Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: ప్రజలు జ్ఞాపకం చేసికొనేందుకు సహాయంగా దావీదు కీర్తన.
70 దేవా, నన్ను రక్షించుము.
దేవా త్వరపడి నాకు సహాయం చేయుము.
2 మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు.
వారిని నిరాశపరచుము.
వారిని అవమానించుము.
మనుష్యులు నాకు చెడు కార్యాలు చేయాలని కోరుతున్నారు.
వారు పడిపోయి సిగ్గు అనుభవిస్తారని నా నిరీక్షణ.
3 మనుష్యులు నన్ను హేళన చేసారు.
వారికి తగినదాన్ని పొందుతారని నా నిరీక్షణ.
4 నిన్ను ఆరాధించే ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను.
నీ మూలంగా రక్షించబడుటకు ఇష్టపడే మనుష్యులు ఎల్లప్పుడూ నిన్ను స్తుతించగలుగుతారు.
5 నేను నిరుపేదను, నిస్సహాయుణ్ణి.
దేవా, త్వరపడి! వచ్చి నన్ను రక్షించుము.
దేవా, నన్ను తప్పించగలవాడవు నీవు ఒక్కడవు మాత్రమే.
ఆలస్యం చేయవద్దు!
ఇశ్రాయేలుకు హెచ్చరిక
3 ఇశ్రాయేలు ప్రజలారా, ఈ వర్తమానం వినండి! ఇశ్రాయేలూ, నిన్ను గురించి యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ఈజిప్టునుండి ఆయన తీసుకొని వచ్చిన ఇశ్రాయేలు వంశాల వారందరిని గూర్చినదే ఈ వర్తమానం. 2 “భూమిమీద అనేక వంశాలున్నాయి. కాని మిమ్మల్ని మాత్రమే నేను ఎంపికచేసి ప్రత్యేకంగా ఎరిగియున్నాను. అయితే, మీరు నాపై తిరుగుబాటు చేశారు. కావున మీ పాపాలన్నిటికీ నేను మిమ్మల్ని శిక్షిస్తాను.”
ఇశ్రాయేలు శిక్షకు కారణం
3 అంగీకారం లేకుండా
ఇద్దరు వ్యక్తులు కలిసి నడవలేరు.
4 అడవిలో ఉన్న సింహం ఒక జంతువును
పట్టుకున్న తరువాతనే గర్జిస్తుంది.
తన గుహలో వున్న ఒక యువ కిశోరం గర్జిస్తూ ఉందంటే,
అది ఏదో ఒక దానిని పట్టుకున్నదని అర్థం.
5 బోనులో ఆహారం లేకపోతే ఒక పక్షి ఆ బోనులోకి ఎగిరిరాదు.
బోను మూసుకుపోతే, అది అందులో చిక్కుతుంది.
6 హెచ్చరిక చేసే బూరనాదం వినబడితే
ప్రజలు భయంతో వణుకుతారు.
ఒక నగరానికి ఏదైనా ముప్పు వాటిల్లిందంటే,
దానిని యెహోవాయే కలుగ జేసినట్లు.
7 నా ప్రభువైన యెహోవా ఏదైనా చేయటానికి నిర్ణయించవచ్చు. కాని ఆయన ఏదైనా చేసేముందు ఆయన తన పథకాలను తన, సేవకులైన ప్రవక్తలకు తెలియజేస్తాడు. 8 ఒక సింహం గర్జిస్తే ప్రజలు భయపడతారు. యెహోవా మాట్లాడితే, ప్రవక్తలు దానిని ప్రవచిస్తారు.
9-10 అష్డోదు, ఈజిప్టులలో ఉన్న ఎత్తయిన బురుజులు ఎక్కి ఈ వర్తమానం ప్రకటించండి: “మీరు సమరయ (షోమ్రోను) పర్వతాల మీదికి రండి. అక్కడ మీరు ఒక పెద్ద గందరగోళ పరిస్థితిని చూస్తారు. ఎందుకంటే, సవ్యమైన జీవితం ఎలా గడపాలో ఆ ప్రజలకు తెలియదు. సాటి ప్రజలపట్ల వారు క్రూరంగా వ్యవహరించారు. అన్యజనులనుండి వారు వస్తువులను తీసుకొని వాటిని ఎత్తయిన బురుజులలో దాచివేశారు. యుద్ధంలో తీసుకున్న వస్తువులతో వారి ఖజానాలు నిండివున్నాయి.”
