నతుడే
తిరిగి వారందరినీ ఒక్క చోటికి కూడదీస్తాడు.
గొర్రెల కాపరిలా తన మందను (ప్రజలను) కాచి రక్షిస్తాడు.’
11 యెహోవా యాకోబును తిరిగి తీసికొని వస్తాడు.
యెహోవా తన ప్రజలను వారి కంటె బలవంతుల బారి నుండి రక్షిస్తాడు.
12 ఇశ్రాయేలు ప్రజలు సీయోను కొండ పైకి వస్తారు.
వారు ఆనందంతో కేకలు వేస్తారు.
యెహోవా వారికి చేసిన అనేక సదుపాయాల కారణంగా
వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి.
యెహోవా వారికి ఆహార ధాన్యాలను, క్రొత్త ద్రాక్షారసాన్ని,
నూనెను, గొర్రె పిల్లలను, ఆవులను ఇస్తాడు.
నీరు పుష్కలంగా లభించే
ఒక తోటలా వారు విలసిల్లుతారు.
ఇశ్రాయేలు ప్రజలు ఇక మీదట
ఎంత మాత్రము ఇబ్బంది పెట్టబడరు.
13 ఇశ్రాయేలు యువతులంతా
సంతోషంతో నాట్యం చేస్తారు.
యువకులు, వృద్ధులు నాట్యంలో పాల్గొంటారు.
వారి విచారాన్ని సంతోషంగా మార్చుతాను.
ఇశ్రాయేలు ప్రజలను ఓదార్చుతాను! వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చుతాను!
14 యాజకులకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది.
నేనిచ్చే పారితోషికాలతో నా ప్రజలు నిండిపోయి తృప్తి చెందుతారు!”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది!
12 యెరూషలేమా, యెహోవాను స్తుతించుము.
సీయోనూ, నీ దేవుని స్తుతించుము!
13 యెరూషలేమా, దేవుడు నీద్వారబంధాలను బలపరుస్తాడు.
నీ పట్టణంలోని ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు.
14 నీ దేశానికి దేవుడు శాంతి కలిగించాడు. కనుక యుద్ధంలో నీ శత్రువులు నీ ధాన్యం తీసుకొని పోలేదు.
ఆహారం కోసం నీకు ధాన్యం సమృద్ధిగా ఉంది.
15 దేవుడు భూమికి ఒక ఆజ్ఞ ఇస్తాడు.
దానికి వెంటనే అది లోబడుతుంది.
16 నేల ఉన్నిలా తెల్లగా అయ్యేంతవరకు మంచు కురిసేటట్టు దేవుడు చేస్తాడు.
ధూళిలా గాలిలో మంచు విసిరేటట్టు చేస్తాడు.
17 దేవుడు ఆకాశం నుండి బండలవలె వడగండ్లు పడేలా చేస్తాడు.
ఆయన పంపే చలికి ఎవడూ నిలువ జాలడు.
18 అప్పుడు, దేవుడు మరో ఆజ్ఞ ఇస్తాడు. వెచ్చటి గాలి మరల వీస్తుంది.
మంచు కరిగిపోతుంది. నీళ్లు ప్రవహించటం మొదలవుతుంది.
19 దేవుడు యాకోబుకు (ఇశ్రాయేలు) తన ఆజ్ఞ ఇచ్చాడు.
దేవుడు ఇశ్రాయేలుకు తన న్యాయచట్టాలు, ఆదేశాలు ఇచ్చాడు.
20 దేవుడు యిలా మరి ఏ దేశానికీ చెయ్యలేదు.
ఇతర మనుష్యులకు దేవుడు తన న్యాయ చట్టం ఉపదేశించలేదు.
యెహోవాను స్తుతించండి!
క్రీస్తులో ఆత్మీయ దీవెనలు
3 మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవునికి స్తుతి కలుగుగాక! దేవుడు పరలోకానికి చెందిన మనకు ఆత్మీయతకు కావలసినవన్నీ మనలో క్రీస్తు ద్వారా సమకూర్చి మనల్ని దీవించాడు. 4 మనము తన దృష్టియందు పవిత్రంగా ఏ తప్పూ చెయ్యకుండా ఉండాలని ప్రపంచాన్ని సృష్టించక ముందే క్రీస్తులో మనల్ని తన ప్రేమవల్ల ఎన్నుకొన్నాడు. 5 యేసు క్రీస్తు ద్వారా మనల్ని తన కుమారులుగా ప్రేమతో దగ్గరకు చేర్చుకోవాలని సృష్టికి ముందే నిర్ణయించాడు. ఇదే ఆయన ఉద్దేశ్యము. ఇలా చేయటమే ఆయన ఆనందం! 6 కనుక ఈ అద్భుతమైన అనుగ్రహాన్ని తాను ప్రేమిస్తున్న క్రీస్తులో ఉన్న మనకు ఉచితంగా యిచ్చిన దేవుణ్ణి మనము స్తుతించుదాం.
