Revised Common Lectionary (Complementary)
95 రండి, మనం యెహోవాను స్తుతించుదాము.
మన రక్షణ కొండైన ప్రభువుకు సంతోషగానం చేద్దాము.
2 యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము.
సంతోష గీతాలు మనం ఆయనకు పాడుదాము.
3 ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు గనుక.
ఆయన యితర “దేవుళ్లందరినీ” పాలించే మహా రాజు.
4 లోతైన గుహలు, ఎత్తయిన పర్వతాలు యెహోవాకు చెందుతాయి.
5 మహా సముద్రమూ ఆయనదే. ఆయనే దాన్ని సృష్టించాడు.
దేవుడు తన స్వహస్తాలతో పొడినేలను చేశాడు.
6 రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించుదాము.
మనలను సృష్టించిన దేవున్ని మనం స్తుతిద్దాము.
7 ఆయన మన దేవుడు,
మనం ఆయన ప్రజలము.
మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము.
దావీదుకు దేవుని వాగ్దానం
17 దావీదు తన కొత్త ఇంట్లో ప్రవేశించాక యాజకుడైన నాతానును పిలిచి ఇలా అన్నాడు: “చూడండి, నేను దేవదారు కలపతో నిర్మించిన ఇంటిలో వుంటున్నాను. కాని దేవుని ఒడంబడిక పెట్టె మాత్రం గుడారంలోనే వుంది! నేను దేవునికి ఒక ఆలయం నిర్మింపదలిచాను.”
2 “నీవు ఏది చేయదలచుకొంటే అది చేయవచ్చు. దేవుడు నీకు తోడై వున్నాడు” అని నాతాను దావీదుకు సమాధానమిచ్చాడు.
3 కాని ఆ రోజు రాత్రి దేవుని వాక్కు నాతానుకు వినిపించింది. 4 యెహోవా ఇలా అన్నాడు:
“నీవు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఈ విషయాలు చెప్పు: యెహోవా ఇలా అంటున్నాడు: ‘దావీదూ, నేను నివసించటానికి ఆలయం కట్టించేది నీవు కాదు. 5-6 ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టు నుండి బయటికి తీసుకొని వచ్చినప్పటి నుండి ఈనాటి వరకు నేను ఒక ఆలయంలో నివసించలేదు. ఇక్కడికీ, అక్కడికీ నేను గుడారంలో వుండి కదలి వెళ్తూనే వున్నాను. ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యేక నాయకులను నేను ఎంపిక చేస్తూ వచ్చాను. ఆ నాయకులు నా ప్రజలకు గొర్రెల కాపరులవలె వున్నారు. ఇశ్రాయేలులో నేను ఒక చోటినుండి మరియొక చోటికి వెళ్లెటప్పుడు ఆ నాయకులెవ్వరితోనూ, “మీరు నాకు దేవదారు కలపతో ఒక ఆలయాన్ని ఎందుకు కట్టలేదు?” అని నేను అనలేదు.’
7 “కనుక, ఇప్పుడు ఈ విషయాలు నా సేవకుడైన దావీదుకు చెప్పుము: సర్వశక్తిమంతుడగు యెహోవా ఏమి చెప్పుచున్నాడనగా, ‘పొలాల్లో గొర్రెల మందలను కాస్తున్న నిన్ను నేను తీసుకొన్నాను. నా ప్రజలకు నిన్ను రాజుగా చేశాను. 8 నీవు వెళ్లిన ప్రతిచోటా నేను నీతో వున్నాను. నీకు ముందుగా నేను నడిచాను. నీ శత్రువులను సంహరించాను. నిన్ను ఇప్పుడు ఈ భూమిమీద మిక్కిలి ప్రముఖ వ్యక్తిగా చేసాను. 9 ఈ ప్రదేశాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇస్తున్నాను. వారు తమ మొక్కలను నాటుతారు. వారి చెట్లక్రింద వారు ప్రశాంతంగా కూర్చుంటారు. ఇక ఏ మాత్రం వారు అవస్థపడవలసిన అవసరం లేదు. దుష్టులెవ్వరూ ఇకమీదట పూర్వంవలె వారిని బాధించరు. 10 ప్రమాదాలు సంభవించినందువల్లనే నా ప్రజలైన ఇశ్రాయేలీయుల సంరక్షణకై నేను నాయకులను ఎంపిక చేశాను. నేనింకా నీ శత్రువులను ఓడిస్తాను.
