Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 7

యెహోవాకు దావీదు పాడిన కీర్తన. బెన్యామీను వంశానికి చెందిన కీషు కుమారుడైన సౌలును గూర్చినది ఈ పాట.

యెహోవా నా దేవా, నిన్ను నేను నమ్ముకొన్నాను.
    నన్ను తరుముతున్న మనుష్యుల బారినుండి నన్ను రక్షించుము. నన్ను తప్పించుము.
నాకు నీవు సహాయం చేయకపోతే అప్పుడు నేను సింహంచే పట్టబడి చీల్చబడిన జంతువులాగ ఉంటాను.
    నేను ఈడ్చుకొని పోబడతాను. ఏ మనిషి నన్ను రక్షించజాలడు.

యెహోవా నా దేవా, నేను తప్పు చేసిన దోషిని కాను. నేనేమీ తప్పు చేయలేదు.
నా స్నేహితునికి నేనేమీ కీడు చేయలేదు.
    నా స్నేహితుని శత్రువులకు నేను సహాయం చేయలేదు.
కాని నేను అలా చేసియుండిన యెడల శత్రువు నన్ను తరుమనిమ్ము.
    నన్ను పట్టుకొననిమ్ము, నా జీవితాన్ని నేలమీద త్రొక్కనిమ్ము.
    మరియు నా ప్రాణాన్ని మట్టిలోనికి నెట్టివేయనిమ్ము.

యెహోవా, లెమ్ము. నీ కోపాన్ని చూపెట్టుము.
    నా శత్రువు కోపంగా ఉన్నాడు కనుక నిలిచివానికి విరోధంగా పోరాడుము.
    లేచి న్యాయంకోసం వాదించుము.
జనాలను నీ చుట్టూ ప్రోగుచేసి,
    వారి మీద పైనుండి పరిపాలించుము.
ప్రజలకు తీర్పు తీర్చుము. యెహోవా, నాకు తీర్పు తీర్చుము.
    నేను సరిగ్గా ఉన్నట్టు రుజువు చేయుము.
    నేను నిర్దోషిని అని రుజువు చేయుము.
చెడ్డవాళ్లను శిక్షించి
    మంచివాళ్లకు సహాయం చేయుము.
దేవా, నీవు మంచివాడవు,
    మరియు ప్రజల హృదయపు లోతుల్లోనికి నీవు చూడగలవు.

10 నిజాయితీ హృదయాలుగల వారికి దేవుడు సహాయం చేస్తాడు.
    కనుక దేవుడు నన్ను కాపాడుతాడు.
11 దేవుడు మంచి న్యాయమూర్తి,
    మరియు ఏ సమయంలోనైనా దేవుడు తన కోపాన్ని చూపిస్తాడు.
12 దేవుడు ఒక నిర్ణయం చేస్తే
    ఆయన తన మనస్సు మార్చుకోడు.
13 ప్రజలను శిక్షించే శక్తి దేవునికి ఉంది.

14 కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేసేందుకే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు.
    అలాంటివారు రహస్య పథకాలు వేస్తూ, అబద్ధాలు చెబుతారు.
15 వారు యితరులను ఉచ్చులో వేసి, హాని చేయాలని ప్రయత్నిస్తారు.
    అయితే వారి స్వంత ఉచ్చుల్లో వారే చిక్కుబడతారు.
16 వారు పొందాల్సిన శిక్ష వారు పొందుతారు.
    ఇతరులయెడల వారు కృ-రంగా ప్రవర్తించారు.
    అయితే వారు దేనికి పాత్రులో దానిని పొందుతారు.

17 యెహోవా మంచివాడు గనుక నేను ఆయనను స్తుతిస్తాను.
మహోన్నతుడైన యెహోవా నామాన్ని నేను స్తుతిస్తాను.

ఎస్తేరు 8:3-17

తర్వాత ఎస్తేరు మహారాజుతో మళ్లీ మాట్లాడింది. ఆమె రోదిస్తూ మహారాజు పాదాలపైపడి, అగాగీయుడైన హామాను దుష్ట పథకాన్ని రద్దు చేయవలసిందిగా మహారాజును వేడుకుంది. యూదులను హింసించేందుకు హామాను పన్నిన దుష్ట పథకం అది.

మహారాజు తన బంగారు రాజదండంతో ఎస్తేరును తాకాడు. ఎస్తేరు లేచి, మహారాజు ముందు నిలబడింది. అప్పుడు ఎస్తేరు మహారాజుతో ఇలా విన్నవించుకుంది: “మహారాజా, మీకు నేనంటే ఇష్టంవుంటే, తమ దయవుంటే, నా కోసం ఇలా చెయ్యండి. ఇది మంచి ఊహ అనుకుంటేనే ఈ పని చేయండి. నేను తమకి ప్రీతిపాత్రురాలినైతే, హామాను పంపిన ఆజ్ఞను రద్దుచేస్తూ ఒక శాసనం చేయండి. అగాగీయుడైన హామాను మహారాజా వారి సామంత దేశాలన్నింటిలోని యూదులందరినీ సమూలంగా నాశనం చేయమని తాఖీదులు జారీచేశాడు. నా ప్రజలు ఇలాంటి ఘోరమైన విపత్తులకు గురికావడం నేను సహించలేను. నా కుటుంబ సభ్యులు హతమార్చబడటం నేను భరించలేను. అందుకే, మహారాజావారిని ఈ ఘోరాన్ని ఆపు చెయ్యవలసిందిగా అర్థిస్తున్నాను.”

