Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహెజ్కేలు 34:11-16

11 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “నాకు నేనే వారికి కాపరిగా వ్యవహరిస్తాను. చెదరి పోయిన నా గొర్రెలను నేనే వెదకుతాను. నేను వాటి విషయమై జాగ్రత్త తీసుకుంటాను. 12 తన గొర్రెలు తప్పిపోయినప్పుడు ఒక కాపరి వాటి వెంట ఉంటే, అతడు వెళ్లి వాటికొరకు వెదకగలడు. అదే విధంగా, నేను నా గొర్రెల కొరకు వెదకుతాను. నేను నా గొర్రెలను రక్షించుకుంటాను. ఒకానొక ముసురు పట్టిన చీకటి రోజూ చెదరిపోయిన నా గొర్రెలను ఆయా ప్రాంతాల నుండి వెదకి తీసుకు వస్తాను. 13 ఆయా దేశాలనుండి వాటిని తిరిగి తీసుకొని వస్తాను. ఆ ప్రాంతాల నుండి వాటిని కూదీస్తాను. వాటి స్వదేశానికి వాటిని తీసుకొని వస్తాను. ఇశ్రాయేలు పర్వతాల పైన, సెలయేటి గట్ల మీద, ప్రజలు నివసించే అన్ని ప్రాంతాలలోను నేను వాటిని మేపుతాను. 14 నేను వాటిని పచ్చిక బీళ్లకు నడిపిస్తాను. ఇశ్రాయేలు కొండలశిఖరాల పైకి అవి వెళతాయి. అవి అక్కడ పచ్చిక మేసి, మంచి ప్రదేశంలో హాయిగా పండుకొంటాయి. ఇశ్రాయేలు పర్వతాల మీద మంచి పచ్చిక భూములలో అవి మేత మేస్తాయి. 15 అవును, నా మందను నేనే మేపుతాను. వాటిని ఒక విశ్రాంతి స్థలానికి నడిపిస్తాను.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

16 “పోయిన గొర్రెలను నేను వెదకుతాను. చెదరి పోయిన గొర్రెలను నేను తిరిగి తోలుకు వస్తాను. గాయపడిన గొర్రెలకు కట్లు కడతాను. నీరసపడిన గొర్రెలు బలపడేలా చేస్తాను. కాని ఆ బలిసిన, శక్తివంతమైన గొర్రెల కాపరులను మాత్రం నేను నాశనం చేస్తాను. వారికి అర్హమైన శిక్ష వారికి నేను విధిస్తాను.”

యెహెజ్కేలు 34:20-24

20 కావున నా ప్రభువైన యెహోవా వాటికి ఇలా చెపుతున్నాడు: “నాకై నేనే బలిసిన గొర్రెలకు, బక్క చిక్కిన గొర్రెలకు మధ్య తీర్పు ఇస్తాను! 21 బక్క జీవాలు అవతలికి పారిపోయే వరకు వాటిని మీరు మీ భుజాలతోను, పార్శ్వాలతోను తోసి, మీ కొమ్ములతో కుమ్ముతారు. 22 కావున నా మందను నేనే రక్షించు కుంటాను. అవి ఇక ఎంత మాత్రం క్రూర జంతువుల బారిన పడవు. గొర్రెకు మరొక గొర్రెకు మధ్య నేనే తీర్పు ఇస్తాను. 23 తరువాత నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటిని మేపుతాడు. అతడు వాటిని స్వయంగా మేపి, వాటికి కాపరి అవుతాడు. 24 ప్రభువును యెహోవాను అయిన నేను అప్పుడు వాటికి దేవుడనవుతాను. నా సేవకుడగు దావీదు వాటి మధ్య నివసిస్తూ పాలకుడవుతాడు. యెహోవానైన నేనే చెపుతున్నాను.”

