Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
25 యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.
2 నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను.
నేను నిరాశచెందను.
నాశత్రువులు నన్ను చూచి నవ్వరు.
3 నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు.
కాని నమ్మక ద్రోహులు నిరాశపడతారు.
వారికి ఏమీ దొరకదు.
4 యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము.
నీ మార్గాలను ఉపదేశించుము.
5 నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము.
నీవు నా దేవుడవు, నా రక్షకుడవు.
రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
6 యెహోవా, నా యెడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నా యెడల చూపించుము.
7 నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు.
యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
8 యెహోవా నిజంగా మంచివాడు.
జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు.
9 దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు.
న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు.
5 “మంచి మనిషి ఎవరైనా వుంటే, ఆ వ్యక్తి జీవిస్తాడు! ఆ మంచి వ్యక్తి ప్రజలయెడల నీతిగా న్యాయంగా వుంటాడు. 6 ఆ సజ్జనుడు పర్వతాలమీదికి వెళ్లి, అక్కడ బూటకపు దేవతలకు అర్పించిన నైవేద్యాలను తినడు. అతడు ఇశ్రాయేలులో నెలకొల్పిన రోత విగ్రహాలను ప్రార్థించడు. అతడు తన పొరుగువాని భార్యతో వ్యభిచరించే పాపానికి ఒడిగట్టడు. తన భార్య ముట్టయినప్పుడు ఆమెతో సంభోగించడు. 7 ఆ సజ్జనుడు ప్రజల మంచితనాన్ని ఆసరాగా తీసుకోడు, ఎవ్వరేగాని అతని వద్దకు అప్పుకు వచ్చినప్పుడు, మంచి వ్యక్తి వస్తువులను తాకట్టు[a] పెట్టుకొని డబ్బు ఇస్తాడు. అప్పు తీసుకొన్నవాడు తిరిగి చెల్లించినప్పుడు, సజ్జనుడు తన డబ్బు తీసుకొని తాకట్టు వస్తువులను ఇచ్చివేస్తాడు. ఆకలిగొన్న వారికి సజ్జనుడు అన్నం పెడతాడు. కట్టు బట్టలు లేక బాధపడేవారికి అతడు వస్త్రదానం చేస్తాడు. 8 అప్పు కోరి అతనిని ఆశ్రయిస్తే మంచి వ్యక్తి ఆ వచ్చిన వానికి డబ్బు ఇస్తాడు. కాని అతడా ఋణానికి వడ్డీ తీసుకోడు. మంచివాడు కపటంగా ప్రవర్తించటానికి నిరాకరిస్తాడు. అతడు ప్రతి మనిషి పట్ల ఎల్లప్పుడూ ఉదారంగా ప్రవర్తిస్తాడు. ప్రజలతనిని నమ్మవచ్చు. 9 అతడు నా కట్టడలను అనుసరిస్తాడు. అతడు నా నిర్ణయాలను గురించి ఆలోచించి, ధర్మవర్తనుడై నమ్మదగినవాడుగా వుండటం నేర్చుకుంటాడు. అతడు సజ్జనుడు. అందుచేత అతడు జీవిస్తాడు.
10 “కాని ఆ మంచి వ్యక్తికీ అటువంటి మంచి పనులేవీ చేయని ఒక కుమారుడు వుండవచ్చు. ఆ కుమారుడు వస్తువులను దొంగిలించి, నరహత్య చేయవచ్చు. 11 అతడు ఈ చెడ్డ పనులలో దేనినైనా చేయవచ్చు. పర్వతాల మీదకి వెళ్లి బూటకపు దేవుళ్ళకు అర్పించిన నైవేద్యాలను తినవచ్చు. ఆ చెడ్డ కుమారుడు తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించి పాపం చేయవచ్చు. 12 అతడు పేదలను, నిస్సహాయులను అలక్ష్యము చేయవచ్చు. అతడు ప్రజల మంచితనాన్ని వినియోగ పర్చుకోవచ్చు. అప్పు తీసుకున్నవాడు సొమ్ము చెల్లించినప్పుడు, అతడు తాకట్టు వస్తువును తిరిగి ఇచ్చివేయక పోవచ్చు. ఆ చెడ్డ కుమారుడు రోత పుట్టించే విగ్రహాలను ఆరాధించి, ఇతర భయంకరమైన పనులు చేయవచ్చు. 13 ఆ దుష్టుడైన కుమారుని వద్ద డబ్బు అప్పు తీసుకొనే అవసరం ఎవరికైన కలుగవచ్చు. అతడు వానికి అప్పు ఇవ్వవచ్చు. కాని, అతడిచ్చిన అప్పుమీద వడ్డీ చెల్లించమని అప్పుదారుని అతడు పీడిస్తాడు. అందువల్ల ఆ చెడ్డ కుమారుడు జీవించడు. అతడు చేసిన ఘోరమైన పనులకు అతడు చంపబడతాడు. పైగా అతని చావుకు అతడే బాధ్యుడు.
