Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: ముత్లబ్బేను రాగం. దావీదు కీర్తన.
9 పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను.
యెహోవా, నీవు చేసిన అద్భుతకార్యాలన్నింటిని గూర్చి నేను చెబుతాను.
2 నీవు నన్ను ఎంతగానో సంతోషింపజేస్తున్నావు.
మహోన్నతుడవైన దేవా, నీ నామానికి నేను స్తుతులు పాడుతాను.
3 నా శత్రువులు నీ నుండి పారిపోయేందుకు మళ్లుకొన్నారు.
కాని వారు పడిపోయి, నాశనం చేయబడ్డారు.
4 నీవే మంచి న్యాయమూర్తివి. న్యాయమూర్తిగా నీవు నీ సింహాసనం మీద కూర్చున్నావు.
యెహోవా, నీవు నా వ్యాజ్యెం విన్నావు. మరియు నన్ను గూర్చి న్యాయ నిర్ణయం చేశావు.
5 యూదులు కాని ఆ మనుష్యులతో నీవు కఠినంగా మాట్లాడావు.
యెహోవా, ఆ చెడ్డ మనుష్యుల్ని నీవు నాశనం చేశావు.
బతికి ఉన్న మనుష్యుల జాబితాలో నుండి శాశ్వతంగా ఎప్పటికి వారి పేర్లను నీవు తుడిచి వేసావు.
6 శత్రువు పని అంతం అయిపోయింది.
యెహోవా, వారి పట్టణాలను నీవు నాశనం చేశావు.
ఇప్పుడు శిథిల భవనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఆ దుర్మార్గపు ప్రజలను జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసేది ఏమీ మిగల్లేదు.
7 అయితే యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు.
యెహోవా తన రాజ్యాన్ని బలమైనదిగా చేసాడు. లోకానికి న్యాయం చేకూర్చేందుకు ఆయన దీనిని చేశాడు.
8 భూమి మీద మనుష్యులందరికీ యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు.
యెహోవా రాజ్యాలన్నింటికి ఒకే విధంగా తీర్పు తీరుస్తాడు.
9 అనేకమంది ప్రజలకు అనేక కష్టాలు ఉన్నాయి
గనుక వారు చిక్కుబడి, బాధ పొందుతున్నారు.
ఆ ప్రజలు వారి సమస్యల భారంతో నలిగిపోతున్నారు.
యెహోవా, వారు పారిపోవుటకు భద్రతాస్థలంగా ఉండుము.
10 నీ నామం తెలిసిన ప్రజలు
నీమీద విశ్వాసం ఉంచాలి.
యెహోవా, ప్రజలు నీ దగ్గరకు వస్తే
సహాయం చేయకుండా నీవు వారిని విడిచి పెట్టవు.
11 సీయోనులో నివసిస్తున్న ప్రజలారా, మీరు యెహోవాకు స్తుతులు పాడండి.
యెహోవా చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఇతర దేశాలతో చెప్పండి.
12 సహాయం కోసం యెహోవా దగ్గరకు వెళ్లిన వారిని
ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు.
ఆ దీన ప్రజలు సహాయం కోసం మొరపెట్టారు.
మరి యెహోవా వారిని మరచిపోలేదు.
13 దేవుణ్ణి నేను ఇలా ప్రార్థించాను: “యెహోవా, నా మీద దయ చూపుము.
నా శత్రువులు నాకు హాని చేస్తున్న విధం చూడుము.
‘మరణ ద్వారాల’ నుండి నన్ను రక్షించుము.
14 తర్వాత యెరూషలేము గుమ్మాల దగ్గర, యెహోవా, నేను నీకు స్తుతులు పాడగలను.
నీవు నన్ను రక్షించావు గనుక నేను చాలా సంతోషంగా ఉంటాను.”
నాలుగు గుర్రాలకు సంబంధించిన దర్శనం
7 పర్షియా రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం పదకొండవ నెల (షెబాటు) ఇరవై నాల్గవ రోజున జెకర్యా మరో వర్తమానాన్ని యెహోవానుండి అందుకున్నాడు. (జెకర్యా తండ్రి బెరక్యా, బెరక్యా తండ్రి ప్రవక్త అయిన ఇద్దో.)
8 రాత్రి వేళ ఒకడు ఎర్రగుర్రమునెక్కి స్వారీచేయటం నేను చూశాను. అతడు లోయలోని కదంబ చెట్ల మధ్య నిలుచున్నాడు. అతని వెనుక ఎర్రగుర్రాలు, చుక్కలు చుక్కలుగల గుర్రాలు మరియు తెలుపు గుర్రాలు ఉన్నాయి. 9 “అయ్యా, ఈ గుర్రాలు ఏమిటి?” అని నాతో మాట్లాడుతున్న దేవదూతను నేను అడిగాను.
అప్పుడు దేవదూత నాతో మాట్లాడుతూ, “ఈ గుర్రాలు ఏనిటో నేను నీకు చెపుతాను” అని అన్నాడు.
10 అప్పుడు కదంబచెట్లమధ్య నిలుచున్న మనిషి, “యెహోవా ఈ గుర్రాలను భూలోకమంతా ఇటు అటు తిరగటానికి పంపించాడు” అని చెప్పాడు.