11 కావున యెహోవా చెపుతున్నదేమంటే: “దేశంమీదికి ఒక శత్రువు వస్తాడు. ఆ శత్రువు మీ బలాన్ని హరిస్తాడు. మీ ఎత్తయిన బురుజులలో దాచిన వస్తువులన్నీ అతడు తీసుకుంటాడు.”
12 యెహోవా ఇది చెపుతున్నాడు:
“ఒక సింహం ఒక గొర్రెపిల్ల మీద పడవచ్చు.
ఆ గొర్రెపిల్లలో కొంత భాగాన్నే కాపరి రక్షించగలడు.
సింహం నోటినుండి అతడు రెండు కాళ్లను గాని,
చెవిలో కొంత భాగాన్నిగాని బయటకు లాగవచ్చు.
అదే మాదిరి, ఇశ్రాయేలు ప్రజలలో ఎక్కువ మంది రక్షింపబడరు.
సమరయ (షోమ్రోను)లో నివసిస్తున్న ప్రజలు మంచంలో కేవలం ఒక మూలనుగాని,
లేక తమ పాన్పులో ఒక గుడ్డముక్కనుగాని రక్షించుకుంటారు.”
ఆరవ బూర ఊదబడింది
13 ఆరవ దేవదూత తన బూర ఊదాడు. దేవుని ముందున్న బంగారు ధూపవేదిక యొక్క నాలుగు కొనల నుండి నాకు ఒక స్వరం వినిపించింది. 14 ఆ స్వరం బూర ఊదుతున్న ఆరవ దూతతో, “యూఫ్రటీసు మహానది దగ్గర బంధింపబడిన నలుగురు దూతల్ని విడుదల చేయి” అని అనింది. 15 ఇదే గడియ, ఇదే రోజు, ఇదే నెల, ఇదే సంవత్సరము విడుదల చేయబడటానికి వాళ్ళు యింతవరకు బంధింపబడ్డారు. మనుష్యులలో మూడవ భాగాన్ని హతమార్చటానికి వాళ్ళు విడుదల చేయబడ్డారు. 16 ఆ రౌతుల సంఖ్య ఇరవై కోట్లు అన్నట్లు నేను విన్నాను.
17 నాకు కనిపించిన రౌతులు, గుఱ్ఱాలు ఈ విధంగా ఉన్నాయి. రౌతుల కవచాలు అగ్నివలె ఎరుపు, ముదురు నీలం, గంధకాన్ని పోలిన పసుపు రంగుల్లో ఉన్నాయి. గుఱ్ఱాల తలలు సింహాల తలల్లా ఉన్నాయి. వాటి నోళ్ళనుండి మంటలు, పొగ, గంధకము బయటికి వచ్చాయి. 18 వాటి నోళ్ళనుండి వచ్చిన ఈ మూడు పీడలు, అంటే మంటలు, పొగలు, గంధకాల వల్ల మనుష్యులలో మూడవ భాగం హతులై పోయారు. 19 ఆ గుఱ్ఱాల శక్తి వాటి నోళ్ళల్లో, తోకల్లో ఉంది. వాటి తోకలు పాముల్లా ఉన్నాయి. ఆ తోకలకు పాము తలలు ఉన్నాయి. వాటితో అవి కాటువేసి బాధిస్తాయి.
20 ఈ మూడు పీడలు యింత నాశనం చేసినా, మరణించని మానవ జాతి తాము చేసిన పాపాలకు పశ్చాత్తాప పడలేదు. వాళ్ళు దయ్యాల్ని పూజించటం మానుకోలేదు. బంగారము, వెండి, కంచు, రాయి, చెక్కతో చేసిన విగ్రహాలను పూజించటం వాళ్ళు మానుకోలేదు. ఈ విగ్రహాలు చూడకపోయినా, వినకపోయినా, కదలకపోయినా, వాటిని పూజించటం మానుకోలేదు. 21 అంతేకాక, వాళ్ళు తాము చేసిన హత్యలకు, మంత్రతంత్రాలకు, లైంగిక అవినీతికి, దొంగతనాలకు మారుమనస్సు పొందలేదు.
© 1997 Bible League International