Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 106:1-12

106 యెహోవాను స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
    దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా నిజంగా ఎంత గొప్పవాడో ఏ ఒక్కరూ వర్ణించలేరు.
    ఏ ఒక్కరూ సరిపడినంతగా దేవుని స్తుతించలేరు.
దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారు సంతోషంగా ఉంటారు.
    ఆ ప్రజలు ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూంటారు.

యెహోవా, నీవు నీ ప్రజల యెడల దయ చూపేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
    నన్ను కూడా రక్షించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
యెహోవా, నీ జనులకు నీవు చేసే మంచివాటిలో
    నన్ను పాలుపొందనిమ్ము
నీ ప్రజలతో నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
    నీ జనంతో నన్ను నీ విషయమై అతిశయించనిమ్ము.

మా పూర్వీకుల్లా మేము కూడా పాపం చేసాము.
    మేము తప్పులు చెడుకార్యాలు చేసాము.
యెహోవా, ఈజిప్టులో నీవు చేసిన అద్భుతాలను మా పూర్వీకులు సరిగ్గా అర్థం చేసుకోలేదు.
    నీ అపరిమితమైన ప్రేమను వారు జ్ఞాపకముంచుకోలేదు.
ఎర్రసముద్రం వద్ద మహోన్నతుడైన దేవునికి
    విరోధంగా ఎదురు తిరిగారు.

అయినా ఆయన తన నామము కోసం వారిని రక్షించాడు,
    ఎందుకంటే తన మహాశక్తిని వారికి తెలియజేయాలని.
దేవుడు ఆజ్ఞ ఇవ్వగా ఎర్రసముద్రం ఎండిపోయింది.
    దేవుడు మన పూర్వీకులను లోతైన సముద్రంలో ఎడారివలె ఎండిన నేలను ఏర్పరచి, దానిమీద నడిపించాడు.
10 మా పూర్వీకులను వారి శత్రువుల నుండి దేవుడు రక్షించాడు.
    వారి శత్రువుల బారి నుండి దేవుడు వారిని కాపాడాడు.
11 అప్పుడు దేవుడు వారి శత్రువులను సముద్రంలో ముంచి, కప్పివేసాడు.
    వారి శత్రువులు ఒక్కడూ తప్పించుకోలేదు!

12 అప్పుడు మన పూర్వీకులు దేవుణ్ణి నమ్మారు.
    వారు ఆయనకు స్తుతులు పాడారు.

ఆదికాండము 27:1-29

ఇస్సాకును యాకోబు మోసగించుట

27 ఇస్సాకు ముసలివాడైనప్పుడు అతని చూపు సన్నగిల్లింది. ఇస్సాకు తేటగా చూడలేకపోయాడు. ఒకనాడు తన పెద్ద కుమారుని అతడు తన దగ్గరకు పిల్చాడు, “కుమారుడా!” అన్నాడు.

“ఇదిగో ఇక్కడే ఉన్నాను” అని జవాబిచ్చాడు ఏశావు.

ఇస్సాకు చెప్పాడు: “చూడు, నేను ముసలివాడనయ్యాను. ఒకవేళ త్వరలో నేను చనిపోతానేమో! కనుక నీ విల్లు, అంబులు తీసుకొని వేటకు వెళ్లు. నేను తినటానికి ఒక జంతువును చంపు. నాకు ఇష్టమైన భోజనం తయారు చేయి. అది నా దగ్గరకు తీసుకురా, నేను తింటాను. అప్పుడు నేను మరణించక ముందు నిన్ను ఆశీర్వదిస్తాను.” కనుక ఏశావు వేటకు వెళ్లాడు.

ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో ఆ సంగతులు చెబ తున్నప్పుడు రిబ్కా విన్నది. తన కుమారుడైన యాకోబుతో రిబ్కా చెప్పింది: “విను, నీ సోదరుడు ఏశావుతో నీ తండ్రి మాట్లాడటం నేను విన్నాను. ‘నేను తినటానికి ఒక జంతువును చంపి నా కోసం భోజనం సిద్ధం చేయి, నేను భోంచేస్తాను. అప్పుడు నేను మరణించక ముందు నిన్ను ఆశీర్వదిస్తాను’ అని నీ తండ్రి చెప్పాడు. కనుక, కుమారుడా, నేను చెప్పేది విని అలా చేయి. మన మేకల మందలోనికి వెళ్లి, రెండు మేక పిల్లల్ని నా దగ్గరకు తీసుకురా. నీ తండ్రికి ఇష్టమైన పద్ధతిలో నేను వాటిని సిద్ధం చేస్తాను. 10 అప్పుడు ఆ భోజనాన్ని నీవే నీ తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్లు. ఆయన మరణించక ముందు నిన్ను ఆశీర్వదిస్తాడు.”