7 ఆయన రక్తం వల్ల మనకు విడుదల కలిగింది. మన పాపాలు క్షమించబడ్డాయి. ఆయన అనుగ్రహం ఎంతో గొప్పది. 8 ఆ అనుగ్రహాన్ని దేవుడు మనపై ధారాళంగా కురిపించాడు. ఇది బాగా ఆలోచించి దివ్య జ్ఞానంతో చేసాడు. 9 ఆయన తాను క్రీస్తు ద్వారా ఆనందముతో చెయ్యదలచిన మర్మాన్ని తన యిచ్ఛానుసారం మనకు తెలియచేసాడు. 10 సరియైన సమయం రాగానే తాను పూర్తి చేయదలచినదాన్ని పూర్తి చేస్తాడు. సృష్టినంతటిని, అంటే భూలోకాన్ని, పరలోకాన్ని ఒకటిగా చేసి దానికి క్రీస్తును అధిపతిగా నియమిస్తాడు.
11 అన్నీ ఆయన ఉద్దేశ్యానుసారం, ఆయన నిర్ణయించిన విధంగా సంభవిస్తాయి. తాను సృష్టికి ముందు నిర్ణయించిన విధంగా తన ఉద్దేశ్యం ప్రకారం మనము క్రీస్తులో ఐక్యత పొంది ఆయన ప్రజలుగా ఉండేటట్లు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. 12 క్రీస్తు మనకు రక్షణ యిస్తాడని విశ్వసించినవాళ్ళలో మనము మొదటివాళ్ళము. మనము ఆయన మహిమకు కీర్తి కలిగించాలని ఆయన ఉద్దేశ్యము. ఆయన మహిమను బట్టి ఆయన్ను స్తుతించుదాం. 13 మీరు రక్షణను గురించి చెప్పబడిన సువార్త విన్నారు. ఆ గొప్ప సత్యం మీకు లభించింది. కనుక మీకు కూడా క్రీస్తులో ఐక్యత కలిగింది. ఆయన్ని మీరు విశ్వసించినప్పుడు మీపై ముద్ర వేయబడింది. ఆ ముద్రే దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ. 14 తన ప్రజలందరికీ రక్షణ కలిగే వరకూ వారసత్వానికి హామీగా ఆయన పరిశుద్ధాత్మను మన దగ్గర ఉంచాడు. ఇది ఆయన మహిమ కోసం జరిగింది.
వాక్యము మానవాతారం ఎత్తటం
1 సృష్టికి ముందు నుండి జీవంగల వాక్యము ఉండెను. ఆ వాక్యము దేవునితో ఉండెను. ఆ వాక్యమే దేవుడు. 2 ఆయన సృష్టికి ముందు దేవునితో ఉండేవాడు. 3 ఆయన ద్వారా అన్నీ సృష్టింపబడ్డాయి. సృష్టింపబడినదేదీ ఆయన లేకుండా సృష్టింపబడలేదు. 4 ఆయన జీవానికి మూలం. ఆ జీవం మానవ జాతికి వెలుగునిచ్చెను. 5 వెలుగు చీకట్లో వెలుగుతోంది, కాని చీకటి దాన్ని అర్థం చేసుకోలేదు.
6 దేవుడు ఒక వ్యక్తిని పంపాడు. అతని పేరు యోహాను. 7 తన ద్వారా మానవులు వెలుగును గురించి విని, విశ్వసించాలని అతడు ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చాడు. 8 అతడు ఆ వెలుగు కాదు. ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చిన సాక్షి మాత్రమే అతడు. 9 ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చే ఆ నిజమైన వెలుగు ప్రపంచంలోకి వస్తూ వుండెను.
10 ఆయన ప్రపంచంలోకి వచ్చాడు. ఆయన ద్వారా ప్రపంచం సృష్టింపబడినా, ప్రపంచం ఆయన్ని గుర్తించలేదు. 11 ఆయన తన స్వంత వాళ్ళ దగ్గరకు వచ్చాడు. కాని వాళ్ళాయనను ఒప్పుకోలేదు. 12 అయినా, తనను ఒప్పుకొన్న వాళ్ళందరికి, అంటే తనను నమ్మిన వాళ్ళకందరికి, దేవుని సంతానమయ్యే హక్కును ఇచ్చాడు. 13 కాని వీళ్ళు మానవుల రక్తం వలనకాని, శారీరక వాంఛలవల్ల కాని, మనుష్యుని నిర్ణయంవల్ల కాని, జన్మించలేదు. వీళ్ళు దేవుని సంతానం.
14 ఆ జీవంగల వాక్యము మానవరూపం దాల్చి మానవుల మధ్య జీవించాడు. ఆయనలో కృప, సత్యము సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన తండ్రికి ఏకైక పుత్రుడు. కనుక ఆయనలో ప్రత్యేకమైన తేజస్సు ఉంది. ఆ తేజస్సును మేము చూసాము. 15 యోహాను ఆయన్ని గురించి ఈ విధంగా నొక్కి చెప్పాడు: “ఈయన గురించి నేను యిదివరకే ఈ విధంగా చెప్పాను, ‘నా తర్వాత రానున్నవాడు నాకన్నా ముందునుండి ఉన్నావాడు. కనుక ఆయన నాకన్నా గొప్పవాడు.’”
16 ఆయన పరిపూర్ణతవల్ల మనమంతా అనుగ్రహం మీద అనుగ్రహం పొందాము. 17 దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసు క్రీస్తు ద్వారా కృపను, సత్యాన్ని ఇచ్చాడు. 18 ఎవ్వరూ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. దేవుని ప్రక్కనవున్న ఆయన ఏకైక పుత్రుడు దేవునితో సమానము. ఆయన మనకు దేవుణ్ణి గురించి తెలియచేసాడు.
© 1997 Bible League International