Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: పిల్లన గ్రోవులతో పాడదగిన దావీదు కీర్తన
5 యెహోవా, నా మాటలు ఆలకించుము.
నేను నీకు చెప్పటానికి ప్రయత్నిస్తున్నదాన్ని వినుము.
2 నా రాజా, నా దేవా
నా ప్రార్థన ఆలకించుము.
3 యెహోవా, ప్రతి ఉదయం నేను నా కానుకను నీ ముందు ఉంచుతాను.
సహాయం కోసం నేను నీ వైపు చూస్తాను.
మరి నీవు నా ప్రార్థనలు వింటావు.
4 యెహోవా, నీవు దుష్టులను నీ దగ్గర ఉండడానికి ఇష్టపడవు,
చెడ్డవాళ్లు నీ మందిరంలో నిన్ను ఆరాధించేందుకు రావటం నీకు ఇష్టం లేదు.
5 గర్విష్ఠులు, అహంకారులు నీ దగ్గరకు రాలేరు.
ఎప్పుడూ చెడ్డపనులు చేసే మనుష్యులను నీవు అసహ్యించుకొంటావు.
6 అబద్ధాలు చెప్పే మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
ఇతరులకు హాని చేయుటకు రహస్యంగా పథకాలు వేసే మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.
7 యెహోవా, నేను నీ మందిరానికి వస్తాను. నీవు చాలా దయగల వాడవని నాకు తెలుసు.
యెహోవా, నీ పవిత్ర మందిరం వైపు నేను వంగినప్పుడు, నీకు నేను భయపడతాను. నిన్ను గౌరవిస్తాను.
8 యెహోవా, ప్రజలు నాలో బలహీనతల కోసం చూస్తున్నారు.
కనుక నీ నీతికరమైన జీవిత విధానం నాకు చూపించుము.
నేను ఎలా జీవించాలని నీవు కోరుతావో
అది నాకు తేటగా చూపించుము.
9 ఆ మనుష్యులు సత్యం చెప్పరు.
వాళ్లు జనాన్ని నాశనం చేయకోరుతారు.
వారి నోళ్ళు ఖాళీ సమాధుల్లా ఉన్నాయి.
ఆ మనుష్యులు ఇతరులకు చక్కని మాటలు చెబుతారు. కాని వాళ్లను చిక్కుల్లో పెట్టుటకు మాత్రమే వారు ప్రయత్నిస్తున్నారు.
10 దేవా! వారిని శిక్షించుము.
వారి ఉచ్చులలో వారినే పట్టుబడనిమ్ము.
ఆ మనుష్యులు నీకు విరోధంగా తిరిగారు
కనుక వారి విస్తార పాపాల నిమిత్తం వారిని శిక్షించుము.
11 అయితే దేవునియందు విశ్వాసం ఉంచే ప్రజలందరినీ సంతోషించనిమ్ము.
ఆ ప్రజలను శాశ్వతంగా సంతోషించనిమ్ము. దేవా, నీ నామమును ప్రేమించే ప్రజలకు భద్రత, బలం ప్రసాదించుము.
12 యెహోవా, మంచి మనుష్యులకు నీవు మంచివాటిని జరిగిస్తే
అప్పుడు నీవు వారిని కాపాడే గొప్ప కేడెంలా ఉంటావు.
18 యెహోవా ఇలా చెబుతున్నాడు:
“కాని ఆ భయంకరమైన రోజులు వచ్చినప్పుడు,
ఓ యూదా, నేను నిన్ను పూర్తిగా నాశనం కానివ్వను.
19 యూదా ప్రజలు నిన్ను,
‘యిర్మీయా, మా దేవుడైన యెహోవా మాకెందుకీ ఆపద తెచ్చిపెట్టాడు?’ అని అడుగుతారు.
అప్పుడు నీవు,
‘ఓ యూదా ప్రజలారా, మీరు యెహోవాను విస్మరించారు.
మీ స్వంత దేశంలోనే పరదేశాల వారి విగ్రహాలను పూజించారు.
మీరలా ప్రవర్తించారు గనుక
ఇప్పుడు మీరు పరాయి రాజులను మీకు చెందని రాజ్యంలో సేవించవలసి ఉంది!’ అని సమాధానం చెప్పు.”
20 యెహోవా ఇలా అన్నాడు: “యాకోబు వంశస్తులకు ఈ వర్తమానం అందజేయుము.
యూదా రాజ్యానికి ఈ సమాచారం తెలియజేయుము.
21 బుద్ధిహీనులైన మూర్ఖుపు జనులారా ఈ వర్తమానం వినండి:
మీకు కళ్లు ఉండికూడా చూడరు!
మీకు చెవులు ఉండి కూడా వినరు!
22 నేనంటే మీరు నిజంగా భయపడటం లేదు.”
ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది
“మీరు నాముందు భయంతో కంపించాలి.
సముద్రానికి తీరాన్ని ఏర్పరచిన వాడను నేనే.
తద్వారా సముద్రజలాలు తమ పరిధిలో శాశ్వతంగా ఉండేలా చేశాను.
అలల తాకిడికి సముద్రతీరం దెబ్బతినదు.
అలలు ఘోషిస్తూ తీరాన్ని చేరుతాయి, కాని అవి దానిని దాటిపోవు.
23 కాని యూదా ప్రజలు మొండి వైఖరి వహించారు.
వారు నాకు వ్యతిరేకంగా తిరగటానికి అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు.
