Revised Common Lectionary (Complementary)
దావీదు యాత్ర కీర్తనల్లో ఒకటి.
133 సహోదరులు ఐక్యంగా శాంతి కలిగి జీవించటం
ఎంతో మంచిది, ఎంతో ఆనందం.
2 అది యాజకుని తలమీద పోయబడిన కమ్మని వాసనగల తైలంలాగా ఉంటుంది. అది అహరోను గడ్డం మీదికి కారుతున్న తైలంలాగా ఉంటుంది.
అది అహరోను ప్రత్యేక వస్త్రాల మీదికి కారుతున్న తైలంలాగ ఉంటుంది.
3 అది హెర్మోను పర్వతం మీద నుండి సీయోను కొండమీద పడుతున్న మంచులా ఉంటుంది.
సీయోను వద్దనే యెహోవా తన ఆశీర్వాదం ఇచ్చాడు. శాశ్వతజీవాన్ని ఆశీర్వాదంగా యెహోవా ఇచ్చాడు.
29 తర్వాత ఇశ్రాయేలు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అతడు ఇలా చెప్పాడు, “నేను మరణించినప్పుడు నా ప్రజలతో ఉండాలని నేను కోరుచున్నాను. హిత్తీయుడగు ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకులతో బాటు పాతిపెట్టబడాలని కోరుతున్నాను. 30 ఆ గుహ మమ్రే దగ్గర మక్ఫేలా పొలంలో ఉంది. అది కనాను దేశంలో ఉంది. అబ్రాహాము తనను పాతిపెట్టేందుకు స్థలం ఉండాలని ఎఫ్రోను దగ్గర ఆ భూమిని కొన్నాడు. 31 అబ్రాహాము, అతని భార్య శారా ఆ గుహలోనే పాతిపెట్టబడ్డారు. ఇస్సాకు, అతని భార్య రిబ్కా ఆ గుహలోనే పాతిపెట్టబడ్డారు. నా భార్య లేయాను నేను ఆ గుహలోనే పాతిపెట్టాను. 32 హిత్తీ మనుష్యుల దగ్గర కొన్న పొలంలో ఉంది ఆ గుహ.” 33 యాకోబు తన కుమారులతో మాట్లాడటం ముగించిన తర్వాత అతడు పండుకొని, పడకమీద తన కాళ్లు చాపుకొని మరణించాడు.
యాకోబు సమాధి చేయబడుట
50 ఇశ్రాయేలు మరణించినప్పుడు యోసేపు చాలా విచారించాడు. అతడు తన తండ్రిని కౌగలించుకొని, అతని మీద పడి ఏడ్చి, అతనిని ముద్దు పెట్టుకొన్నాడు. 2 తన తండ్రి దేహమును సిద్ధం చేయమని అతడు తన సేవకులకు (ఆ సేవకులు వైద్యులు) ఆజ్ఞాపించాడు. యాకోబు శరీరాన్ని సమాధి చేసేందుకు వైద్యులు సిద్ధం చేశారు. ఈజిప్టువారి ప్రత్యేక పద్ధతిలో ఆ శరీరాన్ని వారు సిద్ధం చేశారు. 3 ఈజిప్టు వారు ఈ పద్ధతిలో శరీరాన్ని సిద్ధం చేయాలంటే, ఆ శరీరాన్ని సమాధి చేసేందుకు ముందు 40 రోజులు వారికి అవసరం. తర్వాత ఈజిప్టువాళ్లు యాకోబు కోసం దుఃఖించటానికి ప్రత్యేక సమయం తీసుకొన్నారు. ఆ సమయం 70 రోజులు.
4 డెబ్భైరోజుల తర్వాత దుఃఖసమయం ముగిసింది. కనుక ఫరో అధికారులతో యోసేపు మాట్లాడాడు. “దయచేసి ఫరోతో ఇది చెప్పండి: 5 ‘నా తండ్రి మరణ ఘడియల్లో నేను ఆయనకు ఒక వాగ్దానం చేశాను. కనాను దేశంలోని ఒక గుహలో నేను ఆయనను సమాధి చేస్తానని నేను వాగ్దానం చేశాను. ఇది ఆయన తనకోసం సిద్ధం చేసుకొన్న గుహ. కనుక దయచేసి నేను వెళ్లి, నా తండ్రిని సమాధి చేసుకోనివ్వండి. అప్పుడు నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను’” అన్నాడు యోసేపు.
6 “నీ మాట నిలబెట్టుకో, వెళ్లి నీ తండ్రిని సమాధి చేయి” అని ఫరో జవాబిచ్చాడు.
7 కనుక యోసేపు తన తండ్రిని సమాధి చేసేందుకు వెళ్లాడు. ఫరో అధికారులంతా, ఫరో పెద్దలు (నాయకులు) యోసేపుతో కూడ వెళ్లారు. ఫరో నాయకులు, ఈజిప్టులోని పెద్దలందరూ యోసేపుతో వెళ్లారు. 8 యోసేపు కుటుంబంలోని వాళ్లందరూ, అతనితో వెళ్లారు. మరియు తన తండ్రి కుటుంబం అంతా యోసేపుతో వెళ్లారు. పిల్లలు, పశువులు మాత్రమే గోషెను దేశంలో విడువబడటం జరిగింది. 9 యోసేపుతో వెళ్లటానికి అందరూ రథాలమీద, గుర్రాలమీద వెళ్లారు. అది చాలా పెద్ద గుంపు అయింది.