11 అయితే యాకోబు తన తల్లి రిబ్కాతో ఇలా చెప్పాడు: “అయితే నా సోదరుడి శరీరమంతా వెంట్రుకలు ఉంటాయి, అతనిలా నాకు వెంట్రుకలు ఉండవు. 12 నా తండ్రి నన్ను తాకితే నేను ఏశావును కానని ఆయన తెలుసుకుంటాడు. అప్పుడు ఆయన నన్ను ఆశీర్వదించడు. నేను ఆయన్ని మోసం చేయటానికి ప్రయత్నించినందువల్ల ఆయన నన్ను శపిస్తాడు.”

13 కనుక రిబ్కా, “ఏదైనా కష్టం వస్తే ఆ నింద నేను భరిస్తాను. నేను చెప్పినది చేయి. వెళ్లి మేకల్ని తెచ్చి నాకు ఇవ్వు” అని అతనితో చెప్పింది.

14 కనుక యాకోబు వెళ్లి రెండు మేకల్ని తీసుకొని, తెచ్చి వాటిని తల్లికి ఇచ్చాడు. ఇస్సాకుకు ఇష్టమైన ఒక ప్రత్యేక విధానంలో అతని తల్లి ఆ మేకలతో వంట చేసింది. 15 తర్వాత ఆమె తన కుమారుడు ఏశావు ఎక్కువగా ఇష్టపడి ధరించే బట్టలు తెచ్చింది. ఆ బట్టలను చిన్న కుమారుడు యాకోబుకు ధరింపజేసింది. 16 ఆ మేకల చర్మాలను రిబ్కా తీసుకొని, వాటిని యాకోబు చేతుల మీద వేసింది. 17 తర్వాత రిబ్కా తాను వండిన భోజనం తెచ్చి, దానిని యాకోబుకు యిచ్చింది.

18 యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, “తండ్రీ!” అని పిల్చాడు.

“ఏమి కుమారుడా, ఎవరు నీవు?” అన్నాడు తండ్రి.

19 “నేను ఏశావును, నీ పెద్ద కుమారుడను. నీవు నాకు చెప్పిన పనులు చేశాను. నీ కోసం నేను వేటాడి తెచ్చిన జంతువులను సమకూర్చి వాటితో నీకొరకైన భోజనమును సిద్ధపరచాను. దానిని తిని, తృప్తిపొంది నన్ను ఆశీర్వదించవచ్చు” అని యాకోబు తన తండ్రితో చెప్పాడు.

20 అయితే ఇస్సాకు, “నీవు ఇంత త్వరగా ఎలా వేటాడి జంతువుల్ని చంపగలిగావు?” అని తన కుమారుణ్ణి అడిగాడు.

“త్వరగా నేను జంతువుల్ని సంపాదించటానికి నీ దేవుడైన యెహోవా నాకు సహాయంచేశాడు గనుక” అని యాకోబు జవాబిచ్చాడు.

21 అప్పుడు ఇస్సాకు, “నా కుమారుడా నేను నిన్ను తడిమి చూడాలి. కనుక నీవిలా నా దగ్గరగా రా. నిన్ను నేను తడిమి చూస్తే, నిజంగా నీవు నా కుమారుడు ఏశావువో కాదో తెలుస్తుంది” అన్నాడు యాకోబుతో.

22 కనుక తన తండ్రియైన ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్లాడు. ఇస్సాకు అతణ్ణి తడిమి చూసి, “నీ స్వరం యాకోబు స్వరంలా ఉంది. కానీ, నీ చేతులు మాత్రం ఏశావు చేతుల్లా వెంట్రుకలతో ఉన్నాయి” అన్నాడు. 23 యాకోబు చేతులు ఏశావు చేతులవలె వెంట్రుకలతో ఉన్నందువల్ల అతడు యాకోబు అని ఇస్సాకుకు తెలియలేదు. కనుక ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు.

24 “నిజంగా నీవు నా కుమారుడు ఏశావువేనా?” అని ఇస్సాకు అడిగాడు.

“అవును, నేనే” అని యాకోబు జవాబిచ్చాడు.

యాకోబుకు ఆశీర్వాదం

25 అప్పుడు ఇస్సాకు, “ఆ భోజనం నా దగ్గరకు తీసుకురా. నేను దానిని తిని, నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు. కనుక యాకోబు అతనికి భోజనం ఇచ్చాడు, అతడు భోంచేశాడు. యాకోబు అతనికి ద్రాక్షారసం ఇచ్చాడు, అతడు త్రాగాడు.