నాకు విముఖులై, నానుండి వారు దూరంగా పోయారు.
24 మనం మన దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండాలని,
‘ఆయన మనకు శీతాకాల, వసంతకాల వర్షాలు సకాలంలో ఇస్తున్నాడనీ,
ఆయన సకాలంలో, సక్రమంగా మనం పంటనూర్పిడి చేసుకొనేలా చేస్తున్నాడనీ’
యూదా ప్రజలు ఎన్నడూ అనుకోలేదు.
25 యూదా ప్రజలారా, మీరు చెడు చేశారు. అందువల్ల వర్షాలు లేవు; నూర్పిళ్లు లేవు.
నీవు యెహోవా ఇచ్చే అనేక మంచి విషయాలను మీరు అనుభవించకుండా మీ పాపాలు అడ్డు పడుతున్నాయి.
26 నా ప్రజల మధ్య దుష్ట వ్యక్తులున్నారు.
ఆ దుష్టులు పక్షులను పట్టటానికి వలలు పన్నే కిరాతకుల్లా[a] ఉన్నారు.
వారు తమ బోనులు సిద్ధంచేసి పొంచి వుంటారు.
కాని వాళ్లు పక్షులకు బదులు మనుష్యులను పట్టుకుంటారు.
27 పంజరం నిండా పక్షులున్నట్లుగా,
ఈ దుష్టుల ఇండ్ల నిండా అబద్దాలే!
వారి అబద్ధాలు వారిని ధనికులుగా, శక్తివంతులుగా చేశాయి.
28 వారు చేసిన దుష్కార్యాల ద్వారా వారు బాగా ఎదిగి, కొవ్వెక్కినారు.
వారు చేసే అకృత్యాలకు అంతం లేదు.
వారు అనాధ శిశువుల తరఫున వాదించరు.
వారు అనాధలను అదుకోరు.
వారు పేదవారికి న్యాయం జరిగేలా చూడరు.
29 వారు ఈ కృత్యాలన్నీ చేస్తున్నందుకు యూదా ప్రజలను నేను శిక్షించవద్దా?”
ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది.
“ఈ రకమైన దేశాన్ని నేను శిక్షించాలని నీకు తెలుసు.
వారికి తగిన శిక్ష నేను విధించాలి.”
30 యెహోవా ఇలా అన్నాడు,
“యూదా రాజ్యంలో ఆశ్చర్యం కలిగించే ఒక భయానక సంఘటన జరిగింది. అదేమంటే,
31 ప్రవక్తలు అబద్ధం చెప్పటం;
యాజకులు దేన్ని చేయుటకై ఎంచుకోబడ్డారో దానిని చేయరు[b]
నా ప్రజలు దానినే ఆదరించారు.
కానీ, ఓ ప్రజలారా చివరలో మీరు శిక్షకు
గురియైన నాడు మీరేమి చేస్తారు?”
13 దైవసందేశాన్ని మీరు మా నుండి విని, దాన్ని మానవుల సందేశంలా కాకుండా, దైవసందేశంలా అంగీకరించారు. ఇలా జరిగినందుకు మేము దేవునికి సర్వదా కృతజ్ఞులము. అది నిజంగా దైవసందేశము. అది భక్తులైన మీలో పని చేస్తోంది. 14 సోదరులారా! యేసు క్రీస్తులో ఐక్యత పొందిన యూదయలోని దేవుని సంఘాలవలే మీరు కూడా కష్టాలు అనుభవించారు. యూదుల వల్ల ఆ సంఘాలు అనుభవించిన కష్టాలే మీరు మీ ప్రజలవల్ల అనుభవించారు. 15 ఆ యూదులు యేసు ప్రభువును, ప్రవక్తలను చంపారు. మిమ్మల్ని తరిమివేసారు. వాళ్ళు దేవుణ్ణి దుఃఖపెట్టారు. మానవులందరికి శత్రువులై జీవించారు. 16 రక్షణ కలిగించే సందేశాన్ని యూదులు కానివాళ్ళకు చెప్పనీయకుండా మమ్మల్ని అడ్డగించారు. ఈ విధంగా చేసి తమ పాపాలను అంతులేకుండా పెంచుకొంటూ పోయారు. చివరకు దేవునికి వాళ్ళ మీద కోపం వచ్చింది.
థెస్సలొనీకయులను మళ్ళీ చూడాలని పౌలు వాంఛించటం
17 సోదరులారా! కొద్దికాలం మేము మీ నుండి దూరంగా ఉండవలసి వచ్చింది. మా శరీరాలు మాత్రమే మీ నుండి దూరంగా ఉన్నాయి. కాని మా మనసులు కాదు. మిమ్మల్ని చూడాలని మా మనస్సుల్లో చాలా ఉంది. కనుక మేము ఎన్నో విధాల ప్రయత్నించాము. 18 మాకు మీ దగ్గరకు రావాలని ఉంది. పౌలునైన నేను ఎన్నోసార్లు రావటానికి ప్రయత్నం చేసాను. కాని సాతాను మమ్మల్ని అడ్డగించాడు. 19 ఎందుకంటే మా ఆశలు మీ మీద పెట్టుకున్నాము. మా ఆనందం మీరే. మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆయన సమక్షంలో గర్వించటానికి కిరీటం మీరే కదా! 20 మాకు కీర్తి లభించటానికి నిజంగా మీరే కారణం. మీరే మా ఆనందం.
© 1997 Bible League International