14 “ఇప్పుడా దుష్టుడైన కుమారునికి ఒక కుమారుడు కలుగవచ్చు. ఈ కుమారుడు తన తండ్రి చేసే దుష్కార్యాలను చూసి, వాటిని నిరసించి తన తండ్రిలాగా ఉండకపోవచ్చు. వాడు ప్రజలందరినీ సమాదాన పరుస్తాడు. 15 ఆ మంచి కుమారుడు కొండల మీదికి వెళ్లి చిల్లర దేవుళ్లను ఆరాధించడు, ఆ దేవుళ్ళకు అర్పించిన నైవేద్యాలను తినడు. ఇశ్రాయేలులో నెలకొల్పిన రోత విగ్రహాలకు అతడు ప్రార్థన చేయడు. అతడు తన పొరుగువాని భార్యతో వ్యభిచార పాపానికి ఒడిగట్టడు. 16 ఆ మంచి కుమారుడు ప్రజల మంచితనాన్ని ఉపయోగించు కోకుండా ఉండవచ్చు. ఏ వ్యక్తి అయినా తన వద్దకు అప్పుకోరివస్తే, అతడు వస్తువులు తాకట్టు పెట్టుకొని డబ్బు ఇస్తాడు. మళ్లీ అప్పు తీసుకొన్నవాడు డబ్బు చెల్లిస్తే, ఆ మంచి కుమారుడు తాకట్టు వస్తువులు తిరిగి ఇచ్చివేస్తాడు. మంచి కుమారుడు ఆకలిగొన్న వారికి అన్నం పెడతాడు. అవసరమైన వారికి అతడు వస్త్రదానం చేస్తాడు. 17 అతడు పేదలకు సహాయం చేస్తాడు. ఎవరైనా తనవద్ద అప్పు తీసుకో తలంచితే, మంచి కుమారుడు అతనికి డబ్బు ఇస్తాడు. కాని అతడు ఆ అప్పుమీద వడ్డీ తీసుకొనడు! మంచి కుమారుడు నా న్యాయాన్ని శిరసావహిస్తాడు. నా కట్టడలను పాటిస్తాడు. తన తండ్రి చేసిన పాపాలకు ఆ మంచి కుమారుడు చంపబడడు! ఆ మంచి కుమారుడు జీవిస్తాడు. 18 తండ్రి ప్రజలను బాధించవచ్చు. వస్తువులను దొంగిలించవచ్చు. అతడు అతని ప్రజలకు ఏ మంచిని ఎన్నడూ చేసియుండడు! ఆ తండ్రి తన పాపాల కారణంగానే చనిపోతాడు. అయితే, కుమారుడు మాత్రం అతని తండ్రి పాపాలకు శిక్షింపబడడు.
32 “వాళ్ళు ఆయన కోసం ఇశ్రాయేలు ప్రజల ముందు సాక్ష్యం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. 33 దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానాన్ని యిప్పుడు వాళ్ళ సంతతియైన మన కోసం పూర్తి చేసాడు. యేసును బ్రతికించటంతో ఈ వాగ్దానం పూర్తి అయింది. ఇదే మేము చెప్పే సువార్త. దీన్ని గురించి కీర్తన గ్రంథంలో ఇలా వ్రాయబడివుంది:
‘నీవు నా కుమారుడవు!
నేడు నేను నీకు తండ్రినయ్యాను.’(A)
34 దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ఎన్నటికీ మట్టిలో కలిసిపోడు. అందువల్ల దేవుడు మరొక చోట,
‘నేను దావీదుకు తప్పక యిస్తానన్న పవిత్రమైన ఆశీస్సులను నీకిస్తాను’(B) అని అన్నాడు.
35 మరొక చోట యిలా చెప్పబడింది:
‘నీ పవిత్రుడి దేహాన్ని సమాధిలో నీవు క్రుళ్ళిపోనియ్యవు!’(C)
36 “దావీదు తన కాలంలో దేవుని ఆజ్ఞానుసారం నడుచుకొన్నాడు. అతడు చనిపోగానే అతణ్ణి అతని పూర్వికులతో సమాధి చేసారు. అతని దేహం మట్టిలో కలిసిపోయింది. 37 కాని దేవుడు బ్రతికించినవాడు మట్టిలో కలిసిపోలేదు. 38 మీరీ విషయం తెలుసుకోవాలి. యేసు ద్వారా మీ పాపాలు క్షమించబడుతాయని మేము ప్రకటిస్తున్నాము. మోషే ధర్మశాస్త్రం క్షమించలేని పాపాలనుండి, 39 యేసు తనను నమ్ముకొన్న ప్రతి ఒక్కణ్ణీ క్షమిస్తాడు. 40 ప్రవక్తలు చెప్పిన ఈ విషయాలు మీకు సంభవించకుండా జాగ్రత్తపడండి:
41 ‘పరిహాసం చేసే ప్రజలారా!
ఆశ్చర్యం పొందండి! నశించకండి!
ఎందుకనగా మీ కాలంలో మీరు నమ్మలేనిది
నేనొకటి చేయబోతున్నాను!
మరొకరు చెప్పినా మీరు నమ్మరు.’”(D)
© 1997 Bible League International