అహష్వేరోషు మహారాజు ఎస్తేరు మహారాణికీ, యూదుడైన మొర్దెకైకీ ఇలా సమాధానమిచ్చాడు, “హామాను యూదులకు శత్రువు కనుకనే వాని ఆస్తిని ఎస్తేరుకి ఇచ్చాను. నా సైనికులు వాడిని ఉరికంబానికెక్కించి, ఉరిదీశారు. ఇప్పుడిక మహారాజు ఆజ్ఞ మేరకు మరో ఆజ్ఞాపత్రం వ్రాయండి. మీకు సర్వోత్తమమని తోచిన పద్ధతిలో, యూదులకు తోడ్పడే విధంగా శాసనాన్ని వ్రాయండి. తర్వాత దానిమీద రాజముద్రికతో ముద్రవేసి మూసెయ్యండి. మహారాజు ఆజ్ఞ మేరకు వ్రాయబడి, దానిమీద రాజముద్రిక గుర్తువేయబడిన ఏ ఆధికారిక ఆజ్ఞాపత్రాన్ని రద్దుచేయ సాధ్యం కాదు.”

మహారాజు వెంటనే లేఖకులను పిలువనంపించాడు. మూడవ నెల, అనగా సీవాను నెల 23వ రోజున యీ ఘటన జరిగింది. లేఖకులు మొర్దెకై ఆజ్ఞలన్నింటినీ వ్రాశారు. అవి యూదులకీ, సామంత రాజులకీ, రాజ్యాధిపతులకీ, 127 దేశాల అధికారులకీ పంపబడ్డాయి. ఆ దేశాలు భారత దేశంనుంచి ఇథియోపియాదాకా విస్తరించి వున్నాయి. ఆ ఆజ్ఞాపత్రాలు ఆయా దేశాల భాషల్లో వ్రాయబడ్డాయి. ఆవి ఆయా ప్రజాబృందాల భాషల్లోకి అనువదించబడ్డాయి. కాగా ఆ ఆజ్ఞాపత్రాలు యూదులకు వాళ్ల స్వంత భాషలో, స్వంతలిపిలో వ్రాయబడ్డాయి. 10 మొర్దెకై ఆ ఆజ్ఞలను అహష్వేరోషు మహారాజు ఆమోదంతో వ్రాశాడు. తర్వాత అతను వాటిమీద రాజముద్రికతో ముద్ర వేయించాడు. అప్పుడిక, మొర్దెకై అశ్వారూఢులైన వార్తాహరుల ద్వారా వాటిని పంపించాడు. మహారాజు అశ్వశాలలోని గుర్రాలు అవి.

11 ఆ లేఖల్లోని మహారాజు ఉత్తరువు ఇలా సాగింది: ప్రతి ఒక్క నగరంలోని యూదులూ తమ ప్రాణ రక్షణ కోసం ఒకచోట గుమిగూడేహక్కు కలిగున్నారు. తమ స్త్రీలపైనా, తమ బిడ్డలపైనా ఏ జాతీయులకు చెందిన ఏ సైన్యాన్నయినా సరే నాశనం చేసే, హత మార్చే, పూర్తిగా రూపు మాపే హక్కు వాళ్లకి వుంది. యూదులకు తమ శత్రువుల ఆస్తిని వశంచేసుకొనే హక్కూ, నాశనం చేసే హక్కూ వున్నాయి.

12 యూదులకు ఈ హక్కు ఒక్క రోజే వుంటుంది. ఆ రోజు అదారు అనబడే 12వ నెల 13వ రోజు. అహష్వేరోషు సామ్రాజ్యంలోని దేశాలన్నింట్లోనూ యూదులకు హక్కు దాఖలు చేయబడింది. 13 మహారాజు ఆజ్ఞాపత్రపు ప్రతి ఒకటి బయటికి పంపబడింది. అదొక శాసనం అయింది. అది అన్ని సామంత దేశాల్లోనూ శాసనం అయింది. సామ్రాజ్యంలో నివసించే ప్రతి ఒక జాతి ప్రజలకీ ఈ శాసనం చాటబడింది. యూదులు ప్రత్యేకమైన ఈ రోజున సర్వసన్నద్ధంగా ఉండేందుకు వీలుగా వాళ్లీపని చేశారు. యూదులు తమ శత్రువులకు బదులు దెబ్బ కొట్టేందుకు ఆ రోజున అనుమతింపబడతారు. 14 వార్తాహరులు మహారాజావారి గుర్రాలమీద వేగంగా సాగిపోయారు. మహారాజు ఆ గుర్రాల రౌతులను వేగంగా వెళ్లమని ఆదేశించాడు. ఆ ఆజ్ఞ రాజధాని అయిన షూషను నగరానికి కూడా వర్తింప జేయబడింది.