11 తరువాత కదంబ చెట్ల మధ్య నిలుచున్న యెహోవా దూతతో ఆ గుర్రాలు మాట్లాడాయి. “మేము భూలోకమంతా సంచరించాము. అంతా సవ్యంగా, శాంతంగా ఉంది” అని అవి చెప్పాయి.
12 అందుకు యెహోవా దూత, “ప్రభువా! యెరూషలేమును, యూదా నగరాలను ఓదార్చటానికి నీకు ఇంకా ఎంతకాలం పడుతుంది? ఇప్పటికి డెబ్బైయేండ్లగా ఈ నగరాలపై నీ కోపాన్ని చూపిస్తూ వచ్చావే” అన్నాడు.
13 అప్పుడు నాతో మాట్లాడుతూ వున్న దేవదూతకు యెహోవా సమాధానం చెప్పాడు. యెహోవా మంచివైన, ఓదార్పు మాటలు చెప్పాడు.
14 తరువాత దేవదూత నాతో ఇలా అన్నాడు: ఈ విషయాలను ప్రజలకు చెప్పు. సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు:
“యెరూషలేముపట్ల, సీయోనుపట్ల నాకు గాఢమైన ఆసక్తి ఉంది.
15 మిక్కిలి క్షేమంగా ఉన్నామని భావించే దేశాలపట్ల నేను చాలా కోపంగా వున్నాను.
నాకు కొంచెం కోపం వచ్చినప్పుడు.
నా జనులను శిక్షించటానికి నేను ఆ రాజ్యాలను వినియోగించాను.
కాని ఆ రాజ్యాలు వీరికి చాలా హాని చేశాయి.”
16 కాబట్టి యెహోవా ఏమి చెపుతున్నాడంటే, “నేను ప్రేమతో యెరూషలేముకు తిరిగి వచ్చి ఆమెను ఓదార్చుతాను. యెరూషలేము మళ్లీ నిర్మింపబడుతుంది.
మరియు నా ఆలయం అక్కడ కట్టబడుతుందని సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు” అని చెప్పు.
17 “ప్రజలకు ఈ విషయాలు కూడా చెప్పు, సర్వశక్తిమంతుడైన యెహోవా,
‘నా పట్టణాలు మళ్లీ భాగ్యవంత మవుతాయి.
నేను సీయోనును ఓదార్చుతాను.
నేను యెరూషలేమును నా ప్రత్యేక నగరంగా ఎంపిక చేసుకుంటాను’” అని చెపుతున్నాడు.
దేవుని తీర్పు
2 ఇతర్లపై తీర్పు చెప్పే నీవు, ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నావు. ఎందుకంటే ఏవిషయాల్లో నీవు ఇతర్లపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవుకూడా చేస్తున్నావు. అందువల్ల నీకు నీవే శిక్ష విధించుకుంటున్నావు. 2 దేవుడు అలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నవాళ్ళకు సత్యం ఆధారం మీద న్యాయమైన శిక్ష విధిస్తాడని మనకు తెలుసు. 3 మిత్రమా! ఏ కారణాలవల్ల నీవు వాళ్ళపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవు కూడా చేస్తున్నావు. మరి అలాంటప్పుడు దేవుని శిక్షను తప్పించుకోగలనని ఎలా అనుకుంటున్నావు? 4 లేక, నీవు దేవుని అనంతమైన దయను, క్షమను, సహనాన్ని ద్వేషిస్తున్నావా? నీవు మారుమనస్సు పొందాలని దేవుడు నీపై దయచూపాడు. ఈ విషయం నీకు తెలియదా?
5 కాని, నీది కఠిన హృదయం. అది పశ్చాత్తాపం పొందదు. కనుక దేవుడు ఆగ్రహం చూపే రోజున నీకు లభింపనున్న శిక్షను స్వయంగా ఎక్కువ చేసుకొంటున్నావు. ఆరోజు న్యాయమైన తీర్పు నీకు వ్యక్తమౌతుంది. 6 ఆ రోజు దేవుడు ప్రతి ఒక్కనికి అతడు చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు.(A) 7 కొందరు ఎప్పుడూ మంచిపనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు తేజస్సును, గౌరవాన్ని, నశించని దేహాన్ని పొందాలని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకే దేవుడు అనంత జీవాన్నిస్తాడు. 8 మరికొందరు సత్యాన్ని తృణీకరించి, చెడును అనుసరిస్తూ స్వార్థంతో జీవిస్తూ ఉంటారు. దేవుడు అలాంటివాళ్ళపై తన ఆగ్రహాన్ని తీవ్రంగా చూపుతాడు. 9 చెడును చేసిన ప్రతి మనిషికి కష్టాలు, దుఃఖాలు సంభవిస్తాయి. అవి యూదులకు, తర్వాత ఇతరులకు కూడా సంభవిస్తాయి. 10 మంచి చేసిన ప్రతి ఒక్కనికి తేజస్సు, గౌరవము, శాంతి లభిస్తాయి. అవి మొదట యూదులకు తర్వాత ఇతరులకు కూడా లభిస్తాయి. 11 దేవుడు పక్షపాతం చూపడు.
© 1997 Bible League International