“‘యెహోవా నీకు ఒక నివాసం ఏర్పాటు చేయునని నేను నీకు చెప్పుచున్నాను.[a] 11 నీవు చనిపోయి నీ పూర్వీకులను చేరినప్పుడు నీ సంతానాన్ని నూతన రాజుగా చేస్తాను. కొత్త రాజు నీ కుమారులలో ఒకడవుతాడు. అతని రాజ్యాన్ని నేను బలపర్చుతాను. 12 నీ కుమారుడు నాకొక ఆలయం కట్టిస్తాడు. నీ కుమారుని సంతానం సదా పరిపాలించేలా నేను చేస్తాను. 13 నేను అతనికి తండ్రిలా వుంటాను. అతను నాకు బిడ్డలా వుంటాడు. నీకు ముందు సౌలు రాజుగా వున్నాడు. సౌలుకు నా మద్దతును ఉపసంహరించుకున్నాను. కాని నీ కుమారుని మాత్రం నేను సదా ప్రేమిస్తాను 14 ఎప్పటికీ అతని అధీనంలో నా ఆలయాన్ని, ఈ రాజ్యాన్ని వుంచుతాను. అతని పాలన శాశ్వతంగా కొనసాగుతుంది!’”
15 తనకు కల్గిన దైవ దర్శనాన్ని గురించి, దేవుడు చెప్పిన విషయాలన్నిటి గురించి దావీదుకు నాతాను వివరింగా చెప్పాడు.
22 ఆ తర్వాత ఆ దేవదూత స్పటికంలా స్వచ్ఛంగా ఉన్న నదిని నాకు చూపాడు. దానిలో జీవజలం ఉంది. ఆ నది దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల కూర్చున్న సింహాసనం నుండి మొదలై, 2 పట్టణంలోని గొప్ప వీధి మధ్యనుండి పారుతూ ఉంది. ఆ నదికి యిరువైపులా జీవ వృక్షం ఉంది. ఆ వృక్షానికి పన్నెండు కాపులు కాస్తాయి. ప్రతి నెలా ఆ వృక్షం ఫలాలనిస్తుంది. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను నయం చేయటానికి ఉపయోగింపబడుతాయి.
3 ఇక మీదట ఏ శాపం ఉండదు. దేవునికి మరియు గొఱ్ఱెపిల్లకు చెందిన సింహాసనం పట్టణంలో ఉంటుంది. ఆయన భక్తులు ఆయనకు సేవ చేస్తారు. 4 వాళ్ళు ఆయన ముఖం చూస్తారు. ఆయన పేరు వాళ్ళ నొసళ్ళపై ఉంటుంది. 5 ఇక మీదట చీకటి ఉండదు. ప్రభువైన దేవుడు వాళ్ళకు వెలుగునిస్తాడు. కనుక వాళ్ళకు దీపపు వెలుగు కాని, సూర్యుని వెలుగు కాని అవసరం ఉండదు. వాళ్ళు చిరకాలం రాజ్యం చేస్తారు.
6 ఆ దూత నాతో, “ఇవి నమ్మదగినవి, నిజమైనవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడైన ప్రభువు త్వరలోనే జరుగనున్న వాటిని తన సేవకులకు చూపించటానికి తన దూతను పంపాడు. 7 ‘చూడు! నేను త్వరలోనే రాబోతున్నాను. ఈ గ్రంథంలో చెప్పబడిన ప్రవచన వాక్కును ఆచరించే వాడు ధన్యుడు’” అని అన్నాడు.
8 యోహాను అనబడే నేను ఈ విషయం చూసాను. నేను అవి విని, చూసినప్పుడు నాకు యివి చూపిస్తున్న దూతను ఆరాధించటానికి అతని కాళ్ళమీద పడ్డాను. 9 కాని అతడు నాతో, “నేను నీ తోటి సేవకుణ్ణి, నీ సోదరులతో, ప్రవక్తలతో, ఈ గ్రంథంలో ఉన్న సందేశాలు ఆచరించేవాళ్ళతో కలిసి సేవ చేసేవాణ్ణి. నన్ను ఆరాధించకు. దేవుణ్ణి ఆరాధించు” అని అన్నాడు.
© 1997 Bible League International