15 మొర్దెకై మహారాజు సమక్షం నుంచి బయల్దేరాడు. అతను మహారాజు సమర్పించిన నీలం, తెలుపు ప్రత్యేక దుస్తులు, ఒకపెద్ద బంగారు కిరీటం ధరించాడు. అతని పైవస్త్రం ఊదా రంగులో వుంది. అది చాలా మంచి ఉన్నితో నేసినది. ఆ రోజున షూషను నగరంలో ప్రత్యేకమైన ఒక ఉత్సవం జరుగుతోంది. 16 అది యూదులకు ప్రత్యేకించి ఆనందదాయకమైన రోజుగా, అందరికీ సంతోషానంద భరితమైన రోజుగా పరిణమించింది.

17 మహారాజు ఆజ్ఞ చేరిన ప్రతి దేశంలోనూ, ప్రతి నగరంలోనూ, యూదుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. యూదులు విందులు, వేడుకలు చేసుకున్నారు. ఇతర జాతులకు చెందిన చాలామంది సామాన్య ప్రజలకు యూదులంటే భయంకలిగి, వాళ్లు యూదా మతం పుచ్చుకున్నారు.

ప్రకటన 19:1-9

దేవుణ్ణి స్తుతించండి

19 ఇది జరిగిన తర్వాత పరలోకంలో ఒక పెద్ద ప్రజాసమూహం మాట్లాడుతున్నట్లు నాకు ఒక స్వరం వినిపించి యిలా అన్నది:

“దేవుణ్ణి స్తుతించండి!
రక్షణ, మహిమ, అధికారం మన దేవునిదే.
ఆయన నీతిమంతుడు కనుక న్యాయంగా సత్యంగా తీర్పు చెబుతాడు.
తన వ్యభిచారంతో ప్రపంచాన్ని పాడు చేసిన
    ఆ వేశ్యను ఆయన శిక్షించాడు.
తన సేవకుల రక్తానికి దానిపై కక్ష తీర్చుకొన్నాడు.”

వాళ్ళందరు మళ్ళీ, ఇలా అన్నారు:

“దేవుణ్ణి స్తుతించండి!
కాలిన ఆ మహానగరం నుండి పొగ ఆగకుండా మీదికి వెళ్తుంటుంది.”

ఆ యిరవై నాలుగు మంది పెద్దలు సాష్టాంగ పడి సింహాసనంపై కూర్చొన్న దేవుణ్ణి ఆరాధించారు. అదే విధంగా ఆ నాలుగు ప్రాణులు కూడా ఆరాధించాయి. వాళ్ళు ఇలా అన్నారు:

“ఆమేన్! దేవుణ్ణి స్తుతించండి!”

అప్పుడు సింహాసనం నుండి ఒక స్వరం యిలా అన్నది:

“ఆయన సేవకులైన మీరంతా, చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా మన దేవుణ్ణి స్తుతించండి.
ఆయనకు భయపడే మీరంతా మన దేవుణ్ణి స్తుతించండి.”

ఆ తర్వాత నాకు ఒక ధ్వని వినిపించింది. ఆ ధ్వని పెద్ద ప్రజాసమూహం చేసిన ధ్వనిలా, జలపాతం చేసే ధ్వనిలా, పెద్ద ఉరుముల ధ్వనిలా ఉంది. వాళ్ళు యిలా అన్నారు:

“దేవుణ్ణి స్తుతించండి.
    సర్వశక్తిసంపన్నుడు, మన ప్రభువు అయిన
    దేవుడు మనల్ని పాలిస్తున్నాడు.
మనం ఆనందించుదాం. సంతోషంతో ఆయన్ని ఘనపర్చుదాం.
గొఱ్ఱెపిల్ల వివాహం కానున్నది.
    ఆయన పెళ్ళి కూతురు తనకు తానే సిద్ధం అయింది.
సున్నితమైన నార బట్టలు ఆమె ధరించటానికి యివ్వబడ్డాయి.
    అవి స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయి.”

(సున్నితమైన నారబట్టలు పవిత్రులు చేసిన నీతి పనులను సూచిస్తున్నాయి.)

ఆ తదుపరి దూత నాతో, “ఇది వ్రాయి. గొఱ్ఱెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానింపబడ్డ వాళ్ళు ధన్యులు.” అతడు యింకా ఇలా అన్నాడు, “ఇవి నిజంగా దేవుని మాటలు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International