26 అప్పుడు ఇస్సాకు, “కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో” అని అతనితో చెప్పాడు. 27 కనుక యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు. అతని వస్త్రాలను ఇస్సాకు వాసన చూచి, అతణ్ణి ఆశీర్వదించాడు. ఇస్సాకు ఇలా అన్నాడు:

“నా కుమారుని వాసన యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనలా ఉంది.
28 విస్తారమైన పంటలు, ద్రాక్షారసం నీకు ఉండేటట్లు వర్షాలు యెహోవా నీకు సమృద్ధిగా ఇచ్చుగాక.
29 మనుష్యులంతా నిన్నే సేవిస్తారు గాక,
    జనములు నీకు సాగిలపడుదురు గాక,
నీ సోదరుల మీద నీవు పరిపాలన చేస్తావు
నీ తల్లియొక్క కుమారులు నీకు సాగిలపడి నీకు లోబడుతారు,

“నిన్ను శపించే ప్రతీ వ్యక్తి శపించబడతాడు,
నిన్ను ఆశీర్వదించే ప్రతీ వ్యక్తి ఆశీర్వదించబడతాడు.”

రోమీయులకు 16:1-16

కుశలములు

16 కేంక్రేయ పట్టణంలో ఉన్న సంఘానికి సేవ చేస్తున్న మన సోదరి ఫీబే చాలా మంచిది. దేవుని ప్రజలకు తగిన విధంగా ప్రభువు పేరట ఆమెకు స్వాగతం చెప్పండి. ఆమె అనేకులకు చాలా సహాయం చేసింది. నాకు కూడా చాలా సహాయం చేసింది. కనుక ఆమె మీ నుండి సహాయం కోరితే ఆ సహాయం చెయ్యండి.

నాతో కలిసి యేసు క్రీస్తు సేవ చేస్తున్న ప్రిస్కిల్లకు, ఆమె భర్త అకులకు నా వందనాలు చెప్పండి. వాళ్ళు నా కోసం తమ ప్రాణాలనే తెగించారు. నేనే కాక, యూదులు కానివాళ్ళ సంఘాలన్నీ వాళ్ళకు కృతజ్ఞతతో ఉంటాయి.

వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యే వాళ్ళందరికీ నా వందనాలు చెప్పండి.

ఆసియ ప్రాంతంలో క్రీస్తును నమ్మినవాళ్ళలో నా ప్రియమిత్రుడు ఎపైనెటు మొదటివాడు. అతనికి నా శుభములు అందించండి.

మీ కోసం చాలా కష్టపడి పని చేస్తున్న మరియకు నా వందనములు చెప్పండి.

నాతో సహా కారాగారంలో గడిపిన నా బంధువులు ఆంద్రొనీకుకు, యూనీయకు నా వందనాలు చెప్పండి. వాళ్ళు అపొస్తలులలో గొప్పవారు. అంతేకాక వాళ్ళు నాకన్నా ముందే క్రీస్తును అంగీకరించారు.

ప్రభువు వల్ల నేను, అంప్లీయతు స్నేహితులమయ్యాము. అతనికి నా వందనాలు చెప్పండి. మాతో కలిసి క్రీస్తు సేవచేస్తున్న ఊర్బానుకు,

నా ప్రియ మిత్రుడైనటువంటి స్టాకుకు నా వందనాలు చెప్పండి. 10 అపెల్లెకు క్రీస్తు పట్ల నిజమైన భక్తి ఉన్నట్లు నిరూపించబడింది. అతనికి నా వందనాలు చెప్పండి.

అరిస్టొబూలు కుటుంబానికి చెందిన వాళ్ళకు వందనాలు చెప్పండి. 11 హెరోదియోను నా బంధువు. అతనికి వందనాలు చెప్పండి.

ప్రభువుకు చెందిన నార్కిస్సు కుటుంబాన్ని అడిగానని చెప్పండి. 12 ప్రభువు కోసం కష్టించి పని చేస్తున్న త్రుపైనా, త్రుఫోసా అనే స్త్రీలకు నా వందనాలు చెప్పండి.

మరొక స్త్రీ పెర్సిసు చాలా కష్టించి పని చేసింది. ఆమెకు నా వందనాలు చెప్పండి.

13 ప్రభువు ఎన్నుకొన్న రూపునకు, అతని తల్లికి నా వందనాలు చెప్పండి. అతని తల్లి నాకు కూడా తల్లిలాంటిది.

14 అసుంక్రితుకు, ప్లెగోనుకు, హెర్మేకు, పత్రొబకు, హెర్మాకు, వాళ్ళతో ఉన్న ఇతర సోదరులకు వందనాలు చెప్పండి.

15 పిలొలొగుకు, యూలియా అనే సోదరికి, నేరియకు, అతని సోదరికి, ఒలుంపాకు, వాళ్ళతో ఉన్న దేవుని ప్రజలందరికి వందనాలు చెప్పండి.

16 మీరు ఒకరినొకరు కలిసినప్పుడు పవిత్రమైన ముద్దులతో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోండి.

క్రీస్తు సంఘాలన్నీ మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International