కీర్తనలు. 95:1-7

95 రండి, మనం యెహోవాను స్తుతించుదాము.
    మన రక్షణ కొండైన ప్రభువుకు సంతోషగానం చేద్దాము.
యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము.
    సంతోష గీతాలు మనం ఆయనకు పాడుదాము.
ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు గనుక.
    ఆయన యితర “దేవుళ్లందరినీ” పాలించే మహా రాజు.
లోతైన గుహలు, ఎత్తయిన పర్వతాలు యెహోవాకు చెందుతాయి.
మహా సముద్రమూ ఆయనదే. ఆయనే దాన్ని సృష్టించాడు.
    దేవుడు తన స్వహస్తాలతో పొడినేలను చేశాడు.
రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించుదాము.
    మనలను సృష్టించిన దేవున్ని మనం స్తుతిద్దాము.
ఆయన మన దేవుడు,
    మనం ఆయన ప్రజలము.
    మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము.

ఎఫెసీయులకు 1:15-23

పౌలు యొక్క ప్రార్థన

15 ఈ కారణాన నేను మీకు యేసు ప్రభువుపట్ల ఉన్న విశ్వాసాన్ని గురించి, విశ్వాసులపట్ల మీకున్న ప్రేమను గురించి విన్నప్పటినుండి 16 దేవునికి కృతజ్ఞతలు చెప్పటం మానలేదు. ప్రార్థించినప్పుడు మిమ్మల్ని తలుచుకోవటం మానలేదు. 17 నేను ఎల్లప్పుడు మన క్రీస్తు ప్రభువు యొక్క దేవుడు అయిన ఆ మహిమగల తండ్రి మీకు పరిశుద్ధాత్మను యివ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆ పరిశుద్ధాత్మ మీకు జ్ఞానాన్నిచ్చి, దేవుణ్ణి తెలియజేయాలని నా అభిలాష. అప్పుడు మీరు దేవుణ్ణి యింకా ఎక్కువగా తెలుసుకోగలుగుతారు.

18 మీ మనోనేత్రాలు తెరుచుకోవాలని, మీరు ఆశిస్తున్న వారసత్వాన్ని గురించి తెలుసుకోవాలని నా ప్రార్థన. ఆ వారసత్వం మీకివ్వటానికి ఆయన మిమ్మల్ని పిలిచాడు. అప్పుడు ఆయన తన విశ్వాసులకు వాగ్దానం చేసిన ఆశీస్సులు ఎంత అద్భుతమైనవో మీరు చూడగలుగుతారు. 19 క్రీస్తును విశ్వసించే మనలో పని చేస్తున్న ఆయన శక్తి ఎంత ఉత్తమమైనదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన. 20 ఈ శక్తి ద్వారా క్రీస్తును బ్రతికించి పరలోకంలో తన కుడివైపు కూర్చోబెట్టుకున్నాడు. 21 దేవుడు క్రీస్తుకు యిచ్చిన స్థానం అన్ని హోదాలకన్నా, అన్ని అధికారాలకన్నా, అన్ని శక్తులకన్నా, అన్ని రాజ్యాలకన్నా గొప్పది. అది ప్రస్తుతమున్న బిరుదులకన్నా, భవిష్యత్తులో లభించే బిరుదులకన్నా గొప్పది. 22 దేవుడు అన్నిటిని ఆయన పాదాల క్రింద ఉంచి, ఆయన్ని సంఘానికి సంబంధించిన వాటన్నిటిపై అధిపతిగా నియమించాడు. 23 సంఘము ఆయన శరీరం. ఆయన అన్నిటికీ అన్ని విధాల పరిపూర్ణత కలిగిస్తాడు. సంఘం కూడా ఆయన వల్ల పరిపూర్ణత పొందుతుంది.

మత్తయి 25:31-46

మనుష్యకుమారుడు అందరికి తీర్పు తీర్చటం

31 “తేజోవంతుడైన మనుష్యకుమారుడు తన దేవదూతలతో కలసి వస్తాడు. వచ్చి తేజోవంతమైన తన సింహాసనంపై కూర్చుంటాడు. 32 ప్రజలందర్ని సమావేశ పరచి గొఱ్ఱెల కాపరి మేకల్లో నుండి గొఱ్ఱెల్ని వేరు చేసినట్లు వాళ్ళను వేరుచేస్తాడు. 33 తదుపరి కొందరిని తన కుడి వైపున, కొందరిని తన ఎడమ వైపున ఉంచుతాడు.