10 యోర్దాను నదికి తూర్పున గోరెన్ ఆఠదు కళ్లం దగ్గరకు వారు వెళ్లారు. ఆ స్థలంలో వారు ఇశ్రాయేలు నిమిత్తం భూస్థాపన క్రమాలు దీర్ఘంగా జరిగించారు. ఆ భూస్థాపన క్రమం ఏడు రోజులపాటు కొనసాగింది. 11 గోరెన్ ఆఠదులో జరిగిన భూస్థాపన క్రమాన్ని కనానులో నివసిస్తున్న ప్రజలు చూశారు. వారు “ఆ ఈజిప్టు వాళ్లు ఎంతగా దుఃఖిస్తున్నారో అని చెప్పుకొన్నారు”. కనుక ఆ స్థలం ఇప్పుడు ఆబేల్ మిస్రాయిము అని పిలువబడుతుంది.
12 కనుక యాకోబు కుమారులు తమ తండ్రి ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. 13 వారు అతని శరీరాన్ని కనానుకు తీసుకొని వెళ్లి, మక్పేలా గుహలో దానిని పాతిపెట్టారు. హిత్తీయుడగు ఎఫ్రోను దగ్గర అబ్రాహాము కొన్న పొలంలోని మమ్రే సమీపాన ఉన్న గుహ ఇది. సమాధిస్థలంగా ఉపయోగించేందుకు అబ్రాహాము ఆ గుహను కొన్నాడు. 14 యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత, అతనూ, అతనితో ఆ గుంపులో ఉన్న ప్రతి ఒక్కరూ తిరిగి ఈజిప్టు వెళ్లిపోయారు.
ఇతరులు పాపం చేసేలా చేయకు
13 కాబట్టి ఇతర్లపై తీర్పు చెప్పటం మానుకొందాం. అంతేకాక, మీ సోదరుని మార్గంపై అడ్డురాయి పెట్టనని, అతనికి ఆటంకాలు కలిగించనని తీర్మానం చేసుకోండి. 14 ఏ ఆహారం అపవిత్రం కాదని యేసు ప్రభువు ద్వారా నేను తెలుసుకొన్నాను. కానీ ఎవరైనా ఒక ఆహారం అపవిత్రమని తలిస్తే అది అతనికి అపవిత్రమౌతుంది.
15 నీవు తినే ఆహారం వల్ల నీ సోదరునికి దుఃఖం కలిగితే నీవు ప్రేమగా ఉండటం మానుకొన్నావన్న మాట. నీ ఆహారం కారణంగా నీ సోదరుణ్ణి నాశనం చెయ్యవద్దు. అతని కోసం క్రీస్తు మరణించాడు. 16 నీ మంచి పనుల్ని ఇతర్లు దూషించకుండా ప్రవర్తించు. 17 దేవుని రాజ్యం అంటే తినటం, త్రాగటం కాదన్నమాట. అది పవిత్రాత్మ ద్వారా లభించే నీతికి, శాంతికి, ఆనందానికి సంబంధించింది. 18 ఈ విధంగా క్రీస్తు సేవ చేసినవాణ్ణి దేవుడు మెచ్చుకొంటాడు. ఇతర్లు కూడా మెచ్చుకొంటారు.
19 అందువల్ల మనము శాంతికి, మన అభివృద్ధికి దారి తీసే కార్యాలను చేద్దాం. 20 ఆహారం కొరకు దేవుని పనిని నాశనం చెయ్యకూడదు. అన్ని ఆహారాలు తినవచ్చు. కాని, ఇతర్ల ఆటంకానికి కారణమయ్యే ఆహారాన్ని తినటం అపరాధం. 21 నీ సోదరుడికి ఆటంక కారకుడివి అవటం కన్నా, మాంసాన్ని తినకుండా ఉండటం, ద్రాక్షారసం త్రాగకుండా ఉండటంలాంటి పన్లేవీ చెయ్యకుండా ఉండటం ఉత్తమం.
22 అందువల్ల వీటి విషయంలో నీవు ఏది నమ్మినా ఎలా ఉన్నా అది నీకు, దేవునికి సంబంధించిన విషయం. తానంగీకరిస్తున్న వాటి విషయంలో తనను తాను నిందించుకోని వ్యక్తి ధన్యుడు. 23 సందేహిస్తూ తినే వ్యక్తి విశ్వాసం లేకుండా తింటున్నాడు. కనుక దేవుడతనికి శిక్ష విధిస్తాడు. విశ్వాసంతో చేయని పనులన్నీ పాపంతో కూడుకొన్నవి.
15 సంపూర్ణ విశ్వాసం గల మనము సంపూర్ణ విశ్వాసం లేనివాళ్ళ బలహీనతల్ని సహించాలి. మనం మన ఆనందం మాత్రమే చూసుకోకూడదు. 2 ప్రతి వ్యక్తి తన సోదరుని మేలు కోసం, అభివృద్ధి కోసం అతనికి అనుగుణంగా నడుచుకోవాలి.
© 1997 Bible League International