34 “అప్పుడా రాజు తన కుడి వైపునున్న వాళ్ళతో, ‘రండి! నా తండ్రి ఆశీర్వాదాలను మీరు పొందారు. మీ రాజ్యాన్ని తీసుకొండి. ప్రపంచం సృష్టింపబడినప్పుడే ఈ రాజ్యాన్ని దేవుడు మీకోసం ఉంచాడు. 35 ఎందుకంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు. దాహం వేసినప్పుడు మీరు నాకు నీళ్ళిచ్చారు. పరదేశీయునిగా మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఆతిథ్యమిచ్చారు. 36 దుస్తులు కావలసి వచ్చినప్పుడు మీరు నాకు దుస్తులిచ్చారు. జబ్బుతో ఉన్నప్పుడు మీరు నాకు సేవ చేసారు. నేను కారాగారంలో ఉన్నప్పుడు వచ్చి పలకరించారు’ అని అంటాడు.

37 “అప్పుడు నీతిమంతులు, ‘ప్రభూ! మీరు ఆకలితో ఉండగా మేము ఎప్పుడు మీకు భోజనం పెట్టాము? మీరు దాహంతో ఉండగా మీకు నీళ్ళెప్పుడిచ్చాము? 38 మీరు పరదేశీయునిగా ఎప్పుడు వచ్చారు? మిమ్మల్ని ఎప్పుడు ఆహ్వానించాము? మీకు దుస్తులు ఎప్పుడు కావలసివచ్చింది? దుస్తులు మీకు ఎప్పుడిచ్చాము? 39 మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మేము ఎప్పుడు చూసాము? మీరు కారాగారంలో ఎప్పుడువున్నారు? మిమ్మల్ని చూడటానికి ఎప్పుడు వచ్చాము?’ అని అడుగుతారు.

40 “ఆ రాజు, ‘ఇది సత్యం. హీన స్థితిలో ఉన్న నా సోదరులకు మీరు చేసిన ప్రతి సహాయాన్ని నాకు చేసినట్టుగా పరిగణిస్తాను’ అని సమాధానం చెబుతాడు.

41 “ఆ తర్వాత ఆ రాజు తన ఎడమ వైపునున్న వాళ్ళతో, ‘శాపగ్రస్తులారా! వెళ్ళి పొండి! సైతాను కొరకు, వాని దూతలకొరకు సిద్ధం చేయబడిన శాశ్వతమైన మంటల్లో పడండి. 42 ఎందుకంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. దాహం వేసినప్పుడు మీరు నాకు నీళ్ళివ్వలేదు. 43 నేను పరదేశీయునిగా వచ్చినప్పుడు మీరు నన్ను ఆహ్వానించలేదు. నాకు దుస్తులు కావలసి వచ్చినప్పుడు మీరు దుస్తుల్ని యివ్వలేదు. నేను జబ్బుతో కారాగారంలో ఉన్నప్పుడు మీరు నాకు సేవ చేయలేదు’ అని అంటాడు.

44 “అప్పుడు వాళ్ళు కూడా, ‘ప్రభూ! మీరు ఆకలిగావున్నప్పుడు గాని, లేక దాహంతో ఉన్నప్పుడు కాని, లేక పరదేశీయునిగా కాని, లేక జబ్బుతో ఉన్న వానిగా కాని లేక చెరసాలలో ఉన్నట్టుకాని ఎప్పుడు చూసాము? అలా చూసి కూడా మీకు ఎప్పుడు సహాయం చెయ్యలేదు?’ అని అంటారు.

45 “ఆయన, ‘ఇది సత్యం. హీనస్థితిలో ఉన్నవానికి మీరు సహాయం చెయ్యలేదు. కనుక నాకు సహాయం చెయ్యనట్లే’ అని చెబుతాడు.

46 “వాళ్ళు వెళ్ళి శాశ్వతంగా శిక్షను అనుభవిస్తారు. కాని నీతిమంతులు అనంత జీవితం పొందుతారు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International